ఆత్మానలం


Sun,April 29, 2018 11:14 PM

చిదిమితే పాల్గారే అయిదేళ్ళ చిన్నారి
ఎనిమిదేళ్ళ ముద్దబంతి
చివరికి నాలుగు నెలల పసికందు
వాళ్ళపై జరిగిన అత్యాచారకాండ చదివినపుడు
వామనుని పాద తళానికి క్రుంగిన బలి శిరస్సులా
నాతల రసాతలానికి వంగిపోయింది
ఇది ఏ పుణ్య భూమి తపః ఫలం
ఇది ఏ కర్మ భూమి యశః షలం
తల్లీ నన్ను క్షమించు
నిన్ను చిత్రహింసలు పెట్టిన
ఈ రక్కసులున్న దేశంలోనే
నేనూ చరిస్తున్నందుకు
సిగ్గుతో తలదించుకుంటున్నాను.
మీ ఆక్రందనలతో నా అంతరంగానికి
శాంతి లేదు
నీ ఉసురు తగిలిన ఈ జాతికి యశస్సు లేదు.
మానవ జీవన గానంలో విషాద గీతికలివి
రక్కసులు కూడా దడుచుకునే రాక్షసకాండ ఇది
పిశాచాలు కూడా కకావికలయ్యే
పైశాచికత్వానికి పరాకాష్ఠ ఇది
కంటికి నిదుర లేదు, హృదయానికి శాంతి లేదు
బదులు తీర్చే శక్తి లేదు
చిరిగిపోయిన గుడ్డబొమ్మల్లా
చివికిపోయి భూమికంటుతున్న
చిన్నారుల దురవస్థ, దీనావస్థ!
విస్ఫులింగాల్ని విరజిమ్ముతూ
దహించుకుపోతున్న వేన వేల ఆత్మలకు
మరోటి జతయ్యింది
కణం కణం రగిలి దావానలమైనట్లు
భరతావనిని కమ్ముకుంటోంది ఆత్మానలం
ముష్కర కాముక హంతకులందరూ
అందులో కాలి బూడిద కావలసిందే
ఇక శాంతి లేదు, భ్రాంతి లేదు
మరోసారి వేచి చూచే శక్తి లేదు
పరస్త్రీని మోహించినందుకే
మోహించి అపహరించినందుకే
రావణ బ్రహ్మకు మరణ దండన విధిస్తే
అబలలని, శిశువులని, చిన్నారులని
చిత్రహింసలు పెడుతున్న రాక్షసులకు
ఏ శిక్ష విధించాలి?
- ప్రతికంఠం దత్తాత్రేయ రాజు, 99594 75471

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles