అతడు


Mon,April 16, 2018 12:42 AM

ATHADU
అతడు తక్కువగా మాట్లాడుతాడు
అయినా
ఎంతో మాట్లాడినట్టుంటుంది.
విననట్టే కనిపిస్తాడు
కాని ప్రతి భావాన్నీ అనుభవిస్తాడు.
ఐదు మైళ్లు కలిసి నడిచాము
మధ్యలో ఓ చెరువు
ఓ చిన్నగుట్ట,
పిల్లబాటలు
ప్రధాన రహదారికి
ప్రవహించేదాకా
శబ్దగర్భిత మౌనభాష అతనిది.
అప్పుడప్పుడు
ఓ ఆకు రాలినట్టు,
కాలువలో ఓ రాయి పడ్డట్టు
ఓ చూపు.
దూరంగా పొగమంచు
అతని కళ్లల్లో
బాష్పంగా మారినట్టు
ఓ ఆవిరి.
సంభాషణ పైకి కనపడదు
ఒక ధీర కావ్యమంత ఉత్తేజం.
ఎవరూ బాధలను
పోగొట్టకపోవచ్చు.
కాని కొంచెమైనా తగ్గించటంలో
అతడు దిట్ట.
ఇరుకుల్లోని కలతలను
విశాలం చేస్తూ పలుచబరుస్తాడు.
అతడు మాట్లాడినట్టే వుండదు
కాని జీవితంలో
ధైర్యాన్ని నింపుతాడు.
వీరుడంటే అతడే
ఉత్సాహాన్ని
రసస్థాయికి తీసికెళ్లే భరతడు.
- డాక్టర్ ఎన్.గోపి

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles