పోగొట్టుకొన్న చోటు


Mon,April 2, 2018 01:28 AM

CHOTU
పోగొట్టుకొన్న చోటేదో
వెతుక్కుంటూ కన్నీటిదిబ్బను చేరుకున్నాక
స్వర్గానికేసిన నిచ్చెన ఇటుకొసకు
మన ప్రేమ రక్తమోడుతున్న సంగతి
సూర్యుడు అవసాన ప్రేయసిని
ముద్దాడుతూ కానీ చెప్పలేదు
అనుభవం ఆలస్యమయిందని
వాగ్దానభంగం మొదలవుతుంది
నటనల మధ్య నివాసం
నీరుగారిపోతున్న వేళ
గాయం లేదన్న మాటే కాని
ఇది యుద్ధమే!
బయటికి కనిపించదు కాని
ఆయుధం పదునైనదే
నోళ్ళు నవ్వుతుంటాయి కాని
నొసళ్ళు కనిపించవు
గుండెను లాకర్లలో దాపెట్టుకొని
అంతా అస్త్రవిన్యాసంలో
ఆరితేరుతుంటారు
పావ్రాన్ని నేలమాళిగల్లో పాతరేసి
వేదికల మీద నాట్యం
పండిస్తుంటరు
ప్రపంచమంతా కలయదిరిగి వచ్చి
మునివాకిట్లో దారి తప్పుతం
శత్రువుకు రాసిన ప్రేమలేఖ
నలుమూలలూ తిరిగి
పదే పదే మారే జెండా రంగులా
పట్టపగలు కౌగిలిస్తుంది
మనమిక నవ్వలేం
మురిపాల మాత్రలెన్ని వేసుకున్నా
అంతరంగ రుజాగ్రస్థత
వెంటాడుతూనే ఉంటుంది
శతాబ్దాల కిందట పాతిన
దుఖ్ఖపు వృక్షాలు
కొద్దికొద్దిగా ఫలిస్తున్నాయి
పూలను చూసి మురిసి
యుద్ధాలు చేసిన తాతలు
తెగిన తలల మీద
గడ్డకట్టిన ప్రాణాంతర వేదనకు బదులు
కటారుల్ని భద్రపరిచి బహుకరించారు
మనం ఖచ్చితంగా
కత్తిని ముద్దాడుతం
పూలు దొరికినా,
పరవశపు గాలులు ఎదురొచ్చినా
పర్వవేళా తరంగాలు కన్నుగీటినా
కత్తులకు పదునుపెట్టి
కన్నీటికి ఊట చేసి
నిరంతర యుద్ధ రంగంలో
నిస్సిగ్గుగా చిందులేస్తుంటం
- ఏనుగు నరసింహారెడ్డి, 89788 69183

443
Tags

More News

VIRAL NEWS