కలరు ప్రాచీన కవయిత్రులెందరో


Sun,May 5, 2019 11:12 PM

Matha

కవిత్వం, కథ, నవల, వ్యాసం, నాటకం, విమర్శ వంటి విభాగాలన్నింటిలోనూ తెలంగాణ స్త్రీ సాహిత్యాన్ని వింగడించి సమీక్ష చేసుకునే ప్రయత్నంలో పూర్వ కవయిత్రులను స్మరించుకుందాం.

అస్తిత్వ చైతన్యం విప్పారుతున్న క్రమంలో తెలంగాణ సాహిత్యం వెలుగుల నిర్మాణాలు చేసుకుంటున్నది. మరుగునపడిన మన ప్రాచీన సాహిత్యంలోని కవయిత్రులను తలుచుకుంటూ వాళ్ల కవన వైచిత్రిని తెలుసుకుంటూ తెలంగాణ కీర్తి పతాకనెగరేస్తున్నది. భిన్న సంస్కృతులు, భిన్న సామాజికవర్గాల స్త్రీలు తమదైన రచనా సామర్థ్యాన్ని వ్యక్తపరుస్తున్న ఈ తరుణం తెలంగాణ సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఇప్పుడు ప్రాచీన కవయిత్రులను స్మరించుకోవడం అంటేనే.. మనల్ని మనం మూలాల నుంచి మననం చేసుకోవడమన్నట్లు. ఇందు లో రెండు పార్శాలను చూడాలి. ఒకటి స్త్రీల అస్తిత్వం, రెండవ ది ప్రాంతీయ అస్తిత్వం. రెండింటిలో ప్రస్ఫుటించే సాహిత్యం వెనుక ఎంతటి సాధన ఉన్నదో గమనించుకోవడం.
నాటి గడ్డు కాలంలో, పురుష ప్రపంచపు ఆధిక్యతల్లో విద్య కు అవకాశాలులేక సాధారణ స్త్రీలు కూపస్థ మండూ కాలై బతికే ఉంటారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతితక్కువ స్త్రీలకు చదువుకునే అవకాశాలు ఉండి ఉంటాయి. అందులో రచనలు చేసినవారు మరీ తక్కువ ఉండి ఉంటారు. మనకు లభించినవి మరీతక్కువ. దొరికిన ఆధారాలను బట్టి చెప్పుకునేదే ఇది. ఇంకా విస్తృత పరిశోధనలు జరుగాల్సి ఉన్నది. కవిత్వం, కథ, నవల, వ్యాసం, నాటకం, విమర్శ వంటి విభాగాలన్నింటిలోనూ తెలంగాణ స్త్రీ సాహిత్యాన్ని వింగడించి సమీక్ష చేసుకునే ప్రయత్నం లో పూర్వ కవయిత్రులను స్మరించుకుందాం.

పనిచేస్తూ శ్రమను మరిచేందుకు పాటలు పాడుకున్న సాహి త్యం, ఇల్లాళ్ళ పాటలు, జానపదుల సాహిత్యమూ దొరకని కాలంలో కవిత్వంగా కనిపించిన కవయిత్రులు వీళ్ళు. ఓ పది సంఖ్యలోని కవయిత్రులు. ఏదో ప్రామాణికమైన రచన లేనిదే ఇది ఫలానావాళ్ళు రాశారు అని చెప్పలేని పరిస్థితి. వాళ్ళ పేర్లు సాహిత్య చరిత్రలో ఎక్కవు. ప్రజాజీవనంలోని మౌఖిక సాహిత్యం జానపద సాహిత్యంగా రావడానికి ప్రధాన కారణం ఇదే.
తెలంగాణ తొలి కవయిత్రిగా 13వ శతాబ్దపు కవయిత్రి కుప్పాంబిక పేరును చెప్పుకుంటున్నాం. కానీ, క్రీ.శ.1000 ప్రాంతంలో వేయించిన గూడూరు శాసనంలో లభించిన ఐదు పద్యాలను బట్టి, ఆ శాసనం వేయించిన విరియాల కామసాని అనే కవయిత్రి తెలంగాణ ప్రాచీన తొలి కవయిత్రిగా ప్రతిపాదనలోకి వచ్చింది. ఆ పద్యాలలోకి వెళ్తే..

చం: అనుపమ దుర్జయాన్వయ సుధాబ్ది ననేకులు రాజనందనుల్
సనిన బొరంటి వెన్నడను సంభవుడయ్యె కనతి ప్రసిద్ధుడై
వినుత విరోధి మండలికి వెన్నను వెన్నడువోలె వానికిన్
ఘనుడగు నెఱ్ఱ భపతి జగిద్విదితుండుదయించె గీర్తితోన్
ఉ: భావిత కీర్తి నాతనికి బాండవ మధ్యమ భీముడోయనన్
గా విరియాల భీమ నృప ఘస్మరుడై జనియించె వానికిన్
భూవినుతుండు మండలిక భాషణుడెఱ్ఱ నరేంద్రుడుత్తమ
శ్రీ వినుతుండ బంధుజన సేవ్యుడు దా వినుతించెనున్నతిన్

ఇట్లా సాగిన శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలున్నవి. అప్పటివరకు తెలుగులో వచనంలోనూ, దేశీఛందస్సులో దానశాసనాలు, విజయశాసనాలు ఉంటే, ఇట్లా వృత్త పద్యాలతో అలంకార ప్రయోగాలేగాని, చక్కని పదకూర్పులేగాని, వర్ణనలేగాని ఉన్నది ఈ గూడూరు విరియాల కామసాని శాసనమే. కాబట్టి ఈ పద్యాలు రాసిన కామసాని తప్పకుండా గొప్ప కవయిత్రి అని నిర్ధారిస్తున్నారు.ఈ పద్యాలు కావ్య రచనాశైలిలో ఉన్నాయి. పాండవ మధ్యమ భీముడోయనన్ అని విరియాల కామసాని తన భర్త విరియాల భీమభూపాలుని పరాక్రమాన్ని ఉత్ప్రేక్షాలంకారంలో వర్ణించింది. విరియాల కామసాని తన భర్త మరణానంతరం రాచకార్యానికి పూనుకొని, శత్రువినాశం చేసి, కాకతి బేతయను కాకతి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సందర్భంలో వేయబడిన ఈ శాసనాన్ని వేయించిన విరియాల కామసాని తెలంగాణలో మొదటి కవయిత్రి. తెలుగులో నన్నయకు పూర్వమే చక్కని కావ్యశైలిలో పద్యరచన చేసిన మొదటి కవయిత్రి అంటారు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి. పద్యాలలోని రచనాశైలిని గమనిస్తే చేయి తిరిగిన కవయిత్రి అని తెలిసిపోతున్నది.

క్రీ.శ.848లో పండరంగు వేయించిన అద్దంకి, కందుకూరు శాసనాలే తరువోజు, సీసపద్యాల్లో ఉన్నవి.తరువాత యుద్ధమల్లు శాసనంలో విజయాలను చెప్పేది -దేశీ ఛందస్సుల్లో ఉన్నది. క్రీ.శ. 935 నాటి ముదిగొండ చాళుక్యరాజు నిరవద్యు డు వేయించిన కొరవి శాసనం పూర్తి వచనంలో ఉన్నది. తర్వా త రాజు కవిని పిలిచి కావ్యమల్లమని చెప్పిన శాసనాలు వచనంలో ఉండి తెలుగు భాష సంపూర్ణ వికసనం చెందినట్లు తెలుపుతున్నవి. క్రీ.శ. 945లో కన్నడ ఆదికవి పంపకవి తమ్ముడు జినవల్లభుడు వేయించిన కరీంనగర్ జిల్లాలోని కుర్క్యాల శాసనంలో కంద పద్యాలు మూడు ఉన్న వి. ఇక నన్నయ మహా భారత రచనకు యాభై ఏళ్ళ పూర్వమే క్రీ.శ. వెయ్యిలో వేసిన ఈ విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం పద్యరచనతో ఉండి కొత్త జాడలు తెలుపుతున్నది.

తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాత కవయిత్రిగా పేరు పొందిన తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక 13వ శతాబ్దం తొలితెలుగు రామాయణమైన రంగనాథ రామాయణం రచించిన కవి గోనబుద్ధారెడ్డి పుత్రిక. కాకతీయులకు సామంతరాజైన మాల్యా ల గుండనాథుడి భార్య. ఈమె తనభర్త చనిపోయినప్పుడు 1276లో బూదపూర (బూత్‌పూర్) శాసనాన్ని వేయించడాన్ని బట్టి ఈమె కాలం 1230 అని నిర్ధారించారు చరిత్రకారులు. వీరి ఆస్థానంలో ఉద్దండుడైన కవి ఈశ్వర భట్టోపాధ్యాయుడు ఉండేవాడనీ తెలుస్తున్నది. రాజకుటుంబానికి చెందినది కావ టం వల్లా, కవి పండితుని కూతురుకావటంవల్లా కుప్పాంబిక గొప్ప కవయిత్రి అయ్యే అవకాశాలు కలిగి ఉండె. ఈమెను గురించి ఈమె తర్వాతి కాలం అయ్యలరాజు ప్రస్తావించిన ఒక పద్యం కుప్పాంబిక రచించిందని చెప్పడంతోటే ఈమె పేరు ముందుకు వచ్చింది.

వనజాతాంబకుడేయు సాయకముల్ వర్ణింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబురానీయద
త్యనురక్తిన్ మిము బోంట్లకున్ తెలుప నాహా! సిగ్గు మైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ!వాంఛల్ తుదల్ముట్టునే

ఈ పద్యభావాన్నే కాదు, పదాలకూర్పును, వర్ణననూ, శైలీరమ్యతను బట్టి చూస్తే ఈమె గొప్ప కవిత్వం రాసే ఉంటుందని తప్పక అనిపిస్తుంది. కానీ, ఈమె రాసిన కావ్యాలు, రచనలు ఏవీ దొరకడం లేదు. విరహ వేదనల వర్ణన, ప్రబంధకవుల శైలి అనిపించేలా ఉన్న ది. కవితనైపుణ్యాన్ని చూస్తే కావ్యరచయిత్రి అని చెప్పవచ్చు. తెలుగుసాహిత్యంలో గొప్ప కవయిత్రి కుప్పాంబిక అనవచ్చు.
రామాయణం రాసిన మొల్ల 16 శతాబ్దం, నెల్లూరు ప్రాంతీయురాలు అని పూర్వం చరిత్రకారులు చెప్పి ఉన్నారు. కాని ముఖ్యమైన మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకొని విమర్శనాత్మకంగా చూస్తే మొల్ల ఓరుగల్లు వాసి అనీ,13వ శతాబ్దం (క్రీ.శ.1350-1400) కవయిత్రి అని తెలుస్తుంది. కాకతీయ రాజుల అనంతర కాలం వాళ్ళు బమ్మెర పోతన, మొల్ల. ఏకశి లా నగరంలో నివసించిన మొల్ల తండ్రి వీరశైవుడు. శివభక్తి తత్పరుడు, గురులింగ జంగమార్చనపరుడు అనీ లోకప్రచారమైన విషయం. ఆమెది కుమ్మరి కులం అనీ తెలుస్తుంది. రామానుజుని ప్రశిష్యుల్లో ఒకరైన రామానందుడు అక్కడ రామభక్తి సంప్రదాయాలను ప్రబోధించడంతో పోతన వీర శైవతత్వం నుండి హరితత్వానికి వచ్చి ఉంటాడు. పోతనవలెనే మొల్లపై కూడా ఈ ప్రభావం పడటం రామాయణం రాయడానికి ఒక కార ణం. వీరశైవ కుటుంబంలో పుట్టింది కాబట్టే కుమ్మరి కులంలో పుట్టిన మొల్లకు విద్యాబుద్ధులు అలవడినా యి. వీరశైవంలో స్త్రీ జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు లేవు . మొల్ల రామాయణం అయోధ్యాపుర వర్ణనతో ఆరంభమైంది. అక్కడక్కడ ప్రబంధ వర్ణనలు వున్నాయి.అందుచేత మొల్ల ప్రబంధయుగానికి అంటే క్రీ. శ 16 వ శతాబ్దానికి చెందినదని అన్నారు.

కానీ తిక్కన, ఎర్రనలు కూడా పురవర్ణనలతో కావ్యారంభం చేశారు. ప్రబంధోచిత వర్ణనలు చేశారు. దాన్నిబట్టి మొల్ల రెండో ప్రతాపరుద్రుని కాలం నాటిదని చెప్పడానికి ఏమీ ఆటంకం ఉండకూడదు అని ముదిగంటి సుజాతారెడ్డి తమ తెలంగాణ సాహి త్య చరిత్రలో అంటూ మొల్ల తెలంగాణ కవయిత్రి అనడానికి కారణాలు చెప్పారు. పోతనలాగానే మొల్ల రామభక్తురాలు. ఇవన్నీ గమనిస్తుంటే చరిత్ర శిథిలాలను తొలిగిస్తే మరెన్ని నిజాలు బయటపడతాయో అనిపిస్తున్నది. మొల్ల రెండో ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నదని ప్రతాప చరిత్ర రాసిన ఏకామ్ర నాథుడూ అనడమూ గమనించవచ్చు. మధురా విజయం అనే కావ్యాన్ని రచించిన గంగాదేవి ఓరుగల్లు నివాసిని. ఈ కావ్యం సంస్కృతకావ్యం. అగస్త్యుడు అనే గొప్ప సంస్కృత కవి రెండో ప్రతాపరుద్రుని కాలంలోని కవి. ఇతని మేనల్లుడు విశ్వనాథుడు సంస్కృత కవి. ఇతని శిష్యురాలు గంగాదేవి. ఈమె 14వ శతాబ్దపు కవయిత్రి. కాకతీయుల ఆడబిడ్డ. విజయనగర రాజు బుక్కరాయల కోడలు. ఈమె భర్త కుమార కంపరాయలు. ఇతడి మధురానగర విజయాన్ని చారిత్రక కావ్యంగా మధురావిజయం రాసింది. ఈ కావ్యపీఠికలో పూర్వకవులతో బాటు తెలుగు కవియైన తిక్కననూ ప్రస్తుతించింది. మనుమసిద్ధి సాయం చేసిన కవి చాతుర్యపు మంత్రిత్వాన్ని స్వయంగా చూసే ఉంటుంది.
మరో కవయిత్రి మాచల్దేవి. క్రీడాభిరామంలో రెండో ప్రతాపరుద్రుని ప్రియురాలు, మాచల్దేవి విదుషీమణి అని అభివర్ణింపబడింది. నర్తకి అయిన ఆమె, కవిత్వంలోనూ నిపుణురాలై వుంటుంది. అందుకే క్రీడాభిరామ కర్త ఆమె పాండిత్యాన్ని గురించి వర్ణించాడు అంటారు సుజాతారెడ్డిగారు. ఈ ఐదుగురు- విరియాల కామసాని, కుప్పాంబిక,మొల్ల, గంగాదేవి, మాచల్దేవి వంటి కవయిత్రులు కాకుండా పూర్వ కవయిత్రుల విభాగంలో మరో నలుగురి పేర్లు తెలుస్తున్నవి. కాని ఆ కవయిత్రులకు ఈ కవయిత్రులకు మధ్య నాలుగు వందలయేళ్ళ కాలం ఉన్నది.1833 ప్రాంతం కవయిత్రి మహంతమ్మ పుత్రసంతాన ప్రాప్తికోసం తపిస్తుంది. కోరి మా మగవారు మీపై జెప్పిరీ బహుకవనముల్‌అంటూ ఆమె భర్తను, అతని సాహిత్య సేవనూ ప్రస్తావిస్తుంది. గోలకొండకవుల సంచికలోని హనుమంతమ్మ ఈ మహంతమ్మ. ఈమె రచనాశైలి సరళం. బసవని స్తోత్రంగా ఉన్న ఈ కవిత్వం హృద్యంగా ఉన్నది.

1847 ప్రాంతంలోని మరో ఇద్దరు కవయిత్రులు బిజినేపల్లి చెన్నక్రిష్ణమ్మ, తిరుమల బుక్కపట్నం కృష్ణమ్మలు తెలంగాణ వారు. బుక్కపట్నం కృష్ణమ్మ రచనలు తెలియడం లేదుగాని, బిజినేపల్లి చెన్న క్రిష్ణమ్మ కపిలదేవ హుతి సంవాద యక్షగానం, సత్యనారాయణ కథాకల్పం, బువ్వబంతి, పెండ్లి పాటలు రాసినట్లు తెలియవస్తున్నది.
ఇదే క్రమంలో రూప్ఖాన్ పేట రత్నదేశాయ్‌నీ చేర్చాలి. సురవరం ప్రతాపరెడ్డిగారు 1934లో తెచ్చిన గోల్కొండ కవుల సంచికలో ఈమె కవిత్వం ఉన్నది. అప్పటికే వీరు మరణించా రు. వారిది రంగారెడ్డి జిల్లా పరిగి. తాలూకా ఇప్పటూరు. ఈమె తోబాటు సంచికలో మరో తొమ్మిది మంది ఉన్నారు కానీ ఈ వ్యాస పరిమితి ఇంతవరకే గ్రహించడమైనది.
రూప్ఖాన్‌పేట రత్నదేశాయ్ గారు శ్రీ వేంకటేశ్వరుణ్ణి సంబోధిస్తూ కందపద్యాలు వ్రాశారు. అపరపాడిత్యం లేకున్నా దేవుని దయతో ఏదో రాస్త్తున్నామని, తప్పు ఎంచకండి, గౌరవించండనీ మగవాళ్ళతో మొరబెట్టుకుంటారు. ఆడవాళ్ళ పట్ల వాళ్ళ పాండిత్యంపట్ల చిన్న చూపొద్దు అనడాన్ని బట్టి చూస్తే ఆదేవుని మీద గురితోనైనా మమ్మల్ని లెక్కలోకి తీసుకోండి అంటూ వేదనగా రాసిన ఈ కవిత్వం చాలా ఆలోచనాత్మకంగా ఉన్నది. ఆమెను తెలంగాణ ప్రాచీన కవయిత్రులలో చివరి కవయిత్రిగా భావించవచ్చు. ఈమె అసలు పేరు పెనుగోళ్ళ రత్నమాంబ దేశా యి. శివకురువంజియక్షగానరచన చేసింది. తెలంగాణ నుండి కురవంజి రచన అంటే ఈమెదొక్కటే అంటారు. తొలి తెలంగాణ కవయిత్రి రత్నమాంబ అని సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన తదుపరి ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంకా ఎన్నెన్ని రత్నాలు వెలుగులు జూస్తాయో..!
- డాక్టర్ కొండపల్లి నీహారిణి,9866360082

1453
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles