రొట్టె మరియు రోజా పూలు


Mon,March 19, 2018 12:57 AM

లక్ష చీకటి పాఠశాలల్ని
వేలాది బూడిద వర్ణపు మిల్లుల ధాన్యపు గదుల్నీ స్పృశిస్తూ
హఠాత్తుగా వచ్చి సూర్యుడు వెలిగించే
అందమైన ఉషోదయాన
మేం వస్తాం కదం తొక్కుతూ.. పదం పాడుతూ..
మా పాటల్ని జనం వింటారు
మాకు రొట్టె కావాలి వికసించే కుసుమాలు కూడా కావాలి
మాకు రొట్టె కావాలి రోజా పూలు కూడా కావాలి..
మేం కదం తొక్కుతూ, పదం పాడుతూ..
పురుషుల కోసం కూడా పోరాడుతాం!
వాళ్లు మా సంతానమే కదా! మేం వాళ్ళకు తల్లులమే కదా!!
పుట్టుక మొదలుకొని బతుకు ముగిసేదాకా
అలుపెరుగక సాగుతాం!
మా దేహాలే కాదు హృదయాలు కూడా
ఆకలితో అలమటిస్తే..
మాకు రొట్టెలివ్వండి, వికసించే కుసుమాలనివ్వండి
మా ఈ మహా ప్రస్థానంలో అమరులైన
అసంఖ్యాక మహిళల దుఃఖం ధ్వనిస్తూ ఉంటుంది
ఒక చిన్న కల, కాసింత ప్రేమ మరియు సౌందర్యం
వారి బానిస ఆత్మలకు తెలుసు!
అవును మేం పోరాడేది రొట్టె కోసం
అంతేకాదు వికసించే కుసుమాల కోసం
కదం తొక్కుతూ.. పదం పాడుతూ..
మేం మంచి రోజుల్ని సాధిస్తాం!
స్త్రీలు వెలిగిపోవడమంటే
జాతి ప్రకాశించడమేనంటాం
ఇకపై బానిసత్వానికి వీల్లేదు
పది మంది కష్టంతో
ఒకడు సుఖించడానికి వీల్లేదు
జీవన మాధుర్యాన్ని అందరమూ కలిసి ఆస్వాదిద్దాం
మనకు రొట్టె కావాలి
వికసించే కుసుమాలు కూడా కావాలని నినదిద్దాం
అవును మనకు రొట్టె కావాలి
రోజా పూలు కూడా కావాలి.
- డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, 96180 32390
(ఇంగ్లీష్ మూలం: జేమ్స్ ఓపెన్‌హామ్)

451
Tags

More News

VIRAL NEWS