కన్నీటి సంద్రం


Mon,April 16, 2018 12:42 AM

ఒక చిరునవ్వు చాటున
కనిపించని గాయం..
కనురెప్పలు దాటని దుఃఖం..
పెదవులు దాటని మౌనం..
ఆధునిక మహిళల జీవితం!
ఆశయాల సాధనకై సాగుతున్న తోవంతా
కంప ముళ్ళు.. కంకర రాళ్లు..
పురుషాధిక్యమే పెను భారం..!
కష్టాలను బ్యాగు నిండా
కన్నీళ్లను బాటిల్ నిండా
మోసుకొని కాలంతో పరుగెత్తడం..
ఉద్యోగ మహిళ ఏ స్థాయిలో పని చేసినా
ఇంట్లో రెండో శ్రేణి మనిషై
జీతం లేని పనిమనిషై.. భోగ వస్తువై..
కలల శకలాలుగా మిగిలిన జీవితం..!
అడుగు వేయనీయని ఆధిపత్యం
బుసలు కొడుతున్న పురుషాధిక్యం
తడబడుతూ నిలబడే ప్రయత్నం
తోడు నిలువని ప్రపంచం
అవిశ్రాంతంగా అలసిపోతూ
ఆకలి దప్పులను మర్చి పోతూ
తమని తాము కోల్పోతూ..
మాటల చాటున చూపుల మాటున..
మైనంలా కరిగిపోతున్న ఆత్మగౌరవం..!
అభివృద్ధిలో సగం
ఆకాశంలో సగం
ఆత్మీయతలో అమ్మ తనంలో సంపూర్ణం
అయినా..
స్త్రీకి నిలువెల్లా సంకెళ్లెనా..
అడుగడుగునా రక్తపు మడుగేనా..!!
- షబ్నం

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles