బతుక్కు యుగం కావాలి!


Mon,April 9, 2018 01:32 AM

వెలుగుతున్న దీపాన్ని ఉఫ్ మని ఊదేసినట్టు..
మరణం అంత సులభమా!
మరెంతో సౌఖ్యమా..!!
woman
నేలలో విత్తనం ఫెటిల్లున పగిలి మొలకెత్తినట్టు..
బతుకు అంత కష్టమా
మరెంతో యాతనా !

ఓటమికి ఒకే దారి
గెలుపునకు అనేక దార్లు..!

రెంటి నడుమా
ఆశ నిరాశల పరదా
తేలియాడుతూనే వుంటుంది

ఒక్కోసారి బతుకునిండా
మబ్బులు ముసిరినట్టు
చీకట్లు కమ్ముకుంటాయి
పోట్రాళ్ళు తగిలి బొటనవేళ్లూ..
బొక్కబోర్లా పడి మోచేతులూ.. మోకాళ్లూ..
చిట్లిపోతాయి...

చిదురు మదురు గాలివానకే
నమ్మకాలు చెల్లా చెదరవుతాయి
అనుభవాలు లిట్మస్ పరీక్షలు పెడతాయి..!

నడి సంద్రంలో నావలాగా
దిక్కు తోచదు.. దిగులు తీరదు..
దివిటీ కనిపించదు... ...

మాటల్ని మింగేసిన ఒంటరితనాలు
చిరు ఆలంబనకై..
తహ తహ లాడతాయి..!

హృదయాన్ని కూడా
చీకటి కమ్మెస్తుంది!
ధైర్యం..
తెగిన గాలిపటమై ఎగిరిపోతుంది!
పిరికితనం నిలువెల్లా పాకుతుంది!!

బతుకు లంగరు తెగిపోతుంది..

చావుకు క్షణం చాలు..!
బతుక్కు యుగం కావాలి ..!!

-వారాల ఆనంద్, 9440501281
(యాంకర్ రాధిక విషాదంలో విషాదమై...)

485
Tags

More News

VIRAL NEWS