అర్థ‘తాత్పర్యాలు’


Mon,February 18, 2019 01:35 AM

rama-chandramouli
జీవితం అనే పదానికి అర్థం చెప్పడం ఎంత కష్టమో..,తాత్పర్యం చెప్పడం కూడా అంతే కష్టం. జీవితం యొక్క అర్థ తాత్పర్యాలు తెలుసుకోవాలంటే, ఆ జీవితాన్నే మరింత లోతుగా పరిశీలించాల్సివుంటుంది. సమాజం ఒకటే అయినా ఎదురయ్యే సమస్యలు ఎందుకు వేరుగా ఉంటాయో! జీవి తం ఒకటే అయినా జీవన విధానం ఎందుకు ఏకరీతిగా ఉండదో గమనించాలి. మనుషుల మధ్య ఏర్పడే బం ధాలకు, వారి జీవితాల్లో చోటు చేసుకునే మార్పులకు కారణం ఏమిటో కూడా కనిపెట్టాలి. అలా చేస్తే తప్ప మానవ సంబంధాలలోని వైవిధ్యానికీ, వైరుధ్యాలకూ మూలమేమిటో తెలియదు. వాటి వెనుక దాగి ఉన్న జీవన తత్వమేమిటో తెలియదు. దాని తాత్పర్యమేమిటో తెలియదు! ప్రముఖ రచయిత రామా చంద్రమౌళి తన తాత్పర్యం కథా సంకలనం ద్వారా ఈ విషయమే చెప్పే ప్రయత్నం చేశారు. ఇరువై కథలున్న ఈ సంకలనం నిండా విలువలు, కట్టుబాట్లు, కలయికలు-ఎడబాట్లు, వంచనలు-వేదనలే. ఇతివృత్తా లు వేరుగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ జీవన తాత్వికత ఇరుసుగా, అనుభవాలసారం-జ్ఞాపకాల భారంగా ఈ కథలన్నీ సాగడం ఈ సంకలనంలో చూస్తాం. సగటు మనిషి దృష్టి తన పరిధిని దాటి ఎందుకు ముందుకు వెళ్ళదు? విజాతి మనుషలు ఎందుకు వికర్షించుకుంటారు? జ్ఞాపకాలు ఏవైనా అంతిమంగా అవి మనిషికి దుఃఖాన్ని మాత్రమే మిగుల్చుతాయా? లేక దుఃఖం నిజంగానే సంఖం కంటే సుఖంగా వుంటుం దా? జీవితంలో చోటు చేసుకొనే ఘటనలో మానవ ప్రమేయం ఎంత? లాంటి ప్రశ్నలలాగా కనిపించే కథల శీర్షికలు పాఠకుడిని ఆలోచింపచేస్తాయి.

బంధాలు బలపడటానికైనా, సంసారాలు కొనసాగడానికైనా చాలా కథలలో అవసరాలే ప్రాతిపదిక! అయినప్పటికీ భిన్న మనస్తత్వాలు, భిన్న దృక్పథాలున్న వ్యక్తులకు సంబంధించిన కథలు కూడా ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి. తాత్పర్యం కథలో నరసింహం ఎట్లా ఆలోచిస్తాడో విజాతి మనుషులు వికర్షిస్తారులో మనోరమ కూడా అట్లాగే ఆలోచిస్తుంది. ఇద్దరిలో లింగ భేదమే తప్ప ఏ ఇతర భేదమూ కనిపించదు. అంతా వ్యక్తిగత స్వార్థమే. అనుకూలవతియైన భార్యను, సమాజ హితాన్ని కాంక్షించే భర్తను వాళ్లిద్దరూ వదిలేసుకుంటారు. వీళ్లిద్దరిలో ఏక సూత్ర వ్యక్తిగత సౌఖ్యమే! దుఃఖ లిపి కథలో వ్యవస్థీకృత హింస కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.కానీ మిగతా కథల్లో కనిపించేదంతా కంటికి కనిపించని హింసే. ఈ హింసకు మహిళలే మొదటి బాధితులు. ప్రమేయంలో లత, అమ్మగదిలో తల్లి-భార్య మనిషే ఒంటరిలో అరుణ, తాత్పర్యంలో నిర్మల! వీళ్లంతా కూడా బయటికి కనిపించని హింసకు బాధితు లే! ఇక్కడ యుద్ధాలు జరుగవు, గాయాలూ కనిపించ వు. కానీ అవి మానని గాయాలై నిత్యం సలుపుతూ ఉం టాయి. సగటు దృష్టితో చూసినపుడు ఎక్కడా నిర్బం ధం (కనిపించదు) ఉండదు. విముక్తి కూడా ఉండదు. మహిళల నోటినుంచి స్వతంత్రించి ఒక మాట గానీ బయటికి వచ్చిందో ఇక అంతే! వీళ్లేదు, నోర్ముయ్ అనే హూంకరింపుల కింద వాళ్ల కలలు, కళలు, ఆశలు, ఆకాంక్షలు సర్వం నేలమట్టమైపోతాయి. ఆధునిక మహిళల వేదనలను గ్రంథస్తం చేయాల్సివస్తే దాన్ని ఒక కొత్త లిపిలో రాయాల్సి ఉంటుంది! అది దుఃఖ లిపి! పైన చెప్పుకున్న పాత్రలది వ్యక్తిగత హింస అని అనుకుంటే దుఃఖ లిపి కథలో ఇందుకు భిన్నమైన హింస కనిపిస్తుంది.

అది వ్యవస్థీకృత హింస. భిన్నాభిప్రాయాలున్న వాళ్లను భౌతికంగా తుద ముట్టించడం వల్ల కలిగే దుష్ఫలితాలను అర్థ శతాబ్దంగా ఈ దేశం అనుభవిస్తూ నే ఉన్నది. పాలకుల విధానాల ఫలితాలే ఈ జాతిని పట్టి పీడిస్తున్నా యి. అందుకే భావాల యుద్ధం భావాలతోనే జరుగాలంటారు. లేనట్లయితే ఈ వ్యవస్థ తన వ్యతిరేకులనే కాదు, దానిలో భాగమైన వ్యక్తులను కూడా బలి తీసుకుంటుంది. ఈ సంకలనంలోని కథలో కనిపించే పాత్రలన్నీ కూడా చాలా సహజమైనవి. మనచుట్టూ సంచరిస్తున్న ట్టుగా అనిపించేవే! దుఃఖం సుఖం కంటే సుఖమాలో సుభద్ర అయినా దిగడానికి కూడా మెట్లు కావాలిలో రజియా- అతడులో రాజు, కొన్ని సముద్రాలులో పాండే అయినా మనకు ఇలాగే కనిపిస్తారు. వ్యక్తుల అల్పత్వమైనా, ఔన్నత్యమైనా ఒకేవిధంగా చిత్రించగలగడం రచయిత ప్రతిభకు నిదర్శనం. రాగద్వేషాలకతీతంగా సమాజాన్ని పరిశీలించగలిగే లోచూపు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కథకుడిగా రామా చంద్రమౌళిది యాభై ఏండ్ల అనుభవం. ఆ అనుభవం తాలూకు పరిణతి మనకు కథల్లో అడుగడుగునా కనిపిస్తుంది. కథకుడు కావడం కంటే ముందు రామా చంద్రమౌ ళి కవి కూడా కావడం వల్ల కావచ్చు కథల నిండా కవి త్వం తాలూకు పరిమళం కనిపిస్తూ ఉంటుంది. ఆకట్టుకునే శైలి వీటన్నిటికీ అదనం!
- గుండెబోయిన శ్రీనివాస్, 9985194697

(గమనిక : రామా చంద్రమౌళి గారు ఫిబ్రవరి 24న రంగినేని ఎల్లమ్మ సాహిత్య (కథా) పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles