ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు?


Mon,November 4, 2019 12:52 AM

తెలంగాణ ఏర్పడి ఆరేండ్లు పూర్తయింది. తెలంగాణ భాషా సాహిత్య చరిత్రలపై దుర్నీతితో చేసిన వక్రీకరణలు ఆరేండ్ల తర్వాత కూడా ఇంత బాజాప్తాగా కొనసాగుతుండటం విస్మయం కలిగించింది. పోతన బొమ్మెర గ్రామంలో జన్మించారనడానికి ఆధారాలు కావాలిట. నివాస గ్రామం మాత్రం ఒంటిమిట్ట అన్న ఏకశిలాగ్రామమన్నది కచ్చితమట. దీనికి ఆధారాలు అక్కర్లేదట. ఈ విషయం.. వివాదమూ పాతదే కావచ్చు. కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ వివాదాలు కొనసాగడమేమిటి? తప్పుడు చరిత్ర ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఆరేండ్లయినా ఈ వక్రీకరణలను ఎందుకు సవరించలేకపోతున్నాం?

తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సంపూర్ణ సాహిత్యాన్ని సముద్ధరించేందుకు వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ అవి ఇంటర్నెట్‌లో అష్టావక్రతలతో కొనసాగుతున్న చరిత్రను గమనించకపోవడం శోచనీయం. ఇవాళ ఇది పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత ఇదే చరిత్రగా మారిపోతుంది. ఇవాళ పోతన ఓరుగల్లు వాడనడానికి ఆధారాలు కావాలని ప్రస్తావించిన వారు, రేపు ఆ వాక్యాన్ని కూడా తొలగించినా ఆశ్చర్యపోనక్కరలేదు.


ఇటీవల ఎవరో పోతన గురించి ప్రశ్నిస్తే.. ఆ సమయంలో ఆఫీసులో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆయన జీవితకాలాన్ని గురించి తెలుసుకోవడానికి గూగుల్ వెతికాను. సాధారణంగా వికీపీడియా ను వెతుకుతాం కాబట్టి సహజంగానే అందులోకి వెళ్లాను. అక్కడ పోతన జీవితకాలం గురించి కంటే కూడా పోతన గురించిన సమాచారాన్ని చూసి ఆశ్చర్యపోయాను.వీరు నేటి జనగామ జిల్లా బొమ్మె ర గ్రామంలో జన్మించారు (ఆధారాలు కావాలి). నివాస గ్రామం కడపకు సమీపమున నుండెడి ఒంటిమిట్ట అనబడిన ఏకశిలానగరము. ఈ మాటలు చూడగానే ఆశ్చర్యమేసింది. తెలంగాణ ఏర్పడి ఆరేండ్లు పూర్తయింది. తెలంగాణ భాషా సాహిత్య చరిత్రలపై దుర్నీతితో చేసిన వక్రీకరణలు ఆరేండ్ల తర్వాత కూడా ఇంత బాజాప్తాగా కొనసాగుతుండటం విస్మయం కలిగించింది. పోతన బొమ్మెర గ్రామంలో జన్మించారనడానికి ఆధారాలు కావాలిట.

నివాస గ్రామం మాత్రం ఒంటిమిట్ట అన్న ఏకశిలాగ్రామమన్నది కచ్చితమ ట. దీనికి ఆధారాలు అక్కర్లేదట. ఈ విషయం.. వివాదమూ పాతదే కావచ్చు. కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ వివాదాలు కొనసాగడమేమిటి? తప్పుడు చరిత్ర ఇంకెంతకాలం కొనసాగుతుం ది? ఆరేండ్లయినా ఈ వక్రీకరణలను ఎందుకు సవరించలేకపోతు న్నాం? మరింత అనుమానం వచ్చి పాల్కురికి సోమనాథుడి గురిం చి వికీలో వెతికాను. అందులోని ఇంగ్లీష్ సమాచారంలో సోమనాథుడి సొంతవూరుపై స్పష్టతలేదనీ.. పాలకుర్తి పేరుగల మరోఊరు కర్ణాటకలో ఉన్నదనీ.. ఒక వాక్యం రాసి వేల అనుమానాలు సృష్టించి వదిలేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఒక ప్రధానమైన అంశాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఇవాళ ఏదైనా రిఫరెన్స్ అంటే గూగుల్ ద్వారా వికీపీడియాను వెతుకడం సర్వసాధారణమైంది. ఇందులో ఉన్న సమాచారాన్ని సాధికారికంగా భావించే అవకాశం ఉన్నది. పఠనానికి, పరిశోధనకు ఎలక్ట్రానిక్ మాధ్యమం ఉపకరణంగా మారిన ఈ రోజుల్లో కొద్దిరోజులు పోయేసరికి ఈ గూగుల్ తల్లి చెప్పేదే చరిత్రగా మారిపోతుంది.

ఎప్పుడో పురాణం హయగ్రీవశాస్త్రి అనే ఓ పండితమ్మన్యుడు రాతల్లో పేలిన ప్రేలాపనలు ఇవి. ఆంధ్ర మహాభాగవతానికి పీఠిక రాయమన్న పాపానికి ఆయన నాటిన గంజాయి మొక్క ఒంటిమి ట్ట. పోతన భాగవతంలో ఏకశిలానగరం చెప్పిన మాటను ఒంటిమిట్టతో పోల్చి అక్కడే పోతన ఉన్నాడని.. అక్కడే భాగవతం రాశాడ ని.. వ్యాఖ్యానం చేసి చిచ్చుపెట్టిన మహానుభావుడు ఈ పురాణం హయగ్రీవశాస్త్రి. ఇక అక్కడి నుంచి ఈ రచ్చ మొదలైంది. వావిలికొలను సుబ్బారావు ఈ పురాణంవారి మాటను పట్టుకొని మరింత సాగదీశారు. కందుకూరి వీరేశలింగం అంధ్ర కవుల చరిత్రము రాసినప్పుడు దాని తొలి ఎడిషన్‌లో పోతన జన్మస్థలం గురించిన ప్రస్తావనలో సందిగ్ధత వ్యక్తం చేశారు. అనంతర కాలంలో పురాణం వారుపెట్టిన చిచ్చుపైన దాదాపు రెండున్నరేండ్లు వాదోపవాదాలు పెద్దఎత్తునే జరిగాయి. శేషాద్రి రమణకవులు, కొమర్రాజు లక్ష్మణరా వు లాంటి ప్రభృతులు బమ్మెర పోతన వరంగల్లు వాడని.. ఏకశిలాపురం అంటే వరంగల్.. భాగవతం వరంగల్‌లో మినహా మరెక్కడా రాయలేదని తేల్చిచెప్పారు. ఈ వాదనల ముందు ఒంటిమిట్ట వాద న కూలిపోయింది.

చివరకు పోతన జన్మస్థలం వివాదం సమసిపోయిన తర్వాత కందుకూరి వీరేశలింగం గారు తన రెండో ఎడిషన్‌లో పోతన వరంగల్ వాడని విస్పష్టంగా తేల్చిచెప్పారు. అందుకు పూర్తి వివరణ కూడా ఇచ్చారు. కందుకూరి వీరేశలింగం ఆంధ్ర కవుల చరిత్రము ప్రథమ భాగం మలి ముద్రణ 1917లో అచ్చయింది. ఇం దులోని 581 పేజీలో ఆయన బమ్మెర పోతరాజు గురించి ఏం రాశా రో ఒకసారి పరికించండి.. ఈతని నివాస స్థలము నైజాము రాజ్యములోని ఓరుగల్లు. ఇదియే భాగవతమునం దేకశిలానగరమని చెప్పబడి యున్నది. ప్రథమమున భాగవతమును ముద్రింపించినవారు బమ్మెర పోతనార్యుని వాస స్థలము కడప మండలములోని యొం టిమెట్ట యనియు, అదియే భాగవతమునందు పేర్కొనబడిన యేకశిలానగరమనియు, అతని చరిత్రమును దెలుపు పురాతన గ్రంథ మేదియో తమకు లభించినదనియు పీఠికలో వ్రాసి యుండుటచేత గతానుగతికులయి జనులా కథనే మొన్న మొన్నటివఱకు నమ్ముచు వచ్చిరి. ఇటీవల విమర్శకులు కొందఱు సత్యమును శోధించి పోతనామాత్యుని వాసస్థాన మోరుగ్లు గాని, యొంటిమెట్ట కాదని సహేతుకముగా లోకమునకు వెల్లడించుటచేత మహాజనులిప్పుడు కన్ను లు తెఱచి తమ తొంటి రపమాదమును దెలిసికొని పూర్వాభిప్రాయమును మార్చుకొనుచున్నారు. అయినను స్థలాభిమానముచేత గొం దఱిప్పటికిని పోతన జనన భూమి కడప మండలమే యని వాదించువా రందందు గనబడుచున్నారు.

అందుచేత నట్టివారి భ్రాంతి నివారణార్థముగా బమ్మెర పోతన నివాస మోరుగల్లని స్థాపించుటకు దగిన హేతువులను గొన్నింటిని నిందు జూపుచున్నాను.. అని పేర్కొన్నారు. పోతన నివాస స్థలము ఓరుగల్లు అని అనేక ఉదాహరణల ను కందుకూరి వారు దీనికి కొనసాగింపుగా పేర్కొన్నారు కూడా. ఇది 1917లో జరిగింది. 1937లో దీన్ని మరోసారి ముద్రించారు. కానీ ఇవాళ్టికి కూడా కడప చరిత్రకారులు అదేపనిగా తమ జిల్లాలో మహానుభావులు ఎవరూ లేనట్టు చిత్ర విచిత్రమైన వాదనలతో పోతనను తమవాడనే ప్రచారం చేసుకొంటున్నారు. ఒంటిమిట్టను ఏకశిలానగరమని అనువాదం చేయడమే అర్థంలేనిది. మిట్టను శిల గా అర్థం చెప్పినవాడికి దండాలు పెట్టాలి. మిట్ట అంటే దిబ్బ అని అర్థం. లేదా గడ్డ అని అర్థం. కడప ప్రాంతంలో గడ్డ పేరుతో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒంటిమిట్టలో దేవాలయంలో ఉన్న సీతారాముల వారి విగ్రహాలు ఏకశిలతో తయారైనాయిట. కాబట్టి అది ఏకశిలానగరమైందిట.

ఒక వాదన చేసేందుకు అది కొంతైనా అర్థవంతంగా ఉండాలి. ఈ జిల్లాకే చెందిన ఓ పండితుడు.. పేరు విద్వాన్ కట్టా నరసింహులు ఒంటిమిట్ట దగ్గర పోతన ఓ రోజు గంగలో స్నానం చేసి మహేశ్వర ధ్యానం చేస్తుంటే రఘురాముడు దర్శనమిచ్చాడట. ఆ రాముడు అచ్చంగా ఒంటిమిట్టలోని రాముడిలాగా ఉన్నాడట. అంతే స్క్రీన్‌ప్లే రాసేశారు. ఇంకో గమ్మత్తేమిటంటే.. ఈ విద్వాన్‌గారి వ్యాఖ్యానం ప్రకారం పోతన కాలంనాటికి తెలుగునాట ఒంటిమిట్టలో తప్ప మరెక్కడా రాముడికి ఆలయమే లేదంట. ఇది మరీ విచిత్రం. వీళ్లను నిర్బంధంగా తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడి వెయ్యేండ్ల క్రితం నాటి ఆలయాలు, నిర్మాణాలు చూపించాలి. అంతెందుకు ప్రస్తుత వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌లో ఉన్న సీతారామచంద్రస్వామి దేవాలయంలోని మూల విగ్రహాలు కాకతీయుల కాలం, షితాబుఖాను హయాంనాటివి. పోతన రామభక్తుడై కృష్ణుడి లీలలు ఎట్లాగైతే రాశాడో, ఇక్కడ మూల విగ్రహం రాముడైతే ఉత్సవ విగ్రహం అష్టభుజ వేణుగోపాలస్వామి. ఈ రకమైన సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉన్నదన్న విషయం వీళ్లెవరికీ తెలియ దు.

పలికెడిది భాగవతమట.. పలికించెడి విభుండు రామభద్రుండట.. అని పోతన తానే రాసుకున్నాడు. మరి ఈ పండితులవారికి ఒంటిమిట్టలో గంగ ఎప్పుడు కనిపించిందో. ఆ గంగలో పోతన మహేశ్వర ధ్యానం ఎప్పుడు చేశాడో పోతన దిగివచ్చి చెప్తే తప్ప తెలియదు. భాగవతంలోని రామావతార ఘట్టంలో రఘు శబ్దం పలుమార్లు వచ్చిందిట. ఒంటిమిట్టలోని రాముడు రఘునాయకుడు కాబట్టే అలా రాశాడన్నది మరోవాదన. మరే ఇతర స్కందంలోనూ ఈ రఘు శబ్దం కనిపించదని పోతన రాసిన స్కందంలో మాత్రమే ఇది ఉన్నదని వ్యాఖ్యానం. రఘువంశానికి చెందిన రాముడి గురిం చి రఘురాముడనక మరేమంటారో. భాగవతంలో రాముడి ప్రస్తావన రామావతార ఘట్టంలో కాక మరెక్కడా రానప్పుడు రఘు అన్న మాట ఎందుకు వాడాల్సి వస్తుందన్న ఇంగితం వీరికి లేకుండాపోయింది. ఇంకో విచిత్రమేమంటే ఈ పోతన గారు ఉన్నట్టుండి వరంగల్‌కు వలస వచ్చాడంట. కొండలు లోయలు వాగులు, వంకలు, నదులు దాటుతుంటే ఆయన వెంట తెచ్చుకొన్న కొన్ని వస్తువులతోపాటు తాను రాసిన భాగవతంలోని కొన్ని స్కంధాలు కూడా ఎక్క డో పడిపోయాయట. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం తో వరంగల్‌కు వచ్చిన తర్వాత ఆయన శిష్యులు కొందరు ఆ స్కం ధాలను పూర్తిచేశారట. దీనికి ఆధారభూమిక ఏమిటో సదరు విద్వాన్‌గారికే తెలియాలి.

వికీ పీడియాలో ఉన్న మరో దుర్మార్గం శ్రీనాథుడికి, పోతనకు బంధుత్వాన్ని అంటగట్టడం. ఎక్కడో జానపదాల్లో ఉన్న కథలను చరిత్రగా చెప్పే ప్రయత్నం చేయడం. చివరకు ఏదో ఒకమూల ఈ సిద్ధాంతం నిజం కాదనేవారూ ఉన్నారు అంటూ ఒక మాట రాసి తప్పించుకొనే వ్యవహారాలకు పాల్పడటం దారుణం. పోతన జన్మకాలం 1450-1510. దాదాపు అరవై సంవత్సరాలు జీవించాడు. శ్రీనాథుడి జన్మకాలం 1365-1441అని ఇదే వికీపీడియాలో ఘోషిస్తున్నారు. ఈ రెండు డేట్లు చెప్పింది కూడా వీళ్లే. మరి ఈ ఇద్ద రు బావ బావమరుదులో బంధువులో ఎట్లా అయ్యారు. అచ్చికబుచ్చికలెప్పుడు ఆడుకున్నారు వికీ మేధావులకే తెలియాలి. చరిత్రను చరిత్రగా చెప్పాలి కానీ ఏదో ప్రచారంలో ఉన్న కథలను చరిత్రగా రాసేసి చివరకు అడ్వైర్టెజ్‌మెంట్లలో కండిషన్స్ ఐప్లె అన్న మాదిరిగా ఇది కాదనేవారూ ఉన్నారంటూ ఎస్కేప్ అవుదామనుకోవడాన్ని ఏమనాలి?

పుస్తకాలు చదవటం తగ్గిపోయి ప్రతిదానికీ నెట్‌లో సర్చ్ చేస్తున్న ఈ రోజుల్లో ప్రాథమిక సమాచారమందించే వ్యవస్థగా వికీపీడియా ఒక స్థానంలో ఉన్నది. ఇప్పటికే దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇందులో పనిచేసేవారు వ్యక్తిగత ఇష్టాయిష్టాలమేరకు సమాచారం పొందించడం వల్ల ఈ తరానికే కాదు, భావితరానికి తీరని నష్టం కలుగజేసినవారవుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సంపూర్ణ సాహిత్యాన్ని సముద్ధరించేందుకు వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ అవి ఇంటర్నెట్‌లో అష్టావక్రతలతో కొనసాగుతున్న చరిత్రను గమనించకపోవడం శోచనీయం. ఇవాళ ఇది పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత ఇదే చరిత్రగా మారిపోతుంది. ఇవాళ పోతన ఓరుగల్లు వాడనడానికి ఆధారాలు కావాలని ప్రస్తావించిన వారు, రేపు ఆ వాక్యాన్ని కూడా తొలగించినా ఆశ్చర్యపోనక్కరలేదు. వికీపీడియా వంటి గ్లోబల్ సర్చ్ ఇంజిన్‌లలో బాధ్యులైన వారు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రకు చేస్తు న్న ద్రోహాన్ని తెలంగాణ మేధావులు, సాహిత్యవేత్తలు, సంబంధిత శాఖలు, విద్యా వ్యవస్థల బాధ్యులు గుర్తించకపోతే పోతన ఒక్కడే కాదు తెలంగాణ కవులంతా మనవాళ్లు కాకుండా పోతారు.
- కోవెల సంతోష్‌కుమార్, 9182777900

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles