శ్రమజీవిగా బహురూపి


Mon,May 20, 2019 02:08 AM

BAHURUPI
మిమ్మల్ని ఒకరోజు పాటు భారతదేశానికి వైస్రాయిని చేస్తే ఏం చేస్తారు? అని ఒక విదేశీయుడు అడిగితే వైస్రాయి భవనంలో ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ అపరిశుభ్రంగా ఉన్న పారిశుద్ధ్య పనివారి నివాసాలను శుభ్రం చేస్తాను అని జవాబు. మీ పదవీకాలాన్ని మరోరోజు పొడిగిస్తే? అని ప్రశ్న కొనసాగితే మర్నాడు కూడా నేను అదేపని చేస్తాను అనే మాటలు ఎదురయ్యాయి.
సర్దార్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ ఒకసారి సలహా కోసం సేవాగ్రామ్ వెళ్లారు. అక్కడ పట్టీలు ఇక్కడ ఉండాలి, కుట్లు ఇక్కడ, ఇది ఇలా చేయాలి, మడమల మధ్య వత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తోలును అడ్డముక్కలుగా వేయాలంటూ ఆశ్రమవాసులకు పాదరక్షల తయారీ శిక్షణ ఇస్తూ పొరపాట్లు సవరిస్తున్నారు గాంధీ.

ఒకసారి గాంధీని, ఆయన వ్యాసాలను తీసుకువెళ్తున్న రైలు ఆలస్యంగా నడుస్తోంది, వ్యాసాలను పోస్టు చేసేందుకు సమయం మిగల్లేదు. ఒక మనిషి ద్వారా వ్యాసాలను ముంబాయి పంపారు. అహ్మదాబాద్‌లోని ఆయన సొంత ముద్రణాలయంలో కాకుండా ముంబయిలోనే ముద్రించారు. పత్రిక మాత్రం సమయానికి విడుదలైంది.

ఇలా పలు రూపాల్లో పరిచయం చేస్తారు తన 148 పుటల బహురూపి గాంధీ పుస్తకంలో అనుబందోపాధ్యాయ. గాంధీ గురించి చాలా పుస్తకాలున్నాయి. అయితే ప్రస్తుత పుస్తక ప్రణాళిక అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఏం చెప్పారో అని కాకుండా వ్యక్తిగతంగా ఏమి చేశారో అంటూ శ్రమ ఆధారంగా, శ్రమ స్వభావరీత్యా ఆయన జీవితాన్ని 27 అధ్యాయాలుగా విభజించి వివరించారు. శ్రమజీవి, బారిష్టర్, బట్టలు కుట్టేవారు. బట్టలు ఉతికేవారు. క్షవరం చేసేవారు, శుభ్రం చేసేవారు. చెప్పులు కుట్టేవారు, సేవకుడు, వంటవాడు, వైద్యుడు, నర్సు , ఉపాధ్యాయుడు, నేత పనివారు, నూలు వడికేవారు, వ్యాపారి, రైతు, వేలం పాట గాడు, యాచకుడు, బందిపోటు, జైలు పక్షి, సైన్యాధ్యక్షుడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రా పకుడు, ప్రచురణ కర్త, ఫాషన్ స్థాపకుడు, పాములవాడు, పురోహితుడు అంటూ గాంధీ జీవితాన్ని విశదం చేస్తాడు రచయిత. సంవత్సరాలు, తేదీలు చారిత్రక క్రమం అని కాకుండా శ్రమజీవిగా బహురూపి అయిన గాంధీని మన కు దర్శింపజేస్తారు.

ఈ విషయానికి సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ ఇలా అంటారు తన ముందుమాటలో. ఆయన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన విధం ఎంతో ఆసక్తి గొలిపే విష యం. ఆయనది పైపైన ఆసక్తి కాదు. ఆయన ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపటం ఆరంభిస్తే, ఆ అంశాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్నచిన్న అంశాలు అని మనం భావించేవాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే ఆయన మానవతావాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం. ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుంటాం ఈ పుస్తకంలో.

ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపారనే రీతిలో, ప్రాథమిక పాఠశాలలో పాఠ్య పుస్తకాల్లో చదివిన విషయాల ఆధారంగా గాంధీ గురించి ఎంతోమందికి అవగాహన ఉంటుంది. అంతేకానీ ప్రత్యేకంగా అధ్యయనం చేసినవారు గానీ, మామూలుగా చదివినవారు గానీ బాగా తక్కు వ. గాంధీకి సంబంధించి చాలా పుస్తకాలు ఆయ న రాసినవీ, ఆయన గురించి రాసినవీ అందుబాటులో ఉండి-అంత మొత్తంలో చదువడం కష్టం అనే భావమూ ఉంది. దానివల్ల గాంధీ గురించి అవగాహన కంటే అపోహలే ఎక్కువ అనిపిస్తున్నది. ఈ పుస్తకం ఈ రకంగానూ, ఇం కా శ్రమ చేయడం తక్కువ అని సర్వత్రా భావిస్తున్న కాలంలో-పెద్ద పరిష్కార మార్గం. కౌమారదశలోని బాలబాలికల కోసం రాశానని రచయి త అనుబందోపాధ్యాయ ప్రకటించినా అందరికీ బాగా ఉపకరిస్తుంది. గాంధీజీ గురించి మెరుగైన అవగాహన ఉన్నవారు కూడా శ్రమజీవిగా ఆయ న ఏమిటో అనేది చాలా తక్కువ వివరించారు.

1948లో డి.జి.టెండూల్కర్ పుస్తకం మహాత్మా రాత ప్రతిని చదివిన అనుబందోపాధ్యా య 1949లో ఈ పుస్తకం రాశారు. అయితే ప్రచురణ 1964లో వచ్చింది. దీని తెలుగు అనువాదం అర శతాబ్దం తర్వాత అంటే 2014లో వెలువడింది. దీనికి మంచి పుస్తకం ప్రచురణ సంస్థను అభినందించాలి. అనువాదం చాలా హాయిగా, హృద్యంగా సాగింది. చక్కని స్వతం త్ర రచనలా నిరాడంబరంగా మలిచిన నండూరి వెంట సుబ్బారావు అభినందనీయులు.
ఈ పుస్తకం అదనపు ఆకర్షణ ప్రసిద్ధ చిత్రకారుల, కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ వేసిన పలు చిత్రాలు. ఈ పుస్తకంలో 27 అంశాలలో 20 రచనలను ప్రఖ్యాత సంపాదకులు ఎం.చలపతి రావు తన నేషనల్ హెరాల్డ్‌లో ధారావాహికం గా ప్రచురించడం విశేషం. ఈ విషయాలు చూడండి..
- ఒకసారి ఒక కేసు వాదిస్తుండగా తన కక్షిదారే అన్యాయంగా ప్రవర్తించాడని ఆయనకు అర్థమయింది. అతన్ని గెలిపించేందుకు వాదించడం మాని, కేసును కొట్టి వేయమని మెజిస్ట్రేట్‌ను కోరారు (పేజీ 16).

- అద్దం, సబ్బు, బ్రష్షు లేకుండానే గడ్డం చేసుకోగలిగేవారు. ఇది గడ్డం చేసుకునే కళలో గొప్ప అభివృద్ధి అని ఆయన ఉద్దేశం (పేజీ 27).
- ఆయన అనేక పాశ్చాత్య పోకడలను విమర్శించేవారు. కానీ పారిశుద్ధ్యాన్ని పాశ్చాత్యుల వద్ద నేర్చుకున్నానని అనేకసార్లు చెప్పేవారు (పేజీ 30).
- శారీర శ్రమను తక్కువ చూడటం ప్రారంభించిన రోజు నుంచే భారతదేశానికి చెడ్డరోజులు ప్రారంభమయ్యాయనీ, తమ సోదరుల మానవ హక్కులను కాలరాచినవారు, తమ అన్యాయాలకూ, క్రూరత్వానికి జవాబు చెప్పుకోవాల్సిన రోజు వస్తుందనీ ఆయన ఠాగూర్‌తో కలసి జోస్యం చెప్పారు. (పేజీ 39).
- బోయర్ యుద్ధంలో స్ట్రెచర్ మోసేవాడిగా ఆయన రోజుకు 25 మైళ్ళ వరకు నడిచేవారు. ఆయన గొప్ప పాదచారి. టాల్‌స్టాయ్ ఫార్మ్ నుంచి తరచు రోజుకు 42 మైళ్ళు నడిచేవారు. (పేజీ 42).

- నల్ల మహిళలకు తెల్ల నర్సులు పురుడుపోసేందుకు నిరాకరించే అవకాశం చాలా ఉంది. కస్తూర్బా గర్భం ధరించినప్పుడు గాంధీ కాన్పు చేయడానికి సంబంధించి అధ్యయనం చేశారు. కస్తూర్బా తమ ఆఖరి సంతానాన్ని సుఖంగా ప్రసవించేందుకు సహాయపడ్డారు. (పేజీ 57).
- ఆయనకు వారు ఇచ్చిన విరాళాలను తమిళులకే ఉపయోగించాలనే విన్నపాన్ని ఆయన తిరస్కరించారు. (పేజీ 91).
- జైల్లోంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆయన మెదడు మరింత క్రమశిక్షణ కలిగింది గా, మరింత పదునుగా తయారయ్యేది (పేజీ 104).
- ఆత్మగౌరవానికి భంగం కలగనంతవరకూ గాంధీ రాజీకి అంగీకరిస్తూనే ఉండేవారు.
రాజకీయాల్లో, బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా గాంధీ ఎలా ఉన్నాడు, ఏమి చేశా డనే విషయాలను తేటతెల్లం చేస్తుందీ పుస్తకం. అదే ఈ పుస్తకం గొప్పతనం. ఒక నిరంతర స్ఫూర్తి దీపిక ఈ పొత్తం.
- డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
94407 32392

147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles