సాహిత్య సవ్యసాచి దోరవేటి


Mon,February 25, 2019 01:11 AM

సాహిత్యం పట్ల ప్రేమ, తపన ఉన్నవారి అభివ్యక్తి అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. అది కథ కావొచ్చు, నవల, పద్యం, గేయం, నాటకం కావొచ్చు. ఇలా అనేక ప్రక్రియలలో తన సాహితీ సేద్యాన్ని కొనసాగిస్తున్న విశిష్ట కవి, రచయిత దోరవేటి. రంగారెడ్డి జిల్లా ధారూరు పూర్వనామం దోరవేటి. తన స్వగ్రామం పేరునే తన కలం పేరుగా మార్చుకున్న పల్లె ప్రేమికుడు దోరవేటి. 30కి పైగా గ్రంథాలు వెలువరించారు. వీటిలో తొమ్మిది నవలలు, పది కథా సంపుటా లు, నాలుగు శతకాలు, వ్యాస సంపుటాలు ఇలా భిన్న ప్రక్రియలలో వీరి సాహితీ సృజన సాగుతున్నది.

పద్యమే ప్రాణముజిహ్వకు పద్యమె నా తెలుగు జాతి ప్రజ్ఞాయశముల్ పద్యమె రసనైవేద్యముపద్య కవిత హృద్వికాస పడమగు నేస్తం..
అంటూ పద్య ప్రాశస్త్యాన్ని తెల్పిన ఈ కవి తెలుగు సాహి తీ లోకానికి అందించిన గొప్ప వ్యాఖ్యాన గ్రంథం పద్యం-రసనైవేద్యం తెలుగు సాహిత్యంలో లబ్ద ప్రతిష్టులైన కవులు రాసిన మేలిమి పద్యాలను ఏరి ఒకచోట కూర్చి వాటికి వ్యాఖ్యానం రాసిన గ్రంథమిది. సాహితీ విద్యార్థులకు పరామర్శ గ్రంథంగా ఉపయోగపడుతుంది.సమకాలీన సమాజంలో మానవ మనస్తత్వాన్ని, అడుగంటిపోతున్న మానవీయ విలువల్ని పట్టి చూపిన కథాసంపుటి నాన్నకు జేజే.దేశభక్తి, సామాజిక బాధ్యత, మానవ త్వం ఈ కథల నిండా ప్రతిఫలిస్తాయి. దోరవేటి కథలు ఏదో ఒక ఆదర్శాన్ని సమాజానికి అందిస్తూనే ఉన్నాయి. తన చిన్ననాడు తనకు విద్యాబుద్ధులు నేర్పిన తన గురువుకు తాను రాసిన పుస్తకాన్ని అంకితం చేసిన శిష్యుడి కథ కాను క. ఈ కానుక కథా సంపుటిలో ఉన్న మిగిలిన పన్నెండు కథలూ దేనికవే సాటి.

పాల్కురికి సోమనాథుని అద్దంలో చూపిన గ్రంథం బస వ పంచశతి. ఇది సంక్షిప్త బసవపురాణం. శివ భక్తుల భక్తి పారవశ్యాన్ని ఆటవెలదులలో అందంగా ఆవిష్కరించిన గ్రంథమిది. దోరవేటి పరిశోధనా పటిమకు దర్పణం భారతీయ కళలు వ్యాస సంపుటి. మానవ జీవితాన్ని సుఖప్రదం,జయప్రదం చేయడంలో కళలు కీలకమైనవి. వాత్సా యనుడు పేర్కొన్న 64 కళల సమగ్ర విశ్లేషణ ఈ గ్రంథం. భారతీయ జీవన సౌందర్యాన్ని చూపిన భారతీయ కళలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది. స్వతహా గా కవి, రచయిత, గాయకుడు, చిత్రకారుడు, బుర్ర కథా కళాకారుడు, అవధాని, అయిన దోరవేటి పది కళలలో నిష్ణాతులు.వీరి లేఖిని నుంచి భారతీయ కళలు రావడం సము చితంగా ఉంది.
చారిత్రక నవలలు రాయడంలోనూ దోరవేటి అందెవేసిన చేయి. మరోశివాజీ, అసమానవీరుడు-బాజీరావు మస్తానీల విషాదాంత ప్రేమకథ పాఠకులను ఆసాంతం చదివిస్తుంది. ఈ నవలల్లోని భాష దోరవేటి నాటి కాలంలోని పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేసినంత సహజ సుందరంగా కనిపిస్తుంది. దోరవేటి గారి చారిత్రక కథలూ వారి అసమాన ప్రతిభా సంపన్నతకు నిదర్శనాలు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ చరిత్ర, సాహి త్యం పట్ల పరిశోధనా స్పృహ మరింత పెరిగింది. ఈ కోణం లో తెలంగాణ ప్రాచీన కవుల జీవితాలను అధ్యయనం చేయడానికి కరదీపిక వంటి గ్రంథం మనకవులు - మహాకవులు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన దోరవేటి తన పరిసరాలు, అనుభవాల కలబోత ఆచార్యదేవోభవ. ఇది ఉపాధ్యాయ కథల సంపుటి. నేటి విద్యావ్యవస్థ, గురుశిష్యుల సంబంధాలు, పాఠశాల నిర్వహణ తీరు ఈ కథలలో చక్కగా విశదీకరించారు. విద్యావ్యవస్థ తీరుపైనే వీరు రాసిన మరొక గ్రంథం చదవేస్తే ఇది వ్యంగ్య వ్యాసావళి. ఈ వ్యాసాలలో విద్యారంగంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల, అధికారుల పాత్రను తెలియజెప్పేలా ఉండే రామలింగం పాత్ర ద్వారా సమాజానికి చక్కని సందేశాన్నిస్తాయి.
దోరవేటి కలం నుంచి వెలువడిన ఖండకావ్యాలు అంజ లి, అంజలి-2. సాంప్రదాయికమైన పద్య ఛందస్సులో సామాజిక స్పృహ కలిగిన ఆధునిక భావాలతో పద్యం రాయడంలో దాశరథి పేరెన్నిక గన్నవారు. ఆ కోవలోనే మనకు దోరవేటి దర్శనమిస్తారు. చక్కని ధారాశుద్ధితో తన మనసులోని భావాలను పద్యాలలో అలవోకగా గుప్పించడం వీరికి కరతలామలకం.

ఇవేకాక చక్కని స్నేహానికి అర్థం చెప్పిన నవల జీవనది. చరిత్ర మరిచిన గొప్ప వాగ్గేయకారులు శ్రీ రాకమచెర్ల వెంకటదాసు జీవిత చరిత్ర, బసవేశ్వరుని జీవితాన్ని అక్షరీకరించిన వచనకావ్యం శరణు బసవ, ప్రౌఢమయిన భక్తి శత కం సాంబశివశరణం మొదలైన గ్రంథాలు దోరవేటి అసమాన ప్రతిభకు నిదర్శనాలు. ఈ కవి తన రచనలకు జీవితానికి మధ్య అంతరం లేకుండా జీవిస్తుంటారు. ఈ కవి నుంచి మరిన్ని గ్రంథాలు రావాలని ఆకాంక్షిద్దాం.
- సాగర్ల సత్తయ్య, 99665 49991

అభినందన సభ

ప్రముఖ కవి దోరవేటి ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ నెల 28న శామీర్‌పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అభినందన సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా డాక్టర్ కె.వి.రమణాచారి, నందిని సిధారెడ్డి హాజరవుతారు. ఈ సందర్భంగా రాయారావు సూర్యప్రకాశ్‌రావు సంపాదకత్వంలో దోరవేటి సాహితీ వ్యాసంగంపై యాభై వ్యాసాల సం కలనం విపంచిని ఆవిష్కరిస్తారు. అలాగే సాగర్ల సత్తయ్య సంపాదకత్వంలో దోరవేటి బాలల కోసం రాసిన కథలు, గేయాలు,పద్యాల సంపుటి మీ కోసం ఆవిష్కరించి విద్యార్థి లోకానికి అంకితమివ్వనున్నారు. గోరటి వెంకన్న, అమ్మంగి వేణుగోపాల్ తదితరులు హాజరవుతారు.

4489
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles