అనాది యాది!


Mon,March 19, 2018 12:58 AM

బతుకు చెట్టుకు ఆశల చిగుళ్లు వేయించి
భవిష్యత్ సూర్యుడితో ప్రేమలో పడ్డ క్షణమే
వసంతం..!
నిర్లిప్త నిరామయ నిర్విణ్ణ ఘడియలకు
రాగాల రంగులను పూయించినదే
కోయిల గీతం!
మూసుకున్న తలపుల దర్వాజా పై
ఆకు పచ్చని కొత్త కోరికలను అలంకరించిందే
మామిడాకుల తోరణం!
షడ్రుచుల లాలసలో ఓలలాడే నిండు దేహానికి
పుట్టి పెరిగిన ఊరుకు
ఎదిగి నిలిచిన నగరానికి
ఊహిస్తున్న ఉటోపియా కు
పొంతన కుదరని ఆగమాగపు విస్మయం
వేప పూత వికాసం!
పంచేంద్రియాల బందిఖానా లోంచి
ప్రపంచ వీక్షణం
పంచ భూతాల సయ్యాటలోంచి
అంతరిక్షాల అన్వేషణం
నింగికీ- నేలకూ, తలకూ- పాదానికీ
లంకె పెట్టే సందిగ్ధ సమయం
పంచాంగం!
మనో యవనిక మీద
స్వప్న వాస్తవాలు- తాత్విక మీమాంసలు
వైఫల్య విజయాలు- విషాదానందాల వర్ణ చిత్రం
కొత్త సంవత్సరం!
అకాల కాలం - కాలాకాలం
కకావికలం- కలకలం
అన్నిటికీ అతీతమై నిలిచే
చిగురాకు అస్తిత్వం- చినుకు మనస్తత్వం
ఎండ పొడ తత్త్వం- పైరగాలి మహత్యం
ఉగాది ఉత్సవం!
ఉగాది...
పునాది మనాదిల కలబోత..!
అనాది యాదిల కలల నేత ...!!
- మామిడి హరికృష్ణ, 80080 05231

453
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles