మాటల కెరటాలు


Sun,April 22, 2018 11:41 PM

ఆడపిల్లల్ని మాట్లాడనివ్వండి
అలలు అలలుగా ఎగిసిపడనివ్వండి
సంక్షోభాలు లేకుండా
సందేహాలు లేకుండా
సంభాషణా పరిమళాలు వెదజల్లనివ్వండి
అది ఇష్టాగోష్టి సన్నివేశం కావచ్చు
వక్తృత్వ ప్రతిభ పోటీ కావచ్చు
ఊసుపోక కబుర్లే కావచ్చు
ఊకదంపుడు ఉపన్యాసమే కావచ్చు
సందర్భం ఏమిటన్నది కానేకాదు ప్రాతిపదిక
వాళ్ళను వాళ్ళు వ్యక్తీకరించుకోనివ్వండి
ఒక పద్ధతి ప్రకారం మాట్లాడట్లేదంటారా?
అసలిప్పుడే కదా వాళ్ళు నోరు తెరిచింది
తిట్లూ శాపనార్థాలూ పెడుతున్నారంటారా?
ఆగ్రహానికి మాటలు తొడుగుతున్నారేమో!!
ఆవేశానికి భాషనిస్తున్నారేమో!
మిత్రులారా!
వాళ్ళ మాటల ప్రవాహానికి అడ్డుకట్టలు వేయొద్దు
ఆటంకపరచొద్దు
శతాబ్దాలుగా కోల్పోయిన అవకాశాల కోసమే కాదు
ఇప్పుడిక కూలిపోతున్న విశ్వాసాల కోసమైనా
వాళ్ళను మాట్లాడనివ్వండి
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
96180 32390

330
Tags

More News

VIRAL NEWS