అలుపెరుగని రచయిత ద్వానా


Sun,March 3, 2019 11:52 PM

సాధారణ వ్యక్తులకు ఉండే డాంబికాలకు ద్వానా చాలా దూరం డబ్బుదేముంది వస్తుంది పోతుంది అనుభవించాలి కదా అంటారు. ద్వానా త్రికరణశుద్ధిగా తన జీవితాన్ని పూర్తిగా సాహిత్యానికే అంకితం చేశారు. జ్ఞానం, సమయం, శ్రమ, ధనం అంతా సాహిత్యానికే ధారపోశారు. ఇంతగా సాహిత్య సేవకు అంకితమైన వారు మరొకరు కనిపించరు.

అదునెరిగిన విమర్శకుడు, పదునెక్కిన కవి ద్వానా అని సినారె మెప్పు పొందిన వ్యక్తి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. ఆయనే ద్వానా శాస్త్రిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితుడు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తెలుగు మెటీరియల్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ద్వానా శాస్త్రి. ఒకసారి ఆంధ్ర సారస్వత పరిషత్తులో సాహిత్య గోష్ఠి జరుగుతున్నది. ముందు పరిచయ కార్యక్రమంలో భాగంగా అక్కడున్న వారు పేరు, ఊరు, హోదాతో పరిచయం చేసుకున్నారు. తన వంతు రాగానే ద్వానా శాస్త్రి అని కూర్చున్నారు. పరిచయం అక్కరలేని వ్యక్తి ద్వానా.
Dwana-sastry
ద్వానా చాలా నిరాడంబరుడు. మాయని గడ్డం సాధారణ వస్త్రధారణ. ఎల్లప్పుడూ ఇన్ షర్ట్, భుజానికో సంచి అందులో నాలుగు పుస్తకాలు, చూడగానే గౌరవం కల్గిగే ఆహార్యం. నిజాయితీ, డబ్బు పట్ల ఉదాసీనత, సాహితీ సేవపట్ల అంకితభా వం, విద్యార్థుల పట్ల ఆపేక్ష ఆయన సుగుణాలు.
భౌతికశాస్త్రంలో పీజీ చేయాలనుకున్న నాకు సీటు రాకపోవడం వల్ల వచ్చిన నష్టమేమి లేదు. పైగా నాకు బోలెడు మంచే జరిగింది. ఇంతమంది సాహిత్యాభిమానుల మనస్సు గెలుచుకున్నాను. నా వల్ల కూడా ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే సైన్స్ గ్రూప్‌లో సీటు రాలేదని చమత్కరిస్తారు ద్వానా.
పాఠశాలస్థాయిలో ఆంజనేయులు, డిగ్రీలో బండ్లమూడి సత్యనారాయణ ద్వారా తెలుగుపై మమకారం ఏర్పడిందనీ, తుమాటి దోణప్ప ఆచార్య చేకూరి రామారావు, కొత్తపల్లి వీరభద్రరావు వంటి గురువుల దగ్గర నా సాహితీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నానని సాహితీ సభలలో వినమ్రతతో చెప్పుకునే వారు. తను సాహితీవేత్తగా ఎదగడానికి సాహిత్యంలోని భిన్న పార్శ్వాల్లో విస్తరించడానికి సహాధ్యాయులు ఆచార్య తిరుమ ల, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, పైడిపాల, మారేమండ శ్రీనివాస రావు వంటి వారితో సాహిత్య చర్చలు దోహదపడ్డాయి. గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలు పాత పత్రికలూ ద్వానాను సాహిత్యంలో రాటుదేలేలా చేశాయి.
శ్రీ కోనసీమ భానోజీ కామర్సు కళాశాల, అమలాపురంలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2004 లో రీడర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ద్వానా శాస్త్రి నోట్సు అంటే పోటీ పరిక్షలకు కల్పవృక్షం. పోటీ పరీక్షల కోస మే 16 పుస్తకాలు రాశారు.
రచనతో మనకి సంబంధం తప్ప రచయితతో కాదు అన్న చేరా మాటలు తనపై ఎనలేని ప్రభావం చూపాయంటా రు ద్వానా. విమర్శకుడిగా తనకంటూ ఒక దృక్పథాన్ని నిర్దేశించుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు రచనే కానీ రచయి తా కాదు అన్న సిద్ధాంతంతో విమర్శ చేస్తున్నారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై అవగాహన గల అతికొద్దిమంది విమర్శకుల్లో ద్వానా ఒకడుగా గుర్తింపు పొందారు. ద్వానా విమర్శలో ముక్కుసూటితనం, నిర్భీతి ఉంటుంది. వాజ్మయ లహ రి, సాహిత్య సౌహిత్యం, వ్యాస ద్వాదశి, విమర్శ ప్రస్థానం, గోపి కవితానుశీలన, తొలి దళిత కవి కుసుమ ధర్మన్న. తెలు గు అకాడమీ 2003 ప్రచురించిన తెలుగులో కవిత్యోద్యమా లు అనే పుస్తకంలో భక్తికవిత్యోద్యమం, జాతీయోద్యమ కవి త్వం, దిగంబర కవిత్యోద్యమం అనే మూడు వ్యాసాలు ద్వానా రాసి ,దానికి సంపాదకత్వం వహించడమే విమర్శ ప్రస్థానానికి తార్కాణం.
మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిత సమీక్ష(ఎం.ఫిల్.) సాహిత సంస్థలు (పి.హెచ్.డి సిద్ధాంత వ్యాసం) వచన కవితా వికాసంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే అంశాలఫై పరిశోధలు చేశారు. 1971 నుంచి సమీక్షలు రాస్తునారు. ఇప్పటి వరకు సుమారు రెండు వేల పుస్తకాలకు సమీక్షలు రాశారు. తెలుగు సాహిత్యం లో అరుదైన వంద పుస్తకాలకు పరిచయ వ్యాసాలు రాశారు. నడింపల్లి రామభద్ర రాజు, పురిపండా అప్పల స్వామి, చల్లా రాధాకృష్ణ శర్మ, తుమాటి దోణప్ప, దాశరథి కృష్ణమాచార్య, చేరా జీవిత చరిత్రలను రాశారు.
వందేళ్ళ నాటి అపురూప సాహిత్య పరమైన ఛాయా చిత్రా ల సంకలనం అక్షర చిత్రాలు తెలుగుపై మమకారం పెంచేందుకు మన తెలుగు తెలుసుకుందాం రాసినారు. శైలజామిత్ర Let Us Know Telugu పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువందించారు. కవులు రచయితలపై తన అభిప్రాయాల ను తెలుపుతూ వంద నానీలతో సాహిత్య నానీలు రాశారు. నానీల రచనలో ఎవరూ చేయని మరో ప్రయోగం నానీలలో సినారె రాశారు. ద్వానా శాస్త్రి సాహిత్య సృష్టి అంతా ఒక ఎత్తు అయితే తెలుగు సాహిత్య చరిత్ర ఒక్కటి మరో ఎత్తు. ఆ గ్రంథం గురించి తెలియని, చదవని తెలుగు విద్యార్థులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మారిషస్ లో ఆరు రోజులు పేరుతో వెలువరించిన తన యాత్ర చరిత్రను లేఖా ప్రక్రియలో లేఖలుగా రాశారు.
ద్వానాలో మరో కోణం గొప్ప ఉపన్యాసకుడు. సాహిత్యంలోని 12 అంశాలపై 12 గంటలపాటు నిర్విరామంగా ప్రసంగించి మూడు రికార్డులు సాధించారు. అదీ పుస్తకాలు కనీసం కాగితాలు లేకుండా మాట్లాడటం అపూర్వం. తన 67వ జన్మదినం సందర్భంగా ప్రసంగావధానం నిర్వహించి 67 మంది పృచ్ఛకులు అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలకు ఆశువుగా సమాధానం చెప్పి రికార్డు సృష్టించారు. 6 గంటలు సాగిన ఈ కార్యక్రమానికి పలకిరిస్తే ప్రసంగం అనే పేరు పెట్టారు. ద్వానాలోని హాస్య చతురత ఆయన్ని అందరివాడుగా చేసింది. కఠినంగా చెప్పాల్సిన విషయానికి హాస్యం జోడించి కఠినత్వపు వాడిని తగ్గిస్తారు. ద్వానా ఉపన్యాసాలూ విషయాన్ని అందిస్తూనే ఆహ్లాదపరుస్తాయి. నవ్వుకునేలా ఉంటాయి.
అర్ధ శతాబ్దపు రచనా జీవితంలో ద్వానా శాస్త్రి కవిత సంపుటాలు-7 విమర్శ గ్రంథాలు-11, ఏడు జీవిత చరిత్రలు, పోటీ పరీక్షలకు 16 పుస్తకాలు, మూడు సాహిత్య చరిత్రలు మొదలైన గ్రంథాలు 80పైగా వెలువరించారు. అర్ధ శతాబ్దపు సాహితీ జీవితం శాస్త్రికి ఎంతో కీర్తితో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందించింది. జాతీయస్థాయిలో జైమినీ అకాడ మీ, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి పురస్కారాలు పొందా రు. కోన సీమరత్న, సమీక్ష సవ్యసాచి, సాహిత్య సవ్యసాచి అనే బిరుదులూ పొందాడు. కృష్ణమూర్తి సాహితీ పురస్కారం. సింగపూర్ తెలుగు సమాజం నుంచి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 50 పైగా సత్కారాలు పొందారు.
సాధారణ వ్యక్తులకు ఉండే డాంబికాలకు ద్వానా చాలా దూరం డబ్బుదేముంది వస్తుంది పోతుంది అనుభవించాలి కదా అంటారు. ద్వానా త్రికరణశుద్ధిగా తన జీవితాన్ని పూర్తిగా సాహిత్యానికే అంకితం చేశారు. జ్ఞానం, సమయం, శ్రమ, ధనం అంతా సాహిత్యానికే ధారపోశారు. ఇంతగా సాహిత్య సేవకు అంకితమైన వారు మరొకరు కనిపించరు.
-ఎడ్ల కల్లేశ్ పరిశోధక విద్యార్థి, ఓయూ

320
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles