ఎండాకాలం!


Mon,May 21, 2018 01:13 AM

Yenda-kaalam
ఎండ కెరటాలు కెరటాలుగా నేలను దిగుతోంది
గాలికి నిప్పంటుకొని నీడలు కాలిపోతున్నాయి
చెట్లు ఆక్సిజన్ అందక వెంటిలేటర్‌పై బతుకుతున్నాయి
ఎండ మీద అడుగుపెడితే మంటల మడుగులో దిగడమే
చౌరస్తాలో మోచి మల్లయ్య కళ్లు పాదాల చుట్టూ తిరుగుతున్నాయి
ఎన్ని నీళ్లు తాగినా దేహ దాహం తీరడం లేదు
ఎండమావులు ఆశల నీళ్లు చల్లి మురిపిస్తున్నాయి
పల్లెలు బావికీ ఊరికీ మధ్య లోలకంలా తిరుగుతున్నాయి
ఎండను చూసి కర్బూజ ముఖం ఎరుపెక్కుతోంది
అమృతపు సోనను ముంజలు మురిపెంగా అందిస్తున్నాయి
ఒంట్లోని వేడికి ఐస్‌క్రీం కరిగి కాలువలవుతోంది
చమురుతేరిన ముఖాలు కళ తప్పి కలవరపడుతున్నాయి
వడదెబ్బకు అల్పప్రాణులు చీమలైపోతున్నాయి
దవాఖానాలు గ్లూకోజ్ అందక విలవిలలాడుతున్నాయి
పిల్లలు కీమోథెరఫీకి గురైన కణాలై మాడిపోతున్నారు
సన్‌క్రీంలను కప్పుకొని కోమలులు అందాన్ని సంరక్షిస్తున్నారు
కాలం కార్మికుడి చెమటతో ఊపిరితీసుకుంటోంది
ముఖం మీది ముడతల్లో నేల తేమను దాచుకుంటోంది
చెరువులు దప్పికేసి అలుగులు దూకడం మానేశాయి
రేపటి చినుకు కోసం రైతు మేఘాల్లో కలగంటున్నాడు
- డాక్టర్ వెల్దండి శ్రీధర్, 98669 77741

423
Tags

More News

VIRAL NEWS