కార్మిక స్వేదం


Sun,April 29, 2018 11:14 PM

మనకు తెలియదు కానీ
గుండెకు కన్నులున్నాయి తెలుసా !
కమిలిన దేహం కక్కుతున్న స్వేదమే
గుండె యొక్క కన్నీరు...!
ఇంతకీ ఆ గుప్పెడు గుండె
పచ్చని స్వేదాన్ని ఎందుకు కక్కుతున్నది ?
అవును...
ఆ మాసిన గుండెకు అలుపైయ్యింది...!
ఎందుకంటే ? కొన్ని యుగాల క్రితం
గడియారపు ముల్లులు క్షణాలను తవ్వి
కాలాన్ని ఆ గుండె కాళ్ళకు బిగించడంతో
పరుగు తీసి తీసి అలసిపోయింది...!!
మీరు ఎప్పుడైనా గ్రహించారా ?
శ్రమపడిన గుండె
మనతో ఎదో మాట్లాడాలనుకుంటోంది !
దాని బాధను లబ్ డబ్ అనే విశ్వ భాషలో
మనకు చెప్తునట్టు లేదూ....!!
ఒక్కసారి మీ కుహరములను
కార్మికుని గుండె గదిలో భద్రపరచండి
శ్రమ శక్తి యొక్క విలువను
అణచివేయబడ్డ హక్కులను
కనీస వేతనాలు పొందలేని
దీనగాధల చరిత్రను రక్త నాళాలతో తోడి
మీ చెవులలో నింపుతుంది...!!
వీలైతే స్వేదం పూసుకున్న
ఆ దేహాన్ని గట్టిగా కౌగిలించుకోండి !
ఒక్కసారి ఆ చెమట పరిమళాన్ని
నాసిక పుటల నిండా పీల్చుకోండి !
వారి దగ్గరికెళ్లి
నాలుగు మాటల అమృత చుక్కలను
కాసిన్ని నవ్వుల పువ్వులను వెదజల్లండి...
వారు నిత్య కార్మిక శక్తిగా నిలిచి
గగన గర్భంలో వేలాడే
రెండు బంతులతో పోటీ పడుతూ
దేశాన్ని నడిపిస్తూనే ఉంటారు...!!
- అఖిలాశ, 072595 11956

419
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles