మాతృస్వామ్యపు వైభవాలు!


Mon,April 8, 2019 12:00 AM

పురాతన కాలం నుంచి బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాలనుంచి, చరిత్ర నుంచి వివరిస్తూ, మదర్ రైట్స్ గ్రంథ రచయిత బారన్ ఒమర్ రోల్స్ తన పరిశీలనల నుంచి అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
bonalu
తెలంగాణ సాహిత్య కళావేదిక సాహిత్య అభిమానులకు ఒక అపురూపమైన బోనాన్ని బోనాలు :మహంకాళి జాతర అనే అరుదైన పుస్తకం రూపంలో సమర్పించింది. దీనికి సినీ దర్శకుడు, లలితకళారాధకుడు బి.నరసింగరావు ప్రధాన సంపాదకుడు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ అక్షర రచయిత. ఈ పుస్తక రచనలో మరో 14 మంది దృశ్య రచయితలున్నారు. రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ.. పిక్టోరియ ల్ ఫోటోగ్రాఫర్లను ఫొటో ఆథర్ అంటుంది. చిత్రంలోని కళాత్మకతను చూడగలిగిన వారిని ఫొటో రీడర్ అంటుంది. ఆ మేరకు ఈ పుస్తకంలోని ఫొటోగ్రాఫర్లందరూ ఫొటో ఆథర్స్ . తమ దృష్టికి వచ్చిన, తాము సేకరించిన దాదాపు 10 వేల ఫొటోగ్రాఫ్‌ల నుంచి బోనాలకు తాము ఇవ్వదలచుకున్న దృశ్యరూపానికి అనుగుణంగా ప్రధాన సంపాదకులు ఎంపిక చేసుకున్న 129 ఫొటోగ్రాఫ్‌లు చూడవలసినవి. ఎ.శరత్‌బా బు, కె. రమేష్ బాబు, సత్యనారాయణ గోల, ఆర్. మధుగోపాల్ రావు, డి.ఎం. అర్జున్, రామా వీరేష్ బాబు, నగర గోపా ల్, పి.విజయభాస్కర్ రెడ్డి, విద్యాసాగర్ లక్కా, డి.రవీందర్ రెడ్డి, కందుకూరి రమేష్ బాబు, ప్రభాకర్ బిలుక, జి. భాస్క ర్, మైసా బాలకృష్ణ (బాలు) తమ ఫొటోగ్రాఫ్‌ల ద్వారా మూడు దశాబ్దాలుగా జంటనగరాల్లో జరుగున్న బోనాలు జాతర రూప చిత్రాలతో కనువిందు చేస్తారు. అన్నవరం శ్రీనివాస్ ప్రాథమిక వర్గాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగ్‌లు బోనాల సంప్రదాయ అపురూప భావచిత్రాలు. శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్ లక్కా పసుపు పారాణి పాద చిత్రం బ్యాక్కవర్గా వెలువడిన బోనా లు : మహంకాళి జాతర పుస్తకాన్ని స్పర్శించి లోపలి పుటలలోకి వెళ్తుంటే ఒక దేజావూ అనుభవం కలుగుతుంది. స్థలకాలాదులకు అతీతమైన ఒక దివ్యానుభవాన్ని పొందడమే కదా దేజావూ అంటే!

అనాది నుంచి స్త్రీ దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామక్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న భావధార ఆ సంప్రదాయం. ఇం దులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధివిధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. జంటనగరాల ప్రజలు జరుపుకునే బోనాలు జాతర, స్త్రీ దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ప్రధాన సంపాదకులు పుస్తకంలోకి స్వాగతం పలుకుతూ.. బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం అంటారు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖా ల్లో నువ్వు తోడుగా ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం. పురాతన కాలం నుంచి బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాలనుంచి, చరిత్రనుంచి వివరిస్తూ, మదర్ రైట్స్ గ్రంథ రచయిత బారన్ ఒమర్ రోల్స్ తన పరిశీలనల నుంచి అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా మాతృదేవతారాధనలను ఉటంకిస్తూ గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి ప్రజలను అంటురోగాలనుంచి కాపాడే దేవతలుగా పూజలందుకొనే వైనాన్ని తెలియజేస్తారు. క్రీ.పూ. 20 వేల ఏండ్లనాటికే తమిళనాడులోని అడిచెన్నలూ రు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమలు, స్త్రీ దేవతల సారూప్యతను వివరిస్తూ సింధు నాగరికతలో మాతృదేవత ప్రధానదైవంగా స్థిరపడిన వైనాన్ని గుర్తుచేస్తారు. క్రీ.పూ. 1750 - 600 సంవత్సరాలలో సింధుప్రాంతాన్ని ఆక్రమించి ఉపఖండంలోకి విస్తరించిన ఆర్యుల జీవనశైలిని, వారి వైదిక సంస్కృతిలో మాతృదేవతలకు, స్త్రీలకు ప్రాధాన్యతను ఇవ్వని రీతులను బోనాలు:మహంకాళి జాత ర పుస్తకం వివరిస్తుంది. మనిషి నేటి రూపాన్ని ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాలు సంప్రదాయంలో, స్థలకాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

తొలినాళ్లలో గ్రామాలకు పరిమితమైన బోనాలు, మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా మారింది. వాస్తవానికి నగరం పునాదిలో ఉన్నది గ్రామాలే కదా. సాధారణం గా పండుగల సందర్భంగా నగరంలోని వ్యక్తులు తమతమ కుటుంబాలతో తమ గ్రామాలకు తరలి వెళ్లారు. హైద్రాబాద్ సికింద్రాబాద్‌లలో శ్రావణ- ఆషాఢ మాసాల్లో నెలరోజులు (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారమున్న జూన్-జులై-ఆగస్ట్ నెలల్లో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి తండోప తండాలుగా తరలి వస్తారు. తమను, పిల్లాజెల్లలను రోగాల బారినుంచి కాపాడమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ - ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. తానీషా హయాంలో భద్రాద్రిలో భక్తరామదాసు రామాలయం నిర్మించిన గాథ మనకందరికీ తెలిసినదే. అబుల్ హస న్ తానీషా గోల్కొండలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి 1675 లో అంగరంగవైభవంగా రంగులీనే బోనాల ఉత్సవానికి శ్రీకారం చుట్టారని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. దాదాపు 260 ఏండ్లు గోల్కొండ రేణుక ఎల్లమ్మ ఆలయానికే పరిమితమైన బోనాలు.. తదనంతర కాలంలో లష్కర్, లాల్ దర్వా జా, ధూల్ పేటలోని మహంకాళి ఆలయాలకూ విస్తరించా యి. క్రమేణా ఈ ఆలయాలూ గోల్కొండ రేణుక ఎల్లమ్మ ఆలయంలో వలెనే బోనాలకు ప్రధాన కూడళ్లుగా మారిన క్రమా న్ని సచిత్రంగా తెలిపారు. బోనాల సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహించే పెద్ద కాపు, పెద్ద గొల్ల, పెద్ద గౌడ్, పెద్ద కుమ్మరి, బైనేని, పెద్ద చాకలి, బడుగురాజు, పెద్ద మేదరి, కొలకాడు, మాత అనే వారిని ఆచారవంతులుగా వీరు నిర్వహించే పాత్రను పుస్తకం లో ఆసక్తికరంగా వివరించారు. పై కులాలకు చెందిన వారు బోనాలను ప్రత్యక్షంగా సమర్పించరు. కుమ్మరి ద్వారానే సమర్పిస్తారు.పై కులాల వారు ఘటం అనే పాత్రలో తెచ్చిన బోనాన్ని తమ ఇండ్లల్లో నివేదిస్తారు.

కింది కులాలవారు పై కులాల వారు సామరస్యంగా జరుపుకునే జాతరగా కూడా బోనాలును అభివర్ణించవచ్చు, బోనాలకు, ఘటాలకు పసుపును పూసి, కుంకుమబొట్లు పెడతారు. గవ్వలను అలంకరణకు వినియోగిస్తారు. వేపమండలను వింజామరలుగా వీయడం కన్పిస్తుంది. గ్రామదేవతలకు కల్యాణం చేయడం, ఆ సందర్భంగా పటాలు తయారు చేసి సూర్యచంద్రుల వంటి బొమ్మలతోఅలంకరిస్తారు. బోనం కుండలు, తొట్టెలతో ఊరేగింపు జరపడం, ఉత్సవాల్లో కొరడాలతో ముందుండి నిమ్మకాయలు కొరుకుతూ వీరంగం వేసే పోతురాజు ఆటపాటల ఊరేగింపులు బోనాల ఊరేగింపుల ప్రత్యేకత. ఆలయాల వద్ద భక్తులు మొక్కులుగా సమర్పించిన కోళ్లు, మేకలను పోతురాజులు నోటితో గావు పట్టి రక్తాన్ని వీరావేశంతో పీల్చి ఉమ్మేయడం, భక్తుల పూనకాలు బోనాలులో విశేషం. బోనాలులో రెండవ రోజు రంగం అనే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అవివాహిత అయిన మాతంగి రంగం అనే వేదికను ఎక్కి భవిష్యవాణిని చెబుతుంది. భక్తులకు వారు చేసిన మంచి చెడ్డలు చెప్పి, భవిష్యత్తులో సంభవించగల ఆపదలను తొలగించుకోవడానికి ఎట్లా నడుచుకోవాలో హితబోధ చేస్తుంది. రంగం ఎక్కిన మాతంగిని ఆ సమయంలో సాక్షాత్తూ అమ్మవారిగానే భక్తులు భావిస్తారు. గోల్కొండ పరిసరాల్లో కొలువుతీరిన సహజ శిలాశిల్పాలను, ఓల్డ్ సిటీలోని గల్లీల లోని సామరస్యవాతావరణాన్ని, లష్కర్‌గా వ్యావహారికంలో ఉన్న సికింద్రాబాద్ వైవిధ్యాన్ని, వివిధ సామాజిక వర్గాల ఆహార్యాన్ని, ఆనందోత్సాహాలను ఈ పుస్తకం దృశ్యమానం చేసింది. చారిత్రక - సాంస్కృతిక కళాభిమానులు తప్పక చదవ వలసిన పుస్తకం బోనాలు : మహంకాళి జాతర
ప్రధాన సంపాదకులు: బి.నరసింగరావు
రచయిత: మామిడి హరికృష్ణ

255
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles