విప్లవాత్మక సత్యవచనం-పఠాభి కవిత


Mon,February 18, 2019 01:35 AM

1972లో పఠాభి తన ఫిడేలు రాగాల డజన్ నేప థ్యం గురించి కొన్ని విషయాలు వివరించారు. 1938లో తన మనఃస్థితి ఎలా ఉందో మనకు తెలి పే ప్రయత్నం చేశారు. వాటిల్లో ప్రధానమైనవి 1.కలకత్తా నగరపు ఉన్మాద వ్యాపారపు కార్యకలాపం తనను బాధించటం. 2.చిత్సూర్ రోడ్డులోని వేశ్యల అమాయకత్వాన్ని దోపిడీ చేస్తున్న తీరు ఆయనను కలవరపరిచింది. 3.యూరప్‌లో కమ్ముకుంటు న్న యుద్ధమేఘాలు మంచు వెన్నెల తెరలమధ్య టాగూర్ ప్రభా వం తన మీద నుండి తొలగిపోయేట్లు చేశాయి. తాను అంతకు ముందు ఎంతగానో ఆరాధించిన టాగూర్ కవిత్వం తాను ప్రబంధ భావ కవిత్వాలలో చదివిన వేల రూపక సంచయం/ సమూహాలు టాగూర్ గీతాలలోని పదబంధ మాధుర్యం వాటి వాటి అర్థాన్ని కోల్పోయాయి. తన హృదయం ఆనాటికి ఒక అశాంతి నికేతనమైంది అని పేర్కొన్నాడు. అలాగే తాను ఎంతో ఇష్టంగా కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. సాహిత్యం చదవడానికి వెళ్ళినప్పటికీ ఈ వాతావరణంలో తాను చదవకుండానే తిరిగొచ్చేశాడు. వ్యాపార పనుల మీద మద్రాసుకు, నెల్లూరుకు మధ్య ప్రయాణిస్తూ తరచుగా శ్రీశ్రీని, మల్లవరపు విశ్వేశ్వరరావు కలుస్తున్న సందర్భంలోనే డాగాల డజన్ పూర్తయ్యిం ది. కలకత్తా నగరానుభవం ఒక ప్రాథమిక ప్రాతిపదిక ఫిడేలు రాగాల డజన్‌కు. తాను ఉద్దేశపూర్వకంగానే టాగూర్ ప్రభావానికి దూరంగా జరిగానని పఠాభి నిర్ద్వంద్వంగా చెప్పేరు. అలాగే వాట్ ఎట్మన్ వచన కవితలు, ఆస్కార్ వైల్డ్ బలాడ్ ఆఫ్ రీడింగ్ జైలు, ఫ్రాయిడ్ రచనలు తనను ప్రభావితం చేశాయి. వీటన్నిటికీ మించి ఐన్‌స్టీన్ స్వతంత్ర మౌలిక ఆలోచనా పద్ధతి పఠాభిని ఆకట్టుకుంది.

పఠాభి చెప్పిన ప్రకారం అప్పటికే కొత్త శబ్దాన్ని, నాదాన్ని అన్వేషిస్తున్నాడు. అంత్యప్రాసల ప్రయోగాలలో మునిగిపోయా డు. గురుదేవుడు బెంగాలీభాషలో అంత్యప్రాసలలో కొత్త ఛందస్సును భిన్నవిధాలుగా ఆవిష్కరిస్తున్నాడు. కానీ తెలుగులో పదాలు ప్రథమా విభక్త్యంతాలుగా ముగుస్తూ ఉండటం తనకు ప్రయోగం కష్టమైనప్పటికీ, తాను సాధించాననే పట్టాభి చెప్పిన మాట. తాను చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చాయి అని అన్నాడు. నిరసన, కలవరం, కలత, విచారం,ఆవేదన, అసహ నం తదితరమైన వాటితో బాధితుడవుతున్న కవికి కొత్త ఆయుధాలు అవసరమయ్యాయి. పాఠకుడిని కూర్చోబెట్టి ఆలోచింపజేసేట్లు చేసి, కలకత్తా నగరపు భావావరణాన్ని, అందులోని దుస్సహ వాస్తవికతను గమనింపజేసే పనినే లక్ష్యంగా పెట్టుకున్నాడు పఠాభి. అందుకే ఆయనంటాడు కదా.. I was prepa -red for even abuse. Abuse would have served my purpose admirably (Thirty four years ago వ్యాసం: పఠాభి- పఠాభి పేల్చిన ఫిరంగులు) సంఘర్షణ నుంచే పురోగతి సాధించబడుతుందనేది పఠాభికి ఉన్న విశ్వాసం. ఫిడేలు రాగాల డజన్‌కు ఉన్న తాత్విక నేపథ్యం, సామాజిక నేపథ్యం గురించి చెప్పాల్సి వస్తే ఆయన మాటల్లోనే చెపితే.. I had to find a rhythm that reflected the beat of the city with its cocophony of street noises mingled with human anguish మానవ ఆక్రందన నగర వీధుల రణగొణ ధ్వనులతో కూడినప్పుడు నాకొక సరికొత్త లయ కావాల్సివచ్చింది. ఆ లయ నగర నాడిని ప్రతిఫలించాలి, పట్టించాలి అన్నాడు. ఈ క్రమంలో సాంప్రదాయ గణబద్ధ ఛందసుసలను, గేయరీతులను భగ్నం చేయాల్సి వచ్చిందని వివరించాడు. వచనం విప్లవాత్మకం అని నమ్మాడు ఆయన. కొత్తది ఏదైనా నిర్మించాల్సి వచ్చినపుడు పాతదాన్ని బద్ధలు కొట్టాల్సిందేనని తీర్మానించాడు.

దువ్వూరి రామిరెడ్డి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, బుర్రా వి. సుబ్రహ్మణ్యం, నోరి నరసింహశాస్త్రి, సి.నారాయణరెడ్డి, కె.వి. రమణారెడ్డి, వేల్చేరు నారాయణరావు లాంటివారు పరస్పర భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారు. వారి అభిప్రాయాల మీద చర్చోపచర్చలు జరిగాయి. ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో పఠాభి ప్రయోగ పరత్వాన్ని సమర్థించినవారు తక్కువే. వేల్చేరు నారాయణరావు ఒక్కరే పఠాభి కవిత్వం మీద వచ్చిన విమర్శలకు సమర్థంగా జవాబులు చెప్పి సమన్వయం చేశారు. పఠాభి కవిత్వ నిర్మాణం మీద భాషాశాస్త్ర దృష్టికోణం నుంచి చర్చ జరగాలంటే ఎవరో ఒకరు మరింత కృషి కొనసాగించాల్సిన అవసరం కనపడుతున్నది. విశ్వనాథ సత్యనారాయణగారు పఠాభి కవిత్వం గురించి తన పరీశీలనను ఇలా చెప్పేరు. ఆయన పుస్తకంలో చివరిపాట ఉన్నది. ఆ పాటలో వర్ణక్రమం విపరీతంగా ఉంటుంది సూచించారు. దీన్ని అదొక మోస్తరు విప్లవం అన్నారు. విశ్వనాథ వర్ణక్రమ వైపరీత్యం పఠాభి కవిత్వంలో ఉందని మాత్రమే చెప్పా రు. విపరీత వర్ణక్రమ భంగం ఎందుకు పఠాభి ఆశించాడు అని మనం ఆలోచించాలి. శ్రీపాద కృష్ణమూర్తిగారు.. వీరి రచన అంతా ఆధునిక నగరవాసి ధనికస్వామి కళ్లజోడు ధరించి చూచి రచించినట్టిది అని పేర్కొన్నారు. ఇందులో ఆధునిక నగరవాసి వరకు నిజమే కాని, పఠాభి నిజంగానే ఒక క్యాపిటలిస్ట్ కళ్లద్దాలతో చూసి రాశాడనటం చర్చించదగింది. ఇట్లా అన్నప్పటికీ ఆయన ఫిడేలు రాగా ల డజన్లో తిరుగుబాటు ఉందన్నారు. కొత్తరకపు కట్టుబా టూ కనిపిస్తాయన్నారు. దువ్వూరి రామిరెడ్డిగారి ఆక్షేపణ మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపములు పఠాభి ఆశించిన ప్రయోజనం ముందు నిలబడలేకపోయింది. పద్యానికి జీవము గతి మాత్రమే అని నమ్మి, గతిని పూర్తిగా విరిచి పారేసి వీరు తమ ప్రజ్ఞను నిలబెట్టుకున్నారు అని అన్న ది ఎవరైనా పద్యగతిని మార్చడంలో పఠాభి విజయం సాధించాడు.

పఠాభి కవిత్వంలో వ్యాకరణాన్ని వెక్కిరించడం, వ్యాకరణా న్ని ఉటంకించడం, స్వతంత్ర ప్రయోగాలు, ఆంగ్ల పదాలు, తెలుగాంగ్ల పదాలతో సంధి, హిందూస్థానీ పదాలు, సంస్కృత సమాసాలు, స్థానిక వివిధ మాండలి ప్రయోగాలు బహుళంగా కనిపిస్తాయి. తనను తానుగా భావకవిని కానని అహంభావ కవిని అని చెప్పుకున్నాడు. పఠాభి ప్రకారం చూసినా అహం అనే పదాన్ని కొంచెం విరామమిచ్చి చదివితే తానూ భావకవి నే అని చెప్పినట్లవుతుంది. తరచుగా పఠాభి కవిత్వంలో మనం ఉదహరించే విషయం.. వచన పద్యం, దుడ్డుకర్ర. పద్యాల నడుములు విరగ దంతాననే ప్రకటన ఒకటి కాగా బాల వ్యాకరణానికి కవిగా తానిచ్చే దండన, ఇంగ్లీష్ పదకోశం నుంచి మాటలను దోచుకురావటం మొదలైనవి. పద్యం ఒక ఛందోబద్ధమయిన మూసను నియమాన్ని, గురు- లఘు యుక్త క్రమాన్ని కలిగి ఉంటుంది. యతిప్రాస సమన్వితమై ఉంటుంది కనుక ముందుగా ఆ క్రమాన్ని భంగపరుస్తాను అని పేర్కొన్నాడు. ఈ భంగపరచడం భావకవులకు పద్యం పట్ల ఉన్న మమత్వాన్ని భగ్నం చేయడం కోసమే. మరి వ్యాకరణాన్ని ఎందుకు దండించడం? వ్యాకరణం భాషాపరం గా ఒక నియమాన్ని విధిస్తున్నది. ఛందో భాషా నియమాలను తాను పాటించనని నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు. ను వర్ణంబు ద్వితీయఅని బాలవ్యాకరణంలో సూరి సూత్రీ కరణ ద్రుతము వచ్చే పలు చోట్ల పొల్లు నకారం ప్రయోగిస్తాడు పఠాభి. అయితే విభక్తిని తిరస్కరిస్తున్నాడా లేక అచ్చును పరిహరిస్తున్నాడా? ఎందుకు పఠాభి ఈ పనిని చేయాల్సి వచ్చిందనేది మరింతగా పరిశీలనను ఆపేక్షిస్తుంది. దీన్ని వ్యాకరణ నియమోల్లంఘన లేదా నియమాతిక్రమణగా సరిపెట్టవచ్చా? అట్లా సరిపెట్టవలసి వస్త్తే అందుకు సమర్థన ఏమిటి అనేది కూడా ఆలోచించవలసిందే.

ఆత్మకథ ఫిడేలు రాగాల డజన్ అనే కవితలో పఠాభి తన ఐడెంటిటీని వెల్లడించాడు. నేను ఫలానా కాదు అని చెప్పే క్రమంలో రాష్ట్రపతి స్థానం కోసం సుభాసుబోసుతో పోటీచేసి ఓటమి పాలైన డాక్టర్ పట్టాభిని కానని చెప్పడం ఎందుకు? ఈ విషయంలో పఠాభి నాటి జాతీయ రాజకీయాల పరిస్థితిని చెపుతున్నాడు. నిజానికి పఠాభిని అతలాకుతలం చేసిన విషయం యూరప్‌లో తలెత్తుతున్న సంక్షోభం, ఈ సంక్షోభంలోంచే అంత కుముందు డాడాయిస్టులు ఉద్భవించారు. ముఖ్యంగా జ్యూరి చ్ డాడాయిస్టుల బృందం యుద్ధోన్మాదాన్ని, అది సృష్టించిన సంస్కృతిని తీవ్రంగా నిరసించారు. జ్యూరిచ్ బృందం ఎం తగా కోపోద్రిక్తం అయ్యిందంటే అది పాశ్చాత్య ప్రపంచపు విలువలను, ఆ విలువలకు మూలంగా నిలిచిన సంస్థలకు వ్యతిరేకంగా నిలిచారు. బూర్జువా వ్యవస్థల డొల్లతనాన్ని వెల్లడించారు. ఆ బృందం సామాజిక, రాజకీయ, మత, నైతిక విలువలను లక్ష్యంగా చేసుకుని దూషించారు, సంప్రదాయ కళలు, కవి త్వం, కళాకారులు అందరూ డాడాయిస్టుల దాడికి గురయ్యా రు. సరిగ్గా డాడాయిస్టులు చేసిన పనే పఠాభి ఒంటరిగా చేశా డు. మృతప్రాయంగా మారిన వ్యవస్థ, మానవుడు ఈ రెంటినీ నిరాకరించారు. పఠాభిది నిరాకరణ కవిత. అన్నిరకాల అనుకరణల పట్ల తీవ్ర అసంతృప్తి సకల రూపాల్లో ఆవిష్కారమయ్యే మౌలికతను పఠాభి కీర్తించాడు. రెండోది- మంచి అభిరుచి, పదసామరస్యం అనే వాటి పట్ల తిరుగుబాటును ప్రకటించాడు. సుడిగుండంలా తిరిగే ఆధునిక నగర జీవన చిత్రణ పఠాభి చేసింది. అసలు నియమబద్ధ వాక్య నిర్మాణ పద్ధతిని భంగపరిచే ప్రయత్నం పఠాభిది. పదాల యథేచ్ఛ ఉంటుంది.

చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను అన్న పఠాభి ప్రయోగశరణం వ్యాకరణం అనే ఉక్తిని నిజం చేస్తూ తాను ప్రయోగించిన వాటికి కొత్త వ్యాకరణ సూత్రాలను ఏర్పరుచుకునే పరిస్థితి కల్పించాడు. అయితే తెలుగు కవిత్వంలో ప్రయో గ పరత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత, భయమూ ఉండటం చేత పఠాభి ప్రాసంగికత నాటికి గానీ, నేటికి గానీ ఎంత ఉన్నా ఇం కా నిగ్గు తేల్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఫిడేలు రాగ ప్రకంపన తీవ్రత, వ్యాప్తి అటువంటిది.
- సీతారాం

పఠాభి జీవితం-సాహిత్యం: శత వసంతాలు

గ్రంథావిష్కరణ సభ నెల్లూరు, టౌన్‌హాల్‌లో 2019 ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ సందర్భంగా జరుగు వివిధ సెషన్లలో సభాధ్యక్షులుగా రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, కాళిదాసు పురుషోత్తం, ఈదూరు సుధాకర్, పెళ్లకూరు జయప్రద వ్యవహరిస్తారు. శిఖామణి కీలకోపన్యాసం చేస్తారు. వి.ప్రతిమ, యాకుబ్, జూపల్లి ప్రేంచంద్, ఆర్.సీతారాం, మేడిపర్తి ఓబులేసు, వంశీకృష్ణ, మేడిపల్లి రవికుమార్ పత్ర సమర్పణ చేస్తారు.
- సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి, నెల్లూరు

810
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles