అక్షరానికి భావుకత


Mon,April 15, 2019 12:32 AM

వాక్యాలకు ప్రాణం పోస్తూ సాగే కవితలే నాన్న పచ్చి అబద్ధాల కోరుగా పుస్తక రూపంలో ఒదిగి సమాజానికి జవసత్వాలు ఇస్తున్నాయి. తనలో ఉబికి వస్తున్న భావాలను, ప్రశ్నలను సమాజంపై సంధించడానికి ఈ కవి మనసును తడి చేసే అంతర్లీన వేదనను ఆయుధంగా ఎన్నుకున్నాడు.
surendra-rodda
కవితా సంపుటి శీర్షికలోనే కవిత్వ నిర్మాణ పద్ధతులలో ఒకటైన అల్లిగొరిని సృష్టించి పాఠకుడి ఇంద్రియాలను మేల్కొలిపేలా చేయడమే గాక, ఆదిలోనే నోస్టాల్జియానూ మోసుకొచ్చిన పుస్తకం..కవి సురేంద్ర రొడ్డ రచించిన నాన్న పచ్చి అబద్ధాల కోరు. మానవత్వ విలువలతో సాగుతూ సమాజహిత భావాలను అక్షరాలుగా మలుస్తూ సాగిన కవితలు ఈ సంపుటి నిండా భావానుభూతులై,మానవీయ పరిమళాలై జీవాన్ని నింపుకున్నాయి. సామాజిక స్థితిగతులకు వర్తమాన పోకడలను అనుసంధానం చేస్తూ, పాఠకుడికి చదువుతున్నంత సేపు ఆయా సన్నివేశాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగించే విధంగా ఈ కవితల నిర్మాణం సాగింది. చక్కని ఇమేజరీతో సాగిన కవితలు పాఠకుడిని లోతుగా కదిలించడమే కాదు, ఎక్కువకాలం ఆయా కవితలు మనసుల్లో ముద్ర వేయడానికి కారణమవుతాయి. అటువంటి ఇమేజ రీ ఈ సంపుటిలోని ఎన్నో కవితలకు బలాన్ని చేకూర్చిం ది. అల్లిగొరి ప్రక్రియ ఈ కవితల్లో బలంగా ఉంది. ఇది కవితా సామర్థాన్ని పెంచడమే గాక,పాఠకుడికి ప్రశ్నలను సంధిస్తూ ఆలోచింపజేస్తుంది. కవిత్వం ఉద్దేశం కూడా అదే. కవిత్వానికి నూతనత్వాన్ని జోడించే మెటాఫర్, సిమిలి లను సందర్భోచితంగా ప్రయోగించారు కవి సురేంద్ర. ఇవి కవిత్వాన్ని కాలంతో పాటు ఎక్కువకాలం నిలబెట్టేలా చేస్తా యి. నిజానికి ఈ పుస్తక శీర్షిక ఆత్మ మొదటి కవితలో ఉం టే, ఈ కవి ఆత్మ నిరంతర ప్రేమికులు అన్న కవితలో ఉం ది. ప్రతి ప్రేమికుడూ కవి కాకపోవచ్చు,కానీ ప్రతి కవీ ప్రేమికుడే అంటూ మట్టిని మానును, నింగిని నేలను, వీచే చిరు గాలిని, కదిలే చిగురుటాకు పాటనూ, నిశిని నక్షత్రాన్ని,అక్షరాన్ని భావుకతను,మనుషులను సకల ప్రాణులను వెరసి అనంత విశ్వాన్ని ప్రేమించు వారే కవులు అంటారీ కవి.

పై వాక్యాలకు ప్రాణం పోస్తూ సాగే కవితలే నాన్న పచ్చి అబద్ధాల కోరుగా పుస్తక రూపంలో ఒదిగి సమాజానికి జవసత్వాలు ఇస్తున్నాయి. తనలో ఉబికి వస్తున్న భావాలను, ప్రశ్నలను సమాజంపై సంధించడానికి ఈ కవి మనసును తడి చేసే అంతర్లీన వేదనను ఆయుధంగా ఎన్నుకున్నాడు. ఒక అలౌకిక వేదనను, అంతర్మథనాన్ని పాఠకుడి మనసు లో సృష్టిస్తూ మానసిక సంఘర్షణకు గురిచేసేలా ఇందలి కవితలు సాగాయి. నాన్న పచ్చి అబద్ధాల కోరు కవిత అణువణువునా ఆర్ద్రత నిండిన నాస్టాల్జియా. ఈ కవిత ఆసాంతం చక్కని ఇమేజరీతో సాగి, పాఠకుడిని తమదైన బాల్యంలోకి తీసుకెళ్లి చక్కని అనుభూతిని పొందేలా సాగింది. ఈ కవితలో ఎన్నో వాక్యాలు పైన ఒక అర్థాన్ని, లోన మరో అర్థాన్ని ధ్వనింపజేస్తూ అల్లిగొరి శైలిని సృష్టించడమే గాక, నిజంగా నాన్న పచ్చి అబద్ధాల కోరే అన్న శీర్షికకు బలాన్ని చేకూర్చే లా సాగిందీ కవిత. ఈ కవితలో కొత్త చెప్పులు నన్ను కొరుకుతున్నాయి వంటి వాక్యాలు నూతన అభివ్యక్తిని మోసుకొచ్చాయి. ఒక కవితకు నిర్మాణ పద్ధతులు ఎంత ముఖ్య మో ప్రారంభ ఎత్తుగడ,ముగింపు అంతే కీలకం. అమ్మకు చెప్పకురా కవితలో ని ఎత్తుగడ కవిత కు బలాన్ని ఇచ్చింది. ఇటువంటి ఎత్తుగడ లు పాఠకుడికి చదవాలన్న ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ కవితలో నేటి మానవత్వ విలువలను ప్రశ్నిస్తూ, ముడుతలు పడుతున్న వయసులో దిక్కులు వదిలేసిన దగాపడ్డ ముసలి ప్రాణాలు చిత్రీకరించబడ్డాయి. టెక్నికల్ టూర్లంటే వేసెక్టమీ చేయించా అన్న వాక్యంలో వేసెక్టమీ లోతైన భావాన్ని సింబలైజ్ చేస్తూ, పిల్లల ఆనందం సంతోషం కోసం తల్లిదండ్రుల ఆనందాలను అవసరాలను త్యాగం చేయడానికి ప్రతీకగా ఈ పదం నిలచింది. అమ్మ కోక కవితలో అమ్మ కొంగుకు వాడిన ప్రతీకలు కవితకు బలాన్నిచ్చాయి.అర్ధాంగి కవితలో గుర్తింపు,ప్రేమకు నోచుకోని స్త్రీ బాధ చక్కని ఇమేజరీతో ఆర్ద్రంగా పలికింది.

ఇరిగిపోకే కన్నీటి చుక్కా కవితలో ద్వంద్వార్థాలను పలికిస్తూ కవితను హృద్యంగా మలిచారు కవి. మరో కూలీ కవితలో సూర్యుణ్ణి పటంతో పోల్చడం నూతనంగా ఉన్న ది. కలలు ఎరుగని కనురెప్పల పరదాలు నిను కానక ఎన్ని కన్నీటి మేఘాలయ్యాయో అనడం నూతన అభివ్యక్తి. జ్ఞాపకంకవితలో నీలి మేఘాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో పోల్చ డం మంచి సిమిలి. వచనం నుంచి కవిత్వాన్ని వేరు చేసేది ఇటువంటి ప్రయోగాలే,కవితా నిర్మాణ పద్ధతులే. మరో కవితలో కరిగిపోతున్న క్షణాలను కోనేటి నీటి చుక్కలతో పోల్చడం చక్కని సిమిలి. కవిత్వానికి వన్నె తెచ్చే ఇటువంటి పోలికలు ప్రయోగించడం అవసరం. నిజమైన నేస్తం కవితలో ఎవరి ఊహ ఊపిరై జంటగా నడుస్తుందో అనడం చక్కని అభివ్యక్తి. ఇక్కడ ఊపిరి తనలో సంలీనమైన ఆత్మదైతే, దేహం తనది. మరో కవితలో కన్నీటి సుడు లు మధ్య నన్ను కాగితపు పడవను చేసి దాటిపోయిన బం ధాల సాక్షిగా అన్న పదాలు లోతైన అర్థబలాన్ని మోసుకొచ్చాయి. తనను తాను కాగితపు పడవగా అభివర్ణించడం మంచి మెటాఫర్. అమ్మ మనసు కవితలో అన్ని ఉడిగిన ఈ కాయంలో చెవుడెందుకు రాలేదో అన్న వాక్య ప్రయో గం ఎన్నో ప్రశ్నలను తట్టి లేపుతుంది. మగాడు కవితలో నాన్నను క్రమశిక్షణ కోసం కటువుగా నటించే మహానటుడుగా చిత్రీకరించి, పరోక్షంగా గరళాన్ని నింపుకున్న శివుడి స్థానాన్ని తండ్రికి కట్టబెట్టారు కవి. ఇలా ఈ సంపుటిలోని కవితలు మానవత్వ విలువలను, సమాజహిత భావాలను మోసుకొచ్చి ఉపయుక్తంగా ఉన్నాయి. సాహితీక్షేత్రంలో నిరంతరంగా తలమునకలై వృత్తితో సమానంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ అక్షర సేద్యం చేస్తున్న కవి సురేం ద్ర రొడ్డ గారికి అభినందనలు. తన అక్షర భావ ప్రవాహం లో మరెన్నో సాహిత్య సుగంధ పరిమళాలు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ..

- పరవస్తు, 83283 84951

295
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles