బీఎస్ కథల్లో సామాజిక తాత్త్వికత


Sun,March 3, 2019 11:50 PM

బి.ఎస్.రాములు తెలంగాణ ప్రభుత్వ బీసీ కమిషన్ అధ్యక్షులు. బహుముఖీన సాహితీకృషీవలుడు. సామాజిక సాహిత్య తాత్త్విక రంగాల్లో పొద్దు చాలని, కార్యశీ లి. వందలాది వ్యాసాల కర్త. శతాధిక గ్రంథకర్త. నడుస్తున్న తెలంగాణ చరిత్ర సర్వస్వం! బి.ఎస్. రచనా నైపుణ్యాల్లో ఒక పార్శ్వాన్ని ఈ వ్యాసంలో పరామర్శిస్తాను. అదే బి.ఎస్. కథల్లో సామాజిక తాత్త్వికత.

కథానికలో సామాజికత ఒక నిర్దేశితమైన అనివార్యమైన ఆవశ్యకత. వర్తమాన సమాజంలోని సమస్యే కథానికకు ఆధారం. ఆ సమస్య చిత్రణ మనిషి ఆశ్రయంగా సాగుతున్నది. ఈ ప్రాసెస్‌లో సమాజానికీ, మనిషికీ మధ్యగల అవినాభావ సంబంధంలోని విపర్యాయా లూ, సంఘర్షణ తప్పకుండా ప్రాధాన్యం వహిస్తాయి. ఈ సామాజికతతో పాటు తాత్త్వికతను కూడా తన కథ ల్లో మిశ్రీకరించగలిగారు బి.ఎస్.

సమాజపు రూపురేఖల చిత్రణ ప్లస్ మనిషి స్వరూప స్వభావాల వైరుధ్యాల ఆవిష్కరణలతో పాటు 1) సమాజంలో నెలకొని వున్న కుల, మత రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సాంఘిక, అసమానతల్లోని మూలాల్ని విశ్లేషించటం 2) వ్యక్తిని వ్యవస్థా, వ్యవస్థని వ్యక్తీ నిర్దేశించే స్థాయికి చేరిన విపర్యయాల కార్యకారణాల్ని విశ్లేషించ టం. ఈ రెండు విశ్లేషణలతో సంతృప్తి చెందక, ఆయా స్థితిగతుల్ని, సమాజ పరిణామాల నేపథ్యంలో మనిషి బతుకు రీతి ప్రమేయంగా వ్యాఖ్యానించాలి. ఇదీ సామాజిక తాత్త్వికత. దీని సాధనకీ, చిత్రణకీ కొన్ని ముఖ్యమైన ఆవశ్యకతలు ఉన్నాయి. వాటిలో మొదటిది లక్ష్యశుద్ధి. కథా ప్రయోజన దృష్టి.
బి.ఎస్. కథా రచన లక్ష్యం సామాజిక సమన్యాయం. ప్రతి మనిషికీ ఆనందకరమైన జీవన ప్రమాణం, అనుభవ సౌఖ్యం అందాలి. ఈ భావనను చదువరుల్లో ఆలోచనా ప్రేరకం చేసి ఆచరణకు అడుగు కదిల్చేటట్టు ప్రచోదనం చేయటం. కథా ప్రయోజనం అంటే కథను మనిషి అభ్యుదయ సాధన దిశగా పయనించేందుకు డ్రైవింగ్‌ఫోర్స్‌గా తయారుచేయటం. ఈ ప్రాసెస్‌లో బి.ఎస్- గతంలోని, వర్తమానంలోని రాజకీయ ఆర్థిక సాహిత్య సాంస్కృతిక సామాజిక జీవనంలోని వివిధ పరిణామా ల్ని, ఆయా పరిణామాల ప్రభావాల్నీ కలిపి కథాకథనం లో గుదిగుచ్చుతారు. అవన్నీ చక్కటి కథామాలలో తీరొ క్క పువ్వుల్లా రంగులీనుతూ ఉంటాయి. బి.ఎస్. కథల న్నీ ఈ లక్ష్యాన్నీ, ధ్యేయాన్నీ చిత్రించినవే. ప్రతి కథా ఒక ఉదాహరణ.
BS-Ramulu
కాలం తెచ్చిన మార్పు ఉంది. మార్కండేయులు చుట్టూ తిరగాల్సిన కథ. నిజానికి అతని పెదనాన్న భూమయ్య కేంద్రకమౌతుంది. మార్కండేయులు ఉద్యోగిని అయిన భార్య అనితతో, ఇద్దరు పిల్లలతో సుఖంలేని సంసారం గడుపుతున్నాడు. మనసులో విడాకుల ఆలోచన ఉన్నది. అతని ఘోషంతా విని భూమయ్య ఓ మాట అంటాడు. ఆడోళ్ళకు ఇష్టంలేకపోతే ఏదీ సాగ దు. ఇంటిపేరొక్కటే మనది. మిగిలిందంతా ఆళ్ళ రాజ్యమేరా. మనం పేరుకే మొగోల్లంరా. అని. ఈనాటి మని షి మనుగడలోని వైరుధ్యాల్ని విశదీకరిస్తూ-ఆనాడు మార్కండేయుని తండ్రి భార్య శాసించినట్లు, విని ఏమయ్యాడో, కుటుంబం ఏమయ్యిందో వివరిస్తాడు. కథలో నిన్న ఉన్న స్థితిని చెప్పాడు రచయిత. గ్రామీణ సౌభా గ్యం, కుటుంబ సౌభాగ్యం- లీలామాత్రంగా దర్శింపజేశారు. ఆ వెంటనే సమాజగమనాన్నీ, మనిషి పయనాన్నీ కూడా విశదం చేశారు. ఛిద్రమైన వ్యవసాయాన్నీ, ఆర్థిక సమస్యల్నీ పారదర్శకం చేశారు. వాటి ప్రభావంతో చితికిపోయిన కుటుంబ పరిస్థితినీ చూపారు. ఆ దశలో కుటుంబంలోని స్త్రీ అధికార స్వరాన్ని వినిపించారు. స్థితీ, చలనాల గమనాన్ని పొడిగించుకుంటూ వచ్చి, వాటి ప్రభావాన్ని చూసి ఇవ్వాళ మార్కండేయులికి రేపటి స్పృహను కూడా తెలియజేశారు. ఇదీ కథలో వచ్చిన కాలం తెచ్చినమార్పు!
కాలం తెచ్చిన మార్పు కథకు కొనసాగింపు వంటి స్వేచ్ఛ నుండి విముక్తి కథని మొన్న మొన్న రాశారు బి.ఎస్. జయకు ఆర్థిక స్వాతంత్య్రం వుంది. ఎంతోమం ది సిబ్బంది వున్నారు. అయినా సమస్యలు, కష్టాలు... కొన్ని అభిప్రాయాలు కలవక పోతే భర్తతో విడిపోవటమేనా? ఈ సందర్భంలో తండ్రి స్వేచ్ఛ పర్యవసానాల గురించీ కూతురితో చర్చిస్తాడు.
పెళ్ళికాక ముందు ఉండే స్వేచ్ఛ వేరు. పెళ్ళయ్యాక కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడంలో, విడాకులు తీసుకోవడంలో వుండే స్వేచ్ఛ వేరు. ఈ రెండూ ఒకటికాదు. బ్రహ్మచారిగా జీవితాంతం స్వేచ్ఛగా పెళ్ళిలేకుండా జీవించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. కానీ పెళ్ళయ్యాక అలాంటి స్వేచ్ఛ కోరుకుంటే లేదా కుటుంబం నుంచి జయ వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలను ఈ సమాజం ఎలా భావిస్తుందో మీ మిత్రుల బతుకును చూశావుగా! ఆ మిత్రులెరో నీకు తెలుసు గదా!
మాధవికి ఆ మిత్రుల గురించి బాగా తెలుసు! వాళ్ళ భార్యలు వాళ్ళను ఎలా ఎంత రాచి రంపాన పెడుతున్నారో కూడా తెలుసు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మాధవికి వాళ్ళు ఎందుకు అలా మారారో.. గడిచిన గతాన్ని గుర్తుచేసుకుంటూ నిరంతరం నరకాన్ని ఎందుకు సృష్టించుకుంటారో అర్థం కాదు.. వారి స్వభావాలు మారడం లేదు. నాన్న నుండి అన్నీ పొంది కూడా నాన్నకు నరకం చూపిస్తున్నారు అనుకుంది. ఆ తర్వాత స్వేచ్ఛ, స్వయం నిర్ణయ స్వేచ్ఛ గురించి పూర్వాపరాలుగా రచయిత చాలా చర్చిస్తారు.
-విహారి, 98480 25600

265
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles