బయటా.. లోపల


Sun,April 22, 2018 11:45 PM

bayataa
నిన్నటి వరకూ
తిర్యక్కులకు స్పర్శా జ్ఞానం
లేదనుకునే వాణ్ణి
పురా జ్ఞాపకాలను
నెమరువేసుకునే
జ్ఞాన గ్రంధి లేదనుకునే వాణ్ణి
నా అనుకోవడాల్ని అబద్ధం చేస్తూ
ఇన్నేళ్ళ విరామం తర్వాత కూడా
విశాఖ సముద్రం నన్ను గుర్తు పట్టింది.
ఎంత దూరం ఎగిరెళ్ళిపోయినా
పిల్లలున్న గూటిని తల్లి పక్షి
జ్ఞాపకం పెట్టుకున్నట్టు
ఈ సముద్రమూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు
వేన వేల నీటి నమస్కారాలు!
చాలాకాలం తర్వాత కలిసిన మిత్రుణ్ణి
ఏరా! ఇన్నాళ్ళూ ఏమైపోయావు అంటూ
భుజాలు పట్టుకుని ఆత్రంగా అడిగినట్లు
ఈ సముద్రమూ నన్ను పలకరించినందుకు
లక్షోపలక్షల ఇసుక దండాలు!
నెలల తరబడి హాస్టల్ పురుగులన్నం తిని బక్కచిక్కి
ఆపొద్దే ఇంటికొచ్చిన కొడుకును
తల్లి వొళ్ళంతా తడిమి తడిమి చూసుకున్నట్టు
ఈ సముద్రమూ నన్ను ఆపాద మస్తకమూ
తడిమినందుకు కోటికోటి కెరటాల వందనాలు!
సాదరంగా వొడ్డుకెళ్ళి నిలబడతానా
పగుళ్ళిచ్చిన నా మొరటుపాదాలను
ఆదరంగా మెత్తటి ఇసుక హృదయంతో
చుట్టు ముట్టేస్తుంది!
ఆటల్లో అలిసిపోయి
పరుగు పరుగున ఇంటికొచ్చిన కొడుకును
వొళ్ళో కూచోబెట్టుకుని చీరకొంగుతో
మొహం మీది చెమట తుడిచే తల్లిలా
సముద్రం ఒక పిల్ల తెమ్మరను
వింజామరను చేసి నా చిరుచెమట నుదిటి మీద
వేవెనలు వీస్తుంది!
ఆకాశమూ సముద్రమూ కలిసిన
సన్నని దిగంత రేఖవైపు
తదేకంగా చూస్తూ వుంటానా
బిడ్డనోటికి స్తన్యం అందిచ్చిన తల్లి
మాతృత్వపు కొంగును
నిండారా కప్పినట్టు
ఈ సముద్రం నా భుజాలనిండా
ఆకాశాన్ని నీలిశాలువాను చేసి కప్పుతుంది
అప్పుడు ఇప్పుడూ
సముద్రం ఒక ఉపాధ్యాయుడే
తన నిరంతర పరంపర
కెరటాల బాహువులతో-
చెప్పిన పాఠమే
ఎప్పటికీ ... ఇప్పటికీ
పడినచోటే లేచి నిలబడమని
వెళ్ళలేక వెళ్ళలేక
వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తానా
లోపలి నుండి ఒకటే హోరు
నేను బయటా.. సముద్రం లోపలా
(సముద్రం లాంటి మిత్రులు
డాక్టర్ వరుగు భాస్కర్‌రెడ్డి గారికి)
- శిఖామణి, 98482 02526

385
Tags

More News

VIRAL NEWS