గోల్కొండా! గోల్కొండా !!


Mon,June 11, 2018 01:00 AM

Golkonda-Golkonda
ఎప్పుడో తలుచుకున్నాను
ఒకసారెప్పుడో కలుసుకున్నాను
కాలం మహిమ గమనించావా !
ఇపుడు నీ దగ్గరికే వచ్చేసాను
ఇక ప్రతిరోజూ ఎదురూబొదురుగా నిల్చుని
తనివితీరా సంభాషించుకుందాం !
పదకొండు దర్వాజాల ఖిల్లాలోకి
తెరిచివుంచిన ఏడుదర్వాజల ఆహ్వానం మేరకు
బంజారీ దర్వాజ గుండా ప్రవేశించాను.
ఫతే దర్వాజా, జమాలీ దర్వాజా, మోతీ దర్వాజా,
మక్కా దర్వాజా తెరుచుకునే ఉన్నాయి నా రాక కోసం.
ఆ ప్రహరీగోడలూ, ఆ గోడలమీద చెక్కినబొమ్మలు, బురుజులకి వేలాడుతున్న
రాతితోరణాల్లోని సింహాల ముఖాలు - వాటివెనుక శ్రమించిన చేతుల్లో
నా తాత ముత్తాత తాతల చేతుల్ని ఊహిస్తాను.
బహుశా నా ఈ రాకకు వెనుక
జననాంతర కారణాన్నేదో వెతుకుతుంటాను.
కాలేజీకిటికీల్లోంచి అతిసమీపంగా బాలాహిస్సార్ దర్బార్ -
ఇంకా మిగిలిన ఏవో చర్చలకోసం నిరీక్షిస్తున్నట్టు,
వినవలిసిన పిలుపులచప్పట్లకోసం వేచిచూస్తున్నట్టు
మోరెత్తి ఏవేవో సంజ్ఞలతో
పురాస్మృతుల మననం చేసుకుంటూ
కొన్నివందల ఏళ్లుగా నిల్చున్నట్టుగా ఉంది.
రాజుల, పాదుషాల, సర్వాయిపాపన్నల,
అంతఃపురాల, వజ్రవైఢూర్యాల కథలపిమ్మట -
రహ్బాన్ ఫిరంగి విజయగాథలానంతరం, ఓటమి గెలుపుల కథనాల పిదప -
తారామతి గానం, ప్రేమావతి నాట్యంలో పరవశించి మత్తిల్లినట్టున్న నిన్ను,
రామదాసు కారాగారపు ఔచిత్యాల,అనౌచిత్యాల చర్చల సారాంశాల
కథాకథనాల వందలేళ్ల తలపోతల తర్వాత -
వైభవాల, వైఫల్యాల, ఎన్నటికీ కన్నులకట్టని గతాల అనంతరం
జాషువాపద్యపు చరణం ఇచ్చోటనే భూములేలు
రాజన్యుల అధికార ముద్రికలు అంతరించెగుర్తుచేసుకుంటూ
కుతుబ్ షాహీల ఏడుసమాధుల గుమ్మటాలవైపు చూస్తూ నీ ముందు నిల్చున్నాను.
సమయం లేదు గోల్కొండా !
హట్టారా సిడీ దర్వాజా, దాన్ కోటా దర్వాజా, నయా ఖిలా దర్వాజా -
ఇంకా ఈ మూసివుంచిన ద్వారాల ముందుకు వెళ్లి
అక్కడి మట్టిలోంచి సాగిన అడుగుల గుర్తుల్ని ఆలింగనం చేసుకోవాల్సివుంది.
- కవి యాకుబ్, 9849156588

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles