దు:ఖ కవిత


Mon,April 2, 2018 01:27 AM

DUKKA-KAVITHA
నిన్నటి రాత్రి నేనొక
దు:ఖ కవితను కలగన్నాను
కవితలోని పంక్తులన్నీ
నన్ను అమాంతం కౌగిలించుకొని
బోరుమనడం నాకు గుర్తున్నది
నా దారిలో రాలిన కొన్ని నక్షత్రాలు
కొన్ని ఆశయాలు..ఆశలు..
ఈ దు:ఖ కవితతో జతగూడినవి!
నేను కొన్ని అక్షరాలను ప్రేమించిన మాట నిజం
అప్పుడప్పుడూ అక్షరాలు కూడా నన్ను
నిండా ప్రేమలో ముంచిన మాట నిజం
జతగూడి మానవ సమూహాలను ప్రేమించిందీ నిజం
దూరంగా ముసురై కురుస్తున్న చీకటి
నా ఆత్మను గుక్కపట్టి గానం చేస్తున్నది
వెన్నెల రాత్రుల్ని నులివెచ్చని ఉషోదయాలని
అర్ధరాత్రుల్ల సుదీర్ఘ చర్చల ఎదురీతల్నీ
జైలుగది ఊచలగుండా నాలోకి ప్రవహించిన
పోరాట శపథాల మట్టి వాసనల్నీ
ఎవరో గానం చేస్తున్నారు
ఇతకంటే దుఃఖపూరిత పదాల గుండా
నేను ప్రయాణిస్తున్నప్పుడు
నా పాదాలను వీరగంధంతో సింగారించిన
అక్షరాల వరసొకటి దూరంగా బిక్కుబిక్కుమని నిలుచుంది
నేను రాల్చుకున్న కనుచూపులన్నీ ఏరితెచ్చి
ఈ దుఃఖ కవిత నాలోకి ఒలికిస్తున్నది
నన్ను ఓదారుస్తుందో గాయపరుస్తుందో తెలియని
సందిగ్ధ మగతలోంచి గట్టిగా నా బాహువుల్లోకి బంధించాను
కలలోనుండి మెలుకువలాంటి మసకలోకి జారిపడ్డాను
ఎప్పటిలాగే రాత్రి కలను దులుపుకొని
మళ్ళీ ఒక గంభీరతను ధరించి
ఈ రోజులో పడ్డాను
- చెమన్, 94403 85563

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles