వ్యక్తిత్వ వికాస సుమతి


Mon,June 17, 2019 01:13 AM

తెలుగువారి జీవన విధానాన్ని నిర్దేశించిన నీతి శాస్త్రము వంటి గ్రంథం సుమతి శతకం. దీనికర్త బద్దెన భూపాలుడు. బద్దెన కవిత్రయ యుగానికి చెందినవాడే. సుమతి శతకం రచింపబడిననాటి నుంచి ఈనాటివరకు తెలుగు వాళ్ల నాలుకల మీద నర్తిస్తున్నది. నా చిన్నతనంలో అక్షరాభ్యాసం చేయిస్తున్న రోజులలో
మౌఖికంగా సుమతి శతకాన్ని పాఠంగా చెప్పేవారు. సుమతి శతకంలో భాష అతి సరళమైంది. సులభగ్రాహ్యమైంది. దానిలో వాడిన ఛందస్సు కందము.
ఆనాటి నుంచి కవిత్వాభ్యాసం చేసే కవులు ఈ శతకం ద్వారా కంద పద్య రచనలోని మెళకువలను అవగతం చేసుకుంటున్నారు.


తెలుగు శతక సాహిత్యంలో శతకాలు దైవభక్తిని ప్రచారం చేయడం కోసం ప్రారంభమైనా తర్వాత సమాజ స్థితికి దర్పణంగా అనేకాంశాలను చర్చించడం, వివేచించటం, వ్యాఖ్యానించటం ప్రధానాంశంగా పెట్టుకున్నారు. అలాంటి వాటిలో ప్రాథమికంగా వెలువడిన వాటిలో సుమతి శతకం అగ్రగణ్యమైంది. ఈ కర్త బద్దెన భూపాలుడు ఏ ప్రాంతంలో ఉండేవాడో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమని సుమతి శతక పరిశోధకులు డాక్టర్ మచ్చహరిదాసు వెల్లడించారు. ఆయన కాలం సుమారు క్రీ.శ. 1300 అని ఆయన నిశ్చయం.

సుమతి శతకం పద్యాల సంఖ్య నూటికి మించి ఉన్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ప్రతిలో 150 పద్యాలు ఉన్నాయని తాము మరొక 56 పద్యాలను అదనంగా సేకరించినట్టు డాక్టర్ మచ్చ హరిదాసు పేర్కొంటున్నారు. తెలుగు నీతి శతకాలలో కంద పద్య శతకా లే గాక, భాస్కర శతకం వంటి వృత్తాల రచనలు, వేణుగోపాల శతకం, ధర్మపురి లక్ష్మీనారసింహ శతకం వంటి సీస పద్య శతకాలు, ఆటవెలదిలో రాసిన వేమన శతకాలు ఇలా అనేక ఛందస్సులలో పరివ్యాప్తమై ఉన్నవి. ఇవి కాక ఆంధ్ర నాయక శతకం వంటి అధిక్షేప శతకాలు, గోగులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకం వంటి శత్రువుల వలన కలిగే బాధలను వర్ణించిన శతకాలు, ఆనాటి కాలంలో అల్లకల్లోలాలను ప్రతిబింబించే రచనలలో ప్రకాశించేవీ ఉన్నాయి.

తెలుగు పద్య సాహిత్యంలో భారత భాగవతాలను పక్కనపెడితే అధిక వ్యాప్తిలో పఠన పాఠనాలలో ఉన్నవి శతకాలుగానే పేర్కొనవచ్చు. శతకాలలో ప్రధాన లక్షణం సమాజగతిలోని అవకతవకలు, అపసవ్య లక్షణా లు ఆపదలు కలిగించే సన్నివేశాలు వర్ణింపబడుతూ వాటికి పరిష్కారాలు సూచింపబడుతూ ఉన్నవి. సాధారణంగా ఉపదేశం చేసే అంశం ఉపమానంగా, తార్కాణంగా లోకవృత్తి దర్శనంగా కాన వస్తుంది. వేణుగోపాల శతక కర్త లాంటి వారి వాక్కు చురుకుగా, కఠినంగా కానవస్తుంది. ఇతర శతకాలలో ఇది మృదువుగా, మిత్ర వ్యాక్యంగా చెప్పబడుతున్నది. సుమతి శతకంలోని కొన్ని పద్యాల్లో రాజనింద కూడా కనిపిస్తుంది.
ఈ కారణంగా ఆయన రాజు కాడేమోనని సుమతి శతక పరిశోధకులు అనుమానిస్తున్నారు. కానీ ఇది సామాన్యమైన దృష్టిలో చూస్తే ఆక్షేపణీయమైనదిగా కనిపించదు. కవి కావ్య నిర్మాణంచేసే వేళలో తాను తన పరిమితమైన వ్యక్తిత్వ పరిమితుల నుంచి బయటపడి సాధారణీకరణం పొంది మొత్తం సమాజ చైతన్యంలో తన్మయత్వం చెంది రచనచేస్తాడు. ఆముక్తమాల్యద వంటి కావ్యాలలో కూడా రాజుల మధ్య వైరుధ్యాలు, దోషాలు, వర్ణనల సందర్భంలో ఆక్షేపణలు కనిపిస్తాయి అందువల్ల బద్దె న.. భూపాలుడు కాడని అనుమానించవలసిన అవసరం లేదు.

పాఠశాలలో విద్యాభ్యాస సందర్భంలో లేత వయస్సులో బాలల్లో సామాజిక చింతనను, సమష్టి బాధ్యతను ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడుగా ఎదగడం కోసం వ్యక్తిత్వ నిర్మాణం కోసం, సమాజ సామరస్యం కోసం సుమతి శతకం వంటివి తమ బాధ్యతను శక్తిమంతంగా తీర్చిదిద్దుతాయి. శ్రమలేకుండా ముఖస్థమయ్యే ఈ పద్యాలు ఎన్ని తరాలైనా ముందుకు కొనసాగించగలవని నాకు తోస్తున్నది.

ఈ శతక ఆరంభంలో కవి చేసిన ప్రతిజ్ఞ ఇలా ఉన్నది. ధారళమైన నీతు లు నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ అని అన్నచోట లోకానికి అన్వయించే లోపాలను ఎత్తిచూపే అనేకాంశాలు, నీతులు ధారాళంగా వెల్లడిస్తాననీ, వాటిని వినేందుకు రుచి కలుగుతుందనీ, ఆసక్తి పెరుగుతుందనీ వెల్లడిస్తున్నాడు.
ఒక పనిచేసే కార్మికుడు, చిన్న ఉద్యోగి తమ జీవితం గడపడానికి ఒక యజమాని మీద ఆధారపడుతారు. అతడు వేళకు తగినట్లు వేతనం చెల్లించక పోతే కేవలం మిడిమేలపు పలుకులు పలుకుతూ ఉంటే అతని కొలు వు చేయడం అవసరమని, ఆ ఉద్యోగం వదలి స్వతంత్రంగా కృషి చేయ డం మంచిదని తొలిపద్యంలో వివరిస్తాడు. 700 ఏండ్ల పూర్వం స్వతంత్రంగా వ్యవసాయం చేసుకోవడం గౌరవప్రదమైన జీవనానికి సాధనం కావచ్చు. కానీ ఈనాడు భూమి దున్నడం, వ్యవసాయం చేయడం లాభసాటి వృత్తి కాకుండాపోయింది. వ్యక్తి స్వాతంత్య్రం అణిగిపోయింది. అనే క వ్యవస్థల మీద కర్షకులు ఆధారపడి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎరువులను సంపాదించటం, పంట పొలాన్ని వేయి కండ్లతో కాపాడటం, ఫలసాయాన్ని ఇంటికి తెచ్చుకోవడం, దాన్ని అమ్ముకోవటం.. ఇవన్నీ ఈ రోజు క్లిష్టమైన అంశాలే ఐనాయి. ప్రభుత్వం జోక్యంచేసుకోవటం అన్నిస్థాయిల్లోనూ అనివార్యంగా కానవస్తున్నది.

ఈ అంశమంతా అడిగిన జీతంబియ్యని అన్న పద్యంలో కవి బొమ్మ కట్టించాడు.నిత్య జీవనంలో బంధువులతో కూడిన కుటుంబం, విశాలమైన కుటుం బం సమష్టి జీవనవ్యవస్థలో పరస్పర సహకారం, ఇబ్బందులను తొలిగించి అందరికీ సహకరిస్తూ సుఖ దుఃఖాలను శుభాశుభాలను పంచుకొ నే అవకాశం కలిగిస్తున్నది. ఈ బాంధవ్య సందర్భంలో తన కర్తవ్యాన్ని తాను వివరించకపోతే ఆ బంధుత్వం వ్యర్థమైనదే అవుతుంది. ఈ అంశా న్ని సుమతి శతకకారుడు అక్కరకు రాని చుట్టము అని పరిత్యజించదగిన అంశాలలో ఒకటిగా వివరిస్తాడు. ఐతే సంసారయాత్రలో అందరు బంధువుల విషయంలోనూ అది చెల్లుబాటు అయ్యే అంశం కాదు. అం దుకే బద్దెన దూరకుమీ బంధుజనుల అని మరొక చోట అంటారు. రక్త సంబంధం కలిగి ఉండటం వల్ల బంధువులు తరతరాలదాకా సన్నిహితంగా కొనసాగుతారు. లోకంలో మామూలు స్నేహం ఇంతటి దీర్ఘకాల అనుబంధం కలది కాదు. ఇలా లోక లక్షణాన్ని వెల్లడిస్తూ కవి అక్కరకు రాని చుట్టమే కాకుండా వరమీయని వేల్పును, యుద్ధంలో సహకరించ ని వాహనమైన గుఱ్ఱాన్ని కూడా పరిత్యజించవలసినదిగా మొహమాటం లేకుండా గ్రక్కున విడువంగ వలయునని వెల్లడిస్తాడు.

నివాసయోగ్యమైన ప్రదేశాన్ని ఎన్నుకునేటపుడు ఏయే అంశాలు ప్రధాన మైనవో బద్దెన ఒక పద్యంలో వివరిస్తాడు. అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్చొప్పడిన యూరనుండుముచొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ..ఒక గ్రామం వాసయోగ్యమైనదిగా ఉండటానికి అవసరమైన అంశాలు ఈ పద్యంలో చెప్పబడినవి. 1) అత్యవసరమైన సందర్భములలో అక్కరను తీర్చే ధన సహాయం చేసే ఋణమిచ్చే ఋణదాత అవసరం. 2) రోగాలు నొప్పులు వచ్చినా ఏ రాత్రైనా పగలైనా మందు మాకు ఇచ్చే వైద్యుడు ఉండాలి. ఈ వైద్యుడికి ఆ కుటుంబానికి అవిచ్ఛిన్నమైన సం బంధం ఉండటం వల్ల వారి వారి శరీర తత్వాలు, వాత, పిత్త శ్లేష్మ లక్షణాలు బాగా తెలిసి రోగాన్ని వెంటనే నిర్ణయించి మందులిచ్చి బాధా నివారణ చేయగలవాడు వైద్యుడు ఉండాలి.

3) ఆ గ్రామంలో తాగడానికి, పంటల సాగుకై నిరంతరం జలాన్ని అందించే ఒక చిన్న ఏరైనా ఉండాలి. జనులు జలముంటేనే జీవనం కొనసాగించగలుగుతారు. 4) ద్విజుడంటే మానవునికి విజ్ఞానానికి సేతువు వంటి వాడు. అధ్యాపకుడు కావచ్చు. శుభాశుభాలు తెలియస్తే కార్తాంతికుడు కావచ్చు. దైవ ఆరాధనచేస్తూ ప్రజల భక్తిని నిరంతరం పుష్పింపజేసే అర్చకుడు కావచ్చు. ఈ మూడు అంశాలు ద్విజుడు అన్న శబ్దాన్ని విశదపరుస్తాయి. ఈ విధంగా నివాసయోగ్యమైన గ్రామ లక్షణాల్ని బద్దెన చెప్పిన నాటి నుంచి ఈనాటి వరకు విస్తృతార్థంలో అన్వయం చేసుకోవ చ్చు. ఆర్థిక సంస్థలు, వైద్యాలయాలు, జల సంపద, విద్యా ఆధ్యాత్మిక సంస్థలు ఈనాటికీ బృహద్రూపంలో కానవస్తాయి.

ఈనాడు ధన సంపాదన జీవనానికి ప్రధాన లక్ష్యంగా మారింది. అన్ని సుఖాలనూ సాధించడానికి ధనమే ముఖ్యకారణమౌతున్నది. ఈ కాలం లో ఒకనాటి పేదవాడు కోటీశ్వరుడుగా మారిపోతున్నాడు. ఒకనాటి ధనికుడు నిర్ధనుడై అనేకమైన అగచాట్లను పడుతున్నాడు. ఈ రెండు రకాలైన వ్యవస్థల్లోనూ సమస్థితి కోల్పోకుండా తనను తాను సంభాళించుకొన్నవారు చిరమైన సుఖాన్ని కోల్పోకుండా అన్నీ సాధించుకోవచ్చు. ఐశ్వ ర్యం వస్తే కొబ్బరికాయలో నీళ్ళలాగ స్వయంభువుగానే వస్తుంది. అట్లాగే దారిద్య్రం కూడా ఏనుగు మింగిన వెలగ పండులాగా గుజ్జునంతా పోగొట్టుకొని డొల్ల అయిపోతుంది. ఈనాడు అనేకులు అక్రమార్జన చేసినవాడు అధికారులు పరిశీలించినప్పుడు ఆదాయం మూలాలు చెప్పలేక తబ్బిబ్బుపడి అన్నీ కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాము.

ఈ విధంగా సుమతి శతకంలోని ప్రతి పద్యాన్ని పరిశీలిస్తే సమాజంలోని అనేక దృశ్యాలు కళ్ళ ముందుకు సాక్షాత్కరింపజేస్తుంది. ఒక్కొక్క పద్యం లో చెప్పిన అంశాలు ఏ కాలానికైనా అన్వయించేట్టుగా ఉంటవి. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప. పాఠశాలలో విద్యాభ్యాస సందర్భంలో లేత వయస్సులో బాలల్లో సామాజిక చింతనను, సమష్టి బాధ్యతను ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడుగా ఎదగడం కోసం వ్యక్తిత్వ నిర్మాణం కోసం, సమాజ సామరస్యం కోసం సుమతి శతకం వంటివి తమ బాధ్యతను శక్తిమంతంగా తీర్చిదిద్దుతాయి. శ్రమలేకుండా ముఖస్థమయ్యే ఈ పద్యాలు ఎన్ని తరాలైనా ముందుకు కొనసాగించగలవని నాకు తోస్తున్నది.
సుమారు యాభై సంవత్సరాలకు పూర్వం ఈ శతకాన్ని యస్టీజీ వరదాచార్యులు సంస్కృతంలోనికి పరివర్తం చేశారు. 1960 ప్రాంతాలలో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు కుమతీ శతకమనే పేర దీనికొక పేరడీ రచనచేశారు.
- కోవెల సుప్రసన్నాచార్య

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles