తెలంగాణ కవిత్వ అంతరంగం


Mon,April 15, 2019 12:31 AM

నరసింహారెడ్డి ఆధునిక కవిత్వాన్ని లోతుగా చదివినట్టు ఒకటి రెండు వ్యాసాల్ని నివేదించినపుడు స్పష్టపడుతుంది. పలువురు కవులు రచించిన కవితా సంకలనాన్ని సమీక్షిస్తూ వ్యాస రచన చేస్తున్న క్రమంలో అధ్యయన నేపథ్యం మనకు అర్థమవుతుం ది. అమ్మంగి వేణుగోపాల్ గంధం చెట్టు సమీక్షలో అమ్మంగి కవిత ప్రభావాలూ ముద్రలూ లేనిది అన్న మాట, ఒంకర టింకర తొవ్వల్లో ఒంటరిగానే సీతారాం అన్న వ్యాసంలో సీతారాం కవిత్వం వ్యాఖ్యానానికి ఒదిగేది తక్కువ, అనుభవానికి అందుతుంది అనే వ్యాఖ్య ఆయా కవుల రచనల్ని హృద యంతో చదివినపుడు మాత్రమే చేయగలిగేవి! ఇంకా ఇటువంటివి అంతరంగంలో ఎన్నో ఉన్నాయి.

కవులు సాహిత్య విమర్శలోనూ రాణించడం ఆధునిక యుగంలో కనిపించే ఉత్తమ సంప్రదాయాలలో ఒకటి. ప్రసిద్ధ ఆంగ్ల సాహితీవేత్త టి.ఎస్. ఇలియట్ కవిగా శిఖర సమానుడు. విమర్శకుడిగానూ ఆయన అభిప్రాయాలకు ప్రపంచవ్యాప్తంగా మన్నన ఉన్నది. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దువ్వూరి రామిరెడ్డి, మధు నా పంతుల, ఇంద్రగంటి, పుట్టపర్తి, సుప్రసన్న, మాదిరాజు ఇట్లా ఎంతోమంది ప్రతిభావంతులు కవితా సృజనలో, విమర్శ విశ్లేషణల్లో రాణించారు. ఇటువంటి కవి విమర్శక శ్రేణిలోని మరొక సహృదయ అధ్యయనశీలి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. ఇదివరకే ఆయన వైవిధ్యభరిత వచన కవిత్వంతో, జీవితా న్ని కాచి వడబోసిన రుబాయీలతో తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. నరసింహారెడ్డి విమర్శావ్యాసాలు అంతరంగం పేరుతో వచ్చాయి. ఈ వ్యాస సంకలనం ప్రధానంగా కవిత్వ విమర్శ. అంతరంగం ఆధునిక (తెలంగాణ) కవిత్వపు అంతరంగాన్ని సహృదయ కోణంతో విశ్లేషించింది. పరిచయపత్రం వంటి ముందు మాటలో ఎం. నారాయణ శర్మ అన్నట్టు సహృ దయత, పరిశీలన, అధ్యయన వైశాల్యం విమర్శకులకు అవసరమైన అంశాలు. ఇవన్నీ నరసింహారెడ్డి అంతరంగంలో కనబడతాయి. కవిలో సహజంగా ఉండే మృదువైన అభివ్యక్తీకరణ, సాటి కవుల పట్ల సహానుభూతి తదితర లక్షణాన్ని వ్యాసాల్లో స్థూలంగా గుర్తించవచ్చు. మొత్తం 26 వ్యాసాల సంపుటి ఇది. మహాకవి దాశరథి కవిత్వంతో ఆరంభమైన అంతరంగం సుం కిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వ విశ్లేషణతో ముక్తాయింపును పొం దింది. ఈ వ్యాసాల్లో కొన్ని సాహిత్య పత్రికల కోసం రాసినవి, మరికొన్ని ప్రత్యేక సందర్భాలలో వివిధ సంచికల కోసం రాసినవి, రెండుమూడు పుస్తక సమీక్షలూ ఉన్నాయి. కొన్ని సంక్షిప్త వ్యాసాలైతే మరికొన్ని సుదీర్ఘంగానూ విస్తరించాయి.

ఏనుగు నరసింహారెడ్డి వచనంలో ఎక్కడా అస్పష్టత ఉండదు. తనదైన అధ్యయనం ద్వారా అవగాహనలోకి వచ్చిన అంశాల ను క్రమరీతిలో పేర్కొనడం అన్ని వ్యాసాల్లోనూ కనిపిస్తుంది. సాహిత్యాభిమానానికి గందరగోళాన్ని కలిగించే మేధో ప్రకటన లు ఎక్కడా కనిపించవు. విశ్లేషణలు కొత్తదనంతో ఉండటం ఆసక్తిని పెంచుతాయి. దాశరథి వచన కవిత- వస్తువు, శిల్పం అన్న తొలి వ్యాసం పైన పేర్కొన్న లక్షణాలకు ప్రతిరూపం. ఇం దులో నరసింహారెడ్డి ప్రకటించిన అభిప్రాయాలతో సాహితీ లోకం దాదాపు ఏకీభవిస్తుంది. దాశరథి వచన కవితను ప్రారం భించి గేయంలోకి జారిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో తన కవిత్వంలో ఆవేశం స్థానంలో ఆలోచన ప్రవేశించింది. ఎక్కడా వాచ్యంగా మార్క్సిస్టు పడికట్టు పదాలను వాడకుండా ఘర్షణ స్ఫురించే విధంగా కవిత్వం చెబుతాడు. దాశరథి కవిత్వానికి నిజమైన అలంకారం సూటిదనం వంటి వ్యాఖ్యలు సునిశితమైనవే. అంతేకాదు దాశరథి కుందుర్తి కంటే బలమైన వచన కవిత్వం రాశాడన్నది నరసింహారెడ్డి అభిప్రాయం. తరచి చూసినపుడు ఆ అభిప్రాయం సరియైనదేనని అర్థమవుతుంది. కుందుర్తి రచనల్లో సింహభాగం వచన కవిత్వమే. దాశరథి పద్య -గేయ ప్రక్రియల తర్వాత మాత్రమే వచన కవిత్వంవైపు దృష్టి పెట్టారు. దాశరథి వస్తువు ప్రజలది, శిల్పం ఆయనది. ఆయన కవిత్వం తెలంగాణ మట్టిది అన్న నరసింహారెడ్డి వాక్యం దాశర థి వ్యక్తిత్వ ప్రతిభావిశేషాలను గురించి చెప్పే గొప్ప నిర్వచనం. సదాశివ కవిత్వం-సంప్రదాయ ముద్ర అన్న వ్యాసంలోని సూత్రీకరణలు సముచితమైనవి. ఇందుకు తర్కం సరిగ్గా సమకూరింది. సదాశివ ఏ భావజాలానికీ చెందిన వారు కారనీ, ఉద్యమాలు,సంఘర్షణలకు దూరంగా తనదైన సాహిత్య లోకం లో గొప్ప రచనలు చేసిన స్వతంత్ర వ్యక్తిత్వమున్న వారిలో ఉన్నతులని నరసింహారెడ్డి అభిప్రాయం.

ఇవి వాస్తవానికి సాధారణ వివరణలే. కానీ సామల సదాశివ కవిత్వంలో బలమైన సంప్రదాయ ప్రభావం ఉంది. ఆయన తొలిరోజుల్లో శతకం రాశారు. ఇది తెలుగు కవుల సంప్రదాయం. సదాశివ కావ్యవస్తువులన్నీ ప్రసిద్ధ గ్రంథాల నుంచి స్వీకరించిన మూలకథలే అన్నవి నరసింహారెడ్డి నవీన వ్యాఖ్యలు. నరసింహారెడ్డి ఆధునిక కవిత్వాన్ని లోతుగా చదివినట్టు ఒకటి రెండు వ్యాసాల్ని నివేదించినపుడు స్పష్టపడుతుంది. పలువురు కవులు రచించిన కవితా సంకలనాన్ని సమీక్షిస్తూ వ్యాస రచన చేస్తున్న క్రమంలో అధ్యయన నేపథ్యం మనకు అర్థమవుతుం ది. అమ్మంగి వేణుగోపాల్ గంధం చెట్టు సమీక్షలో అమ్మంగి కవిత ప్రభావాలూ ముద్రలూ లేనిది అన్న మాట, ఒంకర టింకర తొవ్వల్లో ఒంటరిగానే సీతారాం అన్న వ్యాసంలో సీతారాం కవిత్వం వ్యాఖ్యానానికి ఒదిగేది తక్కువ, అనుభవానికి అందుతుంది అనే వ్యాఖ్య ఆయా కవుల రచనల్ని హృద యంతో చదివినపుడు మాత్రమే చేయగలిగేవి! ఇంకా ఇటువంటివి అంతరంగంలో ఎన్నో ఉన్నాయి. నందిని సిధారెడ్డి ఇక్కడి చెట్లగాలి- తెలంగాణ దృక్పథం- అస్తి త్వంఅన్న వ్యాసం విలక్షణమైంది. సిధారెడ్డి కవిత్వాంతరంగా న్ని వ్యాసం సుస్పష్టంగా పరిచయం చేసింది. అభివ్యక్తిలో ఆయ న ప్రత్యేకతల్ని నరసింహారెడ్డి సరిగ్గా గుర్తించారు. ఆయన ఇట్లా ఇక్కడి చెట్ల గాలిని విశ్లేషించారు. 2014 జనవరిలో ఇక్కడి చెట్లగాలి ప్రచురించబడ్డది. ఈ సంకలనం తెలంగాణ ఆకాంక్షకు, అనుమానాలకు, అవమానాలకు అద్దం పట్టింది. రకరకాలుగా మలుపులు తిరుగుతున్న కేంద్ర, రాష్ట్ర రాజకీయాలవల్ల ప్రజానీకం తల్లడిల్లిన తీరును చూసి చలించి రాసిన కవిత్వం ఇది. ఇదే వస్తువుపై తెలంగాణ కవులందరూ రాసినప్పటికీ సిధారెడ్డి సాధించిన స్పష్టత ఎవరూ సాధించలేదు. స్పష్టతే ఆయన కవిత్వ లక్షణంగా చెప్పుకోవచ్చు.అల్పాక్షరాలలో అనల్పార్థ సాధకుడైన ఆధునిక కవి సిధారెడ్డి. వస్తువుకూ శిల్పానికీ మధ్య సరియైన సమన్వయం సాధించడం కొందరికి కష్టం.

వస్తువాదులకు పోరాటవాద కవిత్వానికీ ఇది మరిం త కష్టం. కానీ అభిప్రాయానికి డాక్టర్ నందిని సిధారెడ్డి విపర్యయం. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం-శిల్పం మరొక మంచి విశ్లేషణ. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సుంకిరెడ్డి రచనా రంగం లో ఉన్నారు. దశాబ్దం క్రితం ప్రచురించిన ముంగిలి ఆయన ను ఉత్తమ పరిశోధకుల శ్రేణిలో నిలిపింది. నిజానికి సుంకిరెడ్డి తొలుదొలుత కవి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో సుంకిరెడ్డి వచన కవిత్వ మాండలిక ప్రయోగాలు చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఏనుగు నరసింహారెడ్డి వ్యాసం సుంకిరెడ్డి కవిత్వంలోని విలక్షణమూ, శ్రేష్ఠమైన అంశాలను గుర్తించింది. సుంకిరెడ్డి కవిత్వంలోని సున్నితమైన ధ్వనిని గుర్తించడం నరసింహారెడ్డి సునిశితత్వం.భావయిత్రి వ్యాపారానికి,కారయిత్రి వ్యాపా రానికి మధ్య సుంకిరెడ్డి భావయిత్రిలోని రమణీయతను కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు అంటాడు నరసింహారెడ్డి. ఈ వ్యాసాల్లో రీతివైవిధ్యం కనబడుతుంది. తెలుగులో గేయకవిత్వం గేయ కవితా వికాసం సాహిత్య విద్యార్థులకు బాగా ఉపయోగపడే మంచి అకడమిక్ వ్యాసాలు!సినారె-ఒక ప్యూర్ పొయెట్ చిన్న వ్యాసమే అయినా స్పష్టత-నిష్కర్ష ఉన్నాయి. కాళోజీ సృజనకు అద్దం పట్టిన సంచికలు సమగ్ర సమీక్షా వ్యాసం. గంగుల శాయిరెడ్డి తెలంగాణకు ఒక ఘనమైన వారసత్వం పద్య కవిపై వెలువడిన సహృదయ సమీక్ష. సుప్రసిద్ధుల్ని గురించిన వ్యాసాలతోపాటు వర్ధమానుల రచనలు కూడా అంతరంగంలో స్థానాన్ని పొందడం అభినందనీయం. రచనా క్రమంలో ఆధునిక కవిత్వంపై నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు, వెలువరించిన అభిప్రాయాలు నూతన ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. లయను వ్యతిరేకిస్తూ అత్యాధునిక కవులు రాస్తు న్న కవిత్వంలో కూడా అంతు చిక్కని ఒక దీర్ఘ లయ ఉంటుంది (పుట 31).

ఆధునిక వచనం సూటిగా విస్తరిస్తున్నపుడు కర్త కర్మ క్రియ ఉండి తీరవలసిన వాక్యాలు లుప్తమైనట్లే కవిత్వం లో ఉపమ, రూపక, ఉత్ప్రేక్షాదులు తగ్గిపోయి పదచిత్రాలు, భావచిత్రాలు విస్తరించాయి (పుట 190). భావ విస్తృతితో పాఠకుడి మీద దీర్ఘ ముద్రవేసేవి భావచిత్రాలు (పుట 191). తాత్విక వ్యంగ్యమే సీతారం కవిత్వ ప్రాణం (పుట 45) అన్న వ్యాఖ్యను విశ్లేషిస్తే బాగుండేది. బాగా వేగవంతంగా ఉండే వచ నం మధ్య విశాలాంద్రోద్యమంలో దాశరథి మూడు కోటులనొక్కటే ముడి బిగించి మహాంధ్ర సౌభాగ్య గీతి పాడిండు వంటి భిన్నశైలికి చూపించే ముగింపు మాటలు వేరుతీరులో కనిపిస్తాయి. అంతరంగంలోని సాహిత్య విమర్శలో తొంభై తొమ్మిది శాతం సహృదయ వీక్షణం! సానుకూల విమర్శ పథానికి తనవంతు సేతు నిర్మాణం చేస్తున్న ఏనుగు నరసింహారెడ్డి ప్రయ త్నం ప్రశంసనీయం.

- డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
98669 17227

170
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles