జెండాకాడి ‘బతుకు పాఠం’


Mon,October 7, 2019 12:15 AM

s-yadagiri
బడిలో పిల్లలకు సర్కారు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయుడు చాలు. బతుకు గురించి, దాన్ని ఉన్నతీకరించే పరిపుష్ట చైతన్యాన్ని, పరిపక్వ హృదయ వైశాల్యాన్ని, పరిపూర్ణ మేధోబలాన్ని విద్యార్థులకే కాదు సమాజం నేలలో ఇంకించడానికి కవైన ఉపాధ్యాయు డో, ఉపాధ్యాయుడైన కవో చాలు. ‘నా అక్షరాల లక్ష్యం /వివక్ష రహిత ప్రజాపక్షం/నా అక్షరాల గురి అపరిమి త పరిధి..’ అన్న కవి సిద్దెంకి యాదగిరి అయితే మరీ మేలు. పాఠాలతో పాటు గుణపాఠాలను, బతుకు ఇరుకులలో కాంతి మొలకలతో పాటు ఆదర్శ జీవితం అయ్యేటందుకు చాక్‌పీస్‌ను, శిరసొంచని కలాన్ని పట్టి బైలెల్లిండు కాబట్టి.
‘కవిత్వానికి మట్టి పరిమళం తోడయినట్లే, భాషా పరిమళం అదికూడా విస్మరించబడిన అట్టడుగు కులా ల నోటిభాష మిళితమైతే, ఇంకనూ అణగారిన వెతల, మూల్గుల స్వరాలలోంచి భాస్వరంలా కణకణలాడే ధిక్కారం పుటం పెట్టబడిన కవిత్వ నమూనా’ ఈ కవి అనడానికి సందేహపడాల్సిన అంశాలేవీ లేవు. తన రెండవ పుస్తకం ‘బతుకు పాఠం’ ఇందుకు ఉదాహరణగా నిలుస్తది.
55 కవితల పాఠాల సారాంశం, బోధనాసారం అవలోకిస్తే తెలంగాణోద్యమం, వృత్తి కేంద్రకం, దళిత జీవితం, స్వీయ కౌటుంబం, పాప్‌స్టార్‌ మైకేల్‌-హక్కు ల యోధ బాలగోపాల్‌ ఇట్లా సుస్పష్టంగా, స్ఫూర్తిమంతంగా దర్శనమౌతుంది.
కొందరు కవులు కొన్ని కొలమానాల్లో ఇమిడిపోవ డం ప్రత్యేకతగా, నిబద్ధతా లక్షణంగా చూస్తే, ఈ కవికి కూడా అందులో స్థానమీయొచ్చు. అదనంగా ఈ కవి సాధన తన ఇంటిభాష, తన కుల పునాదుల విచికిత్స. ఆత్మతో సంభాషణ జరుపుతున్నట్లు ఒక మౌఖిక (జానపద) సంప్రదాయ బాణిలో సంలీనపరుచడం గమనించవచ్చు.

అంబేద్కర్‌ అధ్యయనశీలతను, బుద్ధుని ఆచరణాదక్షతను వామపక్ష భావజాలంతో సమ్మిళిత పరుచుకొని తనకంటూ ఉన్న రచనా సంవిధానాన్ని సమాజ అవసరాల మేరకు కొనసాగిస్తూ వస్తున్నడు. దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి సాహిత్య వ్యాసంగంలో కార్యకర్తృత్వంతో పాటు వ్యాసం, కథ ప్రక్రియలను కూడా చేపట్టి దళిత బహుజన కవి స్థానాన్ని స్థిరపరుచుకుంటున్నడు సిద్దెంకి యాదగిరి


కవిత్వం అల్లాటప్పా కాదు, ఆషామాషీ కానే కాదు, ఎప్పుడూ నిప్పుల సుడిగుండం మీది నడకే. తిరిగే మత్స్యాన్ని పళ్లెంల చూస్తూ, భేదించే అర్జునుడిలా ప్రతిక్షణం అప్రమత్తతే. నిరంతరం కవి స్పృహ రాపాడవలసిందే.
జెండా కాడికి రాండ్రి అంటున్నప్పుడు.. ‘పల్లెతనా న్ని పోగొట్టుకున్న జాగల/దేవులాడి నిలవెట్టేటందు కు..’ అన్న ఆరాటం నిలువనీయదీ కవిని. చిన్నప్పటి పల్లెల ఏమేమి సహజాతంగా ఉండేవో చెప్తూ.. ‘ఛాతీ మీద పగుల గొట్టిన బండల, గొంతు వంచిన సలాక’ల సాహసాలను ఆర్ద్రంగా చెబుతడు.
‘మానవత, భావుకత
మా వస్తు శిల్పాలు
జీవితపు విలువలే
మా అలంకారాలు..’
మ.ర.సం.సంస్థాగత గీతంలో రాసుకొన్నట్లుగా, పాడుకొన్నట్లుగా ఈ కవి ఆ కట్టుబాట్లకే కట్టుబడి ఉన్న డు. తాత, అయ్య తన చిన్నతనం అనుభవాన్నే జాం బవ గ్యానంగ గానం చేస్తున్నడు.‘లందగోలెంల మురిగిన తోలు, తీరుతీరు చెప్పుల దేశవాళి పరిశ్రమ’ అం టూ.. ‘పనితనం యిగురం అద్దితే/సెప్పు సప్పుడు కిర్రు మంటది.’ పని విలువకు అలంకారం జతపరుస్తున్న డు. ‘మాయదారి ప్రపంచ మార్కెట్ల/ జాంబవగ్యా నం/సోయిదప్పి సొట్టపోతూ అంబాడుతుంది..’ మూలం విధ్వంసమైనందుకు వగస్తున్నడు.‘లోకం తొడిగే చెప్పులకు/ఆముదం అద్దితే శోకం లేకుం డా.. మరో రకమైతది..’ కవి న్యాయాగ్రహాన్ని మర్మగర్భం గా సూచిస్తున్నడు. కవిత నిడివికి సంబంధం లేకుండా అర్థోక్తి లోనో, అస్పష్టంగానో, సత్యదూరంగానో ముగింపు చెప్పడీ కవి. సమాజాన్ని వేలుపట్టుకొని చీకట్లోంచి వెలుగులోకి నడిపించే గురుతర బాధ్యత మోస్తున్నడు.
నిచ్చెన మెట్ల కుల సంసృతి అభిజాడ్యాన్ని అభిశంసన చేయకుండా ఈ కవి ఉండలేడు. ఊరి ముసలవ్వ సాపెన తీర్గ కులగర్వం కవిత నడుస్తుంటది. ‘నిందలు మోపినోడు బొంద మొయ్య’, అంటరానితనం అంటగట్టినోని తీగె/గుంటుకు లేకుంట గాను’, గుండంల మునగనియ్యని గండం’ల ఎదుర్కొనే అతారెగా సాపె న శిల్పం ఎంచుకున్నడు.

ఇదే వరుసలో ‘చదువుతున్నం’ కవితలో ‘జంబూద్వీప పరిపాలక వారసులం/ జాంబవులం/ అనాగరిక మనాది మనువా/నీ జాతకం చదువుతున్నం..’ అని హెచ్చరిక చేస్తున్నడు. యుద్ధంలో వెన్నుచూపని లక్షణం యోధునికుండటం, పెన్నువిరుగని, వాక్యం చెరగని లక్షణం కవికుండటం అవశ్యం.
తెలంగాణోద్యమానికి తనవంతు అక్షరధార ధార వోసిన ఈ కవి కవితలు సింహభాగంగా ఈ పుస్తకం లో కన్పిస్తయి.‘తూట్లు పడ్డ పొక్కల ఉస్మానియా పొద్దు పొడుస్తది, మాది మాకు మీది మీకు, వాల్లకు పక్కా అయితే ఏకాభిప్రాయం/బే పక్కా అయితే దోఖాభిప్రా యం, సీమాంధ్ర మబ్బుచాటు వెన్నెలా/మసకబారి దాగిపో...’, శోధించు హైద్రాబాద్‌ అంతా బోధిస్తది..’ అంటూ రెప్పవాల్చని ఉద్యమానికి పదం, పాదం కలిపిండు. ఆనక ‘గెలిచిన కల’ను బహు చక్కగ నిర్మించుకోవాలే అని తాపత్రయపడుతున్నడు.
కవిత్వంలో నూతనాభివ్యక్తి, శిల్ప రమణీయకం ఇలా కొన్నింటిని ప్రదర్శించినంత మాత్రాన పాఠకుడు సంతృప్తి చెందడు. వస్తువైవిధ్యాన్ని కూడా ఆశిస్తడు. యాదగిరికి ఈ రహస్యం తెలుసు కనక మీదు మిక్కిలి ప్రజలతో నిత్యం అనుసంధానమయ్యే వస్తువులనే కవిత్వంగా మలిచిండు.
బడి పిల్లాడిని ‘సుద్దముక్కతో మెదడు బల్లపై రాసి/బుద్దికి తేవాలనుకుంటాను’, వాడు శిథిల సందిగ్ధత నుంచి శిరసెత్తి/కర్తవ్యాన్ని కౌగలించుకున్నట్లు’ చూస్తే మురిసిపోతడీ కవి. స్మరించదగిన, ప్రేరణాత్మక అసాం జే, మైకేల్‌ జాక్‌సన్‌, బాలగోపాల్‌, అబూజ్‌ మఢ్‌లపై దీటైన కవితలూ ఉన్నయి.

అంబేద్కర్‌ అధ్యయనశీలతను, బుద్ధుని ఆచరణా దక్షతను వామపక్ష భావజాలంతో సమ్మిళిత పరుచుకొని తనకంటూ ఉన్న రచనా సంవిధానాన్ని సమాజ అవసరాల మేరకు కొనసాగిస్తూ వస్తున్నడు. దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి సాహిత్య వ్యాసంగంలో కార్యకర్తృ త్వంతో పాటు వ్యాసం, కథ ప్రక్రియలను కూడా చేపట్టి దళిత బహుజన కవి స్థానాన్ని స్థిరపరుచుకుంటున్నడు.
ఈ పుస్తకంలో.. ‘మానవ వనంలో అలజడి దర్శించడం తెలుసు. ఒత్తిడిని తట్టుకొని, అవమానాల్ని గెలవగల స్థిర సంకల్పం తెలుసు’ అన్న ప్రశంసా మాటలు ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారివి. ‘నవతరం తెలంగాణ కవుల్లో నావికుడు కావాలని’ ఆకాంక్షను ప్రకటి స్తూ, కవితో జోడెడ్ల స్నేహంగా అభివర్ణించుకున్న ఆత్మ గౌరవ మాటలు ఓయూ కళాకారుడు దరువు ఎల్లన్నవి కవి నడకను ఉద్వేగపరిచేవే. అవ్వకొంగుతో బతుకు దిద్దుకొంటున్నడు, అసహజపు సమాజం బతుకును సరిదిద్దడానికి అవ్వ కొంగు నీడలోనే అక్షరాలను దూస్తున్నడు గురి ఉన్న సిద్దెంకి యాదగిరి.
- దాసరాజు రామారావు

148
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles