మార్మిక బాలుని శాశ్వత విడిది


Mon,June 24, 2019 01:19 AM

ఈ పుస్తకం చదువడం ముగించిన నాటి రాత్రి ఒక కలగన్నాను. లిప్తకాలపు స్వప్నం కాద ది, సుదీర్ఘమైన నడక. ఎక్కడ చూసినా పచ్చదనం, విశాలమైన సముద్రతీరం, కొబ్బరిచె ట్లు, నిర్మలమైన చెరువులు, మిరియం, ఇలాచీ ఘాటు పరిమళాలు, వంపులు తిరిగిన బాక్వాటర్స్, నవరసాలను ముఖభావాలలో పలికించే నృత్యరీతులు-వాటిని దాటుకుం టూ దప్పిక తీరని పాంధురాలి వెతుకులాట సాగుతోంది. పరశురాముడు తపస్సు చేసుకోవడానికి తగిన చోటు కోసం గాలిస్తుండగా సముద్రం ఎదురైందట. దానిమీదకి గొడ్డలి విసిరాడట, ఆ మేరకు సముద్రం వెనక్కి వెళ్ళగా ఖాళీ అయినచోట పుట్టిందే కేరళ అం టారు. ఆ పురాణగాధ, ఒక తలపుగా తాకి వెళ్ళింది.
Liptakalam
విశాలమయ్యీ అయ్యీ కళ్ళచివర్లు, పిగిలిపోతాయా అన్నంతగా చూపుని లాక్కునే సౌందర్యరాశి కేరళ. మలబా రు మీదుగా ఆ చూపు విస్తారంగా సాగుతూనే ఉంది. ఆకా శం నుంచి గూగుల్ మ్యాప్‌తో కిందికి చూస్తూ వస్తుంటే ప్రదేశాలు స్పష్టపడినట్లుగా కనిపించినచోట ఆగాను. ఇక కలాంతాన, కొచ్చి సరస్తీరంలోని తేవరా శివారు ప్రాంతంలో ఉన్న సిఐఎఫ్‌టీ క్వార్టర్స్‌లో కనిపించాడు ఆ బాలుడు, రం గురంగుల కుంచె పట్టుకుని నవ్వుతూ కళ్ళముందు నిలిచా డు. పట్టుకోబోతే నీకు అందుతానా? అన్నాడు. నివ్వెరపో యి చూస్తుండగానే సప్తవర్ణాల ఇంద్రధనుస్సు అంచు పట్టు కు తిరగేసి, ఊయల ఊగుతూ ఊగుతూ దిగంతంలోకి మాయమయ్యాడు. కల చెదిరింది, ఒక్క పెట్టున దుఃఖం వచ్చింది. అమ్మునాయర్ ఇంగ్లీష్‌లో ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ పేరుతో రాసిన పుస్తకాన్ని స్వర్ణ కిలారి లిప్తకాలపు స్వప్నం పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని డ్రాఫ్ట్ రూపంలో చదివినప్పుడే చాలా ఉద్వేగపడ్డాను. ఎడ్వర్డ్ థామ స్ క్లింట్ అనే కేరళ బాల చిత్రకారుని జీవితగాథ ఎందుకు ఇంత గా కలవరపెడుతుంది మనల్ని!! క్లింట్, నెల ల వయసులోనే దొరికిన పరికరాలతో నేల మీద చిత్రమైన గీతలు గీస్తూ ఉండటం ఒక మురిపెం. ఏడాది రెండేండ్లకే స్పష్టంగా బొమ్మలు వేయడం ఒక అద్భుతం, ఏడేండ్లు నిండకుండానే, ప్రాణాంతకమైన జబ్బుతో పోరాడుతూ కూడా ఇరువై అయిదు వేల బొమ్మలు వేయడాన్ని ఏమంటారో తెలుసుకోవడానికి కాసేపు తడుముకోవాల్సి వచ్చిం ది.

నీకు అందుతానా? అంటూ పారిపోయిన ఆ బాలుడు చెప్పకుండానే చెప్పిన రహస్యం ఇదే. కళాకారుని తాదాత్మ్యత. కళారంగాల్లో మహామహులనుకున్నవారే ఒక గొప్ప సృష్టి తర్వాత మరికొన్ని పేలవ ప్రదర్శనలతో తడబడుతూ ఉం టారు కదా! అలాంటిది ఒక్కచోట కుదురుగా కాలూని నిలబడని బాల్యానికి, ఇంతటి ఏకాగ్రత, నైపుణ్యం, ఓపిక, శక్తినిచ్చినది ఏది? బొమ్మ వెయ్యాలనుకున్నపుడే వెయ్యడం, ఎంతసేపు వెయ్యాలనుకుంటే.. అది తెల్లవారుఝాము మూడయినా వెయ్యడం, వద్దనుకున్నపుడు ఎవరు చెప్పినా వెయ్యకపోవడం, తనకు నచ్చిన బొమ్మే వేసుకోవడం, తన బొమ్మకు అవార్డ్ తీసుకోవాల్సిన సభలో కూచునే బదులు ఇంటికి వెళ్లి బొమ్మలు వేసుకుంటాననడం, అన్నిటికీ మించి - తనకి రెండు చేతులతో పాటు, ఒక తొండం కూడా ఉంటే భోజనం చేసే సమయంలో కూడా బొమ్మలు వేసుకోవచ్చుననే నిఖార్సయిన కళాకారుని జీవితచరిత్ర ఈ పుస్తకం. అం దుకేనేమో ఈ మార్మిక బాలునికి చిత్కళ తల్లిగా మారి అక్కున చేర్చుకొని కుంచె విసరుని కొసరికొసరి రుచి చూపింది. నిజానికి ఈరోజు ఈ అక్షరాలను పైకి ఎత్తిపట్టి లోకానికి చూపుతున్న స్వర్ణకి కూడా క్లింట్ జీవితపు స్ఫూర్తి అంటుకునే ఉంది. సామాజిక మాధ్యమాలలో ఒక అల్లరి అమ్మాయిగా, సరదాగా కనిపించిన తను, ఇంత ప్రభావవంతమైన పుస్తకాన్ని అనువాదం చెయ్యడానికి సిద్ధపడటం, అందులోనూ ఇది ఆమె తొలి పుస్తకం కావడం యాదృచ్ఛికమేమీ కాదు. తన గురించి చదివిన ఎవరినీ మామూలుగా వదలడు ఈ బుడతడు. క్లింట్ బతికుంటే ఈ అనువాదకురాలికి సమ వయస్కుడు. తన కొడుకు ఏడేండ్ల వయసులో - ఏడేండ్ల క్లింట్ గురించి చదివి, చెప్పరాని మానసిక సంచలనంతో కదిలిపోయానంటారు స్వర్ణ.

ఈ పుస్తకపు అనువాదం మామూలు విషయం కాదు, క్లింట్ అసాధారణ ప్రతిభకు, హిందూ మత ఆధ్యాత్మికతకు ముడివేసే ప్రయత్నం మూల రచనలో కనిపిస్తుంది. అమ్మూ నాయర్ స్వయంగా హిందూ మతావలంబి. కానీ స్వర్ణ, కులమతాల పట్లా ఆస్తికత్వం పట్లా ఆసక్తి లేని యువతి. క్లిం ట్‌ను ఒక మత ఆరాధకుడిగా కట్టివేసే గట్టి ప్రయత్నాన్ని, తన స్వేచ్ఛానువాదంలో కొంత సరళం చేయాలని చూశారు. ఒకట్రెండు పదాలు, వాక్యాల మార్పు ద్వారా మూలభావానికి దెబ్బతగులకుండా తర్కానికి దగ్గరగా, పుస్తకాన్ని సార్వజనీనంగా ఉంచడానికి కృషిచేశారు. క్రైస్తవ మత విశ్వాసులై న తల్లిదండ్రుల నేపథ్యాన్ని కూడా దాటుకొని క్లింట్, వందలాది హిందూ దేవుళ్ళ బొమ్మలు వేయడానికి ఆసక్తి చూప డం, ఇన్ని వేల బొమ్మల్లో ఒక్క క్రీస్తు బొమ్మ కూడా లేకపోవడం చిత్రంగా అనిపించినప్పటికీ దానివెనుక కారణాలు పుస్తకంలోనే స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. క్లింట్‌కు బైబిల్ నీతి కథలు, హిందూ పురాణ కథలతో సహా చాలా కథలు చెప్పేవారు తల్లిదండ్రులు చిన్నమ్మ, జోసెఫ్. ఆయుధాలు వాడే సాటిలేని యోధులను ఎక్కువ ఇష్టపడేవాడు క్లింట్. అలాగే ఏనుగు అంటే ఉన్న ఇష్టం వల్ల వినాయకుడు ప్రీతి పాత్రమయ్యాడు. మతాలకు ఉండే రాజకీయ ముఖం ఎరుగని బాలకుని మనసుకు ఏది నచ్చితే అది కాన్వాస్ మీదకి రావాల్సిందే. ఏ ముద్రల మరకలు పడని సహజ కళారూపాలవి. క్లింట్ జీవితంలోని ప్రతిక్షణాన్నీ అద్భుతంగా రీ బిల్ చేసిన అమ్మూ నాయర్ ప్రతిభను తెలుగు పాఠక సమాజానికి అంతే గొప్పగా అందించారు స్వర్ణ. పంటికింది రాళ్లుగా అనిపించే ఒకటి రెండు అంశాలను అనువాద ఔచిత్యం ద్వారా పరిహరించారు.

జననమరణాల తాత్విక ఘర్షణ చిన్నపిల్లలకు ఉంటుందా? అందులోనూ ఏడేండ్ల లోపు పిల్లవాడికి ఉంటుందా? క్లింట్‌ను చదివాక పాత అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తుంది. క్రీస్తు పునరుత్థాన ఘట్టం క్లింట్ మనసులో ఎన్నో ఆలోచనలు రేపింది. ఒకరోజు తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లి తిరిగివస్తూ, మనం ఎక్కడ నుంచి వస్తాం నాన్నా? అనడిగాడు. లాజిక్ లేని సమాధానాలను క్లింట్ నమ్మడు కనుక తెలీదని చెపుతాడు జోసెఫ్. చనిపోయాక మనం ఎక్కడికి వెళతామని మళ్లీ అడుగుతాడు. సమాధానం లేదు. ఆ ఘర్షణను భుజాలకెత్తుకొని తదనంతర కాలంలో ఒక బొమ్మలో దానిని వొంపుకున్నాడు క్లింట్. జనన మరణాల చిక్కు ప్రశ్నలను మోసుకొని యముడి వద్దకి ధీమాగా నడిచి వెళ్తున్న నచికేతుడి బొమ్మ అది. నచికేతుడు తిరిగివచ్చాడు. క్లింట్ తిరిగిరాలేదు. సమస్త జంతుజాలపు భావోద్వేగాలను అత్యంత నిశితంగా పట్టి - బొమ్మల్లో చూపగల క్లింట్, అందరి ఉద్వేగాలకూ అతీతంగా, ఆరేండ్ల పదకొండు నెలల వయసులోనే వచ్చిన పని అయిపోయినట్లుగా విడిది వదిలి పెట్టాడు. కాపురమొచ్చిన కన్ని పాపా యి ఇల్లు ఖాళీచేసి వెళ్లి పోయాడు. విడిది లిప్తకాలమే అయినా అక్షరం దానిని శాశ్వతం చేసిం ది. ఈ పుస్తకం, అనేక పాఠాల సమాహారం. తల్లిదండ్రులకీ పిల్లలకీ మధ్యనుంచే బాంధవ్యం - ఆధార, ప్రయోజన పూరిత సంబంధంగా కాకుండా ప్రేమ, స్వేచ్ఛల సహజ పునాది మీద రూపొందితే క్లింట్ లాంటి పిల్లలు వెలుగులోకి వస్తారు. చదువుకీ కళలకీ మధ్యనున్న అనవసర దూరాల్ని తగ్గిస్తారు.

ఈ లిప్తకాలపు స్వప్నం పిల్లలను, చదువుకునే పిల్లలను, కళల పట్ల మక్కువ ఉన్న పిల్లలను, అందరు తల్లిదండ్రులను, డాక్టర్లను, ఉపాధ్యాయులను, ఇరుగు పొరుగును, కుటుంబ స్నేహితులను, ప్రకృతి ప్రేమికులను, మరీ ముఖ్యంగా కళాసృష్టిలో పిచ్చిగా మునిగిపోయేవాళ్ళను అడ్రస్ చేస్తుంది. మనం ఎట్లా ఉంటే అద్భుతాలు పుడతాయో, ఆ అద్భుతాలు ఎంత సహజంగా మొత్తం సమాజంలో ఇమిడిపోతాయో చెప్తుంది. పిల్లలు కాదు పెద్దలు చదువాల్సిన పుస్తకం ఇది. పెద్దలే కాదు, తన ముఖాన్ని మానవీయంగా మార్చుకునేందుకుగానూ మొత్తం సమాజం చదువాల్సిన పుస్తకమిది. ఇటువంటి స్వప్నంలో నా ఉద్వేగాన్ని అక్షరరూపంలో పంచుకోమని స్వర్ణ నన్ను కోరడం, నేను రాయగలగడం, నా ఒడిలో క్లింట్‌ను కూర్చోబెట్టుకున్న అనుభూతినిచ్చింది. లిప్తకాలపు స్వప్నాన్ని అక్షర సాకారం చేసి న అనువాదకురాలికి అన్నింటా తోడుగా నిలిచిన ఆమె సహచరుడు కొణతం దిలీప్‌కు అభినందనలు.
- కె.ఎన్.మల్లీశ్వరి
అమ్మునాయర్ ఇంగ్లీష్‌లో ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ పేరుతో రాసిన పుస్తకాన్ని స్వర్ణ కిలారి లిప్తకాలపు స్వప్నం పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. లిప్తకాల పు స్వప్నం పుస్తకంలోని ముందుమాట.
(ఈ నెల 30న లిప్తకాలపు స్వప్నం పుస్తకం
విడుదల సందర్భంగా..)

141
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles