ఆసిఫా.. ఆసిఫా..


Mon,April 16, 2018 12:44 AM

ASIFAHUMAN
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
భ్రష్ట, అమానుష మతాలను కాల్చడం
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
తుచ్ఛ కులోద్రేకాలను తెగనరకడం
ఈ వివక్ష, ఈ హింస ఎందాకా
నోరులేదు అరుద్దామన్నా కూలబడిపోయింది
చేయెత్తుదామన్నా సత్తువలేదు చలువలు బట్టిపోయింది
ఈ ఫాసిజాన్ని ఎందుకు భరించాలి, తెగ నరుకక
ఈ కౄర, పైశాచిక వర్గాల పాలక యంత్రాంగాలను
ఎందుకు మొయ్యాలి థూ అనక
ఆడదయితే చాలట రేప్ చేసెయ్యొచ్చునట
పరాయి మతస్తురాలైతే నేరమే కాదట!
ఆసిఫా.. నా చిట్టి నేస్తమా..
బాల్యం ఇచ్చట పూలతోట కాదు
బాల్యం ఇచ్చట పండుగసలే కాదు
బాల్యం బంగారుకల కానే కాదు
బాల్యం స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టా కాదు
ఇచ్చట బాల్యంతో ఎవరూ దోస్తీ కట్టరు
ఇచ్చట దేవుళ్ళను తప్ప పిల్లలనెవరు ప్రేమించరు
ఈ దేశం మైకంతో తగులబడుతున్న మత శ్మశానం
ఈ దేశం వైరంతో రక్తమాంసాలు కుళ్ళిన
కులాల రొచ్చుపెంట
ఇంకా పూర్వీకుల చరిత్రలు తాకి, నాకి మురిసిపోతుంటరు
ఇంకా ఈ దేశంలో మనుషులింకా పుట్టలేదని పొంగిపోతుంటరు
ఇంత అవమానమైనా తలలు సిగ్గుతో
చితుకని ఛండాలపు వారసత్వం ఇక్కడే ఉంది
ఛ, ఇక్కడ పుట్టినందుకు నా పుట్టుకే ఒక అవమానమైపోయింది
థూ, ఇన్ని చూస్తున్నందుకు నా చూపే అవకరమైపోయింది
ఈ దేశపు జెండాకు ఏమని జాతీయ గీతం పాడాలె?
ఈ దేశానికి ఎందుకింకా చేయెత్తి జైకొట్టాలె??
ఏం చెప్తారురా జవాబు?
ఆ పసిదాని అమాయకపు, అందమైన కంటిచూపులకు
ఏం చెప్తారు?
మీరింకా మనుషులేనని ఎట్లరా అనుకుంటరు?
- శ్రీరామోజు హరగోపాల్, 9949498698

667
Tags

More News

VIRAL NEWS