నదితో నడక


Mon,May 28, 2018 01:58 AM

Naditho-nadaka
నది పక్కనే నడక-
నన్ను నేను తవ్వుకుంటూ
పై పైన మట్టి పోసుకుంటూ గట్టులా ముందుకు సాగిన నడక-
సూర్యుడు ఉదయపు వలని దులుపుతున్నాడు
రాత్రి నదిమీద వాలిన చుక్కలు
పొద్దునే పడవలెక్కి నీటి బుగ్గలు చిదుముతున్నాయి!
ఎన్నిసార్లు నడవ లేదు
అమ్మ వేలు పట్టుకునో.. నాన్న చేయి పట్టుకునో..
చెలులతోనో యవ్వనకాలపు కలలతోనో
ఒక మహాకవి నీడలాంటి సాయంకాలపు ఆకాశంతోనో
ఎన్ని సార్లు నడవలేదు
ఈసారి నది ఒడ్డున నడక
ఒక పురా స్వప్న మహా సంచారమే అనిపించింది!
నది ఒరుసుకున్నప్పుడల్లా
నాలో పేరుకుపోయిన ఏ యుగాలనాటి శిథిలాలో
పెళ్ళలు పెళ్ళలుగా రాలిపడ్డాయి
అక్కడక్కడా చేపలు పైకెగిరి లేయెండ చొక్కా తొడుక్కుని
మళ్ళీ బుడుంగుమంటున్నాయి
అవి వచ్చీపోయే నాగరికతల నమూనాలేమో..
నదిని చాపలా చుట్టుకుంటూ నేను-
నన్ను కొంచెం కొంచెం కరిగిస్తూ నది-
అది నడకో..
ఒకరిలోకి ఒకరిని లాక్కునే రహస్తంత్రమో..!
ఏమోలే.. అదంతా ఎందుగ్గానీ
ఖాళీ ఖాళీ కడుపు నిండా నీళ్ళు మాత్రం నిండాయి
ఏ దు:ఖపు వలపోతలకైనా ఖర్చయ్యే కన్నీళ్ళ కోసం
ఇప్పుడు పెద్దగా హైరానా లేదు
ఎవరైనా నాతో నడవొచ్చు
నదితో నడిచినట్టే.. ..!
- ప్రసాదమూర్తి, 84998 66699

485
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles