ప్రతిభకు ప్రోత్సాహం


Mon,March 25, 2019 01:39 AM

రైల్లో ఆడవాళ్ల పెట్టెలో ఎక్కినందుకు అతనికి 50 రూపాయల జరిమానా పడింది. తనలాగే శిక్షపడిన మరో వ్యక్తి జరిమానా కట్టి విడుదలైపోతుంటే, బతిమా లి ఆయన ద్వారా నాకు కబురంపాడు. నాలుగు గంటలలోపు రైల్వే మెజిస్ట్రేట్ కోర్టులో ఫైన్ కట్టకపోతే జైలుకు పంపుతారు. రైలు కదులుతుంటే దగ్గరున్న పెట్టెలో ఎక్కానంటే ఎవరు నమ్ముతారు? అప్పుడు మేమెవర మూ 50 రూపాయలు ఇవ్వగల స్థితిలో లేము.
gs-varadha-chary
ఏసంస్థలోనైనా యజమాని నుంచి గేటువద్ద నిలబడే కాపలాదారు వరకు అంతా ఒక కుటుంబం అన్న భావన ఉంటే పారిశ్రామిక శాంతి వెల్లివిరుస్తుంది. అట్లా భావించే అభ్యుదయ భావాలుగల పారిశ్రామికులలో విజయవంతంగా సంస్థ లు నడుపుతున్నవారెందరో ఉంటారు. వారిని అందుకు ఉద్యుక్తులను చేసే సలహాదారులుంటారు. చిన్నస్థాయిలోనే అయినా అలాంటి బాధ్యత నిర్వహించే అవకాశం నాకూ దక్కింది. నేనెప్పుడూ.. ఒక వృత్తిలో ఉండేవారు ఎప్పటికప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సలహా ఇస్తుంటాను. ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉస్మానియా యూనివర్సిటీ లో జర్నలిజం కోర్సులో చేరుతానని, అనుమతి ఇప్పించాలని వచ్చాడు. ఏడాది కోర్సు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు తరగతులుండేవి. ఆయన హాజరవడానికి వీలుగా పది నెలలపాటు ఆయనకు ఉదయపు షిప్టులో డ్యూటీ వేయకుండా మధ్యా హ్నం, రాత్రి షిఫ్టులలోనే వేసి, డిగ్రీ పూర్తిచేసే వీలు కల్పించాం. నేను అంతటితో ఆగలేదు. వృత్తిసంబంధమైన అదనపు యోగ్యత సంపాదించినందుకు, ఆయన కు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టాను. యజమానులలో ఒకరు మనమే చదువుకునే అవకాశం ఇచ్చి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలా? అన్నాడు. మన సహాయంతో అదనపు యోగ్యత సంపాదించాడు నిజ మే. దానితో వేరేచోట ఉద్యోగం సంపాదించుకొంటే మనకేం లాభం? ఆ ప్రయోజనం మనకే చెందాలంటే ఏదో ప్రోత్సాహం ఉండాలన్నాను. అంగీకరించారు. ఇది చూసి క్రానికల్లో పనిచేసే ఇద్దరు ప్రూఫ్ రీడర్లు జర్నలిజం డిగ్రీచేశారు. వారికీ రెండు ఇంక్రిమెంట్ల ప్రోత్సాహకం ఇప్పించాము.

అదొక సంప్రదాయమైంది. అలాటివారి లో ఒకరైన మానిక్ సింగ్ వర్మ ప్రమోషన్లు పొంది, చివ రికి క్రానికల్ వైజాగ్ ఎడిషన్లో రెసిడెంట్ ఎడిటర్‌గా రిటైరయాడు. వృత్తి సంబంధమైన విషయాల్లోనే కాదు, వ్యక్తిగత తప్పుల వల్ల ఇబ్బందుల్లో పడిన ఇద్దరు జర్నలిస్టులకు యాజమాన్యం చేత సహాయమిప్పించిన ఘటన గురిం చి చెపుతాను. ఒకరోజు మధ్యాహ్నం మారేడ్‌పల్లి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. ఆయన వెంట ఒక లాయరు కూడా ఉన్నారు. ఆర్.వి.బి.శర్మను అరెస్టు చేయడానికి వచ్చామన్నారు. ఏం నేరం చేశాడని అడిగాను. శర్మ కలకత్తాకు చెందిన స్టాండర్డ్ లిటరేచర్ కంపెనీ నుంచి వాయిదాల పద్ధతిలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా కొన్నాడట. వాయిదాలు కట్టలేదు. సివిల్ అరెస్టుకు వారంటు తెచ్చా రు. శర్మ చీఫ్ సబ్‌ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాను. కోర్టు సమయం ముగిసే లోపల సగం డబ్బయినా కడితే, జడ్జిగారి అనుమతి తీసుకొని అరెస్టు ఆపేస్తామన్నారు. సగం డబ్బయినా కట్టడం మా వల్ల అయ్యేపని కాదు. యజమాని దగ్గరకు వెళ్లాను. కుటుంబ పెద్దగా మీరే ఆదుకోవాలన్నాను. నెలకింత జీతంలో మినహాయించుకోండన్నాను. మొదట విసుక్కున్నా క్యాషియర్‌కు చెప్పి డబ్బులిప్పించారు. శర్మకు అరెస్టు గండం అట్లా తప్పింది. ఇలాగే కర్రా కృష్ణమూర్తి అనే ప్రూఫ్ రీడర్‌ను ఆదుకున్నాం. రైల్లో ఆడవాళ్ల పెట్టెలో ఎక్కినందుకు అతనికి 50 రూపాయల జరిమానా పడింది. తనలాగే శిక్షపడిన మరో వ్యక్తి జరిమానా కట్టి విడుదలైపోతుంటే, బతిమా లి ఆయన ద్వారా నాకు కబురంపాడు. నాలుగు గంటలలోపు రైల్వే మెజిస్ట్రేట్ కోర్టులో ఫైన్ కట్టకపోతే జైలుకు పంపుతారు. రైలు కదులుతుంటే దగ్గరున్న పెట్టెలో ఎక్కానంటే ఎవరు నమ్ముతారు? అప్పుడు మేమెవర మూ 50 రూపాయలు ఇవ్వగల స్థితిలో లేము.

యాజమానులే దిక్కు. ఇచ్చారు. రైల్వేకోర్టుకు మా సిబ్బంది సంఘం నాయకుడు వెళ్లి విడిపించుకువచ్చాడు. ఇవి కార్మిక సంఘం విధులు కావు. మానవ సంబంధాల్లో భాగాలు. సాటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే కుటుంబ భావన గలవారం చూస్తూ ఊరుకోలేం గదా! ఇంగ్లీషు తెచ్చిన తంటా: 1963లో పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆంధ్రభూమికి అప్పటికి విడిగా విలేఖరులు లేరు. దక్కన్ క్రానికల్ విలేఖరులు తాము కవర్ చేసిన ప్రతివార్త కార్బన్ కాపీ ఒకటి ఆంధ్రభూమికి ఇచ్చేవారు. దాన్ని తెలుగులో రాసుకొని ఆంధ్రభూమిలో ప్రచురించేవాళ్లం. ఇంగ్లీషు లో రాసే విలేఖరులు సాంకేతిక పదజాలం అర్థాన్ని కానీ, పేర్ల ఉచ్చారణను కానీ ఆ వార్త చెప్పిన వారిని అడిగి తెలుసుకోవచ్చు. తెలుగు పత్రికకు తెలుగులో వార్త ఇచ్చే విలేఖరి లేకపోతే ఆ బాధ సబ్‌ఎడిటర్ నెత్తికి చుట్టుకుంటుంది. అర్థాలైతే వారు వెతుక్కుంటారు. పేర్లు తెలుగులో ఎట్లా రాయాలి? మనకు అలవాటైన పేర్లయితే సరే. రామ, రమాలను ఆడా మగా తెలిస్తే సరిగానే రాసుకుంటాం. కానీ విదేశీయుల పేర్లు ఇంగ్లీషు (రోమన్) లిపిలో ఉచ్చరించని అక్షరాలెన్నో పెట్టి రాస్తుంటారు. మన సంప్రదాయమేమో రాసిన ప్రతిఅక్షరాన్ని ఉచ్చరించాలన్నదాయె. వారు ఏదో రాస్తారు. ఏదో పలుకుతారు. ఇది ప్రాంతీయ భాషాపత్రికలను పీడిస్తున్న పెద్ద సమ స్య. మన ప్రధానమంత్రి పేరునే మోదీ అనిగాక మోడీ అని పలుకుతూ వచ్చాం. ఇప్పటికీ కొందరు మోడీ అనే రాస్తున్నారు. వెంకయ్యనాయుడు వంటివారు మోడీ అనే పలుకుతున్నారు. మీడియా ప్రభావం వల్లనే. తెలు గు మీడియాలోనే ఇలాంటి తప్పులు ఎక్కువ జరుగుతుండటం బాధాకరమైన విషయం. ఈ కథంతా చెప్పడానికి కారణం, అరువై ఏండ్ల నుంచీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నదని చెప్పడమే!

దీన్ని ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చిన వార్త గురించి చెపుతాను. నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో జైనులకాలం మంటపాలు బయటపడ్డాయి. పురాతత్వశాఖ వారు వెళ్లి తవ్వకాలు జరుపగా మంటపాలు వెలికివచ్చాయి. గచ్చులో ఎన్నో ఏండ్లు పూర్తిగా మట్టిలో పూడుకుపోయి ఉన్నా, చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆ శాఖ డైరెక్టర్ చెప్పారు. గచ్చుకు సామాన్య ఇంగ్లీషు పదం వాడక ఆయన లాటి న్ శాస్త్రీయ నామం వాడారు. ఆ వార్త రాస్తున్న సబ్ ఎడిటర్ దాని అర్థం కోసం డిక్షనరీ చూస్తే ఆ మాటలేదు. నన్నడిగితే నాకూ తెలియదు. గోరాశాస్త్రి ఇంగ్లీషు బాగా వచ్చినవారు. ఆయనను అడిగితే తనకూ తెలియదని, ఇలాంటివి గోపాలశాస్త్రిని అడిగితే చెపుతాడని, ఆయన దగ్గర లాటిన్ డిక్షనరీ ఉంటుందన్నారు. గొట్టు మాటలు వదిలేసి వార్త రాయవచ్చు. కానీ ఈ వార్తకు అదే జీవం. జర్నలిజంలో వెన్ ఇన్ డౌట్.. కట్ ఔట్ అని ఓ నానుడి ఉంది. కానీ దానికి ముందు ఫైండ్ ఔట్ అని కూడా అన్నారు. ఈ వార్తలో గచ్చు ఎట్టి పరిస్థితిలోనూ వదల వీలులేనిది. రెండు గంట లు వెచ్చించాము. ఇంతలో ఆ విలేఖరి వచ్చాడు. ఏమిటీ మాటకు అర్థమని అడిగితే తనకూ తెలియదన్నాడు. పక్కన ఓ తెలుగు పత్రిక ఉంది. విషయం చెపుతున్నది తెలుగువాడు. గోష్ఠి ముగిశాక అడుగవచ్చు. ఫోన్ నంబరు ఇవ్వు, నేనడుగుతానని విసుక్కున్నాను. ఫోనుచేసి అడిగితే పుట్టపర్తివారు అదా? గచ్చు అని నవ్వేశారు.
- డాక్టర్ జి.యస్.వరదాచారి
(జ్ఞాపకాల వరదలోంచి కొన్ని భాగాలు...)

173
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles