ఆత్మీయ కరచాలనం


Mon,August 12, 2019 01:27 AM

varthamana-lekha
ఉత్తరం పేరు విన్నప్పుడల్లా ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకున్న చిన్ననాటి మిత్రుడిని కలుసుకున్నట్టే ఉంటది ఎవరికైనా. ఉత్తరాలు రాయడంలోనూ, వాటిని అందుకోవడంలోనూ ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆత్మీయుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూసిన రోజులను ఎట్లా మరిచిపోతాం. ఉత్తరం మన తోడుగా ఉన్న మనిషిగా మారనిదెన్నడు? ఇప్పుడు లేఖలు కనుమరుగవుతున్న కాలం అయినప్పటికీ ఒకప్పుడు లేఖలు సాహిత్యాన్ని బతికించాయి.
నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి రాసిన లేఖలు అప్పటి భారతదేశ స్థితిగతులను చెప్పాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన శారదలేఖలు, అలాగే చలం ప్రేమలేఖలు, బోయి భీమన్న జానపదుని జాబులేఖలు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించుకున్నాయి. ఈ మధ్యకాలంలో దర్భశయనం శ్రీనివాసాచార్య, సంజీవ్‌దేవ్‌ల గారి మధ్య లేఖల రూపంలో నడిచిన సాహిత్య విశేషాలు మెత్తని ఉత్తరాలు పేరుతో వచ్చాయి. యశస్వీ సతీష్ తన భార్యకు రాసి న పరాం ప్రేయసి లేఖలు భార్యాభర్తల అనుబంధాన్ని ఆవిష్కరించాయి.
అలాగే 51 మంది కవయిత్రుల జీవిత విశేషాలు తెలుపు తూ శిలాలోలిత రాసిన వర్తమాన లేఖలు లేఖాసాహిత్యం లో విలువైనవి. ఈ లేఖల్లో 51 మంది కవయిత్రుల జీవిత, సాహిత్య విశేషాలతోపాటు వర్తమాన సమాజాన్ని చిత్రించా రు. ఈ లేఖలన్ని భూమిక మాసపత్రికలో వర్తమానలేఖ కాలమ్ పేరుతో రాశారు.
అతడు ప్యాంటూ చొక్కా తొడుక్కొని వెళ్తాడు
ఆమె ఇంటిని కూడా తొడుక్కొని వెళ్తుంది..

రాసేశక్తి ఉన్నవాళ్లు రాయకుండా ఉండటం నా దృష్టిలో నేరమేనని అంటారు శిలాలోలిత ఒక లేఖలో. ఒక దశలో గొప్ప కవిత్వ సృజన చేసి ఇప్పుడు రాయకుండా ఉన్న కవయిత్రులు సుజాత పట్వారి, ప్రశాంతి, బి.పద్మావతి, సమతారోషిణి మొదలగు కవయిత్రులకు రాసిన లేఖల్లో వారితో తనకున్న చనువు, స్నేహం వల్ల ప్రేమగా కోప్పడింది. స్నేహంగా మందలించింది. మా అమ్మవుగా అని బుజ్జగించి తిరిగివాళ్లను సాహిత్యంవైపు మరల్చే ప్రయత్నం చేసింది.


స్త్రీ ఏ విధంగా ఒక చట్రంలో ఇరుక్కోని బందీగా ఉందో తెలియజేస్తూ శిలాలోలిత రాసిన కవితావాక్యాలివి. తన మొదటిసంపుటి పంజరాన్ని నేనే,పక్షినీ నేనే నుంచి గాజునది వరకు, కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు, తెలుగు కవయిత్రుల కవితామార్గం, నారి సారించి మొదలై న పరిశోధన గ్రంథాలలోనూ ఎప్పటికప్పుడు స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీరు ఎక్కువగా విషాదానికి సంబంధించినవే ఎందుకు రాస్తారని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు.. నా చుట్టూ సమస్యలే ఉన్నప్పుడు విషాదం కాక నా రచనల్లో ఆనందం ఎలా ఉంటుందని? సమాధానమిస్తారు. తన అక్షరం ఎప్పుడూ బాధితుల పక్షమే. పంజరాన్ని నేనే, పక్షినీ నేనే కవితాసంపుటిలో తన చుట్టూ పంజరాన్ని నిర్మించుకున్న స్త్రీ, పక్షిలాగ ఎగురడానికి కూడా మగువలే మానసికంగా బలంగా ఉండాలని కోరుకున్నారు. అటువం టి స్త్రీవాద దృక్పథమే ఈ లేఖల్లో కూడా చూస్తాం. స్త్రీల జీవితాల్లోని వంకరగీతలే నా అక్షరాలు అని తన కవిత్వం గురిం చి చెప్పుకున్నారు శిలాలోలిత. ఇటువంటి వ్యథాభరిత స్త్రీల జీవితాలను గురించి ఎంతో ఆవేదనగా ఇతర కవయిత్రుల తో పంచుకున్నారు. లేఖల్లో వీరిది ఆత్మీయశైలి. గతవారం నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను, బాగా గుర్తొస్తున్నావు లాంటి మాటల్లోని ఏదో ఆత్మీయత మన మెడచుట్టూ చేతులను పేనవేసుకున్న ట్లు అల్లుకుంటుంది. మనసునిండా ప్రేమతో విడువలేక విడుస్తూ ఉండనా మరి! అంటూ మరో లేఖలోకి నడిపిస్తా రు. ఈ లేఖలన్ని ఒక్కో కవయిత్రితో తనకున్న అనుబంధా న్ని తెలుపుతూ కవయిత్రులకు రాసిన లేఖలు. ఈ లేఖల్లో కవయిత్రులను కలిసిన మొదటి క్షణాలను తల్చుకుంటుంది. వాళ్ల రచనల పట్ల, వాళ్ళ కవితావాక్యాల పట్ల ఎంత ప్రభావితమయ్యారో ఇష్టంగా చెప్పడంలో అదే ఆత్మీయత కనబడుతుంది. కవులను, కవిత్వాన్ని ఎంతగా ప్రేమిస్తుందో తన కలం పేరును బట్టి తెలుసుకోవచ్చు. శిలాలోలిత అసలు పేరు పి.లక్ష్మీ. రేవతీ దేవి రాసిన శిలాలోలిత రచనకు కదిలిపోయి అదే పేరును తన కలానికి పేరుగా పెట్టుకున్నారు.

నన్ను కదిలించి, కరిగించి, కన్నీళ్ళొలికించిన కవిత్వంగా చెప్పుకున్నారు. లక్ష్మీ అనే కవయిత్రి శిలాలోలితగా మారిన పరిణామక్రమాన్ని రేవతీదేవికి రాసిన లేఖలో చూడొచ్చు. రాసేశక్తి ఉన్నవాళ్లు రాయకుండా ఉండటం నా దృష్టిలో నేరమేనని అంటారు శిలాలోలిత ఒక లేఖలో. ఒక దశలో గొప్ప కవిత్వ సృజన చేసి ఇప్పుడు రాయకుండా ఉన్న కవయిత్రులు సుజాత పట్వారి, ప్రశాంతి, బి.పద్మావతి, సమతారోషిణి మొదలగు కవయిత్రులకు రాసిన లేఖల్లో వారితో తనకున్న చనువు, స్నేహం వల్ల ప్రేమగా కోప్పడింది. స్నేహంగా మందలించింది. మా అమ్మవుగా అని బుజ్జగిం చి తిరిగివాళ్లను సాహిత్యంవైపు మరల్చే ప్రయత్నం చేసింది. అబ్బూరి ఛాయాదేవి, శీలా సుభద్రా దేవీ, శాంతసుందరి మొదలగు ప్రసిద్ధ కవయిత్రులే కాకుండా ఇప్పటితరం కవయిత్రులు గండికోట వారిజ, జాజుల గౌరి, సల్మా మొదలగు కవయిత్రులు కూడా ఈ లేఖల్లో ఉన్నారు. కవయిత్రుల శైలి ని వారి ప్రత్యేకతలను తక్కువ మాటల్లో చెప్పడం సులభమైన విషయం కాదు. ఈ పనిని అలవోకగా సాధించారు శిలాలోలిత. దీనికి కారణం ఆయా కవయిత్రులను, వారి రచనలను అమితంగా ఇష్టపడి ఈ లేఖలను రాయడమే. సాహిత్యంలో ఒక్కో రచయిత్రిది ఒక్కో శైలి. ఒక్కో సామాజిక నేపథ్యం. ఒక్కోదారి. వాళ్ళందరి ప్రత్యేకతలను చెబుతూనే ఇప్పటి సమస్యల మీద స్పందిస్తూ ప్రస్తుత సమాజా న్ని ప్రతిబింబింపజేయడం చేయడం ఈ లేఖల ప్రత్యేకత. ఆత్మీయంగా రాసిన లేఖలే అయినా సమాజ చిత్రణ, సామాజిక చింతన ఈ లేఖల్లో ప్రధాన విషయం. ఇప్పుడు వస్తున్న సాహిత్యం మీద చర్చించడం మరొక ముఖ్యమైన అంశం. పక్కవారిని కూడా పట్టించుకోని ఈ కాలంలో ఇంత ప్రేమగా పలుకరించే లేఖలు రావడం సంతోషం. ఈ లేఖలు ప్రతీ ఒక్కరికి ఒక సాంత్వన. ఒక తోడు. ఒక ఆత్మీయ కరచాలనం. సాహిత్య వనంలో పూసిన పూలను ఏరికూర్చిన పూలదండ వర్తమాన లేఖ. దీని పరిమళం పుస్తకం మూశాక కూడా మన వెంట నడిచి వస్తూనే ఉంటుంది.

- తగుళ్ళ గోపాల్ 95050 56316

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles