సిద్ధార్థ దుఃఖపూరిత సంఘర్షణ


Mon,May 13, 2019 12:52 AM

సిద్ధార్థ కవితారీతి సర్రలియజాన్ని అనుసరించడం వల్ల చాలా విన్నూత్నంగాను కళాత్మకంగాను రూపుదిద్దుకున్నది. రెండు ప్రపంచయుద్ధాల మధ్య కవులంతా అటు గ్రామీణ జీవితం ఇటు నగర జీవితం మధ్య తలెత్తిన సంఘర్షణలోనే గొప్ప కవులుగా రూపుదిద్దుకున్నారు. వారి సంఘర్షణే అందుకు కారణం. సిద్ధార్థ కవిత కూడా అంతే.

bommala-bayi
తెలంగాణ సాహిత్య అకాడమీ స్థాపనకు రెండేండ్లు పూర్తయిన సందర్భంగా రెండు అవార్డులను ప్రక టించింది. అందులో కవితా రచనకు కవి బొమ్మగౌని సిద్ధార్థకు లభించింది. ప్రపంచ తెలుగు మహాసభ ల నిర్వాహణ, 50 పుస్తకాల ప్రచురణలతో విశిష్ఠతను చాటు కున్న అకాడమీ, ఈ అవార్డుల ప్రకటన నిర్ణయం ప్రతిష్ఠాత్మకంగా మారింది. తెలంగాణ సంస్కృతి, జీవనరీతికి చెందిన ప్రతీకలతోప్రయోగరీతికి, వినూత్న అభివ్యక్తికి పేరుగాంచిన సిద్ధార్థ అవార్డుకు ఎంపిక కావడం తెలంగాణ కవి లోకాన్ని మెప్పించింది. ఈ అవార్డుతో సిద్ధార్థ మూడు దశాబ్దాల సాహితీ సంఘర్షణ సాఫల్యమైందనే చెప్పాలి. నాటి వాదాల వీధులలో, ఉద్యమాల దారుల్లో ఒంటరి పథికుడు. 1996 నుంచి ఆయన కవితా ప్రస్థానం కొనసాగుతున్నది. దేశ, విదేశాల కవితా ఉద్యమాలు, కవులపై అధ్యయనం నిర్మాణాలతో సాగిన కవన కదనం సిద్ధార్థది. నాటి తెలంగాణ దు:ఖపూరిత సంఘర్షణను పొదువుకున్న కవిగా సిధార్థ ఆవిర్భావం ఒకానొక తెలంగాణ చారిత్రక విభాతసంధ్యలోనే జరిగింది.

ఎనభైయవ దశకం నడిమి కాలం తెలుగు సాహిత్య చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలో కూడా ముఖ్యమైనది. తొలిసారి అభ్యుదయ, విప్లవ సాహిత్యానికి భిన్నంగా నూతన సాహి త్య ఉద్యమాలు తలెత్తాయి. వాటినే న్యూ సోషల్ మూవ్‌మెంట్స్‌గా పిలుస్తున్నారు. ఆనాటి రచనారంగం సాంతం తీవ్రమైన సంఘర్షణకు లోనైంది. భిన్న సామాజిక శ్రేణులు చవిచూస్తున్న వివక్షే ఎజెండాగా సాహిత్యోద్యమాలకు దిగాయి. సరిగ్గా ఈ కాలంలోనే వ్యాపించిన సంక్షుభిత, యుద్ధ పరిస్థితులలో తెలంగాణ ఆలోచనాపరులు, కవులు ఇక్కడ పుట్టిన వారిగా తమ జీవితాన్ని సరికొత్తగా నిర్వచించడం మొదలుపెట్టారు. ఆనాటి తెలంగాణలో రాజుకున్న పరిస్థితులను అధిగమించడానికి రచయితలు నడుంకట్టారు. దీనితో తెలంగాణ భవితపై ఆలోచనలకు బీజాలు పడ్డాయి. నాటి పాలకవర్గాల దాష్టీకానికి, తెలంగాణ దుస్థితికి నిరసనగా కవితా రచన రూపుదిద్దుకున్నది. ఈ క్రమంలో గద్దర్ రాజకీయ విశ్వాసాలలో భాగంగా కొత్తగా అం బేద్కరిస్టు ఎజెండా ముందుకు తెచ్చాడు.

వరవరరావు ముక్తకంఠంతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆనాటి విద్యావంతులైన మధ్యతరగతిలో శ్రీశ్రీ తర్వాత ప్రభావశీలమైన కవిగా శివారెడ్డి రూపు దిద్దుకున్నాడు. మరోవైపు సిధారెడ్డి సంభాషణ మొదలు పెట్టాడు. సారాంశంలో చూస్తే సాహిత్యరంగంలో ఒక కొత్త సంఘర్షణ రూపుదిద్దుకో సాగింది. మొత్తంగా స్థానికతతో తెలంగాణ సమాజంపై ఆలోచనకు దారిపడ్డ కాలమది. దీన్ని అడ్డుకోవడాలు జరిగాయి. అది తొలిసారి కాదు.1960లలో దిగంబర కవితా ఉద్యమం, కుందుర్తి ప్రీవర్స్ ఫ్రంట్ కూడ తెలంగాణ మేధావుల సమాలోచనలకు ప్రతిగా రూపు దిద్దుకున్నవే. నాటి తెలంగాణ యువకవులకు అదొక కొత్తసిలబస్, వ్యాకరణం. ఎనభైయవ దశకంలో అదే స్థితి తిరిగి తలెత్తింది. కమ్మ వలస భూస్వాములకు, దళారీలకు కొమ్ము కాసే చేకూరి రామారావు చేరాతల రూపేణా తెలంగాణ భావనకు ప్రతిగా ఒక కొత్త సిలబస్, కొత్త వ్యాకరణం ముందుకు వచ్చాడు. ఆ భావనకు ప్రతిగా స్త్రీ వాదాన్ని తలకెత్తుకున్నాడు.

పత్రికలు, ప్రచార సాధనాల మద్దతులేని తెలంగాణ కవి యోధులు చేరాతల కొత్తసిలబస్‌ను పూర్తిగా తిరస్కరించి స్థానికతతో సంఘర్షణకు దిగారు. నాడు కవిగా సిధారెడ్డి, ఎస్వీ చేరాతలతో చేసిన పోరాటమే ఇందుకు దాఖలా. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాబల్యశక్తుల కవుల ప్రమాణాలను కాదనడంలో సిద్ధార్థది ముఖ్యపాత్ర. ఆ సంరంబంలో కెశివారెడ్డి కవితా రూపాన్ని, భాష, అభివ్యక్తిని అనేక తెలంగాణ కవులు అనుసరిస్తున్న కాలమది. దానిని పూర్తిగా కాదని తనదైన మార్గాన్ని ఎంచుకున్న తెలంగాణ కవి సిద్ధార్థ. ఆయన తొలి సంపుటి దీపశిల ఇందుకు దాఖలా. అందులోని ప్రయోగరీతి, భాష, అభ్యివ్యక్తి తీరు నాటి కవి లోకా న తీవ్రమైన చర్చలకు దారితీసింది. ప్రగాఢమైన అధ్యయనం వల్ల తనవైన ఈస్తటిక్స్ ను రూపొందించుకున్న కవి సిద్ధార్థ. అప్పుడే మొదలవుతున్న తెలంగాణ సాహిత్యోద్యమం వల్ల కావచ్చు, ఒక రకంగా కల్లుగీత, దాని తాత్విక వారసత్వంలోంచి తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుని కావ్యరాతలోకి దిగాడు.

ఆధునాతన కవితా రీతుల అధ్యయనంతో పాటు కుటుంబంనుంచి సంక్రమించిన వైష్ణ వం, సూఫీ సంప్రదాయం నేపథ్యంలో తనదైన కవితా దృక్ప థం రూపొందింది. సిద్ధార్థది నల్గొండ జిల్లా, బీబీ నగర్ సమీపంలోని చిన్న పల్లె. సంపన్న విద్యావంతుల కుటుంబం. చార్మినార్ సానువుల్లో గౌలీపురాలో జన్మించిన సిద్ధార్థ తల్లి సుశీలమ్మ రవీంద్రుడు, ప్రేవ్‌ుచంద్, శరత్, మాదిరెడ్డి సులోచన రచనల చదువరి. సూఫీ సంప్రదాయంలో పెరిగిన తండ్రి శ్రీనివాసులు ఇంగ్లీషు సాహిత్యం చదువుకున్నారు. ఆయనొక ప్రైవేటు ఉద్యో గి. అమ్మ సుశీల అక్షరాలతో రంగరించిన చేతులలోనే సిద్ధార్థ బాల్యం గడిచింది. అటు సంప్రదాయకంగా సంక్రమించిన విలువలు, ఇటు ఆధునిక సాహిత్యం నుంచి సముపార్జించుకున్న ఉన్నత విలువల మధ్య కవి సిద్ధార్థ రచనకు పునాదులు పడ్డాయి. సిధ్దార్థ అమ్మగారు కొడుకు కవితా రచనను, పుస్తక సంచయాన్ని చూసి మురిసిపోయేది. గొప్ప రచయితలంతా స్త్రీల సమక్షంలోనే రూపుదిద్దుకున్నారన్న ఒక అభిప్రాయం ఉన్నది. ప్రేవ్‌ుచంద్, టాగూరు, సురవరం , చలం, శరత్‌ల జీవితాలే ఇందుకు దాఖలా. సిధార్థ కూడా అంతే. ఈ కవి యాతనకు ప్రతిబింబం అకాడమీ అవార్డు పొందిన బొమ్మలబాయి.

ఈ కవితా సంఫుటిలో రూపొందిన భాషలో నమ్రతను,వినయశీలతను ప్రయోగించడం చూడవచ్చు. మధ్యయుగాల భక్తకవులలో, గజల్ కవులలో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది. గాత్రము, సితార్ వాయిద్య సంగీతంలో శిక్షణ వల్ల కావచ్చు ఆయన కవితసాంతం సంప్రదాయ కవితా ప్రక్రియ విన్నపా లువలే రూపుదిద్దుకున్నది. మధ్యయుగాల భక్తకవుల కీర్తనలన్నీ దాదాపు విన్నపాలు. సంప్రదాయ సాహిత్యంలో తత్వా లు, వచనాలు వలే విన్నపాలు కూడా ఒక ప్రక్రియ. తెలంగాణ కవి కృష్ణమాచార్యుల వచనాల నుంచి భక్తరామదాసు వరకు రాసిన కీర్తనలు, సూఫీవాదులైన ఉర్దూ మహాకవుల గజళ్లు, నజవ్‌ులు, మర్షియాలు ఈ విన్నప ప్రక్రియకు చెందినవే. ఇది ఒకరకంగా ప్రపంచం నుంచి తన విముక్తికి కవి తనతో తాను మాట్లాడుకోవడం, నిరాకారుడై సర్వాంతర్యామితో విన్నవించుకోవడం. అయితే సిద్ధార్థ తన కవితతో చేసే విన్నపం లోకం తో, తన చుట్టూ ఉన్న మనుషులతో. నేటి కవులు గజల్ ప్రక్రియను స్వీకరించే నట్టే, మధ్యయుగ కవుల విన్నప ప్రక్రియను ఆధునిక సందర్భానికి సిద్ధార్థ అన్వయించడం కనిపిస్తుంది. కన్నడ వచనాలలో, గజల్‌లో ప్యారడాక్స్ అన్నది ప్రత్యేక లక్ష ణం. దానివల్ల పాఠకులకు చదివే కవిత సజీవంగా నిలిచి అనేక అర్థాలను స్ఫురిస్తుంది. సిద్ధార్థ కవితలో ప్యారడాక్స్ బలంగా ఉన్నది. నాస్టాలిజియా ఏమాత్రం లేకపోవడం విశేషం. కవికి పరిసరాలతో సజీవ సంబంధంలో ఉండవల్లే ఇది సాధ్యమైంది.

ఫ్రెంచ్ మహాకవి జాన్ ఆర్స్, లాటిన్ అమెరికన్ కవియిత్రి గాబ్రియెల్ మార్క్వెజ్‌లలో ఈ లక్షణం బలంగా ఉన్నది. దాదా పు వందేళ్ల క్రితం వెలువడిన కవితా రచన అది. చాలామంది ఆంగ్ల, ఫ్రెంచ్ కవులలో స్వీయ విధ్వంసక ప్రవృత్తి ఉండటం మామూలే. దానికి భిన్నంగా తూర్పు దేశాల సూఫీ,భక్తి కవిత వలే విలక్షణమైన అభివ్యక్తితో జాన్ ఆర్ప్, గాబ్రియెల్ ఎంతో పేరుగాంచారు. సిద్ధార్థకు ఈ కవుల సహా రూమి, హఫీజ్ సహా కవుల రచనలపై అధ్యయనం ఉన్నది. ఆధునిక తెలుగు కవుల లో సిద్ధార్థది విలక్షణమైన రీతి. బొమ్మలబాయితో పాటు మొదటి సంకలనం దీపశిలలో కూడ ఈ లక్షణం ఉన్నది.

నాటి హైదరాబాద్ కేంద్రంగా తలెత్తిన ఉద్యమేతర తెలంగాణ కవులలో అంతర్జాతీయ అధునాతన సర్రియలిస్టు కవితా ప్రయోగాలు చోటుచేసుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కవితోద్యమాల అధ్యయనం వల్ల కావచ్చు ఆధునిక కవితా రీతు లు సర్రియలిజం, ఫార్మలిజం, ఇమేజిజం తాలూకు ప్రయోగాలు సిద్ధార్థ కవిత్వంలో బలంగా ఉన్నాయి. దీనికంటే ముందే సిధారెడ్డి కవిత సంభాషణలో ఒక కవితలో సర్రయిలిస్టు ఛాయ ఉన్నదన్న పరిశీలనా ఉన్నది. తనచుట్టూ తీవ్రమైన సామాజిక సంక్షోభం, హింసాకాండ, యుద్ధ వాతావరణం ప్రబలినప్పుడు కవి నిస్సహాయుడైనప్పుడు, ఊహకందని వాస్తవా న్ని చెప్పడానికి ఆధునిక కవి సరికొత్తగా ఆవిష్కరించిన కళా కవితా ఉద్యమ భావనలవి. సిద్ధార్థ ఆక్రమంలోని వారే.

రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచి పారిస్ కేంద్రంగా తలెత్తిన ప్రక్రియ సర్రియలిజం. దీని ప్రధాతలంతా ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ అగ్రశ్రేణి నేతలే. ఆంద్రీబ్రితో పికాసో, లూయూ ఆరెగాన్, పాల్ ఎలార్డ్, సపాల్ట్ వాళ్లలో ముఖ్యులు. అంతెందుకు పోలీస్ యాక్షన్ దరిమిలా తెలంగాణ చవిచూసిన యుద్ధ వాతావరణంలో స్థానిక కవులు కాళోజీ, మఖ్దూం, బూర్గుల రంగానాథరావు, వెల్దుర్తి, దాశరథి, సినారె, సివి కృష్ణారావు, యశోదారెడ్డి, సుప్రసన్న, మాదిరాజు గొప్ప సర్రియలిస్టు కవిత రాశా రు. అభ్యుదయ కవితా యుగంలో శ్రీశ్రీ ఖడ్గసృష్టిలో చేరిన అనువాద కవితలన్నీ సర్రియలిస్టు కవులవే. వీళ్లంతా అభ్యుద య కవులు కావడం గమనించాలి. నాటి మనిషిని అతని ప్రతిస్పందలను, దుస్థితిని కవిత్వంలోకి తేవడంతో కళాత్మకంగా మారింది. తెలుగులో మాత్రం కేవీఆర్, చెలసాని వంటి రచయితలకు సర్రిలియలిస్టు పోకడలపై సదభిప్రాయం లేదు. సిద్ధార్థ కవితారీతి సర్రలియజాన్ని అనుసరించడం వల్ల చాలా విన్నూత్నంగాను కళాత్మకంగాను రూపుదిద్దుకున్నది. రెండు ప్రపంచయుద్ధాల మధ్య కవులంతా అటు గ్రామీణ జీవితం ఇటు నగర జీవితం మధ్య తలెత్తిన సంఘర్షణలోనే గొప్ప కవులుగా రూపుదిద్దుకున్నారు. వారి సంఘర్షణే అందుకు కారణం. సిద్ధార్థ కవిత కూడా అంతే.
-సామిడి జగన్‌రెడ్డి, 8500632551

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles