మహా కాళేశ్వరం .. ఒక జలాలయం


Sun,April 8, 2018 11:39 PM

మనిషి.. నాగటి పోటుతో భూమిని గాయపరుస్తాడు
ఐనా.. భూదేవి రక్తసిక్త శరీరంతో మనిషిని గుండెలకు హత్తుకుని
ప్రతిగా .. మాతృమూర్తియై నోటికి ఆహారాన్ని అందిస్తుంది
భూమి తల్లి .. భూమి దేవత .. భూమి కారుణ్య .. భూమి ఒక లాలించే ఒడి
సరస్సులనూ, తటాకాలనూ, నదులనూ, ఆనకట్టలనూ..
చివరికి సముద్రాలను కూడా మోస్తున్నది భూమే కదా ..!
ఈ పవిత్ర భూమితో .. మట్టితో .. మట్టి ఆత్మతో
యుగయుగాల అనుబంధం మన తెలంగాణా బిడ్దలకు
తరతరాల తల్లి, బిడ్డ బంధం మనది !
1955 నుండి 1967 వరకు .. ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన , ఎత్తైన
మానవ నిర్మిత రాతి డ్యాం నాగార్జున సాగరాన్ని నిర్మించిందెవరు
మనం .. తెలంగాణావాళ్ళమే కదా!
కుడి ఎడమ కాలువలు .. బాహువులుగా
కుడి ఎడమ కళ్ళు .. జలనేత్రాలు.. శ్రీశైలం, సాగరం.. గా
వర్ధిల్లి .. ఇప్పుడు
ప్రళయ జలోద్ధిత శివతాండవ జగత్ నృత్య మహార్ణవ ద్వారాలను తెరిచిందెవరు
మనమే .. తెలంగాణీయులం!
మహా కాళేశ్వరం .. మహారుద్ర జలక్షేత్రం
సంగమ .. సంలీన.. సమన్వయచ్ఛటలతో ఉదక విస్ఫోట వైభవం
నీటి పుట్టుక .. నీటి విస్తరణ .. నీటి వ్యాప్తి.. నీటి ఆశీస్సు ..
తెలుసు ఈ నేల మూలవాసులకు
పాదాలపై ప్రణమిల్లి తల్లిని ప్రార్థించగానే
ఆశీర్వదించే చేతివలె
ఒక ఏరు పారుతుంది.. జలోధృత ధారై...
ఇక చేతులు చాచి పిలిచేది తల్లి భూమాతే కదా
ఏరు పాయై, పాయ వాగై, వాగు వంకై ..
వంక జలపాతమై , జలపాతం ఒక నదై..
ప్రజ్వలించే నది.. నేలకు లక్షల ఎకరాలను శోభింపజేసే జలాభరణమై
ఒక మేడిగడ్డ , ఒక అన్నారం , ఒక సుందిళ్ల, ఒక ఎల్లంపల్లి.. ఒక మానేరు..
పేర్లు ఏవైతేనేమి .. భూమి ఒక్కటే..!
నీరు మట్టిని తడుపుతున్నపుడు .. ఆత్మ వికసన ఒక్కటే
లక్షల ఎకరాల పంటలను లక్ష్యిస్తున్నపుడు
ఇక్కడి మనుషులు
సమూహాలు సమూహాలుగా .. ఇంజనీర్లయి, టెక్నీషియన్లయి..
రూపశిల్పులై.. కూలీలై.. కార్మికులై..
చెమటతో తడుస్తూ వేలమంది శ్రామికులై ..
మనుషులే రాత్రింబవళ్లు కాలాన్ని తాగుతూ ..!
బ్యారేజ్ లౌతారు, రిజర్వాయర్లౌతారు, కాలువలౌతారు!
సర్జ్ ట్యాంక్ లౌతారు, పెన్ స్టాక్ లౌతారు, ఎత్తిపోతల ప్రవాహాలౌతారు..!
పంపులుగా, మోటార్లుగా, పవర్ హౌజ్ ..లుగా
విద్యుత్తును ధరించిన మిలియన్ల మెగావాట్లుగా..
మట్టి మనుషులు వెలుగులు చిమ్ముతున్న కాంతిపుంజాలౌతారు!
ఇక్కడ మానవులందరూ ఒకటే..
ఒకరి పేరు ముఖ్యమంత్రి , మరొకరు మంత్రి
ఒకరు ఛీఫ్ ఇంజనీర్ , ఇంకొకరు వెల్డర్..
ఇతను ఫిట్టర్, అతను కార్పెంటర్, వీడు డ్రైవర్.. వాడు కట్టర్..
వెరసి అందరూ మహామానవులు...!
కాళేశ్వరంలో ఇప్పుడు జరుగుతున్నది మహాజలయజ్ఞం
ఇప్పుడు కమండలంలోకి
గోదావరి నదిని ఆవాహన చేస్తున్నారు భూమిపుత్రులు
తల్లి తప్పక వస్తుంది.. ఆశీర్వదిస్తున్న ఆకాశంవలె!
ఈ మహాయాగం దేశంలో ప్రథమం.. నూతనం.. విశిష్టం..
ప్రకృతిని శాసించి కాదు..,
ప్రకృతితో స్నేహించి , అర్థించి, ఆశ్రయించి..
ధరిత్రి చరిత్రను పునర్లిఖిస్తున్న సందర్భమిది!
మహాజలార్ణవం .. మహా జలజీవవైభవం..
మహోత్తుంగ తరంగ తేజ విస్ఫోటనం!
జలాభిషిక్తయైన భూమాత శోభిత ఋతు తురీయమిది
శివ పదఘట్టనలతో.. తాండవ నర్తనతో..
ఈ జలాలయం ఒక సత్యమై.. ఒక సజీవ స్వప్నమై..
వర్ధిల్లే మహాకాళేశ్వరమా ..
నువ్వు రేపటి మహత్తువు .. రేపటి శరత్తువు .. భవిష్యత్ జగత్తువు..
మనిషీ.. మట్టీ.. నీరూ .. కలెగలిసిన మహా మానవ వర్చస్సువు నువ్వు!
తెలంగాణాకు మాతృదేవతవు నువ్వు!!
- రామా చంద్రమౌళి, 9390109993
( 29-02-2018 న కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వ్యవహరించబడ్తున్న, భారతదేశంలోనే అపూర్వమైన మానవ నిర్మిత మహాజలనిధి ఎనిమిది ప్యాకేజ్‌లతో ఇరవై ఐదువేలమంది ప్రజలు రాత్రింబవళ్ళు నిమగ్నమై ఒక మానవ మహత్తర శక్తిగా ఐక్యతతో పని చేస్తున్న అద్భుత సందర్భాన్ని నేను ఒక వరిష్ఠ ఇంజినీర్‌గా ప్రత్యక్షంగా చూసి.. పరవశించి.. పులకించిన క్షణం.. )

530
Tags

More News

VIRAL NEWS