సినీగీతాల సిరిమల్లి వడ్డేపల్లి


Mon,March 18, 2019 01:13 AM

vaddepalli
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే.. (పెద్దరికంచిత్రం) అని భావకవితా వినువీధిలో అక్షర నక్షత్రాల ముగ్గుల్ని చిత్రించిందా కలం. నీ చూపులోనా విరజాజి వాన ఆ వానలోన నేను తడిసేనా హాయిగా.. (పిల్లజమిందార్) అని అందమైన నవ్వుల్లో పువ్వు ల్ని పూయించి అక్షర వర్షాన్ని కురిపించిందా కవనం. కురిసింది వాన వాన జల్లు కోరగా, విరిసింది ప్రేమ ప్రేమ తీయతీయగా.. (సంకల్పం) అని వాన దారాల తోరణాలు పేని వలపుల మెరుపుల్ని తలపిస్తుందా కల్పనం అంబా శాంభవి భద్రరాజ గమనా కాళీ హైమవతీశ్వరీ త్రినయనా.. (భైరవద్వీపం) అని భక్తి భావ సుమాల్ని అలవోక గా అందిస్తుందా అర్చనం. జానపదం నుంచి జావళీ వరకు అంగారం నుంచి శృంగారం వరకు, ఆటవెలది నుంచి పావెల ది వరకు పరిచయ వ్యాసాల నుంచి పరిశోధన వరకు, బుల్లి తెర నుంచి వెండితెర వరకు-వెండితెర నుంచి మన గుండె తెర వరకు.. మాటల్లో కాకుండా చేతల్లో తన సామర్థ్యాన్ని చూపించిన మౌనవృక్షం డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. సిరిసిల్ల ఖిల్లా (కరీంనగర్ జిల్లా)లో డాక్టర్ సి.నారాయణ రెడ్డి సాహితీ వారసుడిగా అంకురించి, లలితగీతాల పొదరింటిలో చివురించి, సినీగీతాల సురభిళాలతో సినీ కళామతల్లి సిగ లో వికసించిన సిరిమల్లియే డాక్టర్ వడ్డేపల్లి. లలిత గీతాల సృజనలో గేయ కథాకావ్యాల రచనలో, నాటి కా విరచనలో, నాటకాల ప్రదర్శనలో, పరిశోధనా వివేచనలో సినారె వారి తదుపరి సాహితీయానం చేస్తున్న వడ్డేపల్లి నాలు గు దశాబ్దాలుగా సినీ గీతాలు, అయిదు దశాబ్దాలుగా లలితగీతాలు రచిస్తూ, ఇటీవలే సినీ దర్శకుడిగా తన విశ్వరూపం ప్రదర్శించారు.

పాటకు పట్టం కట్టి, పాటలోనే ప్రాణాలు పెట్టిన వడ్డేపల్లి 1949 జూలై 30వ తేదీన లక్ష్మమ్మ-లింగయ్య దంపతులకు మూడో కొడుకుగా జన్మించారు. వీరు చేనేత కుటుంబానికి చెం దినవారు. చిన్నతనం నుంచి దృష్టి నేత పైనగాక అంతా రాత పైనే ఉండేది. బాల్యంలో నిరంతరం మగ్గాల శబ్దాలు వీరి హృదయంలో మాత్రా ఛందస్సుకు బీజం వేశాయనవచ్చు. ఉగ్గుపాలతో జానపద రసాలు, చేనేత మగ్గాల లయవిన్యాసా లు వడ్డేపల్లి గారిని గేయాల భావుకుడిని చేశాయి. ఈ నేపథ్యం లోనే మమతల మగ్గాలపైన సమత వస్త్రముల నేస్తా.. మనిషి మనిషిలో వాడని మల్లె మనసు పూయిస్తా! అని తన కవితా దృక్పథాన్ని అనంతర కాలంలోలలిత గీతం గా చాటి చెప్పుకున్నాడు. లలిత గీతాల పరికల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారిదో విలక్షణ శైలి. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి భావుకత, సినారె గారి శిల్పం, దాశరథి గారి అభివ్యక్తి వడ్డేపల్లి వారి లలితగీతాల్లో లావణ్య లతికలై నర్తిస్తాయి. వడ్డేపల్లి కృష్ణగారి సాహితీ ప్రస్థానం గేయ కవితతోనే మొదలైంది. అయితే ఈ కవితలో గేయానికి సంబంధించిన లయాత్మకతను పాటించడం వీరికి సహజసిద్ధంగానే అలవడింది. వీరి తొలికవిత ఎవడెరుగును? శీర్షికన స్రవంతి (జూన్1968) లో ప్రచురితమైనది. ఈ కవితలో సహజ గేయలయాత్మకత ఉండటం గమనించదగ్గ అంశం.
శిథిల శిల్పాల దాగిన
కథల గూర్చి ఎవడెరుగును?
చితికిన బ్రతుకుల లోపలి
వెతల గూర్చి ఎవడెరుగును?
శిథిల, కథల / చితికిన, వెతల పదాలలో చక్కని ప్రాస ప్రయాణించింది. ఈ కవితను త్రిశ్రగతిలో నడిపిస్తే చక్కని లలిత గీతమవుతుంది.

1969లో లలితగీత రచన వైపు మొగ్గుచూపారు. దీనికి కారణం దేవులపల్లి కృష్ణశాస్త్రి లలిత గీతాల మాధుర్యంతో పాటు సి.నారాయణరెడ్డి గేయ ప్రాభవ వైభవం! ఆకాశవాణివారు వడ్డేపల్లి గీతాన్ని 1969 జనవరిలో ప్రసారం చేయడం జరిగింది. ఆరోజుల్లో దేవులపల్లి, దాశరథి, సినారె, బోయి భీమన్న, బాపురెడ్డి మొదలగు గొప్ప కవుల రచనలకే ప్రాధాన్యం ఉండేది. అలాంటి స్థితిలో వడ్డేపల్లి గారి గీతం కూడా ప్రసార యోగ్యం కావడంతో తన రచనా విధానంపై విశ్వాసం కలిగి, విభిన్నరీతిలో వివిధ వస్తువులను తీసుకొని అనేక కోణాల్లో సుందర రస బంధురంగా గేయాలను సృజించడం ప్రారంభించారు. తొలి దశలో తరచుగా రేడియోలో లలిత సంగీతం శీర్షికన ప్రసారమయ్యే దేవులపల్లి వారి గీతాలే తన కు ప్రేరణ కలిగించాయని వడ్డేపల్లి గారే స్వయంగా చెప్పుకు న్నారు. ఆ తర్వాత దాశరథి, సినారె గార్ల గేయాలు వడ్డేపల్లి గారి ని కవిగా ముందుకు నడిపించాయి. వడ్డేపల్లి కృష్ణ గారి లలితగీత ప్రస్థానం, ఆకాశవాణితో మొద లై ఆబాలగోపాలాన్ని అలరించింది. క్రమంగా వారు మరింత పదును పెట్టుకొంటూ రచనలు కొనసాగించడంతో గేయసృజనలో నిష్ణాతులైనారు. పద్మశ్రీ భానుమతిగారు వీరి గీతాలను ప్రశంసించి, తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రచయిత్రి సినిమాలో 1979లో తొలిసారిగా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చి, యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించింది. రచయిత్రి చిత్రం ఆలస్యంగా విడుదలైనా, ఎల్.పి.రికార్డ్‌ద్వారా కృష్ణగారు లలితగీత రచయితగానే గాక సినీ గేయరచయితగా సినీవర్గాల దృష్టిలోకి వచ్చారు. 1980లో అక్కినేని తమ సొంత చిత్రం పిల్ల జమీందార్ చిత్రంలో యుగళ గీతం రాయించి ఆదరించారు.

1971-1980 మధ్యకాలంలో ఆకాశవా ణి ద్వారా ప్రసారమైన ప్రబోధ, ప్రభాత బృందగీతాలు, ఈ మాసపు పాటలన్నిటిని రాగరథం శీర్షికన 1981లో లలితగీత సంపుటిగా వెలువరించారు. కవియంటే వెలిగే దీపం కవితంటే కాంతికి రూపం.. అనే గీతంలో కవి కవిత్వ మూల్యాల్ని ఆవిష్కరిస్తూనే అద్భుతంగా నిర్వచించారు. దీపానికి, కాంతికి గల పరస్పర సంబంధా న్ని కవికి కవితకు సమన్వయ పరిచారు.
వెన్నెలంత చల్లనిది స్నేహము
మల్లెయంత తెల్లనిది స్నేహము
పువ్వువోలె పరిమళాల రువ్వగలుగుస్నేహము
దివ్వెవోలె కాంతులనే యివ్వగలుగు స్నేహము
సర్వదాను చంపుకొనును స్వార్థమనే దాహము!
స్నేహంలోని స్వచ్ఛతను వెన్నెలతో, మల్లెలతో ఉపమింపజేశారు. నిర్మల స్నేహానికి నీరాజనం పట్టారు. శబ్దార్థ సుందరంగా స్నేహం విలువల్ని విశ్లేషించారు. ఇలా రాగరథంలోని గేయాలన్ని వస్తు వైవిధ్యంతో కూడి ఉన్నవి. వడ్డేపల్లి కృష్ణ గారిది రసరమ్య శైలి. వస్తువు ఎలాంటిదైనా నవ్యత, రమ్యతలతో లలితంగా, కవితా శిల్పంగా చెప్పగల ప్రతిభావంతులు. దాశరథి గారన్నట్లు వీరిది వాగ్గేయకారుల లక్ష ణం. కవితా శిల్పంతో పాటు గాన శిల్పానికి ప్రాధాన్యం యివ్వ డం! వడ్డేపల్లి గారి ఏ గేయమైనా, చక్కని తూగు, సాగు కలిగి సంగీతాత్మకంగా ఉంటుంది. వడ్డేపల్లి కృష్ణగారు గాయకుడు కాదు, కానీ వారి రచనల్లో గాన లక్షణం ప్రస్ఫుటం. ఈ కారణం చేత వీరి గేయాలు రాగరంజితాలయ్యాయి.

కాసుకంటే విలువైనది కాలం శీర్షికన రాసిన గీతం కాలం విలువను, విత్తములో సత్తువెంతో అనే గీతం డబ్బు ప్రాధా న్యం గురించి చెప్పేగీతాలు. మహిళా జన జాగృతి, మానవ త్వం, పల్లెల సౌందర్యం కర్షక, కార్మిక, శ్రామికవర్గాల గురిం చి రాసిన గేయాలు వస్తువు దృష్ట్యా ఎంతో విలువైనవి.
ముఖ్యంగా అక్షరం గురించి రాసిన గీతం ఎంతో ఆలోచనాత్మకం!
బోయవాడినే వాల్మీకిగా/ తీర్చి దిద్దినది అక్షరం!
రాతి గుండెలో రామాయణం/రాగమెత్తినది అక్షరం!
అంటూ అక్షరం అపూర్వ ఆయుధం అని చాటి చెప్పిన గీతమిది అక్షర సత్యమిది! ప్రకృతి వల్లి శీర్షికన కూర్చిన గేయాలు గాఢమైన భావుకత, ప్రకృతి పట్ల ప్రగాఢాభిమానం తెలియజేస్తాయి. చైత్ర మాసంలో చెట్లు చిగిరించినపుడు, పూలు వికసించినపుడు అగుపించే దృశ్యాన్ని అక్షరాల గవాక్షాల్లోంచి చూపించారు. వారు బతుకమ్మ (2015), భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ (2016), రమణీయ రామప్ప (2018) సంగీత నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.
వడ్డేపల్లి గారి పదబంధాలు, భావచిత్రాలు మనల్ని అలరిస్తా యి. ఇరుల కురులు, వసంతలతాంతం, వెలుగు పూలు జాతిలత, కాలజలధి మొదలైనవి ఉదాహరణలు.

వడ్డేపల్లి కృష్ణ గారి లలిత గీతాలు, అచ్చమైన స్వచ్ఛమైన ఆణిముత్యాలు,లలిత భావ నిత్యసత్యాలు. ప్రస్తుతం వారి సాహితీ స్వర్ణోత్సవ సందర్భంగా వెలువరించిన వడ్డేపల్లి లలితగీతాలు లో కూడా అనేక లలితగీతాలు తటిల్లతలుగా కనిపిస్తాయి. సుమనస్వి అయిన వడ్డేపల్లి పాటల్లోనే కాదు, మాటల్లోనూ మాధుర్యాన్ని మేళవిస్తూ సంభాషిస్తుంటారు. రాశితో పాటు వాసిని పోషిస్తూ రాస్తున్న ప్రతిభామూర్తిగా భాసిస్తుంటారు. వీరు మరిన్ని లలిత గీతామృతశీకరాలను ప్రపంచానికి అం దించాలని ఆశిస్తున్నాను.
- డాక్టర్ వి.వి.రామారావు, 98492 37663
(వడ్డేపల్లి కృష్ణ సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా..)

223
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles