ఒక దీర్ఘ ‘తపస్సు’లోంచి..


Sun,January 13, 2019 10:57 PM

తపస్సు నుంచి బయటకు వచ్చిన తరువాత మానవ సంబంధాలు ఎంత ఛిద్రమవుతున్నాయో, మనుషులు ఎంత విచ్ఛిన్న దశకు చేరుకున్నారో, మానవ విలువలు ఎంత భగ్నమైపోయాయో అవగతమై హృదయమంతా ఒక మధ్యాహ్నపు ఎండను తాగినంత కఠినమైన అనుభూతి మిగులుతుంది.
TAPAS-FRONT
Lack of good translations is one of the reasons for low visibility of Indian literature in general and Telugu in particular
- కె.పురుషోత్తం

దేశంలోని బెంగాలి, మళయాలం, తమిళం, కన్నడ భాషల సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదమైనంతగా తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు. ఇదే సమయంలో ఇతర భాషల సాహి త్యం విరివిగా తెలుగులోకి అనువాదమవుతున్నది. అనువాద విషయంలో ఆదానం, ప్రదానం రెండూ ముఖ్యమైనవే. కేవలం ఆదానమే ఎక్కువగా జరుగుతుండటం వలన తెలుగు ప్రజల సాహిత్య విశాలత్వం, సంస్కృతి ఇతర భాషల ప్రజలకు చేరవలసినంత చేరడం లేదు. దీని వల్ల అసలు సాహిత్యమే అంతంత మాత్రమనే తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి. అయితే దీన్ని బద్దలు కొడుతూ అప్పుడప్పుడు మైలు రాళ్లలాంటి కొన్ని తెలుగు గ్రంథాలు, కావ్యాలు ఇతర భాషల్లోకి అనువాదం కావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకే పుస్తకంలో ఒక వైపు తెలుగు మరో వైపు దాని ఇంగ్లీష్ అనువాదం అంటే ద్విభాషా కవిత్వం వేయడం కూడా ఒక కొంత పుంత. అలా వచ్చినవి కూడా తెలుగుతో తక్కువే. ఇటీవల డాక్టర్ రాధేయ రాసిన మగ్గం బతుకు తరువాత తాజాగా ప్రొఫెసర్ రామా చంద్రమౌళి రాసిన తపస్సు కవిత్వం కనిపిస్తాయి.
ఔను! కవిత్వమంటే ఒక జీవిత తపస్సు. ఒక దీర్ఘ ధ్యానం. ఒక ఏక్‌తార రసనాదం. దాని అంచులు తాకాలంటే మనమూ తపస్సులో మునగాల్సిందే. ఈ తపస్సు మనిషి జీవిత సంక్షోభాన్ని లోతుల నుంచి కుప్పలు కుప్పలుగా తవ్విపోస్తుంది. వ్యష్టి స్వార్థమే కేంద్రమై రోత పుట్టించే సామాజిక చర్యలు మన చుట్టూ విస్తృతమవుతున్న తరుణంలో ఈ తపస్సు మన దళసరి శరీరాలపై ఒక చర్నాకోల దెబ్బ.

ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిదారుల్లారా.. బాజాప్తా చొరబాటుదారుల్లారా
సుస్వాగతం మా ఎదపై పరిచిన ఎర్ర తివాచీ పైకి
రక్షణ రంగమైనా.. ఔషధ రంగమైనా.. ఆహార రంగమైనా
మా అత్యంత వ్యక్తిగత రహస్య రతిరంగమైనా
మీ నిరభ్యంతర ప్రవేశానికి సాదర స్వాగతం
రండి మీ సౌఖ్యాల కోసం, మా సుఖాల కోసం
మీ క్షణిక లగ్జరీల కోసం ఈ దేశాన్ని
మా అస్తిత్వాన్నీ, మా ఉనికినీ, మా ఆత్మగౌరవాన్నీ
మీ పాదాల ముందు తాకట్టుపెట్టి
రాజ్యాంగ సాక్షిగా బానిసత్వాన్ని స్వీకరిస్తాం..
ప్రపంచీకరణ ఇనుప పాదం మన జీవితాల్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి దేశ ప్రజల వీపులన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎర్ర తివాచీలుగానే మారిపోయాయి. అందుకే ఇప్పుడేదీ రహస్యం కాదు. వాడు మెల్లమెల్లగా మన జీవితాల్లోని అన్ని అరలకూ వచ్చి కూర్చున్నాడు. ఇన్నాళ్లూ విదేశీ వస్తువులను, పెట్టుబడులను బొంత పురుగులుగా చూసిన మనం ఇప్పుడవి సీతాకోకచిలుకలుగా మారి మన దేహాల మీద ఎగురుతూ మన వీపుల మీద వాతలు పెడుతుంటే మనం హావ్స్ అండ్ హావ్ నాట్స్‌గా మారి ఒక కుట్రబాజితనంతో వర్గీకరింపబడ్డాం. ఇక ఇప్పుడంతా మాతా భిక్షాందేహీ అని చిప్పలు పట్టుకునుడే. అందుకే గత కొన్ని దశాబ్దాల కాలంగా జీవితమంటే వ్యాపారం, వ్యాపారమంటే జీవితంగా మారిపోయింది.

నిజానికి బతకాలన్న ఆశే ఒక ఆయుధం
అంతిమంగా మరణాన్ని జయిస్తూ బ్రతకడమే విజయం
బ్రతుకును అర్థవంతంగా నిర్మించుకుంటున్న క్రమంలో
నువ్వు పదే పదే కూలిపోతావు.. శిథిలమవుతావు... పతనమవుతావు
రక్తాలోడ్తున్న పాదాలతో కత్తుల వంతెనపై పరుగెత్తీ పరుగెత్తీ
ఒక ఒంటరి దు:ఖ సముద్రంలో నిట్టనిలువుగా నిలబడ్తావు..
అందుకే జీవితం తపస్సు అనేది. ఇక్కడ ఆకాశంలో మాదిరిగానే ఎక్కడా దారులుండవు. మనమే కొత్తదారులు వేసుకుంటూ వెళ్లాలి. ఒకరు నడిచిపోయిన దారిలోనే మన జీవితం నడవదు. ఇప్పుడు మనం ఒక కొత్తదారిని నిర్మించుకోవాలి. కృషి అంటే పాతాళగరిగె. సముద్రాంతర గుప్తలోకాలను గాలించాలి. అయినా జీవితం చిక్కినట్టే చిక్కి చేజారిపోతుంటుంది. వేయిసార్లు ఓడిపోతే ఒక్క విజయం వశమవుతుంది. ఇంతా చేసి జీవితం రాలి తీరవలసిన శిశిర పత్రమే. చివరికి నీ ఆనవాలు ఇక్కడ ఏమి మిగులుస్తున్నావన్నదే ప్రధాన ప్రశ్న. నీ చిటికెన వేలును ఎవరో పట్టుకున్నప్పుడే తెలుస్తుంది. నీ చేయి విలువ. నీ వేలు విలువ. నీ నడక విలువ..
సుప్రీం కోర్టు అతని నెత్తిపై చెత్తను కుమ్మరిస్తూనే ఉంటుంది
అయినా చెత్తను గుర్తించరు
మన్ కీ బాత్‌లో రోడ్లను ఊడ్వ డం.. చీపుర్లను కొనడం గురించి
దేశ ప్రజలు చెవులు రిక్కించి స్వచ్ఛ భారత్ ప్రసంగం వింటారు
మానవ చెత్తను ఊడ్చేయగల చీపుళ్ల గురించి ఆం ఆద్మీ చెప్పడు
అయిదు వందల రూపాయల అప్పు కట్టని
రహీం పండ్ల బండిని జప్తు చేసే బ్యాంక్ మగాళ్లు
సినిమా హీరోలకూ, మాల్యాలకూ, నీరవ్ మోడీలకు
దొంగ పారిశ్రామిక వేత్తలకు వాళ్ల ఇండ్లకే వెళ్లి
వేల కోట్లు అప్పిచ్చి.. లబోదిబోమని ఎందుకు
రుడాలి ఏడ్పులేడుస్తారో తెలియదు
చాలా వరకు చెత్త కోట్ల రూపాయల కరెన్సీ రూపంలో
రెపరెపలాడ్తూంటుంది లాకర్లలో..
చెత్త పదార్థ రూపంలోనే కాదు మనుషుల రూపంలో కూడా ఉంటుందని ఈ కవి దృష్టికోణం. చెత్త ఎప్పుడూ చెడు వాసనే వేయదు. అప్పుడప్పుడూ డియోటరెంట్ వాసనల్తో మన పక్కనే మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటుందంటాడు కవి. ప్రశ్నించాల్సిన ప్రజలు 247 తలలు వంచుకొని వాట్సప్‌ల్లో, ఫేస్‌బుక్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇదీ ఇప్పుడు దేశం నిండా నిండుకున్న చెత్త యవ్వారం.

ఈ తపస్సు నిండా ఎంతో తాత్వికత నిండి ఉంది. జీవితం.. పాకురు మెట్ల దిగు డు బావి అయిన సన్నివేశంలో జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది. ప్రతి క్షణం చస్తూ, పుడుతూ ఏవో ఇరుకు దారుల గుండా ప్రయాణించాల్సే వస్తున్నది. మొండిగా అడుగు వేస్తామా ఏవో గాజు ముక్కలు కాలికి గుచ్చి జీవితం సాంతం రక్తాలోడుతున్న ఒంటరి పయనమవుతుంది.
మూల భాషలో ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టు లక్ష్య భాషలోకి తీసుకుపోవడం అంత సులభం కాదు. దీనికి రెండు భాషల వినియోగపు మర్యాదలు తెల్సి ఉండాలి. అంతేగాక మూల రచయిత భావాన్ని సరిగ్గా పట్టుకోగలగాలి. లేదంటే అనువాదమంతా పెచ్చులు ఊడిపోయిన సౌధంలా కనిపించి దాని వికారం మనసును తాకి వాక్యాన్ని దాటి ముందుకు పోనీయదు. కాని ఈ తపస్సును అనువాదం చేయడానికి అనువాదకులందరూ నిజంగానే తపస్సు చేశారని చెప్పాలి. కారణం రచయిత ఏడు దశాబ్దాల జీవితానుభవం నుంచి అనేక జీవిత తాత్విక విషయాలను చాలా లోతుగా చెప్పాడు ఇందులో. వాటిని అంతే గాఢంగా ఇంగ్లీష్‌లోకి తీసుకుపోవడం కత్తి మీద సామే. మచ్చుకు ఒకటి.
Every thing is not visible, as air
can be sensed with touch, feeling, vibrations
no reasons for bondage of relationship....
పిడికిట్లో గాలి ఉందా? అనే మూల కవితలోని కొన్ని అనువాద వాక్యాలివి. పోయెం అంతా చదువుతుంటే రవీంద్రుని గీతాంజలి గుర్తుకు వస్తుంది అక్కడక్కడ. అనువాదం అంత బాగా కుదిరింది. సాధారణంగా జాతీయాలు, సామెతలు, నుడికారాలు, పోలికలు చెప్పేటపుడు ఒక భాషలోనివి మరో భాషలో సరిగా లొంగవు. కాని వీరు అలాంటి ఇబ్బందిని కూడా చాలా సునాయాసంగా దాటిపోయారని చెప్పాలి.

తపస్సు నుంచి బయటకు వచ్చిన తరువాత మానవ సంబంధాలు ఎంత ఛిద్రమవుతున్నాయో, మనుషులు ఎంత విచ్ఛిన్న దశకు చేరుకున్నారో, మానవ విలువలు ఎంత భగ్నమైపోయాయో అవగతమై హృదయమంతా ఒక మధ్యాహ్నపు ఎండను తాగినంత కఠినమైన అనుభూతి మిగులుతుంది. నైతిక విలువలు ఎంత దిగజారిపోయాయో, మాట్లాడవలసిన మేధావులు, రచయితలు మౌనం వహిస్తూ ఎంత నష్టానికి గురిచేస్తున్నారో తెలిసి గుండెనిండా మంటలు రేగుతాయి. కవిత్వం ఏం చేస్తుందని ప్రశ్నించుకుంటే గుప్పెడు సంస్కారాన్ని మన మనసులకు పూస్తుందని, పిడికెడు గాయాల్ని మన రక్తానికి కూడా రుచి చూపి కాస్త కదలిక తెస్తుందని ఈ తపస్సు చదివిన తరువాత అర్థం అవుతుంది.జీవిత తాత్వికతను ప్రతి అక్షరం నిండా నింపుకున్న ఈ తపస్సు ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌కు అంకితమీయడం గమనార్హం.
- డాక్టర్ వెల్దండి శ్రీధర్, 98669 77741

1104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles