నాన్నకు ప్రేమతో..!


Sun,April 29, 2018 11:16 PM

Naannaku-prematho
నన్ను, నిన్ను.. అందరినీ
నడిపించే కిరణం నాన్న
నాన్న లేకుండా జగత్తే లేదు
గమ్మత్తేమిటంటే..
ఈ ప్రపంచానికి నాన్న కావాలి
తన చిటికెన వేలు పట్టుకోవడం తెలుసు
తన కృషి, సంపద, సౌఖ్యం అన్నీ మనవే
కానీ, ప్రపంచంలోనే నాన్న ఒంటరవుతున్నాడు
అందరూ వున్న అనాథవుతున్నాడు
రెండక్షరాల రక్ష నాన్న
నాన్నంటే నడిచే దీపం
కరుగుతూ వెలిగే కొవ్వొత్తి
అమ్మ ప్రేమకు మూలకణం
ఆమె పక్కన అతను
అతని చెంతన ఆమె
అమ్మా-నాన్న.. పాలు-తేనె
శక్తికి తియ్యదనం తోడు
ఇల వెలిసిన అమృతం అమ్మానాన్నలు
ఇద్దరూ ఇద్దరే
ఇంటికి పునాదులు
పిల్లలకు ఆశాజ్యోతులు
అమ్మ లేని నాన్న, నాన్న లేని అమ్మ
ఒంటిస్తంభం మేడలు కారాదు
ఆ గోడలకు మనం
సహజ కవచ కుండలాలం కావాలి
నాన్నకు అమ్మ, అమ్మకు నాన్న
ఒకరి కొకరుగా ఒక్కచోటనే ఉండనిద్దాం
తల్లి మనసు, తండ్రి వాక్కు
యుగాలు మారినా మారని మమత నాయనే
కోపం, తాపం, కట్టుబాట్లు, క్రమశిక్షణ
ఆయుధం ఏదైనా అనురాగం ఒక్కటే
నాన్న చూపుడు వేలు, అమ్మ కొంగుచాటు
తారుమారైనా తప్పు లేదు
భయమైనా, బాధైనా, కష్టమైనా, నిష్టూరమైనా
బాపుబాట బంగారుతోట వైపే
తనువు వేరైనా తాను మనకెప్పుడూ ప్రియనేస్తమే
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా
చిత్రంగా... నాన్నే కనిపిస్తున్నాడు
నా అణువణువునా నిండిన తేజస్సు
నా అడుగులో అడుగు
నాన్నే నాకు ఆదర్శం
నాన్నే నాకు సమస్తం
నా పసితనమంతా తనదే
చిన్నతనాన తాను నాటిన జ్ఞానం విత్తు
ఇవాళ్టికి చెక్కుచెదరని అక్షరాల చెట్టు
నిండు ధవళవస్ర్తాల్లో నిలువెత్తు నిజాయితీ
వారసత్వం, వంశప్రతిష్ఠల ముందు
ఆస్తులు, అంతస్థులు అధః పాతాళంలోనే
ఆత్మగౌరవాన్ని భుజంపై వేసుకొని తిరిగాడు
కోటలు లేని గడీగోడల పెంకుటింట్లో
ప్రజల పంతులుగా వెలిగిన వాడు
నీతి తప్పని నా బతుకంతా తనదే
ఇప్పుడు నాన్నా.. అని పిలవడానికి తాను లేడు
ఐసియులో నువ్వు కార్చిన
ఆఖరి కన్నీళ్ల సాక్షిగా చెబుతున్నాను,
నేను నీ కొడుకునే, నాలో ఉన్నది నువ్వే!
- దోర్బల బాలశేఖరశర్మ
80966 77410

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles