హౌస్ హజ్బెండ్


Mon,May 28, 2018 01:59 AM

House-husband
యు ఆర్ ఫ్రమ్ మార్స్
అయామ్ ఫ్రమ్ వీనస్
ఇరుగ్రహాల వాసులం
ఈ భూమి మీద కలుసుకున్నాం
రెండు అస్తిత్వాలు
ఒక్క జీవితంగా ఉదయించాం
ఈ లోకం..
నీకూ నాకూ వేర్వేరు విలువల వస్ర్తాలను
బాధ్యతల కిరీటాలను అందించింది
యుగాల నుంచీ
ఎవ్వరి కిరీటాన్ని వాళ్ళం ధరించే ఉన్నాం
అనివార్యంగా ఇపుడు కిరీటాల్ని మార్చుకున్నాం
పురిటి నొప్పులు పడింది నేనైనా
పుట్టెడు దుఃఖాన్ని మోసింది నువ్వు
పాపని కన్నది నేనైనా
అరచేతుల్లో చందమామగా చూసింది నువ్వు
పాల ప్యాకెట్ తెచ్చింది నేనైనా
పాపకి పాలు పట్టింది నువ్వు
స్కూల్ కోసం పాపకి సాక్స్‌లు వేసింది నేనైనా
స్నాతకోత్సవం దాకా నడిపించింది నువ్వు
గుర్రం బొమ్మ కొన్నది నేనైనా
గుర్రంగా మారి స్వారీ నేర్పించింది నువ్వు
కుంకుడుతో తలంట్లు పోసింది నేనైనా
ఫ్యాషన్ జడలతో పాపని నవ్వించింది నువ్వు
ముంగిట్లో రంగవల్లులు పేర్చింది నేనైనా
పాప చేతుల్లో మెహిందీ రంగోలీలు దిద్దింది నువ్వు
బట్టలు కొని తెచ్చింది నేనైనా
రంగుల డిజైన్లతో గౌన్లు కుట్టించి వేసింది నువ్వు
కారు కొన్నది నేనైనా
కుటుంబ డ్రైవర్‌గా మారింది నువ్వు
ఆటల్లో దెబ్బ తగిలింది పాపకైనా
దిండు తడిచేలా ఏడ్చింది నువ్వు
వయసొచ్చాక పాపకు ఓణీలు కొనింది నేనైనా
క్షణ క్షణం కంటిపాపలా కాసింది నువ్వు
పాప పెళ్ళికి ఆర్థిక హంగులు చేర్చింది నేనైనా
హార్దిక పరిపుష్టిని సమకూర్చింది నువ్వు
అత్తారింటికి సాగనంపింది నేనైనా
మెట్టినింటికీ పేరు తెచ్చేలా మలిచింది నువ్వు
నాన్నలా మా ఆయన లేడెందుకని పాప అలిగొస్తే
అరిచింది నేనైనా
అల్లుడిని అర్థం చేసుకునేలా పాపకి అండగా
నిలిచింది నువ్వు
అవును..
నేను సంపాదిస్తున్న అమ్మని
నువ్వు సక్రమంగా సంసారాన్ని నడిపిన నాన్నవి
నాన్నా.. అంటూ మన కూతురు
తాతా.. అంటూ మన వరాలు
నిన్ను పెనవేసుకున్నప్పుడల్లా
నేను అసూయ పడుతూనే వున్నాను
నా కంటే నీవే వాళ్ళకి ఎక్కువైనందుకు కాదు
నీ లాంటి నాన్న నాకు లేనందుకు
క్షణ క్షణం నేను గర్వపడుతూనే వున్నాను
పురుషాహంకారాన్ని దాటేసి
నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు
నేను వర్కింగ్ వుమన్ అయినందుకు
నువ్వు హౌస్ హజ్బెండ్ లా మారినందుకు
ఇక ఇపుడు ఇద్దరి కిరీటాలని
మ్యూజియం గాజు గదిలో భద్రపరుచుదాం
నగ్న శిరసులతో
సహజ న్యాయ శిరోజాలని
లోకంపై కప్పేద్దాం
గృహాన్ని దాటి
గ్రహ ధర్మాన్ని ప్రతిష్టిద్దాం..!
- అయినంపూడి శ్రీలక్ష్మి
99899 28562

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles