ఔను.. వాళ్లు చామన ఛాయే!


Mon,June 11, 2018 01:02 AM

Aunu-vaallu
నేనిప్పుడు మిమ్మల్ని
కంఠాలు తెంపేసిన ఏ కలువ రేకులతోనో
తూడులకు ఉరేసిన ఏ తామరలతోనో కొలువలేను
రాలిపోయిన పుప్పొడి మెట్లపై మీ పాదం తొక్కించలేను
సింహమధ్యలతోనో, అరటి బోదెలతోనో
హంసలతోనో, చక్రవాకాలతోనోనీకొక వికృత రూపాన్నిచ్చి
రాజాస్థానాల్లో ఆడే బొమ్మను చేయలేను
అసలు సౌందర్య దృష్టేలేని కవిగాళ్ళందరూ
నీ అందాలను వారి తుచ్ఛ భావనాలోకంలో
ఎన్ని మానభంగాలకు గురిచేసారు
పోల్చటానికి ఏమీ మిగలనట్టుగా
ప్రతి కవిగాడూమార్చి మార్చి వాడేసిన చంద్రబింబంతో
నిన్నిక ఎంతమాత్రమూ తూకంవేయలేను
ఇంకేదో కొత్త డిక్షన్ కోసం దేవులాట మొదలెట్టాను
ఎవడో నిర్ణయించిన సౌందర్య కొలతల్లోచిక్కుకొని
ఊపిరాడక చస్తున్న ఓ నా పిచ్చి లచ్చుమమ్మల్లారా!
మీరంతా నల్లతుమ్మపూవు పసుపు వర్ణాలే
తెల్లటి ఉమ్మెత్త పువ్వు మొఖాలే మీవి
గుమ్మంపై వేలాడుతున్న జొన్నకంకి మీద
సర్కస్ ఫీట్స్ వేస్తున్న కీసుపిట్టకంఠాలే మీవి
ఆకాశ పాదాలకు పసుపు పూసే ప్రయత్నంలో నిమగ్నమైన
నా నల్లాల పూవుల్లారా
గాలితేమతో జీవగంజి నింపుకుంటున్న
ఓ కందిపువ్వు రూపాల్లారా
ఒడ్డుమీద నవ్వుతూ పలకరించే
ఓ నా గునుగు పూల కళ్ళ అందాల్లారా
తొమ్మిది నెళ్ళ పసిగుడ్డును మోస్తూ
ఏడేడు సముద్రాలు ఈదిన సాహసమే మీది
ఎవరేమన్నా
మీరు మా పుల్జెరి పళ్ళ తీపి, వగరులే
కలువలపై కవాతు చేస్తున్న కానుగు పువ్వులెహె!
- డాక్టర్ చంద్రయ్య, 99637 09032

477
Tags

More News

VIRAL NEWS