బతుకును ఆరాధించిన భావుకుడు


Mon,September 9, 2019 12:45 AM

kaloji
కాళోజీది బతుకు తత్వం. బతుకుతూ బతుకనివ్వుమనే సిద్ధాంతం. తెలంగాణలో బతుకుని పూజించే ఉత్సవం బతుకమ్మ నుంచి స్ఫూర్తి గ్రహించవ చ్చు. అల్బర్ట్ స్విట్జర్ భావించిన Rever -nce of Life నుంచి ప్రేరణ పొందవచ్చు. బతుకునే పర మ ప్రమాణంగా భావించి బతుకంతా బతుకు కోసం గానం చేసిన కవి కాళోజీ. బతుకే భగవంతుడనీ, ఇచ్ఛయే ఈశ్వరుడనీ సంపూర్ణంగా విశ్వసించాడు. కనుకనే బతుకు కోసం నిలబడ్డాడు. సామాన్యుల బతుకు కోసం కలెబడ్డాడు. బతుకును సిద్ధాంతీకరించాడు. కవిత్వీకరించాడు.
సాగిపోవుటె బతుకు ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు
తొలిగి తోవెవడిచ్చు-తోసుకొనిపోవలయు
బతుకు పోరాటము-పడకు ఆరాటము..
ఇంత సులువైన మాటల్లో బతుకును సూత్రబద్ధం చేయ టం కాళోజీకే సాధ్యం. ఆగకుండా ముందుకు సాగిపోవట మే బతుకని నిర్వచించటం ఒకటయితే, బతుకు నిత్యపోరాటంగా గుర్తించిన తర్వాత పక్కకు తొలిగి ఎవరూ తోవ ఇవ్వరని, ఎవరికి వారు తోసుకొని పోవలసిందేనని నిర్ధారించి, మరొక జీవన సత్యాన్ని ఉపదేశించాడు. కాళోజీ అధ్యయనంలో అందుకున్నదెంతో అనుభవం ద్వారా అందుకున్నది అంతకంటే ఎక్కువ. బతుకును కష్టతరం చేసేది విజ్ఞానం. మూలమునుక్లిష్టతరం చేసేది వ్యాఖ్యానం అని ప్రకటించాడు. శాస్త్ర విజ్ఞానం చాలా ప్రగతి సాధించి ఉండవచ్చు. సాంకేతిక విజ్ఞానం మరింత వృద్ధి చెంది ఉండవచ్చు. ఇవన్నీ బతుకును సుల భం చేయటానికే తోడ్పడాలని ఆయన భావించాడు. అదే ధోరణిలో పోలిక చెప్తూ మూల రచనను మరింత క్లిష్టంగా మారుస్తున్న వ్యాఖ్యానాల తీరు మీద విసురు విసిరాడు. సూటిగా చెప్పటం, సులువుగా బతుకటం కాళోజీకి ఇష్టం. అట్లా అని స్పందనలు, భావోద్వేగాలు లేని బతుకును కోరుకోడు.

తెలుగు నేల మీద కాళోజీది విలక్షణ స్వరం. కవిత్వంలోగాని, జీవితంలోగాని, వ్యక్తిత్వంలోగాని అటువంటి ప్రత్యేకశైలి మరెవరికి సాధ్యపడలేదు. అనితర సాధ్యం నా మార్గం అని చెప్పుకున్న శ్రీశ్రీని అనుకరించబోయిన ఉదాహరణలయినా చెప్పవచ్చు గానీ, కాళోజీని అనుసరించే సాహసోదంతాలు కనిపించవు. పోలిక కూడా దొరుకదు. కాళోజీకి సాటి కాళోజే.


భావుకత లేకుంటే బండబారును బతుకు కనుక బతుకులో భావుకత ఉండాలని భావించాడు. కంచం, మంచం పద్ధతి బతుకు బతుకే కాదని నిరసించాడు కూడా. సంపాదనతో మాత్రమే బతుకు సాఫీగా సాగదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పాడు. జీవితమున మజా అంతా జీవిత్తముతోనే కాదు. ప్రమిదను ముంచెడి తైలము ప్రజ్వలింపలేదొత్తిని అని ప్రకటించాడు. శబ్ద చమత్కారం కాళోజీకి ఇష్టమే. ప్రయోజనానికి అర్థం కలిగించేంత వరకు ప్రయోగిస్తాడు. జీవితం మాటను చమత్కరించి జీవిత్తము అన్నాడు. విత్తము డబ్బు. సంపద జీవితాన్ని ఇవ్వలేవని సారాంశం. దానికి మంచి పోలిక చెప్పాడు. దీపం మునిగిపోయేంత నూనె వత్తిని వెలిగించలేని విధంగానే అధిక సంపాదన జీవితాన్ని సుఖపెట్టలేదనే అంతరార్థాన్ని ధ్వనిస్తాడు. భావుకత లేకుంటే ఇంత జీవ వైవిధ్యం, సుఖం, ఇన్ని రుచులు, ఇన్ని కళలు మానవున్ని సుసంపన్నం చేసేవి కావని, వీటన్నిటి కలయికతోనే కళకళలాడితేనే బతుకు మహోత్తేజకరమని కాళోజీ భావన. సంపన్నుడి తత్వాన్ని సరిచేస్తూనే సామాన్యుని మనస్తాపాన్ని సరిచేయటం కాళోజీ ప్రత్యేకత. దిగులు, రంది, విచా రం, కలత బతుకును కబళిస్తాయని, అవి వదులుకొని సాగుమని అందరిని ఉత్సాహపరుస్తాడు. దిగులుతో బతికే బతు కు బతుకే గాదు. భ్రాంతిలో ఎరుక ఎరుకే గాదు. బతుకదలి స్తే దిలాసాగా బతుకాలె. భ్రాంతిలేని ఎరుకతో బతుకాలె. ప్రేమ, కరుణ, దుఃఖం, ఆగ్రహం, సంస్కారం, బంధం వం టి భావోద్వేగాలతో, ప్రశ్న, నిరసన, ఉద్యమం, హక్కులు, బాధ్యతలు, సమాజం, విలువలు వంటి భావ చైతన్యాలతో నిండి ఉప్పొంగుతుంటుంది గనుక కాళోజీ బతుకును ఆరాధించాడు. ఇవన్నీ లోపించిన, నిస్సారంలో ఆయాసపడుతు న్న యాంత్రికంగా పరిణమించి బతుకును వదులుకుంటు న్న వర్తమాన తరానికి కాళోజీ బతుకు ఉత్సాహాన్ని నూరిపోస్తాడు.

కాళోజీకి కవిత్వ నిర్వచనాల పట్ల, సాహిత్య విశ్లేషణల పట్ల ఆసక్తి లేదు. మానవ జీవితానికి ఒక కచ్చితమైన నిర్వచనం, ఒక కచ్చితమైన పద్ధతి లేనట్లే.. సాహిత్యానికీ లేదు. ప్రతీ సాహిత్య స్రష్టదీ, ఒక కచ్చిత ప్రత్యేక కమిటెడ్ లేదా కట్టుబడ్డ మనిషి రచయిత కాలేడు కట్టుబడిన రచయిత తన రచన ద్వారా మహా అయితే కంపెనీ వస్తువులను విరివిగా అమ్మటానికి ఉపయోగపడే మంచి పోస్టరు సృష్టించగలడు. మంచి పోస్టరుగా ఉపయోగపడగలడు.. అంతే అని బాహాటంగా ప్రకటించగల శక్తి కాళోజీకి మాత్రమే సొంతం.


కాళోజీకి మనుషులంటే బహు ప్రేమ. మనిషి స్వప్నించే సమస్త కళా సంపద మీద ప్రేమ. అయితే.. పని మీద అంతకంటే ఎక్కువ పట్టింపు. పనినీ, కళల్నీ, మనుషుల్నీ, విలువ ల్ని పక్కకుపెట్టే రాజకీయాల మీద ఏవగింపు. అక్షరాల్ని అభిమానించకముందు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ముం దున్నాడు. గణేశ్ చవితికి సెలవివ్వకపోతే వెయ్యికి పైగా లేఖ లు రాయించి సెలవు తీసుకోగలిగిన చైతన్యంతో పెరిగాడు. వందేమాతర నినాదంతో విద్యార్థుల్ని వీధుల్లో ఊరేగించగలిగిన సమూహ సందర్భాలున్నాయి. స్వాతంత్య్రం కోసం చౌరస్తాలో ఒక్కడే నిలబడి కరపత్రాలు పంచిన ఒంటరి మొండితనమూ ఉన్నది. ఆర్య సమాజం ప్రేరణతో మత మార్పిడులను ఎదుర్కొని అన్యమతం నుంచి తిరిగి తమ మతంలోకి మార్చగల తెగువ కాళోజీకి సొంతం. ఆంధ్రమహాసభలో ప్రవేశించి ఉత్సాహంగా భాగం పంచుకొని రెండు గా చీలుతున్న సన్నివేశాన్ని నివారించటానికి ఆరాటపడ్డ ఆవేదన వుంది. స్టేట్ కాంగ్రెస్‌లో చేరి గాంధీ అహింసా వ్రతంతో సాగినా, స్థానిక పరిస్థితుల్లో రజాకార్ల హింసనెదుర్కొవటానికి అవసరహింసను అక్షరాలకెత్తిన ఆవేశమూ ఆగ్రహమూ ఉన్నాయి. విశాలాంధ్రను ఆహ్వానించిన కంఠంతో అనుభ వం నేర్పిన పాఠం తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం పలుకులై దూకగల సాహసం, ఎమర్జెన్సీని నిరసించి అజ్ఞాతంలోకి వెళ్లగల నిబద్ధ నిజాయితీ, రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రతిహింసను ప్రవచించి, ప్రతిహింస రాజ్యాంగహింసగా మారి పరిధులను దాటితే తిరుగబడి ఎదురాడే తర్కం, ధైర్యం.. ఏది గమనించినా, ఎటు నుంచి ఎటు పరిశీలించినా కాళోజీ వ్యక్తిత్వం అతనికి మాత్రమే సాధ్యమైన మహత్వం. ఆచార్య నరేంద్రదేవ్ బోధనలు, గాంధీ సిద్ధాంతం, మార్క్సిస్టు అవగాహన, రూసో భావత్రయం, మత సం స్కృతుల మూలాలు, సూఫీ భావన లు, తత్వవేత్తల సామాన్యత, మహాకవుల భావుకత, త్యాగపురుషుల ధార్మికత, వైతాళికుల దార్శనికత.. ఎన్నెన్నో కలెగలిసి చిలికితే కాళోజీ ఆలోచన. నిండు మనిషి ఆవిష్కరణ.

భావుకత లేకుంటే బండబారును బతుకు కనుక బతుకులో భావుకత
ఉండాలని భావించాడు. కంచం, మంచం పద్ధతి బతుకు బతుకే కాదని నిరసించాడు కూడా. సంపాదనతో మాత్రమే బతుకు సాఫీగా సాగదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పాడు. జీవితమున మజా అంతా జీవిత్తముతోనే కాదు. ప్రమిదను ముంచెడి తైలము ప్రజ్వలింపలేదొత్తిని అని ప్రకటించాడు. శబ్ద చమత్కారం కాళోజీకి ఇష్టమే.


నేను కమ్యూనిస్టు వలె చెపుతున్నా, నేను సోషలిస్టుగ మాట్లాడుతున్న. నేను హిందువుగ ఈ విషయం చెపుతున్న అంటరు గని, మరి-మనిషి వలె ఆలోచించేదెప్పుడు..? అని కాళోజీ తరచుగా సంధించిన ప్రశ్న. అన్ని మార్పులకు మూలం మనిషే. అన్ని అఘాయిత్యాలకు కారకుడు మనిషే. అధికార నియంతృత్వాలు మనిషే. ఉద్యమాలు, ఉద్రేకాలు మనిషే. మనిషిలోని పలు కోణాలను కవిత్వ రూపంలో కాళోజీ ఆవిష్కరించాడు.
మనిషి ఎంత మంచివాడు
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు..
మనిషిలోని మంచితనాన్ని గర్తించేది మనిషే. కీర్తించేది మనిషే. ఆ విశేష స్వభావాన్ని వర్ణించి వదిలేసే తత్వం కాదు కాళోజీది. మళ్లీ అంతలోనే మనిషి రెండో కోణాన్ని వివరిస్తాడు.
మనిషి ఎంత చెడ్డవాడు
బతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు..
మనిషిలోని వైరుధ్యాల్ని కవి దర్శించాడు. మంచీచెడుల్ని వివేచన చేయటం ఒకటయితే.., చిత్రమేమిటంటే చనిపోయిన మనిషిలోని చెడును వదిలేసి మంచిని తలుచుకోవటమెంత సహజమో అంతే సహజంగా బతికి ఉన్న మనిషిలో ని మంచిని గుర్తించకుండా చెడును వెతికి వెతికి ప్రచారం చేయటం చెడుతనానికి నిదర్శనమని మనిషి లోపాన్ని విశ్లేషించాడు. మనిషి ద్వంద్వ నీతుల్ని ఎత్తిచూపటం కాళోజీ కవిత్వం లో ప్రధాన లక్షణం. ఒకే మనిషిలో ఉండే ద్వంద్వ ప్రవృత్తు లు కావొచ్చు, సమాజంలో ప్రపంచంలో వేరువేరు మనుషుల వేరువేరు ప్రవృత్తులు కావొచ్చు.. నిర్భయంగా కాళోజీ ఖండించాడు.
మనుజుల చేతనె మనెడు ప్రపంచం
మానవునే మననీదు ప్రపంచం..
మనుషులు లేకుండా ప్రపంచం ముందుకు సాగలేదనేది సత్యం. మనుషులతో సాగే అదే ప్రపంచం మనిషిని బతుకనివ్వకుండా ఆటంకపరుస్తున్న తీరు కాళోజీని కలత పెడుతుంది. కలవరపెడుతుంది.
పరుల కష్టము చూసి పగిలిపోవును గుండె
మాయమోసము చూసి మండిపోవును ఒళ్లు
అవనిపై జరిగేటి అవకతవకలు చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు..
మొత్తం కాళోజీ కవిత్వానికి, హృదయానికి అద్దంపట్టే పంక్తులివి. వ్యక్తిగత ఔన్నత్యం కాళోజీ నిఘంటువులో లేనేలేదు. గొప్ప కవిత్వం సృజించాలని కోరుకున్నదీ లేదు. తనతోపాటు ఇతరులు సౌఖ్యంగా ఉండాలి. బతికే అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలని భావించాడు. లోకంలో అల్లుకుపోయిన మోసాల్ని, మాయల్ని చూసి విలపించాడు. జరుగుతున్న అవకతవకలను సవరించాలని ఆరాటపడ్డాడు. గొంతెత్తి అరిచాడు. కలమెత్తి చరిచాడు.

నిజాం రాజయినా వదలలేదు. భారత రాష్ట్రపతి అయినా వదలలేదు. ముఖ్యమంత్రి అయినా విడువలేదు. మోసం చేసిన ఉద్యమ నేతయినా విడువలేదు. ఎంతటిస్థానంలో ఉన్నా వెరువకుండా కాళోజీ వకల్తా తీసుకున్నది సామాన్యుడు. కాళోజీ మాటల నిండా హోరెత్తేది పౌరుడు. అక్షరాల పొడుగునా కదం తొక్కిందంతా ప్రజ. మంచి సమాజ నిర్మాణం, మానవ సంస్కార ప్రేరణం కాళోజీ తత్వానికి, వ్యక్తిత్వానికి, కవిత్వానికి అంతిమలక్ష్యాలు. కాళోజీ అనునది. కాలమునకే గాదు. మహాకాలునకుజీఅననిది నఖరా లు లేనట్టిది. నాజూకు కానట్టిది. నానా భావనలది. నానా భావన లేనిది. ఎదచించుకు పారునది. ఎదలందు చేరునది. కనురెప్పలు తడుపునది.. కాళోజీ కవిత్వమని ప్రకటించుకున్నాడు. కాళోజీ అంటే నానా భావనల నది. తనవైన ఆలోచనలు, తనవైన ఆదర్శాలు ప్రపంచానికి చాటిచెప్పాలనే తప న ప్రతికవికీ సహజమైనట్టే కాళోజీకీ ఉన్నాయి. అయితే మిగ తా కవుల కంటే కాళోజీ ప్రత్యేకమైన కవి. కాళోజీ ఎంచుకున్నది ప్రజల తోవ. కనుక ప్రజల వస్తు వు, ప్రజల శిల్పం. ప్రజల భాష స్వీకరించటం వల్ల తెలుగు కవిత్వంలో ప్రజాకవి అనే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. మహాకవి గౌరవం పొందిన కవులు అయిదారుగురైనా కనిపిస్తారు. వాళ్లు కవిత్వ సృజన చేసేటప్పుడు పండితుల్ని, విమర్శకుల్ని దృష్టిలో పెట్టుకున్నారు. ప్రజాకళ్యాణం కవిత్వానికి ధ్యేయంగా ఉన్నప్పటికీ పండిత ప్రముఖుల మెప్పు కోరుకున్నట్లు గమనించవచ్చు. కవిత్వంలో ఉపయోగించిన భాష, నడిపించిన శైలి, తీర్చిదిద్దిన శిల్పం కొద్దిమందికే అం దేవనేది స్పష్టం. కానీ కాళోజీ అట్లా కాదు. ప్రజల భాష గ్రహించాడు. నీది బడి పలుకుల భాష. నాది పలుకుబడుల భాష అని ప్రకటించుకున్నాడు. నోటి మాటకు వ్యాకరణం అక్కర్లేదన్నాడు. నాట్యానికి శిక్షణ అవసరమౌతుంది గాని నడకకు శిక్షణ అవసరం లేదని చెప్పాడు. ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ధి అనుచుంటి ఈ మాట అనుభవం కొద్ది, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్లు, అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, కమ్మని చకినాలొకచోట, గట్టిదవడలింకొకచోట, కొంగులాగిన కళ్లు కొలిమిలో పెట్టాలె, కండకండగకోసి కాకులకు వేయాలె.. వంటి అనేక వాక్యా లు ప్రజల భాషను, పలుకుబడుల భాషను కాళోజీ ప్రయోగించిన తీరు కు నిలువుటద్దాలుగా నిలుస్తాయి.

అదేవిధంగా సాధారణ గాన శిల్పం, దేశిఛందస్సు ప్రజ లు తరచుగా అనుసరిస్తుంటారు. సరిగ్గా.. అంత సులభమైన ఛందస్సునే కాళోజీ స్వీకరించాడు. పిరికిపంద బతుకు కన్న హింస వేయిరెట్లు మిన్న, ఏ భాషరానీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషమెవరికోసమురా మొదటిది త్రిశ్చగతిలో సాగి జానపద గేయాల్ని తలపిస్తే , రెండోది ద్విపదలో సాగి బతుకమ్మ పాటను, తందానాన గేయాల్ని తలపునకు తెస్తుం ది. కోపం వచ్చినప్పుడు ఎంతటి వాణ్ణయినా పట్టుకుని నిలబెట్టి నిలదీసే పద్ధతి ప్రజల్లో కనిపిస్తుంది. కాళోజీ కూడా అదే పద్ధతిని అనుసరించి ప్రజల శిల్పాన్ని తెలుగు కవిత్వానికెక్కించినట్టు గుర్తించవచ్చు. ముఠా మనిషి మర్రిచెన్న ముఖ్యమంత్రివానీవు, ఏమంటవ్ రాష్ట్రపతీ, భారత స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ అడుగుతుండు.. అని ఎదురుగా నిలబడి సూటిగా ప్రశ్నించే శిల్పం. ప్రజల శిల్పం కాళోజీ కవిత్వంలో చాటాచోట్ల మెరుస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా ముందుకురికిన వ్యక్తి కాళోజీ. గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితుడై సత్యాగ్రహాన్ని, అహింసను ఆయుధంగా పోరాడినాడు. తెలంగాణలో ప్రజలు అనుభవిస్తున్న పీడనను నిరసించి ఉద్యమించిన సాహసి. జేబులో అజ్ఞాత నేత ఉత్తరం దొరికి కరపత్రాలు పంచినందుకు షహరె బదర్ అనే వరంగల్ నగర బహిష్కరణకు గురయినాడు. విశాలాంధ్ర కోసం వరంగల్ వీధుల్లో తెలంగాణ ఉద్యమకారుల నిరసన ఎదుర్కొన్నాడు. ప్రతి చర్యా ఉద్వేగమే. ప్రతి అడుగూ ప్రతిఘటనాత్మకమే. అనంతర కాలాల్లో ఆకాంక్షలు ఫలించినాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ స్వార్థ రాజకీయుల చేతిలో నలిగింది. గాంధీ మంత్రం ఫలించింది. అయినా గాంధీ వాదానికి నామం పెట్టింది. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించింది. దోపిడీదారులు పీఠమె క్కి పీడన అట్లే సాగింది. విశాలాంధ్ర ఏర్పడింది. తెలంగాణ ప్రజల బతుకు త్రిశంకు గతి అయింది. కవి ఏం చేయగల డు? కవిత్వం రాస్తాడు. కాళోజీ ఒళ్లు మండి సూటిగా ప్రశ్నించాడు. ధైర్యం గా నిరసించాడు. జరుగుతున్న పరిణామాల్ని, రాజకీయ స్వార్థాల్ని తీవ్రంగా ఖండించాడు. ఎరగనట్టు పడిఉండగా సాక్షీభూతున్ని కాను, సాక్షాత్తూ మానవున్ని.. అనుకున్నాడు.

స్వార్థాన్ని తీవ్రంగా ఖండించాడు. కవిత్వాన్ని వాహికగా చేసుకొని, ఆయుధంగా మలచుకొని మంటలు పుట్టించాడు. కలము-బడితె-రుపాయి.. కొలువుదీరి కూసున్నయి. ప్రతినిధులు చేసిందే ప్రజాస్వామ్యమంటున్నయి. విశ్వాసం లేదంటే వెర్రికూతలంటున్నయి అని విరుచుకుపడటం, కాళోజీ లక్షణమైంది. కలం ప్రసార మాధ్యమాలకు బడితె శాంతి భద్రతలుగా దిగజారిన రాజ్యానికి, రూపాయి, వాణి జ్యంగా మారిన ఆర్థికవ్యవస్థలకు ప్రతీకలు. ఇవన్నీ బదు లుకొని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నాయని కాళోజీ భావించాడు. కవి కూడా నేతగాడె. బహుచక్కని సాలెగూడు అల్లువాడె అని తెలిసినా రాజకీయ బల్లీ(యు)ల నోటి అంద క ఎగిరెడి పక్షీ(యు)లవైపు నిలబడి కాళోజీ తన ఆవేదనలు ధీర కంఠంతో వినిపించాడు. సాహిత్య విమర్శకులను ఆయ న పట్టించుకోలేదు. అది కవిత్వం అవునా? కాదా? రససిద్ధి జరుగుతుందా? లేదా ఆయన పట్టించుకోదల్చుకోలేదు. ఆయన తోవ ఆయనది. ఆయన భావన ఆయనది. కాళోజీ పాఠకునికీ.. కవికీ నడుమ విమర్శకున్ని ఒప్పుకోలేదు. పరిసరాల నుంచి పొందే స్పందన వల్ల రచన చేసేవాడే రచయిత గాని విమర్శకుణ్ణి దృష్టిలో పెట్టుకుని రాసే రచయి త రచయితే కాడు. రచన స్వయంగా చదివి ఆనందించగలవాడే పాఠకుడు. విమర్శకుని సలహా ప్రకారం చదివేవాడు పాఠకుడు కాదు. సమాజం, విలువలు, సంప్రదాయాలు, ఆదర్శాలు, ఆచరణ, ప్రేమ, కరుణ, ద్వేషం, దుఃఖం, ఆనం దం ఇట్లాంటి అనేకానేక భావ పుంజం అయిన మానవ జీవి తం విమర్శే రచన. మళ్లీ రచన మీద విమర్శేమిటి? అని విమర్శకుని పాత్రను (జీవితం-విమర్శ వ్యాసం) తిరస్కరించాడు. బహుశా విమర్శకున్ని అంతలా పక్కకుపెట్టిన రచయి త మరెవరూ ఉండకపోవచ్చు. కాళోజీ ఐదారు కథలు రాశాడు. అవన్నీ రాజకీయ వ్యవ స్థ మీదా, కుల పట్టింపుల మీదా, వస్తువ్యామోహం మీదా, సమాజ స్థితిగతుల మీదా తీవ్రమైన విసుర్లే. పౌరాణిక పాత్ర ల్ని వృత్తాంతాల్ని ఆధారం చేసుకొని వర్తమాన పరిణామాలకు చురకలంటించటం కాళోజీ సాధించిన విశేష శిల్పం.

కాళోజీకి కవిత్వ నిర్వచనాల పట్ల, సాహిత్య విశ్లేషణల పట్ల ఆసక్తి లేదు. మానవ జీవితానికి ఒక కచ్చితమైన నిర్వచనం, ఒక కచ్చితమైన పద్ధతి లేనట్లే.. సాహిత్యానికీ లేదు. ప్రతీ సాహిత్య స్రష్టదీ ఒక ప్రత్యేకమైన దారి. ఎవరిదారి వారిదే అనేది కాళోజీ అభిమతం. కమిటెడ్ లేదా కట్టుబడ్డ మనిషి రచయిత కాలేడు కట్టుబడిన రచయిత తన రచన ద్వారా మహా అయితే కంపెనీ వస్తువులను విరివిగా అమ్మటానికి ఉపయోగపడే మంచి పోస్టరు సృష్టించగలడు. మం చి పోస్టరుగా ఉపయోగపడగలడు.. అంతే అని బాహాటంగా ప్రకటించగల శక్తి కాళోజీకి మాత్రమే సొంతం. ప్రహ్లాదుని కథలో ప్రజాస్వామ్యాన్ని నిరూపించటం, శకుంతల వృత్తాంతంలో మహిళా హక్కుల చైతన్యాన్ని అన్వయించటం కాళోజీ దర్శనశక్తిని ప్రతిబింబిస్తాయి. సందర్భానుసారంగా ఆయా సన్నివేశాల్లో, సంభాషణల్లో ఆయన ప్రయోగించిన ఛలోక్తులు మాటలోని పదునును, వ్యంగ్యా న్ని, వ్యాప్తి గుణాన్ని తెలియజేస్తాయి. కాళోజీ స్వయంగా చెప్పుకున్నట్టు తన కవిత్వమంతా సమకాలీన రాజకీయ సాంఘిక సంఘటనలపైన తన వ్యాఖ్యానం, తనదంతా రన్నింగ్ కామెంట్రీ. కాళోజీ రచనల ద్వారా ఆరేడు దశాబ్దాల ప్రజా జీవితాల్ని, రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రను అవగతం చేసుకోవచ్చు. వ్యవస్థ తీరుతెన్నుల మీద చైతన్యవంతుడైన కవి తిరుగుబాటు బావు టా వారసత్వంగా స్వీకరించవచ్చు. దాశరథి రంగాచార్య భావించినట్టు.. కాళోజీ జీవితమే కవిత్వం. అంత అలవోకగా జీవించాడు. అంత అలవోకగా కవిత్వం రాశాడు. మాటలు నేర్వని తెలంగాణకు మాటలు నేర్పి గలగలా మాట్లాడించి కత్తిలేకనే నెత్తుర్లు చిందించగల నెరజోడు కాళన్న (యశోదారెడ్డి). నిజమే పీవీ భావించిన ట్టు.. కాళోజీ ఒక ఫినామినన్. రాజకీయ నాయకులు విఫలమైన చోట రచయిత విజ యం సాధించి మానవ జాతికి మహోపకారం చెయ్యగల డు.. అది కాళోజీ విశ్వాసం. అది కాళోజీ ఆచరణ. మానవున్ని మానవునిగా, బతుకును బతుకుగా బతుకనిచ్చే మహా సందేశం అందించిన కవికెవరు సాటి. అతడు కాళోజీ.

- నందిని సిధారెడ్డి, 94403 81148
(నేడు కాళోజీ జయంతి)

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles