అరుదైన కవి ‘అలిశెట్టి’


Sun,January 6, 2019 11:18 PM

కవి భౌతికంగా దూరమైన కొద్దీ, ఆయన రాసిన కవిత్వం ఆయన్ను మరింతగా ప్రజలకు దగ్గరగా చేస్తుందనడానికి ప్రభాకర్ నిలువెత్తు నిదర్శనం. ఆయన కవిత్వం పట్ల నేటి యువత పెంచుకుంటున్న మమకారమే దానికి తార్కానం. సమకాలీన సమాజ పోకడలు, సామాజిక వికృతాలు, హింసలను కవిత్వంతో చెండాడుతూ.., కుంచెతో అర్థవంతమైన బొమ్మలు గీసిన అలిశెట్టి ప్రభాకర్ అరుదైన కవి, చిత్రకారుడు. ప్రభాకర్ జీవితం, ఆచరణ నేటి సాహిత్యలోకానికి ఆదర్శప్రాయం.
Alisett-portraiti
జీవితంలో తాను కోరుకొన్న శిఖరాలకు చేరుకోలేకు న్నా, తన ఆలోచనలకు అనుగుణంగా జీవించలేకు న్నా, తనలో తాను పడుతున్న మధనానికి అంతం లేదని తెలిసినా, మనిషి తన చుట్టూ ఉండే సమాజం పట్ల తన తపనను తనకు తెలిసిన మార్గంలో ఇతరులతో పంచుకొనే ప్రయత్నం చేస్తుంటాడు. సమాజంలో జీవించడం అంటే తన చుట్టూ జరిగే సంఘటనల పట్ల స్పందించకుండా ఉండలేకపోవడం, తన స్పందనను పంచుకొనే క్రమంలో తన వారంటూ లేకున్నా, తన ప్రతిస్పందనలను పంచుకొనే ఏకైక మార్గం తన స్పందనలకు అక్షరరూపం ఇవ్వడం. అదే వచనం కావచ్చు, లేదా కవిత్వం కావచ్చు.
సమాజాన్ని మార్చాలనుకొనే లక్షలాదిమంది సామాన్య యువతరంలా ప్రభాకర్ కూడా 70-80 దశకంలోని వామ పక్ష భావాలకు ఆకర్షితుడై, తనకున్న ఆస్తిపాస్తులను అమ్ముకొంటూ, తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తూ, సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన నిత్య పోరాట వీరుడు ప్రభాకర్. తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చి, భావాలే తూటాలుగా సమాజాన్ని మార్చగలనని మనసా వాచా నమ్మిన అక్షరయోధుడు ప్రభాకర్. తన పరిసరాలను, ఇల్లును తాను కోరుకున్న నూతన సమాజంలా తీర్చిదిద్దుకొని, ఇతరులకు తాను కోరుకొనే నూతన ప్రపంచాన్ని చూపెడుతుంటాడు. అతని ఆలోచనల ప్రతిరూపాలు అత ని చుట్టూ ఉండే సమాజంలోని మంచి చెడులకు, అంతరాలకు, వివక్ష అణిచివేతలకు ప్రతిబింబాలుగా ఉంటాయి.

తన ఆలోచనలను అక్షరరూపంలో ప్రపంచంతో పంచుకొనే క్రమంలో కావలిసిన వారు దూరమైనా, తన ఆలోచనలను మార్చుకోకుండా నిబద్ధతతో నిలిచాడు. ప్రపంచంలో తాను కోరుకునే మార్పు రావాలని, దానికి తన జీవితాన్నే ఫణంగా పెట్టాల్సి వస్తుందని తెలిసినా, వెనుకడుగు వేయని ఎంతోమం ది ధైర్యస్తుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. మంచి చిత్రకారుడిగా తన చుట్టూ ఉండే రంగుల ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలించే ప్రభాకర్ జిలుగు వెలుగుల జీవితంలోని చీకటిని చీల్చి చెండా డు. అతను ఎప్పుడూ అవకాశాలు అందుకోలేని పీడిత ప్రజల బాధల పట్ల, వారి మౌన వేదనల పరిష్కారం కోసం సంవేదనాశీలతతో ఆలోచించాడు. జగిత్యాలలో జరిగిన రైతాంగ పోరాట జైత్రయాత్రకు ప్రత్యక్ష సాక్షి అయిన అలిశెట్టి సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రేమించాడు. జైత్రయాత్ర ప్రభావంతో తన ఆలోచనలను అక్ష రీకరించడానికి చేసిన ప్రయత్నంలో ఎర్రపావురాలు(1978) కవిత్వం రూపు కట్టింది. చివరగా మరణం నా చివరి చరణం కాదు అంటూ తన జీవితాన్ని ముగించాడు అలిశెట్టి ప్రభాకర్.
అందరిలాగా సాధారణ జీవితం గడుపాలనుకోని ప్రభాకర్, సమాజాన్ని ఉన్నదున్నట్లుగా చూడాలనుకోలేదు. తాను ఉన్న సమాజంలో ఆకలి, అరాచకం, కులమతాల వివక్ష అణిచివేత లు,ధనిక పేద తారతమ్యాల్లేని ఒక నూతన ప్రపంచాన్ని చూడా లని నిరంతరం పరితపించిన, కృషి చేసిన ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్. తన నమ్మకాలు, వ్యవహారాలు తన జీవితంలోని సుఖాల ను, తన కుటుంబసభ్యుల ప్రశాంత జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయని తెలిసినా, అవి నిజమైనా వెనుకడుగు వేయకుండా తన సిద్ధాంతాలకే కట్టుబడిన అవిశ్రాంత పోరాట యోధుడు ఆయన.

ఆ క్రమంలో తన జీవితా న్నే కోల్పోయిన నిజమైన ప్రజా కవి ప్రభాకర్. తన ఇద్దరు పిల్లలను, తననే నమ్ముకొని వచ్చిన తన జీవిత భాగస్వామి భాగ్యను మానసికంగా తన నమ్మకాలపట్ల, ఆలోచనల పట్ల మద్దతుపలికే సహచరులుగా చేసుకోవడంలో విజయం సాధించాడు. తన కవితాలోకంలో ప్రపంచంలోని అందరి బాధతప్త జీవు ల బాధలకు అక్షరరూపం ఇచ్చినట్లే తన జీవిత భాగస్వామి భాగ్య పట్ల తనకున్న అనురాగాన్ని, ఆమె పట్ల తాను ఏర్ప ర్చుకొన్న అభిప్రాయాన్ని, ప్రేమను తన చివరి రోజుల్లో కవితా రూపంలో చెప్పుకొని తనకుతాను స్వాంతన పొందాడనిపిస్తు న్నది.
చాటుమాటుగా అర్థాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు
సంసారం బరువెంతో సమీక్షించుకొనేవాణ్ణి
ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి లేకుండానే
పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా
మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ని..అంటూ తనకు తానే ఓదార్చుకొన్నాడు. తన జీవితంలో తనతో పాటు ఉండి, తనకు సంపూర్ణ సహకారం అందించిన భార్యకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ కవితలో అలిశెట్టి తన ప్రేమను వెల్లడించాడు.
తన సొంత ఊరును, తన వాళ్లను విడిచి కరీంనగర్ వెళ్లినా, అక్కడ కూడా ఆయనను వెంటాడిన రాజ్య బెదిరింపులు, నిర్బంధాలు రాజధానికి చేరిన తర్వాత కూడా వీడలేదు. రాజ్యాన్ని ఎదిరించిన ప్రభాకర్ తన అనారోగ్యాన్ని కూడా అంతకంటే ఎక్కువగా ఎదిరించాడు. ఈ ప్రపంచంలో తనలాం టి నిజాయితీపరులు నిలువలేరని, సిద్ధాంతాల పేర వ్యాపారం చేసుకొనే వారిని తన సహచరులుగా చెపుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిత్వం అలిశెట్టిది. ఎన్నో ఆశలతో నగరాలకు వచ్చే గ్రామీణ ప్రజల జీవితాలను అతి దగ్గరగా చూసిన ప్రభాకర్, ఆశల పల్ల కి తన కళ్లముందే కూలిపోతున్నా, ఏం చేయలేని నిస్సహాయ స్థితిని నగర జీవితాన్ని తన కవితలో.. నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా జీర్ణించుకొన్నవాణ్ని.. అంటూ తన బతుకు బండిని మరికొంత కాలం, మరికొంత దూరం ఈడ్చుకెళ్లడాని కి, తన వద్ద ఉన్న ఆస్తిని ఈ విధంగా చెప్పుకొన్నాడు.
రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా
అది మనకు పెన్నుతో పెట్టిన విద్య.. ఆఫ్ కోర్స్
కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా
రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికీ తెలుసు..
అంటూ.. తాను రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని తానే చెప్పుకున్న నిజాయితీ పరుడు. తన కవిత్వం ఈ సమాజాన్ని సహజ న్యాయం దిశలో నడిపించలేకపోతుందని, ప్రజల్లో, ముఖ్యంగా విద్యావంతుల్లో, మేధావుల్లో రావాల్సిన మార్పు రావడంలేదని ఆవేదన చెందేవాడు, అసంతృప్తిని వెల్లడించా డు. నమ్మిన సిద్ధాంతాలతో తనకు తోడుగా ఉంటామని చెప్పి, దారి మధ్యలోనే ప్రయాణాన్ని విరమించుకున్న వారితో విభేదించినా, వారితో స్నేహాన్ని మాత్రం వీడలేదు. తన రచనలను, కలాన్ని కాసులు కురిపించే వెండితెరకు అందించాలనే అనేక ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, తన తల్లిదండ్రులిచ్చిన ఆస్తులను అమ్ముకొని తన జీవితాన్ని స్వేచ్ఛగా ఎల్లదీసిన నిస్వార్థపరుడు అలిశెట్టి ప్రభాకర్.

తన భావాలను వెల్లడించడానికి ఎన్నడూ వెనుకాడని వాడు అలిశెట్టి. పైకి అభ్యుదయ ప్రగతిశీలురుగా చెప్పుకుంటూ.. సాగుతున్న పోరాటాలకు మద్దతుగా నిలువకుండా, రంధ్రాణ్వే షణతో విమర్శించే వారంటే ఆయన ఆమడ దూరం పెట్టేవాడు. ఇతరుల మాటలకు, పొగడ్తలకు వెరువని, లొంగని ధీశాలి. మినీ కవిత్వానికి తనదైన వాడి వేడితో సాహిత్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనుడు ప్రభాకర్. పుట్టడం, చావడం మన చేతిలో ఉండకపోయినా, ఆ రెండు ఒకేరోజు జరుగకపోవడం సర్వసా ధారణం. కానీ ఆ రెండు ఒకేరోజు సంభవించడమే అలిశెట్టి జీవితంలోని ప్రత్యేకత. ప్రభాకర్ అందరిలాంటి సామాన్యుడు కాద నే విషయం ఆయాన్ నిజ జీవితంలోనే కాదు అమరుడైన రోజు తో కూడా నిరూపించాడు. కవి భౌతికంగా దూరమైన కొద్దీ, ఆయన రాసిన కవిత్వం ఆయన్ను మరింతగా ప్రజలకు దగ్గరగా చేస్తుందనడానికి ప్రభాకర్ నిలువెత్తు నిదర్శనం. ఆయన కవిత్వం పట్ల నేటి యువత పెంచుకుంటున్న మమకారమే దానికి తార్కాణం. సమకాలీన సమాజ పోకడలు, సామాజిక వికృతాలు, హింసలను కవిత్వం తో చెండాడుతూ.., కుంచెతో అర్థవంతమైన బొమ్మలు గీసిన అలిశెట్టి ప్రభాకర్ అరుదైన కవి, చిత్రకారుడు. ప్రభాకర్ జీవి తం, ఆచరణ నేటి సాహిత్యలోకానికి ఆదర్శప్రాయం.
- సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు, 93915 33339
(జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి,
వర్ధంతి సందర్భంగా..)

919
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles