ఇబ్తెదాయె ఇష్క్ మే...


Sun,January 6, 2019 11:19 PM

Nomula
ఇబ్తెదాయె ఇష్క్ మే.. అరువైయవ దశకంలో వచ్చిన హరియాలీ ఔర్ రాస్తా సినిమా పాటలో తొలి చరణం అది. నా కౌమారదశ నుంచి ఆ పాటకు నేను ఫిదా. ఇప్పుడు కూడా ఆ పాట నా వీనులకు సోకగానే జ్ఞాపకాల పరిమళాలు గుప్పుమని కమ్ముకుంటాయి. అది సరేగాని నేను ఆరు పదులు దాటినాక ఒక సుప్రభాత సమయంలో ఇబ్తెదాయె ఇష్క్ అంటే ఏమిటి? అని సందేహం తొలుచుకొచ్చింది. ఆలోచిస్తుంటే ఆ మొలకెత్తిన సందేహం ఇంతింతై వటుడింతై పెరిగిపోయింది. శంకానివృత్తి కోసం పెద్దదిక్కు సామల సదాశివగారి ని అడుదామంటే ఆయనేమో స్వర్గంలో దేవతలకు అర బ్బీ, ఫారసీ, ఉర్దూభాషల సాహిత్య రహస్యాలను బోధించటంలో మస్రూఫ్‌గా ఉన్నాడాయె. ఇక చివరాఖరికి మిగిలిన ఒకే ఒక్కడు నోముల సార్‌కు ఫోన్ చేశా. గుప్పున సిగరెట్ పొగ వదిలినట్లు టక్కున సమాధానం వచ్చింది. ఇబైదాయె ఇష్క్ అంటే లేత వయసులోని తొలి వలపు అని. ఆ జవాబుతో నా తభియ త్ ఖుష్ అయిపోయింది. పిమ్మట ఉర్దూ భాష కు సంబంధించి ఎప్పు డు ఏ సందేహం వచ్చి నా కేరాఫ్ అడ్రస్, ఉన్న ఒకే ఒక దిక్కు నోముల సారు. నోములా నోములా నల్లగొండ వెన్నెలా.. ఇపుడు ఆ చివరి వెన్నల కూడా మసకేసి మబ్బుల చాటుకు మాయమైంది. ఆకాశం తలుపులు బార్లా తెరుచుకుని అవతలివైపునకు నిష్ర్కమించింది.

ఇపుడు ఉర్దూ భాషలోని అలీఫ్, పే, బే, తే, సే అక్షరాలన్నీ అనాథలై ఒంటరొంటరిగా మిగిలిపోయినై.. మనందరితో సహా!
రెండు పదుల క్రితం ఒక కొత్త సంవత్సరం తొలిరోజు జయమిత్రులందరం అమ్మంగి ఇంట్లో కలుసుకుని అమ్మంగి రాసిన పాట చిన్న గొర్రెపిల్లలమూ నోములా- మెల్లమెల్లగా నడుపు నోములా.. అని కోరస్‌గా పాడుతుంటే ఆయన చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తూ చుక్కల్లో చంద్రుడిలా మా మధ్య కొలువుతీరి గుప్పుగుప్పున పొగలు పీలుస్తూ వదులుతూ కూచున్నాడు.. అల్లపుడెపుడో బొగ్గుతో నడిచే పాత రైలింజను మాదిరిగా. ఇప్పుడు ఆయన మహాభినిష్ర్కమణంతో ఈ జనారణ్య కీకారణ్యంలో ఆ గొర్రెపిల్లలన్నీ ఒంటరి ద్వీపాలుగా దిగులు దిగులుగా మిగిలిపోయినై. ఇపుడు మనం మూలమూలలకు నోములకోసం వెదుక్కుంటూ అంగలారుస్తున్నాం గానీ.., నీలాంబర పు తెరల పొరల వెనుక జన్నత్‌లోని మెహెఫిల్‌లో సాముల-నోముల గురుశిష్యులిరువురు భిన్న భాషల సాహిత్యాల గురించి గుఫ్తగూ (చర్చ) చేస్తుంటారనే నా నమ్మకం. గురుశిష్యులిద్దరూ స్వర్గంలో ఒక ఉర్దూ ఇస్కూల్ నడుపుతున్నారనీ, దేవతల పిలకాయలంద రూ అందులో నల్లపలకల మీద తెల్ల చాకుపీసులతో అలీఫ్, పే, బే, తేసే ల అక్షరాభ్యాసం చేస్తుండొచ్చనే నా అనుమానం. బడి పంతుళ్లుగా జీవితాలు ప్రారంభించిన ఆ ఇద్దరూ పుడకల మీద నుండి పై స్వర్గానికి చేరుకున్నా లక్షల లక్షల అక్షరాల మీద ప్రేమ ఇంకా తగ్గలేదేమో! వారి సహజ స్వభావం వీరిని వీడలేదేమో.

సామలకు నోముల గురువుకు తగ్గ శిష్యుడు. పెద్దాయ న ముందు నోముల చిన్నపిల్లాడిలా భయభక్తులతో చాలా అదబ్‌గా, వినయంగా ఉండేవా డు. ఆ నిత్యాగ్నిహో త్రి గురువుగారి ముందు సిగరెట్ వెలగించేవాడు కాదు. గొంతు చించుకుని చర్చించేవాడు కాదు.ఆ విషయాన్ని గమనించిన నేను ఒకసారి నోములవారితో ప్రస్తావించ గా.. ఆయన ఒక సుదీర్ఘమైన దమ్ములాగి బుజుర్గ్ లోగోఁకే సామ్నే ఊఁఛీ ఆవాజ్ సే బాత్ నహీఁ కర్నా అని ఉపదేశించాడు. అట్లా నోముల వారి పుణ్య మా అని నేను తెహజీబ్ (సంస్కారం) గురించి ఒక పాఠం నేర్చుకున్నా. నేను మళ్ళీ ఇబ్తెదాయె ఇష్క్ దగ్గరికే వస్తా. తొలి చూపులో తొలి వలపు. 1982లో ప్రప్రథమంగా నల్లగొండలో నాకు నోముల వారి దర్శనభాగ్యం లభించిం ది. వెంకటేశ్వరా టాకీసు పాన్ డబ్బా ముందు దోస్తుల మధ్య. టక్కుటక్కుల నల్లబూట్లు, పొడుగు చేతులున్న ఇన్‌షర్టు, శీర్షమాణిక్యంలా తలమీద పికాసో హ్యాటు, శ్రీశ్రీ మార్కు సిగరెట్టు స్మోకింగు, చంకలో ఏదో ఇంగ్లీ ష్ పుస్తకం. ఆ ప్రథమ వీక్షణంలో నాకాయన కళింగాం ధ్ర బహుబాషావేత్త రోణంకి అప్పలస్వామిలా కనిపించి ఇబ్తెదాయె ఇష్క్‌లో పడిపోయాను. ముచ్చటగా ముప్పై ఆరేండ్ల మత్సరము లేని ఇష్క్ మాది. కాకపోతే మా ఇద్దరి మధ్యా ఒక లవర్స్ క్వారెల్ కూడా ఉంది. నా సలాం హైద్రాబాద్ నవలను ఆంగ్లీకరిస్తానని వాగ్దానం చేసి ఆశపెట్టాడు. ఆ అనువాదానికి నోముల వారే తగువారని నా ప్రగాఢ విశ్వాసం.

కాని క్యా ఫాయిదా? ఉస్తాద్ వాదా న నిభాయె. దేఖ్ లేయింగే నోముల సాబ్ దేఖ్ లేయింగే. ఏదో ఒక రోజు ఆకాశం అవతలి వైపు సరిహద్దు సంధ్యలలోనో, ఏ వినువీధుల మూల మలుపులోనో, స్వర్గపురి పాన్ డబ్బా దగ్గర మీరు దమ్ముకొడుతూనో నాకు దొరుకక పోతరా! అపుడు మీకూ నాకూ తక్‌రార్ జరగకపోతదా.. ఆ తక్‌రార్ తస్వియా జరగకపోతదా. నా సలాం హైద్రాబాద్ ఆంగ్లానువాదం జరిగేదాకా హవ్‌ుతో ఆప్ కో నహీఁ చోడేఁగే. యాద్ రఖ్‌లేనా నోముల సాబ్ జర యాద్ రఖ్‌లేనా.
నోముల సార్ ట్రేడ్‌మార్క్ మరెవరికీ లేదు. అవి ఆయనకు మాత్రమే సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. ఒకటి జయహో అనే పలకరింపు మరొకటి. ఆయన హమేషా ధరించే హ్యాట్ చంకలో ఎల్లపుడూ ఏదో ఒక గ్రంథరాజం, వేళ్ల మధ్య రగులుతున్న సిగరెట్టు. ఇవి లేకపోతే ఆయన్ని గుర్తుపట్టటం అసాధ్యం. కర్ణుడి కవచ కుండలాల లాగా ఆయన ఆహార్యంలో అవన్నీ విడదీయలేని భాగాలు. ఆ హ్యాటులో ఆయన హాలివుడ్ హీరో రాక్‌హడ్సన్‌కు కొంచెం తక్కువగా, చిత్రకారుడు పికాసో కన్నా కొంచెం ఎక్కువగా కనబడేవాడు. ఈ భూమ్మీద నడిచిన తన అడుగు జాడలకు గుర్తుగా ఆయన తన హ్యాటును మనకోసం వదిలి వెళ్లా డు.. గాంధీగారి కళ్ళద్దాలు, చేతి కర్రలాగా! నల్లగొండలో ఆయన పనిచేసిన నాగార్జున డిగ్రీ కళాశాల ముందున్న చౌరాస్తాలో ఒక ఆరడుగుల సన్నని పొడుగైన పాలరాతి స్తంభాన్ని స్థాపించి దాని మీద ఆయన వదిలిన హ్యాటును పెడితే చాలు నల్లగొండ ప్రజలందరికీ అది నోముల సత్యనారాయణ సార్ విగ్రహం అని గుర్తించి వచ్చిపోయే వారందరు భక్తితో నమస్కారాలు చేస్తూ వెళ్లిపోతారు.

జానే వాలే కభీ వాపస్ నహీఁ ఆతే.. లేకిన్ జానే వాలోఁకి యాద్ బార్ బార్ ఆతీ హై..
అల్విదా నోముల సాబ్ అల్విదా...
- పరవస్తు లోకేశ్వర్, 91606 80847

769
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles