ప్రపంచమంతా అతని రంగస్థలమే


Mon,January 21, 2019 12:08 AM

జానపద రూపకాలే కాకుండా భారతీయ శాస్త్రీ య నృత్య రీతులను వివేచించి, సమీక్షించే ప్రజ్ఞాశాలి. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థల సభ్యుడిగా ఎంపిక చేసి గౌరవించా యి. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఆయన చేసిన నిర్విరామ కృషి ఈ తరానికి
దిక్సూచిగా నిలుస్తుంది.

VIJAY-KUMAR
నాటకరంగంలో ఆయన నడిచే ఒక విజ్ఞాన సర్వస్వం. పాశ్చాత్య, భారతీయ నాటక రంగాలను ఔపోసనపట్టి తెలుగు నాటకరంగాన్ని ప్రభావితం చేసినవా డు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. ఐదు దశాబ్దాల పాటు నటుడిగా, నాటకకర్తగా, ప్రయోక్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, అధ్యాపకుడిగా తెలుగు నాటకరంగంలో చెరగని సంతకమై కనిపిస్తాడు. ఆయన తెలంగాణ ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మలుచుకొని వరంగల్, హైదరాబాద్‌లలో అధ్యాపకుడిగా పనిచేస్తూనే నాటకరంగ వ్యాప్తికి అవిశ్రాంతంగా కృషిచేశా డు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించిన తొలిరోజుల్లో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, మఖ్దూవ్‌ు మొహియిద్దీ న్, మంత్రి శ్రీనివాసరావు వంటి వారు నాటకరంగ వ్యాప్తికి తొలి పునాదులు వేస్తే, 1980 దశకంలో నాగభూషణ శర్మ నాటకాన్ని విశ్వవిద్యాలయాల పీఠాలపై అధిరోహింపజేశాడు. భారతీయ నాటకరంగంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకు న్న నాగభూషణ శర్మ సుదీర్ఘ నాటక ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటి ఈ నెల 15న తన జీవన నాటకరంగం నుంచి నిష్ర్కమించి నాటకరంగానికి తీరని లోటును మిగిల్చాడు.

1936 జూలై 24న సుబ్రహ్మణ్యం, కామేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి స్ఫూర్తితో బాల్యంలోనే నాటకరంగం పట్ల ఆకర్షితులై కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రతో రంగస్థల వేదికను కనువిందు చేశాడు. గుంటూరులో కాలేజీ విద్యను అభ్యసించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఆంగ్లంలో ఎం.ఏ. డిగ్రీని పూర్తిచేశారు. కాని నాటకరంగం లో ఉన్నత చదువులు అభ్యసించాలన్న తపన ఆయనను అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చేర్చింది. అక్క డ నాటక దర్శకత్వంపై ఎం.ఎఫ్.ఏ. కోర్సు పూర్తిచేయడమే కాకుండా అమెరికన్ నాటకాలపై పీహెచ్‌డీ. అందుకున్నారు.

నాగభూషణశర్మ వరంగల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పదోన్నతిపై ఓయూ ఆంగ్ల శాఖలో రీడర్‌గా చేరారు. ఆ సమయంలోనే వైస్ చాన్స్‌లర్ ఆచార్య జి.రామిరెడ్డిని ఒప్పించి ఓయూలో నాటక కోర్సును ప్రారంభించడంలో కీలక భూమిక పోషించారు. అదే శాఖకు 1982లో ఆచార్యుడిగా ఎంపికై తొలి అధిపతిగా నియమితులయ్యారు. రాజా రాందాస్, చాట్ల శ్రీరాములు వంటి ప్రతిభామూర్తులతో కలిసి ఉస్మానియా రంగస్థల శాఖను ఆధునిక ప్రయోగశాలగా మార్చారు. అంతకుపూర్వం 1960 దశకంలో తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాసరావు ఆంధ్ర విశ్వవిద్యాలయ రంగస్థల శాఖను ఆధునిక నాటక ప్రయోగాలకు తొలి బీజం వేస్తే దాన్ని అందిపుచ్చుకొని నాగభూషణశర్మ హైదరాబాద్‌లో నవ్య నాటకాల ఆవిష్కరణకు తెరతీశాడు. ఆయన వారసత్వంగా చాట్ల శ్రీరాములు, ఆచార్య డి.ఎస్.ఎన్.మూర్తి కొనసాగించారు. ఆయన స్కూల్ నుంచే తనికెళ్ళ భరణి, తల్లావఝుల సుందరం, ఆచార్య ప్రసాదరెడ్డి, ఆచార్య భిక్షు, యాదగిరి వంటివారు వెలుగులోకి వచ్చా రు.

ఆయన పర్యవేక్షణలో తనికెళ్ళ రాసిన గో గ్రహణం వంటి ఎన్నో నాటకాలు ఉస్మానియా నాటక శాఖలో పురుడు పోసుకొ ని తెలుగు నాట ప్రఖ్యాతి పొందాయి. నాటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం నేటి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణాన్ని వేదికగా చేసు కొని తాను అనువాదం చేసిన రాజా ఈడిపస్ నాటకం స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించబడింది. తెలుగు నాటక చరిత్రలో ఈ ప్రదర్శన అత్యుత్తమ ప్రదర్శనగా మన్ననలు పొందింది. 1988లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన రంగస్థల శాఖకు తొలి శాఖాధిపతిగా, డీన్‌గా సేవలందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల విభాగానికి 1996లో శాఖాధిపతిగా నియమితులయ్యా రు. ఆయన అక్కడ పనిచేసిన కాలంలోనే చంద్రశేఖర కంబార కన్నడంలో రాసిన నాటకాన్ని సాంబశివ ప్రహసనంగా తెలుగులోకి అనువదించారు. ఈ నాటకాన్ని తల్లావఝుల సుంద రం దర్శకత్వంలో విద్యార్థులు ప్రదర్శిస్తే ప్రేక్షకులే కాదు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఇతర భాషా నాటకాలను తెలుగులోకి అనువదించడంలో ఆయన సృజనాత్మక రచయితగా ఖ్యాతిగాంచారు. ఇబ్సన్ రాసి న డాల్స్ హౌజ్‌ను బొమ్మరిల్లుగా, బెక్ట్ రాసిన కకేసియన్ చాక్ సర్కిల్‌ను తెల్లసున్నగా, శామ్యూల్ బకెట్ రాసిన నాటకాన్ని దేవుడయ్య వస్తాడటగా అనువదించాడు. గిరీష్ కర్నాడ్ తుగ్లక్ వంటి నాటకాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా దాదాపు 50కి పైగా ఇతర స్వతంత్ర నాటకాలు రచించారు.

నాగభూషణశర్మ తెలుగు నాటకాలే కాకుండా ఆంగ్ల నాటకాల ప్రదర్శనకు హైదరాబాద్ డ్రమెటిక్ సర్కిల్‌తో జతకట్టారు. ప్రయోక్తగా అనేక నాటకాలను హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ముఖ్య నగరాల్లో ప్రదర్శించారు. మాక్‌బెత్, డాల్స్‌హౌజ్, ఎనిమీ ఆఫ్ ద పీపుల్, ఎంపరర్ జోన్స్, వేయిటింగ్ ఫర్ గోడో, తుగ్లక్ వంటి నాటకాలు ఆయనకు ఖ్యాతిని తెచ్చి పెట్టాయి.

ఆయన తరగతి గదుల్లో బోధించిన పాఠాలు నాటక విద్యార్థుల్లో చెరగని ముద్ర వేశాయి. పాశ్చాత్య నాటకరంగం గురించి ఆయన సాధికారికంగా పాఠం చెబితే తరగతి గదులు పరవశించేవి. ఆయన నిరంతరం తరగతి గదిలోనో, నాటక రిహార్సల్స్‌లోనో, గ్రంథాలయాల్లో గడపడంతోనే ఆనందాన్ని వెతుకున్నా డు. తన సంపాదనంతా నాటక, జానపద పరిశోధనలకు, పుస్త క ప్రచురణలకు ఖర్చుచేసి నిరాడంబరంగా జీవించాడు. ఆయ న రాసిన రంగస్థల శాస్త్రం, నాటకశిల్పం, నాటకరంగ పరిభాషిక పదకోశం, ఆంధ్రప్రదేశ్ ఫోక్ పర్‌ఫార్మెన్స్ వంటి గ్రంథా లు ఈ తరానికి మార్గదర్శనం చేస్తాయి.

1993 మార్చి 9న హైదరాబాద్ బొగ్గులకుంటలో రసరంజని సంస్థ ప్రారంభించబడింది. దీనిని కె.వి.రమణాచారి, జే. వి.సోమయాజులు, గరిమెళ్ల రామ్మూర్తితో పాటు నాగభూషణ శర్మ ఓ మూలస్థంభమై నడిపించాడు. ఆయన ఈ సంస్థ ద్వారా 250 నాటకాలు 3,500 ప్రదర్శనలు జరుగడానికి కృషి చేసి నాటకానికి బ్రహ్మరథం పట్టే రోజులు రావాలని తపించాడు.

నాగభూషణశర్మ ప్రతిభ బహుముఖీనమైనది. నాటకానికి సమాంతరంగా శాస్త్రీయ, జానపద కళల వికాసానికి కృషిచేశా రు. 1968లోనే జానపద కళలపై మక్కువ పెంచుకొని బొమ్మలాట ప్రదర్శించే పద్ధతిని నేర్చుకున్నాడు. బొమ్మలాట బృందాలను వెంటేసుకొని జపాన్, ఫ్రాన్స్, గ్రీసు దేశాల్లో ప్రదర్శించి తెలుగు జానపదానికి పట్టం కట్టాడు. పరిశోధకుడిగా అనేక అం శాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఆయా ప్రక్రియలను, కళాకారులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పరిచయం చేశారు. ఒగ్గు కథ, చిందు భాగవతం, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టాడు. ఆయన ప్రదర్శించిన నాటకాల్లో జానపద కళారూపాలను ప్రవేశపెట్టి ప్రయోగాత్మకంగా ఆవిష్కరించాడు. ఆయన రాసిన తెలుగు నవలా వికాసం సాహిత్యరంగంలో ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.

నాగభూషణశర్మ నిత్య చలనశీలి. ఆ తత్వమే అతనిని అధ్యయనం వైపు నడిపించింది. ద సురభి థియేటర్, నాట్యాంభుజం, తొలి నాటి గ్రావ్‌ుఫోన్ గాయకులు, కూచిపూడి గురుస్ అండ్ పర్‌ఫార్మెన్స్, ధర్మవరం నాటక సాహిత్యం వం టి అనేక గ్రంథాలు పరిశోధనాత్మకంగా వెలువరించారు. భిన్న ప్రక్రియల్లో ఆంగ్లంలో 15 గ్రంథాలు, తెలుగులో 22 గ్రంథాలు ప్రచురించారు. పరిశోధనాత్మక పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఇండియన్ థియేటర్ జర్నల్, నర్తనం మాగజైన్‌కు ఎడిటర్‌గా ఉంటూ ఎన్నో పరిశోధక వ్యాసాలు ప్రచురించారు. జానపద రూపకాలే కాకుండా భారతీయ శాస్త్రీ య నృత్య రీతులను వివేచించి, సమీక్షించే ప్రజ్ఞాశాలి. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థల సభ్యుడిగా ఎంపిక చేసి గౌరవించా యి. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఆయన చేసిన నిర్విరామ కృషి ఈ తరానికి దిక్సూచిగా నిలుస్తుంది.

- డాక్టర్ జె.విజయ్‌కుమార్‌జీ, 9848078109
(ఈ నెల 15న కన్నుమూసిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మకు నివాళిగా..)

945
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles