సాహిత్యానికి సైవేద్యం -పద్యం!


Mon,April 22, 2019 01:15 AM

ప్రతి జాతీ తనదైన సంస్కృతివల్లనే ఇతర జాతులనుండి భిన్నంగా కనిపిస్తుంది. తరతరాల సామూహిక అనుభవసారంగా రూపొందిన ఆచరణల సంకలన మే సంస్కృతి. అయితే, కాల పరీక్షకు నిలిచి గెలిచిన ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు, కళారూపాలు, వాస్తుశిల్పనిర్మాణాలు, ఆహారఅలవాట్లు, భాష, పదాలు, వస్త్రధారణ రీతులు, రివాజులు అన్నీ కలిసి ఆ జాతికి ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని, విశిష్ట గుర్తింపును ఇస్తాయి.
అందుకే.. ఒక దేశం, లేదా జాతి యొక్క సంస్కృతి అంతా దేహమైతే, భాష ముఖం లాంటిదని పెద్దలు చెపుతారు. అలా, భాష, జాతి సామూహిక అభివ్యక్తి (collective expression) గా, ఒకే జాతి ప్రజల మధ్య ఏకత్వ స్ఫూర్తి (unifying factor)గా కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తూన్నది. తెలుగు భాష కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే భారతదేశంలో ఉన్న వందలాది లిపి ఉన్న, లిపి లేని భాషలలో, ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన తెలు గు భాష తనదైన విశిష్టత, ప్రత్యేకతలతో విరాజిల్లుతున్నది. అందులోనూ తెలంగాణ భాష మరింత ప్రత్యేకమై, ఉత్తర దక్షిణ భారత దేశాల సత్సంగమంగా భౌగోళికంగానే గాక, భాషాపరంగా కూడా అదే విశిష్టతను ప్రకటిస్తూ వస్తున్నది.

Padya-Telang
భాష సాహితీ ప్రక్రియ పరంగా తెలుగు భాషకు వన్నె తెచ్చి, పదారవిందానికి రాగాల సొబగులద్ది, వాక్య పారిజాతాలకు లయ మెరుపులు దిద్దిన విశిష్ట ప్రక్రియ పద్యం. భావ శార్దూలానికి చంపకమాలలల్లి, కథా మత్తేభానికి ఉత్పల మాలలుకట్టి, ఆటవెలదుల నర్తనలకు తేటగీతికలను అర్పించి, వయ్యారపు సీస పద్యాలకు ద్విపదల జడలనల్లి, కావ్య కన్యకను సర్వాంగ అలంకృత దేహిగా మలచిన శిల్పి పద్యం! ఉత్ప్రేక్షల ఆభరణాలను, ఉపమానాల గాజులను, రూపకాల వస్త్రాన్ని, భ్రాంతిమత్తుల మువ్వలను, అతిశయోక్తుల మేలిముసుగును కప్పి ఆ సర్వాంగ సుంద ర దేహిని సకల సౌందర్య రాశిగా తీర్చిదిద్దిన చిత్రకారిణి పద్యం!
పద్యం పాండిత్యానికి, భాషాసంపత్తికి, కొత్త సృజనలకి దారివేసింది. మనిషి భాషా నైపుణ్యాలను మరిం త పదును పెట్టించి, ఛందోనియమాల చట్రంలోంచి, చిత్రవిచిత్ర విశిష్ట ప్రయోగాల సృష్టికి ప్రేరకమైంది. పద్యం భాషను, సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జ్ఞానవైభవానికి నిలువుటద్దంలా మారింది. గానయోగ్యమై స్మరణమననాలను సులభతరం చేసిం ది.పండితపామర జనరంజకమై, ప్రజల నాల్కల మీద నడయాడింది. చివరికి పద్యం తెలుగు జాతి అస్తిత్వ కేతనంగా మారింది. తెలుగు సంస్కృతికే సొంతమైన విశిష్ట సాహితీ ప్రయోగంగా నిలిచింది!
పద్యం కావ్య రూపంలో మొదలైన 10వ శతాబ్దం నుంచి ఎన్నెన్నో మలుపులను, మెరుపులను, మరుపులను చవిచూస్తూ నేటికీ కొనసాగుతూ తెలుగు భాషా సంప్రదాయానికి పదహారణాల నిఖార్సయిన ఉదాహరణంగా గెలిచింది. తెలంగాణలో జరిగిన విస్తృ త సాహితీ సేద్యానికి ప్రాతిపదికగా నిలిచింది.

పద్య సాహితీ ప్రస్థానం తెలంగాణ కవుల సేవ:
పద్యసాహిత్యాన్ని ప్రభావితం చేయడంలో ఇతర తెలుగు ప్రాంతాల కన్నా తెలంగాణ కవులు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. అయితే గతంలో పూర్తిస్థాయి లో ఈ విషయం సాధికారికంగా నమోదై తగిన గుర్తింపును, ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కనుక శాస్త్రీయంగా, చారిత్రకంగా, సాహితీ ప్రక్రియ భాషా ప్రయోగాలపరంగా తెలంగాణ కవుల సేవను, పాత్రను పరిశీలించాలి. పద్య సాహితీ ప్రస్థానంలో తెలంగాణ కవుల సేవను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పద్యసాహితీ చరిత్రను నా అవగాహన మేరకు ఈ క్రింది దశలుగా విభజించాను. విమర్శావ్యాస సౌలభ్యం కోసం ఈ యుగ విభజన చేశాను.
యుగ విభజనకు ఈ అంశాలను ప్రాతిపదికగా స్వీకరించడమైనది. 1.లభించినమేరకు ఉన్న కవులు, కాలాదులు. 2.ఆయా కవులు సృజించిన విశేష ప్రక్రియలు, నూతన ప్రయోగాలు, ధోరణులు. 3.ప్రధాన కవులు, వారు నివసించిన కాలంలోని సమకాలీన రాజవంశాలు. అయితే ఈ యుగ విభజనపై ఇంకా లోతైన చర్చ జరగాలి. మరింత సమగ్రమైన, సర్వజనామోదమైన శాస్త్రీయమైన నిర్ధారణ జరగాలి.
పంపయుగం: తెలంగాణలో పద్యసాహిత్య ఆనవాళ్ళ పై చరిత్రను తవ్వుకుంటూ వెళితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తెలుగు భాష లిఖిత రూపం లో ఎంత ప్రాచీనతని కలిగి ఉన్నదో, తెలంగాణ ప్రాం తంలో పద్యసాహిత్యం అంతే ప్రాచీనతని కలిగి ఉంది. తెలుగులో ఇంతకాలం కీర్తిస్తూ వచ్చిన నన్నయ కన్నా దాదాపు వందేండ్ల ముందే తెలంగాణలో పూర్తి స్థాయి పద్యం వైభవోపేతంగా ఉంది. క్రీ.శ. 941 ప్రాంతంలో నివసించిన పంపకవి రాసిన జినేంద్ర పురాణంలోని ఈ సీస పద్యమే దానికి తార్కాణం.
హరినిలయంబును హరినిలయంబునువిషధరాఢ్యంబును విషధరాఢ్య / మప్సరోమయమును నప్సరోమయమునువన విలాసమును పావన విలాస/ మున్నత కరిశృంగ మున్నతి కరిశృంగ మిందు కాంత స్రవమిందు కాంత/ మురుకలనకులంబు నురుకలనకులంబునంశుకాంత ద్యోతి నాంశుకాంత..

మొనర నవశత సాహస్రయోజ నోన్న
తమును పదివేల యోజనాల మరుశ్రీవలము
గలిగి కనకాద్రికిన్నూటఁగలిగితనరి
ప్రధితమై యొప్పు మందర పర్వతంబు
వేములవాడ చాళుక్యుల ఆస్థాన కవిగా ఉండి, బోధ న్ ప్రాంతంలో సమాధి చెందిన పంపకవి పద్యం తాళపత్ర గ్రంథ రూపంలోనిదైతే, దానికన్నా ముందు పద్యకవిత్వం పర్వతశిలపై శాసనరూపంలో కూడా లభించింది. పంపకవి సోదరుడైన జినవల్లభుడు కరీంనగర్ జిల్లా కుర్క్యాల వద్ద వేసిన శాసనం తొలిసారిగా తెలుగు కంద పద్యాన్ని పరిచయం చేసింది.
దినకరు సరి వెల్గుదుమని
జినవల్లభు నొట్టు నెత్తు జిత కవి వనకున్
మనుజుల్ గలరే ధాత్రిన్
వినుతిచ్చుదుననియవృత్త విబుధ కవీంద్రుల్
చారిత్రకంగా ఇదే కాలంలో మరో కవి మల్లియరేచన పద్యకవిత్వాన్ని రాయడమే గాక కవి జనాశ్ర యం పేర పద్యలక్షణ గ్రంథాన్ని రాయడం విశేషం! ఈయన జినవల్లభుని మిత్రుడని తెలుస్తున్నది. రేచన రచనలపై సిపి బ్రౌన్ విస్తృత పరిశోధన చేయించడమే గాక, ఆయన పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించా డు. అంతటి ప్రాముఖ్యత వహించిన రేచన తనదైన శైలిలో పద్యానికి మరింత పాండిత్యాన్ని అందించడానికి అంత్య ప్రాసలతో అద్భుత ప్రయోగాలు చేశా డు.
దానికి ఈ పద్యం ఓ ఉదాహరణ..
జననుత భీమ తనూజా!
సున యార్పిత విభవ తేజ! సుభగమనోజా
వినుత విశిష్ట సమాజా
యననంత్య ప్రాసయగు నహర్పతి తేజా
11వ శతాబ్ది వేములవాడ భీమకవి తన సాహితీ ప్రతిభతో తెలుగు పద్యాన్ని సుసంపన్నం చేశాడు.
రామునమోఘబాణమును,
రాజశిఖామణి కంటి మంటయున్
దామర చూలి వ్రాతయును,
దారక విద్విషు ఘెరశక్తియున్
భీము గదా విజృంభణ,
ముపేంద్రుని చక్రము, వజ్రివజ్రమున్
వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తవోవునే?
తెలుగులో మొదటి నీతిశాస్త్ర గ్రంథ రచయిత రుద్రదేవుడు(1158-1195) పద్య ప్రక్రియలోనే ఈ కావ్యరచన చేసి పద్య సాహిత్య వస్తు విస్తృతికి దోహదం చేశాడు. ఆయన నీతి పద్యాలలో ఒక కంద పద్యం..
ఆపదలఁజెందు ప్రజలను
భూపతి మొదలిచ్చి మగుఁడ బ్రోవగఁ రాదా
జేపట్టి విడువ వలవదు
భూపతికిఁ గుటుంబమనగ భూమియె కాదే.

కాకతీయ సోమన యుగం: పద్యకవిత్వాన్ని కొత్తపుంతలు తొక్కించి ప్రజలభాషకు కావ్య గౌరవాన్ని తెచ్చి, తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రచించిన మహాకవి పాల్కురికి సోమన (1160-1240). పద్య సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలకు ఆద్యుడు. ద్విపద ప్రక్రియ సృష్టికర్త. సమాజాన్ని కావ్యంలో ప్రస్తుతించిన తొలి సాంఘిక కావ్యకర్తగా బసవపురాణం తో చరిత్రకెక్కాడు. ఇందులో కోడిపై రాసిన పద్యం, తెలంగాణ కవుల్లో ప్రాచీన కాలంలోనే ప్రకృతిజంతువుల స్వభావ పరిశీలనపై ఉన్న సమగ్రతకు అద్దం పట్టింది. పద్యానికి వర్ణన ఎంత అందాన్నిస్తుందో నిరూపించింది.
తొలికోడి కనువిచ్చి- నిలిచి మై
పెంచి జలజల రెక్కలు సడలించినీలి
గ్రుక్కున కాలార్చికంఠంబు విచ్చి-
ముక్కున నీఁకెలు చక్కొల్సి కడుపు
వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి-
కొక్కరోకుఱ్ఱని కూయక మున్న
భారతీయులందరికీ రామాయణం ఒక ప్రాతఃస్మరణీయ ఇతిహాసం అయితే, దానిని తెలుగులో తొలిసారి రచించిన తెలంగాణ కవి గోన బుద్ధారెడ్డి (క్రీ.శ. 12వ శతాబ్దం). సోమన పరిచయం చేసిన ద్విపదను ముందుకు తీస్కెళ్ళిన ఈ కావ్యంలో వాల్మీకి రామాయణంలో లేని ఎన్నో జనరంజక, జానపదకథలు చోటుచేసుకున్నాయి.రావణుని మరణ ఘట్టాన్ని వర్ణించిన తీరు అనన్యసామాన్యం.
రాఘవాస్త్రాక్షతరక్తాంబుధార,లోఫంబులై
పర్వనొరయుచు వచ్చి
కులిశధారాహతిఁ గుంభిని గూలు,
కులశైలమును బోలెఁ గూలే రావణుఁడు
ఆదైత్యభూరి దేహాతిపాతమున,
భూదేవి యప్పు డద్భుతముగాఁ గ్రుంగెఁ
గ్రుంగె శైలంబులు గ్రుంగె దిక్కరులు,
గ్రుంగె భుజంగంబు గ్రుంగెఁ గూర్మంబు.
ఇదే కాలంలో స్త్రీలు కూడా పద్యక్షేత్రాన్ని సుసంప న్నం చేయడం విశేషం. వారిలో అగ్రశ్రేణి సాహితీ మూర్తి కుప్పాంబిక (1230-1300). తెలుగు పద్య ప్రపంచంలో తొలి కవయిత్రి. కవితారచనలోనే గాక పద్య ప్రౌఢిమలో కూడా ఆమె అందెవేసిన చేయి అనడానికి ఈ మత్తేభం ఓ ఉదాహరణ.
వనజాతాంబకుడేయు
సాయకములన్ వర్ణింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు
మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా!
సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ!
వాంఛల్ తుదల్ముట్టునే.

రెండో ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న (1289-1323) కాలం తెలుగు పద్యానికి స్వర్ణయుగం. ఆయ న కవిపండిత పోషకుడే గాక, స్వయనా కవి. ఆయన ఆస్థానంలో విద్యాధనుడు, శాకల్యమల్లన, శరభాంకుడు, విశ్వనాథుడు వంటి కవులున్నారు.
పోతన యుగం: మహాకవి పోతన(1400-1470) కూడా పద్య సాహిత్యం భూమార్గం పట్టడంలో తనదైన సేవ చేశాడు. ఆయన భాగవత పద్యాలు ప్రజాదరణను పొంది ప్రజల నాల్కల మీద నడయాడాయి. పద్యం వారసత్వ సంపదగా మారింది. వీరభద్రవిజయంలో ఆయన రాసిన ఈ సీసపద్యం, ఆటవెలది పద్యాల్లో పదాలు భావాలు పరస్పరం ఎంత అనుసంధానమై సంచరించాయో తెలుస్తుంది.
సీ- పరమేష్ఠి సృష్టి లోపలి పురుషులకెల్ల దీపమై వెలుగు నీరూపు రూపు / అఖిలంబు నెందాక నందాక నందమై పృథుతరంభైన నీ బిరుదు బిరుదు..
ఆ.వె- శూలినైన దాపసులనైన బాధింతు గాలి నైన నెట్టి ఘనులనైన
గలదె నీదు పేర్మి ఘనత తక్కొరులకు నిన్ను బోల వశమె నిరుపమాంగ!
పోతన భాగవతంలో శబ్దక్రీడతో పద్యాన్ని కొత్తగా దర్శింపచేసాడు.హరిఅనే పదానికి ఉండే నానార్థాలను ఆధారం చేసుకొని చమత్కారం చేశాడు.
హరిసుతు బరిచారుగాగొని
హరిసుతు దునుమాడి పనిచె హరిపురమునకున్
హరి విభునకు హరిమధ్యను
హరి రాజ్య పదంబునిచ్చె హరి విక్రముడై.

ప్రబంధ యుగం: పద్య సాహిత్య ప్రస్థానంలో ఒక మహోన్నత ఘట్టం ప్రబంధం. ప్రబంధాలలోని అష్టాదశ వర్ణనలు, నవరస ప్రాధాన్యత, నాటకీయ శైలి, భాషాడంబరం పద్య సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. పిల్లలమర్రి పినవీరభద్రుడు (1450-1490)రాసిన శృంగార శాకుంతలంబలమైన ముద్ర వేసింది. నవరసాలలోని ఒక్కోరసానికి పట్టం కడుతూ మహాకావ్యసృజన చేయవచ్చు అని నిరూపించిన ఈ రచనలోని ఈ కావ్య పద్యం ఓ మెచ్చుతునక..
శృంగారము ముఖ్యం బగు
నంగియు నంగములుఁ దలఁప నవ్య రసములున్
సాంగ మగునేనిఁ డంకము
బంగారముతోడి యొఱ ప్రబంధము వొందున్
చాలామంది భాషావేత్తలు, సాహితీ చరిత్రకారులు వచనం వచ్చి పద్య సంప్రదాయాన్ని, ఛందోవిరచిత రచనలను వెనక్కు నెట్టిందని విశ్లేషించారు. ఇది నిజ మే అయినా, వచనంలో కావ్య రచన ఆధునిక పరిణా మం కాదు. 15వ శతాబ్దం నాటికే వచన రచన తెలంగాణలో విస్తారంగా వాడుకలోకి వచ్చింది. దానికి ఏకామ్రనాధుడి(1450-1550)ప్రతాపరుద్ర చరిత్రము ఉదాహరణ. కాకతీయ రాజుల చరిత్రను, విశేషాలను అందించిన ఈ తొలి తెలుగు చారిత్రక కావ్యం వచనం లో కొనసాగి పద్య సంప్రదాయానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. కాకతీయ రాజుల వంశక్రమా న్ని వివరించే ఈ వచనాన్ని చూస్తే దాని శైలిలోని సరళత అవగతం అవుతుంది..
గుండమరాజు వివాహంబుఁజేసికొని యొక్క సుతుఁని గని యెరుకు దేవరాజు అని పేరు పెట్టెను. తదనంతరం బాగుండమరాజు డెబ్బది సంవత్సరంబులు రాజ్యంబు పాలించి యన్ని దిక్కుల యప్పనంబుల గైకొని యెరుకు దేవరాజును ట్టాభిషిక్తుంగావించి తాను శివలోకంబున కరిగెను.ఎరుకు దేవరాజు బాలుం డగుటం జేసి యతని మేనత్త కుంతలి రాజ్యంబు జేసె ను.. నవవర్షంబులు రాజ్యంబు జేసి యెరుకు దేవరాజుకు రాజ్యభారంబంతయు నప్పగించి తాను శివలోకంబున కరిగెను...
తెలంగాణ పద్యకవిత్వంలోకి వచనం వచ్చిన తర్వా త, పద్యం ప్రజలందరికీ చేరువకావడానికి భాషాపరంగా, పదాలపరంగా సరళత్వాన్ని సంతరించుకోవలసి వచ్చింది. తేటతెలుగుకు పట్టం కడుతూ పద్యం కొత్తరూపును పొందిన స్థితికి నిదర్శనం కొరవిగోపరాజు (1470ప్రాంతం)సింహాసన ద్వాత్రింశిక. ఇదే విషయాన్ని ఈ చంపకమాల పద్యంలో చెప్పిన తీరు పద్యపరిణామానికి తార్కాణం.
తెనుఁగన దేటగాఁ గథలు
దెల్పినఁ గావ్యము పొందు లేదు మె
త్తన పసచాల దండ్రు విశదంబుగ
సంస్మ్కతశబ్ద మూఁదఁజె
ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు
వీనులఁ గావునన్ రుచుల్
దనరఁ దెనుంగుదేశియును
దద్భవముం గలయుంగఁ జెప్పెదన్.

పద్య సాహిత్యం పురుడు పోసుకున్నదే మహా భారతంలోంచి. అందుకే మహాభారతాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రీకృష్ణార్జున యుద్ధం ప్రధానాంశంగా చరిగొండ ధర్మన్న (1480-1530) ఒక ప్రయోగం చేశారు. అదే చిత్ర భారతం. ఈయన ప్రబంధ యుగపు తొలికవి. తొలి శతావధాని కూడా.ఈ కావ్యానికి ప్రాణమనదగిన పద్యాన్ని అర్జునుని ప్రతిజ్ఞలా ఇలా వివరించారు..
మనుజాధీశులఁ జెప్పనేల
సకలామర్త్యుల్ దగన్ రేఁచి వ
చ్చిన శ్రీకృష్ణుని పాదమాన
నినురిక్షింతున్ భయంబేది న
మ్ము నరేంద్రా! విను మత్ప్రతిజ్ఞ
భువనంబుల్ సాక్షిగాఁ గావకుం
డిన మన్మూర్ధము నాదు నిష్ఠుర
కృపాణింద్రెంచుకొందు న్వడిన్.
ఇలా నాటి పద్యాల్లో తెలుగు భాషాసారాన్ని, సౌం దర్యాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు.
-మామిడి హరికృష్ణ,8008005231
(ఇంకా వుంది.. )

1. పూర్వ పంప యుగం (9వ శతాబ్ది పూర్వ శాసనయుగం)
2. పంప యుగం (9-10వ శతాబ్ది)
3. కాకతీయ సోమన యుగం (11-12వ శతాబ్ది)
4. పురాణ యుగం (13వ శతాబ్దం)
5. పోతన యుగం (14వ శతాబ్దం)
6. ప్రబంధ యుగం (15-16 శతాబ్దం)
7. కుతూబ్‌షాహీల యుగం (16-17వ శతాబ్దం తొలి భాగం)
8. ఆసఫ్ జాహీలుసంస్థానాల యుగం (17వ శతాబ్దపు మలిభాగం 19వ శతాబ్దం తొలిభాగం)
9. ఆధునిక యుగం (19వ శతాబ్దపు మలి భాగం నుంచి ప్రస్తు తం)
Padya-Telang1
పురాణ యుగం: పురాణాలను తెలుగు ప్రజల కోసం తొలిసారిగా అనువాదం చేసిన కవి మారన (13వ శతాబ్దం). ఆయన అనువాదం చేసిన మార్కండేయ పురాణం ఆ తర్వాత పద్యరచనలో ప్రబంధ ప్రక్రియకు ఆధారమై నిలిచి, అల్లసాని పెద్దనవంటి వారికి స్ఫూర్తినిచ్చింది. ఈ కావ్యంలోని హరిశ్చంద్రో పాఖ్యానంలోని ఈ ఉత్పలమాల పద్యం మారన పద చమత్కారానికి, పాండితీ ప్రకర్షకు ఓ మచ్చుతునక.

ఆ నగుమోముచెన్ను శశియందును
బంకరుహంబునందు లే
దానయనప్రభాతి మదనాస్త్రములందు
మెఱుంగులందు లే
దానునమేనికాంతి లతికావలియందుఁ
బసిండియందు లే
దానలినాయతాక్షి లలితాకృతి
నామదిఁ బాయ నేర్చునే?
పద్యసాహిత్యంలో చక్కని ప్రక్రియ చంపూ. ఈ ప్రక్రియలో తొలిసారిగా వచ్చిన కావ్యం భాస్కర రామాయణం. ఈ కావ్యం ప్రక్రియ పరంగానే గాక, దీన్ని రాసిన కవుల పరంగా కూడా ప్రత్యేకతను సాధించింది. తెలుగు సాహిత్యంలో ముగ్గురు కవు లు రాసిన ఒకే కావ్యం శ్రీమహాభారతం (నన్నయ, తిక్కన, ఎర్రన) కాగా, ఈ భాస్కరరామాయణం నలుగురు కవుల చేత పూర్తి చేయబడింది. హుళక్కి భాస్కరుడు (13వ శతాబ్దం), మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు, అయ్యలార్యుడు రామాయణంలోని వేర్వేరు ఖండాలను వేర్వేరు కాలాల్లో అనువదించి పూర్తి చేశారు. ఈ కావ్యం పద్యకవితా ప్రస్థానంలో ఓ మైలురాయి అని చెప్పడానికి ఈ శార్దూల పద్యం ఓ ఉదాహరణ.
ధీరోదారుఁడు నిర్వికారుడు
జగద్వీరుండు సౌజన్యవి
స్తారుం డుత్తమశీలుఁ
డర్కకులనిస్తారుండు శూరుండు గం
భీరుం డిద్ధవిచారసారుఁ డగుటం
బెంపార విశ్వంభరా
భారం బెల్ల భరింప రాఘవు
మహాభాగున్ నియోగించెదన్.
సాహిత్యంలో విస్తారంగా జనాదరణ చూరగొన్న ప్రముఖ ప్రక్రియ సంకలనం. పద్యకవితా ప్రస్థానంలో తొలి సంకలన గ్రంథాన్ని కూర్చిన ఘనత మడికి సింగనదే (14వ శతాబ్దం). అదే సకలనీతి సమ్మతం. చరిత్రకు ఎక్కని ఎంతో మంది కవుల వివరాలు ఈ సంకలనం ద్వారా తెలుస్తున్నాయి. ఈ సంకలనంతో పాటు ఆయన పద్మపురాణం కావ్యా న్ని రాశాడు. దీనిలోని ఈ చంపకమాల పద్యం శృంగార రసాన్ని సమున్నతంగా వ్యక్తీకరించింది.
తడిసిన చీర పెందొడల
దార్కొన లోజిగి చౌకలింపగా
బడువగు కౌనుదీగె కుచభారమున
న్వెడ వ్రాల వెన్నడిన్
దొడవగు వేణియం దురలి
తోరపు దీర్థపు బిందు లొప్పగా
నడుగుల కాంతికిం దలిరుటాకుల
యందము డిందజేయగాన్.

పద్యంలో వస్తువుతోపాటు, శిల్పం, శైలి కూడా ప్రధానమే. దీనిని ప్రాచీన కాలంలోనే గమనించిన కవులలో గౌరన (1380-1450) కూడా ఒకరు. ఆయన రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం తెలిసిన కథే అయినా శైలి సరళంగా, సుందరంగా, ధారాళంగా ఉండి పద్యాన్ని మరింత సుసంపన్నం చేసింది.
మందార మంజరీ మంజు మరంద
నందదిందిందిర నందనారామ
కమనీయ వికసిత కనకారవింద
కమలినీ తతులు లతాగార లతాంత
రచిత శయ్యాతల రతి రయగళిత
కచభర సురపుర గణికా కపోల
కవిత ఘర్మోదక కణగణ మిళిత
మలయ సమీర కోమల కంపితాగ్ర
మహిత చిత్రధ్వజ మాలా సహస్ర
సహిత చింతామణీ సౌధ పాళికల
ఈ పద్యాన్ని చూస్తే పదవిన్యాసం, శబ్దధారాళత ఎంత లయాత్మకంగా ఉందో తేటతెల్లమవుతుంది.

194
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles