ప్రజాస్వామ్య విలువలకు పట్టం


Mon,November 18, 2019 01:07 AM

‘బీ’ అంటే ‘బాయ్‌' లేదా ‘బాల్‌' అని చిన్నారులకు నేర్పేవా రు. కానీ ‘బీ’ ఫర్‌ ‘బ్యాలట్‌' అని పుస్తకానికి పేరు పెట్టడం రచయితకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవం చెప్పకనే చెప్తుంది. సతీష్‌ చందర్‌ పత్రికారంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. తన ఇరువయ్యొకటవ ముద్రిత గ్రంథంలో ముప్ఫై ఏండ్ల రాజకీయ మార్పులను ప్రజాస్వామ్య విలువలతో, మానవీయ కోణంలో అణగారిన ప్రజల ఆలోచనా దృక్పథంతో విశ్లేషించి దాదాపు 800 పేజీల్లో 7 అధ్యాయాల్లో 197 సంపాదకీయాల ఈ సంకలనం రాజకీయాలపై పరిశోధన చేసేవారికి ఒక కరదీపిక అవుతుంది. దేశీయమే కాదు, అంతర్జాతీయ విషయాలనూ వదల్లేదు. తాను సంపాదకత్వం వహించిన ఏడెనిమిది పత్రికల్లో తాను రాసిన సంపాదకీయాలను అధ్యాయా ల ప్రకారం పరిణామక్రమంగా పొందుపరచి మనకందించారు. ఆయన పదునైన వ్యాఖ్యలు, ఆకట్టుకునే శైలి పాఠకులను ఒకేసారి 800 పేజీ లు చదివేలా చేస్తాయి.సామాజిక న్యాయానికి కట్టుబడిన సంపాదకుడు అంతర్లీనంగానే కాదు ప్రత్యక్షంగాను ప్రజాపక్షాన నిలుస్తారు. అది ఈ పుస్తకంలో మొదటిపేజీ నుంచి చివరి పేజీ వరకు స్పష్టమవుతుంది. ‘నీవు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ అది చెప్పడానికి నీకున్న హక్కును నా ప్రాణమిచ్చయినా కాపాడుతాను’. అనే ఈ మాట నేడు పాలకులకు రుచించడం లేదు. ‘రెండు రెం డ్లు నాలుగన్నందుకు గూండాలు గుండ్రాళ్ళు విసిరే రాజ్యం లో’ వాస్తవాన్ని వెల్లడించడానికి, నిజం నిగ్గుదేల్చడానికీ రచయిత ఎక్కడా తడబడినట్లు లేదు. మొహమాటమసలే లేదు. విధానా లు, నినాదాలు, వివాదాలు, ప్రచారాలు, కులాల కుంపట్లు, కప్పగంతులు.. దేనినీ వదలకుండా విశ్లేషించారు, విమర్శించా రు. ‘ఏ పార్టీకైనా అధికారం చేతికొచ్చాకనే అన్ని జాడ్యాలు బయటపడతాయి’. చక్కటి నగ్నసత్యాన్ని కొద్ది మాటల్లో చెప్పారు.

‘కమలం వచ్చి సైకిలుపై పడ్డా, సైకిలు వచ్చి కమలంపై పడ్డా నలిగేది కమలమేనంటూ ఆ రెండు పార్టీల పొత్తును తనదైనశై లిలో విశ్లేషించారు సతీష్‌ చందర్‌. ‘వంద అబద్ధాలాడైనా ఓ పొత్తు పెట్టుకోవాలనేది రాజకీయ నానుడిగా మారిందని తేల్చేశారు. ప్రతిసారి కాంగ్రెస్‌ వాళ్లు ‘అరచేతిలో’ స్వర్గం చూపిస్తారు. ఈసారి తామే చూసుకొని మురిసిపోయారు. కలల్ని ప్రసవిస్తున్న సమయంలో గర్భస్రావం అయింది. బాబు చెవికి కమలం ఎం త అందమో, ‘చేతి’కి కొడవలి అంత సొగసని ఆలస్యంగా గ్రహించారు. పార్టీ కన్నా పొత్తు గొప్పదని పరోక్షంగా అంగీకరించారు.నాటి ప్రధాని వీపీ సింగ్‌ ‘సామాజిక న్యాయం’ మొదలుకొని జనతాదళ్‌ ‘సాంఘిక న్యాయం’, ఈ మధ్య బాబుగారి ‘సమ న్యాయం’ వీటన్నింటికీ తగు వివరణలతో విశ్లేషించి తనదైన భాష్యం చెప్పారు. వీపీ సింగ్‌ మండల్‌ రాజకీయాలకు, కాన్షీరాం బహుజన రాజకీయాలకు తెరతీశాక రాష్ర్టాల్లో అణగారిన కులాల వారికి తమంతట తాము ‘రాజ్యాధికారానికీ రావాలనే కాంక్ష పెరిగింది. తమ తమ సామాజికవర్గాల సిద్ధాంతకర్తల వ్యూహాలతో, నాయకత్వంతో అధికారంలోకి రావాలనేది వారి కోరిక. వారసత్వ రాజకీయనేతలను ఒప్పుకోని సతీష్‌చందర్‌ ‘ఈ తనయులకీ, దేశంలో ఉరకలెత్తుతున్న యువతరానికీ ఎలాంటి సంబంధమూ లేదు! ఈ వాస్తవాన్ని గుర్తించాలి. రేపటి నేతలు ఉద్యమించే యువతరం నుంచే పుట్టుకొస్తారు తప్ప, పేరుమోసిన రాజకీయ కుటుంబాల నుంచి కాదు’ అని అంటా రు.

అదేమిటో కానీ, ‘పదవి ఈడొచ్చిన కొడుకులున్న ప్రాంతీయ పార్టీల నేతలు దాదాపు ఇలాగే ఆలోచిస్తారు’ అంటూ చురకంటించారు.మతం పేరు మందిర్‌, కులం పేరు మండల్‌. సంకీర్ణ రాజకీయాలు నడిచిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఇదే గోచరిస్తుంది. ‘ద్వేషభకి’్త నేడు ‘దేశభక్తిగా మారిందన్నారు. బహుజనుల పక్షపాతి గా రచయిత మండల్‌ ప్రభావాన్ని, ప్రభంజనాన్ని అనేకచోట్ల ప్రస్తావిస్తారు. రచయిత పదునైన వ్యాఖ్యల్ని, లోతైన విశ్లేషణకు కొన్ని మచ్చుతునకలను చూడండి..‘పన్నులు ఒకేసారి వేయలేని ప్రభుత్వాలు తమ ముఖాన్ని ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌'లో దాచుకుంటున్నాయి..’‘అబద్ధాల ప్రచారానికయ్యే ఖర్చుతోనే నాలుగైదు నాగార్జునసా గర్‌ ప్రాజెక్టులు కట్టవచ్చు. దేశాన్ని అవకాశవాద రాజకీయమే మధ్యంతర ఎన్నికల వైపు నెట్టింది. శక్తి ఉండి వ్యూహాలు లేని పార్టీ లు, వ్యూహాలుండి శక్తిలేని పార్టీలు మన దేశానికి దాపురించాయి..’

అడుగులు తడబడినప్పుడల్లా బడుగులు గుర్తుకొస్తారనడం ద్వారా దేశంలోని అవకాశవాద రాజకీయ పార్టీలను తూర్పార బట్టారు. వెనుకటికెవడో ఒక వీర అహింసావాది ‘అహింస గొప్పద ని ఎదుటివాడిని నాలుగు తన్ని మరీ ఒప్పించాడట’!
సతీష్‌చందర్‌ తన వ్యంగాస్ర్తాలతో దేశంలోని రాజకీయపార్టీలకు సున్నితమైన విమర్శలతో బలమైన హెచ్చరికలు చేస్తారు. ఈయనపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం కనబడుతుంది. ‘గతమంతా తడిసె హవాలాతో, కాకుంటే స్కాములతో’! ఇలాంటివి ఎన్నో మనకు ఈ పుస్తకంలో కనపడుతాయి. ప్రపంచ రాజకీయాలపై ఆయనకున్న పట్టు అసామాన్యమైనది. ‘రొట్టెనూ, స్వేచ్ఛనూ ఏకకాలంలో ప్రసాదించలేని ఏ ప్రభుత్వాన్నయినా రష్యా ప్రజలు తిరస్కరించడానికి ఎక్కువ కాలం తీసుకోరు.’ ‘అగ్రరాజ్యాల్లో సిద్ధాంతాలు అడుగంటిపోయా యి. అమెరికాలో ప్రజాస్వామ్య మూ లేదు, రష్యాలో కమ్యూనిజమూ లేదు. రెండు రాజ్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధం మాత్రం ఈ సిద్ధాంతాలు ఉన్నట్లుగా భ్రమింపజేసింది.’ ‘అమెరికా లో క్లింటన్‌ గెలుపు డాలర్‌ స్వామ్యపు వాపుకు చిహ్నం.’ ఇలాంటి విశ్లేషణలు ఆయన అం తర్జాతీయ పరిజ్ఞానానికి అద్దం పడుతాయి. రచయిత పదునైన వ్యాఖ్యలూ, వాటిలోని లోతైన అర్థాన్నీ గ్రహించాలంటే పూర్తిగా పుస్తకం చదువాల్సిందే. ఏ అధ్యాయంలోనైనా నిగూడార్థం ప్రజాస్వామ్యమే. మన దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిహసించబడుతున్నదో తెలియజేసే మరికొన్ని వారి మాటల్లోనే..

‘మన దేశంలో మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ, కులమతాలకు మాత్రం ఓట్లు రాలతాయి’. ‘పార్టీలు వెలవెలబోయి న చోట వాటి గుర్తులు కొండగుర్తులుగా మిగిలిపోతాయి. వాటి స్థానంలో వ్యక్తులూ, వారి ప్రాధాన్యతా ముందుకొస్తాయి’.
అవినీతిలో పొర్లుతున్న రాజకీయ నాయకుల మధ్య శేషన్‌ నీతిమంతుడిలా భాసిల్లుతున్నారు. ఊరి వెలుపల ఉన్నవాళ్లకు దేవాల య ప్రవేశం గూర్చి ఆలోచించాడు గాంధీ. అణగారిన ప్రజలకు ‘పోలింగ్‌ బూతుల్లోకి ప్రవేశం కల్పించాలని తపించాడు శేషన్‌. అధికార ప్రజాస్వామ్యానికి పోలిగ్‌ బూతే గర్భగు డి’. ‘నెల తక్కువ ప్రభుత్వాల, మైనారిటీ సర్కారుల శకం ప్రారంభమయింది’.‘ప్రజాస్వా మ్యానికి రుచినివ్వగలిగేవి ఎన్నికలు’.‘అధినేత వేరు, నేత వేరు. వారిద్దరికీ మధ్య చెయ్యి ఊపటానికీ, చేతులు జోడించటానికీ ఉన్నంత తేడా’ ‘ఇప్పుడు అర్చ న నుండి ఆధ్యాత్మికం వరకూ ఆకర్షణ తప్పనిసరయింది. సేల్స్‌ నుంచి సేవ వరకూ సౌందర్యం అనివార్యం’. ‘ప్రజాస్వామ్యం లో ఎన్నికలు కూడా పెళ్ళిళ్ళలాంటివే. ఎన్నికలకు ముందే హడావిడి. అయ్యాక ఏమీ ఉండదు’.‘గాంధీగారి దేశంలో గజానికొక్క గాంధారి పుత్రుడున్నాడని తిలక్‌ అంటే, గాంధీగారి దేశంలో గజానికొక్క గాడ్సే’ అని చమత్కరించాడు రచయిత.ప్రపంచశాంతికి అలీన విధానం ఒకప్పుడు అవసరమైందో లేదో కానీ దేశంలో ప్రజాస్వామ్య శాంతికి మాత్రం ‘విలీన విధా నం’ అంత ఆరోగ్యకరం కాదని తేలిందంటూ పార్టీల విలీనాన్ని సున్నితంగా విమర్శించారు.రాజకీయం ఒక కళ. కానీ క్షుద్ర రాజకీయం ఒక నేరం. ఒకప్పుడు అవి రెండూ వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడవి కలిసిపోయాయి. నేరస్తుడు కళాకారుడు కావచ్చు కానీ కళాకారుడు నేరస్తుడు కాకూడదు.గెలుపు ఒక మత్తు. ఓటమి ఒక స్పృహ. గెలిచినవాళ్ళు ఎలా గెలిచామని పెద్దగా ఆలోచించరు. ఆలోచించినా ఒకటో, రెండో కారణా లను వెతుక్కొని వాటివల్లనే గెలిచామనుకుంటారు. కానీ ఓటమి అలా కాదు. అది నిద్ర పోనివ్వదు. కారణాలనే కాదు వాటి మూలాల్లోకి కూడా వెళ్ళిపోతారు.

మూడు దశాబ్దాల ఎన్నికల రాజకీయచిత్రం మనకు కళ్లకు కట్టిన ట్లు ఆవిష్కరించారు సతీష్‌ చందర్‌. అన్ని వ్యాసాలను ఏడు అధ్యాయాలుగా విభజించారు. ప్రచారం, పొత్తులు, ఓటు బ్యాంకులు, సమస్యలు, మధ్యంతరాలు, ఫిరాయింపులు ఇంకా ఫలితాలు. ప్రతి అధ్యాయానికి ముందుగా పరిచయం ఉంటుం ది. ప్రతి పరిచయమూ ఒక సిద్ధాంత వ్యాసంలా ఉంటే అందులోని ప్రతి వ్యాసమూ ఒక విజ్ఞాన గుళిక. పార్టీలకు మాత్రం అది చేదుగా ఉంటుంది. కానీ దేశ ప్రజాస్వామ్యానికి చేయూతనిచ్చేదిలా ఉంటుంది.
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ లీడర్‌షిప్‌- అణగారిన వర్గాల చైతన్యానికై ఏర్పడిన ఒక సంస.్థ ఈ సంపాదకీయాల సంకలనాన్ని ఒక సామాజిక బాధ్యతగా పాఠకులకు అందించింది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో తనదైన ముద్ర వేసుకున్న సతీష్‌ చందర్‌ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అరుదైన రచయిత. వారి వ్యంగ్యాస్ర్తాలు, హాస్యోక్తులూ ఆలోచింపజేసేవిగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లోని మూడు దశాబ్దాల ఎన్నికల చరిత్రను తెలుసుకు నేవారికి ఇదొక ప్రామాణిక గ్రంథం గా ‘బి ఫర్‌ బ్యాలట్‌'ను నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి ఆవిష్కరణసభలో అభివర్ణించటం గమనార్హం.
- శ్రీరామకవచం ఎస్కే

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles