తెరలు తొలగిస్తే..కావ్యతత్త్వం కనిపిస్తుంది


Mon,May 20, 2019 02:10 AM

రామ రాజ భూషణుడు 16వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని గురించి చెప్తూ.. బహుళాంధ్రోక్తి మయ ప్రపంచము అన్నాడు. బహుళమంటే.. అనేకవిధాల అవకాశాలున్న భాషా ప్రవృత్తి అని అర్థం. ఈ మాట వల్ల రాయలసీమలో ఉన్న ఈ కవి అనేక ప్రాంతాలలో అనేక విధాలుగా విభిన్న యాసలతో విభిన్న క్రియారూపాలతో వ్యవహరింపబడుతున్న తెలుగు భాష సమగ్ర స్వరూపాన్ని రక్షించినాడని తెలియవస్తున్నది. స్వస్థాన వేషభాషా అభిమతం గలవారు రసానుభవాన్ని సాహిత్యం ద్వారా పొందుతారు. ఆ రసము శబ్దం వల్ల ఉత్పన్నమవుతుంది. ఆ శబ్దము పరికృతమై నిర్దిష్టంగా కావ్యంలో ప్రయోగింపబడుతుంది. నిర్దిష్టమంటే ఏ శబ్దరూపము అనౌచిత్య స్ఫురణ కలిగిస్తుందో.. రసభంగ హేతువవుతుందో.. ఆ శబ్దము దోషయుక్తమైనది.
Nannayya
ప్రాచీన తెలుగుసాహిత్యం కేవలం పద్యరూపం కాకుండా, వచనరూపం కాకుండా, వివిధ ఛందోరూపాల సమ్మేళనంతో విచిత్రమైన చంపూకావ్యంగా రూపొందింది. ఈ చంపూ పద్ధతిని మనకు సంస్కృత కావ్యాలలో ఉన్నది. దక్షిణాది భాషల్లోనూ ఉన్నది. అయితే, రుషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కీర్తింపబడి కావ్యానికి మూలాధారమైన పద్యం ఒక విద్యగా పేర్కొన్నారు.

దుర్భర తపో విభవాధికున్ గురుపద్యవిద్యకు నాద్యుడు నంబురుహ గర్భనిభున్ ప్రచేతసపుత్రున్ భక్తి తలంచుతున్..తన నుంచి తరువాతి కాలంలో ప్రవహింపబోతున్న పద్య కవిత్వానికి మూలాలు వాల్మీకిలోనే ఉన్నాయని నన్నయ పేర్కొన్నాడు. ఆయన వర్ణించిన వాల్మీ కి తపో విభవాలు అధికంగా ఉన్నవాడు. బ్రహ్మదేవుని వంటివాడు. ప్రచేతస పుత్రుడు. ఈ ప్రచేతస శబ్దము ఆయన వంశానికి చెందిందిగా కన్పించినా శ్రీఅరవిందులు పేర్కొన్న ఉన్నత మనోభూమికలను స్ఫురింపజేస్తున్నది. వాల్మీకి తన గురువైన నారదుని గురించి.. తపస్వాధ్యాయ నిరతం అని పేర్కొన్నాడు. ఈ తప స్సు అతనికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నుంచి సం క్రమించింది. కావ్య సంసారంలో కవియే ప్రజాపతి అన్నట్టుగా బ్రహ్మదేవుడు కవిస్థానంలో ఉంటాడు. నన్నయ బ్రహ్మదేవుని గూర్చి గురుపద్యవిద్యకు ఆద్యు డు అన్నాడు. గురుపద్య విద్య అంటే అనంతమైన వైవిధ్యభరితమైన పద్యనిర్మాణం అని అర్థం. వాల్మీకి క్రౌం చవధను చూసినప్పుడు తన దు:ఖాన్ని అవిజితంగానే పద్యరూపంలో వెలువరించాడు. ఈ పద్య ఆవిష్కారం దృష్టిలో పెట్టుకొని వాల్మీకిని పద్యవిద్యా ప్రథముడని ఆదికవి అని నన్నయ్య పేర్కొన్నాడు.

తెలుగు కవిత్వంలో నన్నయ్య ప్రారంభించిన పద్య కావ్యం కంటే ముందు జినవల్లభుడి కుర్క్యాల శాసనంలో ఉన్న కందపద్యాలు, గూడూరు శాసనంలో ఉన్న వృత్తాలు.. మహాభారత నిర్మాణానికి పునాదిగా పనిచేసినాయనడంలో సందేహంలేదు. కంద పద్యం ఆర్యావృత్త వికృతియే అయినా చతుర్మాత్రాగణాలతో నియమింపబడి విలక్షణమైన నడకతో తెలుగు సాహిత్యంలోనే అత్యంత ఆదరణీయత కలిగిన ఛందస్సుగా పేరుపడ్డది. దీనిలో మార్గ లక్షణాల కంటే దేశి లక్షణా లు ఎక్కువ. గూడూరు శాసనంలోని వృత్తాలు సంస్కృ తంలో బహుళ ప్రయోగం లేని ఛందస్సులు. వీటితోపాటు నన్నయ్య కావ్యనిర్మాణంలో శార్దూల మత్తేభాలను దేశీ ఛందస్సులైన గీతము, సీసము, ఆటవెలది.. ముందే పేర్కొన్న కందము, మధ్యాక్కర.

ఇలా రెండు విధాలైన ఛందోమార్గాల సంగమంగా కావ్య నిర్మాణా న్ని నిర్వహించాడు. అందువల్ల నన్నయ నిర్మించిన కావ్యం కేవల మార్గ పద్ధతికి చెందిందని అనుకోవడం సత్యదూరమైన అంశం. మధ్యాక్కరలు నన్నయకు ముందు యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో కానవస్తాయి. దానిని సేకరించి కావ్యంలో అనేక సందర్భాల్లో మధ్యాక్కరలు ప్రయోగించాడు. మధ్యాక్కరలో ఉన్న విశేషం ఆయన పంచమగణాదియతి పద్దతిని అనుసరించి వచనంగా చదువుకోవడానికి వీలవుతుం ది. సీసము, గీతము, ఆటవెలది, కందము మొదలైన వి పాడుకోవడానికి వీలవుతుంది. నన్నయ విరళంగా వాడిన నాలుగు వృత్తాలు పాఠ్యే గేయేచ మధురం అన్నట్లుగా పరిమితమైన సంగీత లక్షణంతో ఆలపించడానికి వీలైనవి. అందువల్ల నన్నయ కావ్య నిర్మాణం లో చదువుకోవడానికి, పాడుకోవడానికి వీలైన ఒక చంపూకావ్య నిర్మాణం సాధించినట్టుగా మనకు తెలియ వస్తున్నది.

నన్నయ భాగంలో నాగస్తుతి పద్యాలు.. సంస్కృ తం చంపూకావ్యాలలోని వచన కావ్యాలలోని దీర్ఘ సమాసబంధుర లక్షణాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా.. ప్రసన్నమయ్యెడున్ అన్న మకుటం నాలుగు పద్యాలకు సమానం కావడంచేత తరువాత తెలుగులో ప్రాచుర్యంలోకి వచ్చిన సమకుటమైన శత క నిర్మాణానికి ఉదాహరణం ఏర్పరిచినట్లయింది.
నన్నయ కావ్యశైలిలో పూర్వ విమర్శకులు చెప్పినట్టుగా రెండుపాళ్లు సంస్కృతం, ఒకపాలు తెలుగు అన్నది ప్రచారంలోకి వచ్చిందే కాని, తెలుగు పదాల ప్రయోగం.. వాక్య నిర్మాణంలో దేశీయత, కాకువు.. ఇతర అంశాలు తెలుగు భాషకు సహజమైన వ్యవహార పద్ధతికి అత్యంతం అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఆశ్వాసాంతాలలో విశేష వృత్తాలు వాడటం కూడా ఆయన ఒరవడియే. దానివల్ల పాఠకునికి ఒక విశ్రాంతి.. వైవిధ్యభరితమైన నడక అనుభవంలోకి వస్తాయి.

నన్నయ ఏర్పరిచిన ఈ కావ్య నిర్మాణ పద్ధతి దాదా పు వెయ్యి సంవత్సరాలు కొనసాగుతూనే వచ్చింది. చెప్పుకోదగిన మార్పు.. పాల్కురికి సోమనాథుడు ప్రారంభించిన ద్విపద కావ్యం వల్లనే కనులముందుకు వచ్చింది. ద్విపద కావ్య నిర్మాణం చేపట్టడంలో సోమ నకు లభించిన ఒడుపల్లా.. రెండు విధాలైంది. ఒకటి- దానిలో అంతర్గతంగా ఉన్న ఖండగతి. మూడు ఇంద్రగణాల తర్వాత సూర్యగణం శూన్యమాత్రలు కలుపుకొని ఖండగతి గీతమే అవుతుంది. మళ్లీ భారతంలోకి వెళితే.. సీసపద్యం ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలతోడి పాదనిర్మితి గలవి. ఈ క్రమాన్ని కొంచెం సవరిస్తే.. రెండు ద్విపద పాదాలవుతాయి. ద్విపద కూడా సీసపద్య నిర్మాణభేదమో, సీసం ద్విపద పద్య నిర్మాణ భేదమో అవుతుంది. మరొక విశేషం మధ్యాక్కర రెండు ఇంద్రగణాలు.. ఒక సూర్యగణము.. రెం డు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం కూర్పుతో ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే.. సీసపద్యము, ద్విపద అక్కచెల్లెళ్లనుకొంటే.. మధ్యాక్కరలో పూర్వార్థానికి, ఉత్తరార్థానికి చెరొక ఇంద్రగణాన్ని చేరిస్తే అదీ సీసపద్య భేదమే అవుతుంది. సోమన్న అందుకొన్న ద్విపద నన్నయకు పూర్వం నుంచే లోకంలో వాడుక లో ఆలపింపబడుతున్న గీత విశేషమే. ఈ దృష్టితో నన్నయ వాడిన సీసమే.. కొంచెం బలం పుంజుకొని ద్విపదగా ఆవిర్భవించింది.

ఇదంతా దేశి ఛందస్సులను కావ్య సందర్భంలో ప్రయోగించిన కవుల ప్రాగల్భ్య ఉక్తి విశేషం మాత్రమే అవుతుంది. పాల్కుర్కి సోమనకు లభించిన రెండవ ఒడుపు పరివర్తన శీలములైన ఇంద్రసూర్యగణాల ప్రయోగంతో లఘు గురువుల మార్పు సులభమై ఎం తటి క్లిష్టమైన సంస్కృత వాక్యాన్నయినా ఇమిడించుకోగలిగిన శక్తి కలిగి ఉంటుంది. సోమనాథుడు పండితారాథ్య చరిత్రలో అతి పుష్కలంగా సంస్కృతం నుంచి వేద శాస్త్రాల వాక్యాలు ఉపయోగిస్తూ పోయా డు అనడానికి ఇష్టంగానే ఉంటుంది కానీ, సోమనాథుని పండితారాథ్యచరిత్ర పండితైకవేద్యమైందే. బసవ పురాణంలో చాలా పలుకుబడులు.. ఈనాటికి మరపునకు లోనై అనేక సందర్భాలలో ఆ కావ్యభాగాలు దుర్గ్రాహ్యాలే అవుతున్నవి. ఇదంతా విలక్షణమైన దృష్టి తో చూస్తే, విహంగావలోకనం చేస్తే.. మార్గదేశి భేదా లు సాహిత్యం మొత్తాన్ని రెండుగా చీల్చివేసే ప్రయ త్నం సఫలమవుతుందని నాకు విశ్వాసం లేదు. వస్తు నిర్మాణం గానీ.. సన్నివేశ చిత్రణ గానీ, మనో లక్షణా న్ని విశ్లేషించడం గానీ రెండింటిలోనూ సమానమైన లక్షణాలే ఉన్నాయి.

సోమన కావ్యంలో సమాజంలోని వ్యక్తులు పాత్రులైనారని, అది దాని సామాజిక తత్పరతను తెలియజేస్తుందని చెప్పుకోవడం స్థూలంగా నిజంగా కనిపించవచ్చు గానీ, దశకుమార చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, శుకసప్తతి, హంసవింశతి మొదలైన కావ్యాలు సమకాలీ న సమాజ చిత్రాన్నే అందిస్తున్నాయి. అసలు కావ్య తత్వాన్ని రసపరీపాకాన్ని సాధారణీకరణాన్నిఅంగీకరిస్తే పౌరాణిక పాత్రలు కూడా పైపైన ఉన్న పరివేశాలు తొలగిస్తే సమాజంలోని వ్యక్తులుగానే దర్శనమిస్తాయి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.. అన్న గజేంద్రుని ఆర్తి.. రుక్మిణీ కల్యాణంలోని కన్య వేదన.. ఘనుడా భూసురుడేగెనో.. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనొ.. అన్న సందర్భంలో సాక్షాత్తూ జగన్మాత అయిన రుక్మిణీ దేవి గా కాక.. సామాన్య కన్యగానే మనకు గోచరిస్తుంది. ప్రతి కావ్యము రస సాక్షాత్కా రం కలిగించేప్పుడు దేశకాలాలను నామరూపాలను పరిత్యజించి సామాన్యమైన మనుష్యుల వేదనగా.. సుఖ దుఃఖాలుగా.., బాధలుగా.., బరువులుగా.. అనుభవంలోకి వస్తాయి.


నన్నయ విరళంగా వాడిన నాలుగు వృత్తాలు పాఠ్యే గేయేచ మధురం అన్నట్లుగా పరిమితమైన సంగీత లక్షణంతో ఆలపించడానికి వీలైనవి. అందువల్ల నన్నయ కావ్య నిర్మాణం లో చదువుకోవడానికి, పాడుకోవడానికి వీలైన ఒక చంపూకావ్య నిర్మాణం సాధించినట్టుగా మనకు తెలియవస్తున్నది.

192
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles