అసమాన ప్రతిభాశాలి పొట్లపల్లి


Sun,December 30, 2018 11:05 PM

సమకాలీనులైన కవుల గురించి ఆయన చెప్పిన ఒక మాట ఒక్కొక్క కవిలో ఒక్కొక్క విశేషముంటుంది. అది వారి సొంతం, స్వభావజన్యం. దాశరథిలో తిరుగుబాటు, నారాయణరెడ్డి లో ప్రణయమాధుర్యం, కాళోజీలో విజ్ఞతతో కూడిన ఎత్తిపొడుపు, జాషువాలో సుమరాశుల భావుకత ఈ నలుగురిని గురించి ఆయన చెప్పాడు. ఈ నలుగురు ఆయనకిష్టమైన కవులు.
potlapally-rama-rao
సంపన్న కుటుంబంలో పుట్టిన సామాన్యుడు పొట్లపల్లి రామారావు. చదువు పాఠశాల విద్యతో ఆగిపోయినా గ్రంథాలయ విద్యతో ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, తెలుగు, సంస్కృత, పారశీక భాషలలో పాండిత్యం సంపాదించుకున్నాడు. ఆయన విశేష ప్రతిభావంతుడు. ప్రతిభ స్వయం ప్రకాశం. అది సాహిత్య రూపంలో వెలుగులు వెదజల్లింది. ఆయన సాహిత్యం కవిత్వమైనా, వచనమైనా ప్రతిభా సంపన్నంగానే ఉంది. ఆరంభంలో ఆయన కవిత్వం ఛందస్సు తో కూడిన గేయరూపంలో ఉన్నా, అనంతరం వచన మార్గం పట్టింది. 1917లో పుట్టిన రామారావు 1940 నుంచి కవిత్వ రచన ప్రారంభించాడు.1960 దాకా కథలు, నాటికలు అసంపూర్ణ నవల, గ్రామ చిత్రాలు, భావ వల్లరులను ప్రచురించిన ఆయన.. ఆపై వచన కవిత్వం రాశారు. పొట్లపల్లి రామారావు సమూహం మనిషి కాడు. ఏకాంతజీవి. ఒంటరిగా ఉండటం ఇష్టపడ్డ మనిషి. తనలో తాను తనతో తాను మాట్లాడుకున్న మనిషి. ఆ మాటలే కవిత్వం. తన ఆలోచనలు, అనుభూతుల చుట్టూ తన కవిత్వం తిరిగింది. నిత్యం అధ్యయనం, నిరంతర ఆలోచన, ఆయన సాహిత్యానికి, దానీ చైతన్యానికి మూలమయ్యాయి. ఏ వ్యుత్పన్నతో సాధనా సంపత్తి బాహిరంగా కనపడకపోయినా, తన గుండెను తాను తవ్వుకొని రత్నరాశుల్ని దేశ సాహిత్యం మీద విరివిగా విస్తరింపజేశాడు. పొట్లపల్లి కవిత్వం ఆలోచన జన్యమైన, అనుభూతి రమ్యమైన, ఆత్మీయతా ప్రవక్తమైనది. ఉన్నత సూక్తులు, అభివ్యక్తులు ఉన్న ఆయన కవిత్వం కొంత సరసంగా కొంత వివరంగా, కొంత గాఢంగా, కొంత సావ్రంగా ఇంకొంత ఉత్తేజకర్తగా, చలనశీలంగా రూపం దిద్దుకొంది.

గతం దృష్టికాక, వర్తమాన దృష్టి ఉండటం వల్ల, తననుతాను చూసుకోవడమేకాక తన సమాజాన్ని చూడటం వల్ల, సమాజం చేత ప్రభావితుడయ్యాడు. తన వల్ల సమాజం ప్రభావితమయ్యే ఉత్తమ సాహిత్యం సృష్టించాడు. తన చూపు, ఆలోచన అపరిమితం. ఈ విషయం ఆయన సాహిత్యం మొత్తం సాక్ష్యం చెబుతుంది. పొట్లపల్లి రామారావు తననుతాను సమాజం మీదికి విసురుకోలేదు. సమావేశాలు, సభలు, సత్కారాలను ఆయన ఇష్టపడ్డట్టు దాఖలు లేవు. ఇటువంటి సందర్భంలో మనకు సుప్రసిద్ధుడైన ఏకాంత జీవి ఠాగూర్ గుర్తుకొస్తాడు. పొట్లపల్లి మీద పూర్వ కథల ప్రభావం కానీ, వర్తమాన కవుల ప్రభావంగానీ ఏమీలేదు. ఆయన సాహిత్యం ఆయన సొంతం. ఆయనకే పరిమితం. ఆయన దర్శనమే, ఆయన చూపే, ఆయన అంతరమే, ఆలోచనే ఆయన సాహిత్యమైంది. ఏ ప్రభావాల వల్ల మలినం కాలేదు. స్వచ్ఛంగా ఉంది. స్వేచ్ఛగా ఉంది. పొట్లపల్లి మీద సమకాలీన సమాజం సమస్యలున్నాయి. తాను నివసించిన ప్రదేశముంది. ప్రకృతి ఉంది. దానివల్ల ఆయ న పొందిన పారవశ్యముంది. కవిత్వంలో వారి ఆలోచనలు, ఎక్కువగా ఆత్మీయతా సంపన్నమైన ఆలోచనలు. ఏకాంత శిఖ రం మీద ఒంటరిగా కూర్చొని తన చుట్టూ తాను, సమాజం చుట్టూ తాను చూసుకున్న క్రాంతదర్శి పొట్లపల్లి రామారావు. ఆయనది మనిషిని ప్రేమించే మనస్తత్వం. మానవత్వాన్ని ఆరాధించే అభ్యుదయ, ఆరోగ్యకర, సమున్నత దృక్పథం. వీరి కవితా సంపుటాలు నాలుగు. చుక్కలు, ఆత్మవేదన, అక్షరదీప్తి, నాలోనేను. వీరి కవిత్వంలో సాహిత్యంలో విశేష అంశాలను భిన్నపార్శ్వాలను పరిశీలించే ప్రసిద్ధులు. ముఖ్యంగా మూడు అంశాలు మనకు ఆయన్ను అనుకోగానే గుర్తుకొస్తా యి. పొట్లపల్లి ఏకాంతజీవి. మౌన మహర్షి కావడంవల్ల నిశ్శ బ్దం ఆయనకు సంతోషాలనిచ్చింది. సాహిత్యమంతటా అది కనిపిస్తుంది. నిశ్శబ్దాన్ని గురించి ఆయన ప్రాణప్రదంగా రాసుకొన్నాడు. నిశ్శబ్దం యొక్క స్తన్యం గ్రోలి శబ్దం పెరుగుతుందట. ఇది ఆయన చెప్పిన మాట.

నిశ్శబ్దం ప్రాణమయితే శబ్దం మృత్యువట. నిశ్శబ్ద ప్రేమ స్వరం వినిపించక శబ్దం నిరంతరం ఏడుస్తూ ఉంటుందట. తన శబ్దంతో తానే కూడి శబ్దం నిర్జీవం గా, నిస్తేజంగా, నీరసంగా, శుష్కంగా తయారవుతుందట. ఆయన కవిత్వం నాలోనేను, చుక్కలు జాగ్రత్తగా చూస్తే మీరు ఆలోచన పరవశులు కావడానికి ఎంత అద్భుతమైన ఏకాంతత, నిశ్శబ్దం, మౌనం దొరుకుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొట్లపల్లికి స్త్రీపట్ల విశేషమైన గౌరవం భక్తి. ఈ రెండూ చాలా స్పష్టంగా కావ్యమంతటా కన్పిస్తాయి. స్త్రీమూర్తిని కవిత్వంలో ఇంతగా దేవతాస్థాయిలో ఆరాధించిన కవి మనకు ఎక్కడోతప్ప కనబడడు. పురుషుడికి పరిపూర్ణత్వం స్త్రీ సృష్టివల్లే జరుగుతుందని, ఆమె ప్రాణదానం చేయడంవల్ల సృష్టి వికాసం చెందుతుందని, చైతన్యవంతం అవుతుందని అంటాడు. తల్లి తన బిడ్డల్ని గూర్చి చెబుతూ అసలు ఏ బిడ్డలయినా వాళ్ళ కళ్ళల్లో స్వర్గం, చిరునవ్వులో అమృతం, పిల్లల కౌగిలిలో అనిమిషత్వం పొం దుతుందంటాడు. రచించటంలో ఆనందం ఉందని గుర్తించి దాన్ని అనుభవించిన ఈ కవి, కన్నీరు ఉండే చోటు కాలుష్యం ఉండదు అంటాడు. మృత్యువును ఎరిగి జీవించేవాడు జీవితా న్ని, బతుకును మరింత గాఢంగా ప్రేమిస్తాడు అంటాడు. లోతై న దేనినీ వ్యక్తీకరించలేవు మాటలు అంటాడు. శబ్దం లోతైన ఏ భావాన్నీ వ్యక్తపరచలేదు అంటాడు. పురుషుడిలో స్త్రీ, స్త్రీలో పురుషుడు ఉంటాడు అని గుర్తించిన గొప్ప తాత్త్వికుడు పొట్లపల్లి రామారావు. గొప్ప ఆలోచనపరుడు అనుభూతి తాత్త్వికు డు అయిన పొట్లపల్లికి ఆగ్రహం, ఆవేశం, విశృంఖలమైన పట్టరాని కోపం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాహిత్యం లో అవి ఎక్కువగా వచనంలో కనిపించాయి. పద్యాలలో ఆయ న ప్రశాంత గంభీరమూర్తి, వచనంలో ఆయన కత్తి దాల్చిన ధీరయోధుడు. నిజాం పాలనకు, ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలలో, సాహిత్య ఆరాధనలో పాల్గొన్న పొట్లపల్లి రామారావు జైలుకు పోవడం, ఆ మనిషికి కష్టమే. ఇబ్బందే. అది ఎలా ఉన్నా మనకు సాహిత్యానికి మాత్రం మేలే చేసింది.

ఆయన జైలుకు పోకపోయుం టే ఇంత మంచి జైలు కథలు వచ్చి ఉండేవి కావు. జైలు కథలు 9 సాహిత్యంలో వెలుగు సాకేవి కావు. ఆయన జైలుకు వెళ్ళకపోయుంటే ఆయన సమాజాన్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమయ్యేది కూడా కాదు. దౌష్ట్యాన్ని ప్రతిఘటించటం, దుర్మార్గపాలన అంతమొందించాలని ఆశించటం నైజాం పరిపాలనను తుదముట్టించాలని అనుకోవడం, దేశం స్వాతంత్య్రం పొందాలని దీక్షబూనడం పొట్లపల్లి సాహిత్యంలో ప్రముఖంగా జైలు కథల్లో కనిపిస్తాయి. అడగనీదే తల్లయినా పెట్టదు అనే కథలో పిల్లల మీద ప్రేమ చూపించేటటువంటి తల్లి ఎందుకు ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తుందేమో అని మనకు శంక కలిగేటట్లు ఉంటుంది. తక్కువగా ప్రేమింపబడే వాడు హక్కులు తల్లి దగ్గర నుంచి లాక్కోవడమెలాగో చెప్తాడు కథా రచయిత రామారావు. న్యాయం కథలో ఓ మాదిగకు ఓ జవానుకు మధ్య ఉన్న ఆలోచనలను తెలియజేస్తాడు.విముక్తిలో జైలులో ఉన్నవాళ్ళు తిరగబడటం ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో తెలియజేస్తాడు. జైలు కథలు జైలు నుంచి బయటకి వచ్చిన వాడు గ్రామాధికారి దగ్గర, గ్రామంలో అకారణంగా జైలుకెళ్ళిన వ్యక్తి ఎంతగా ఇబ్బందులు పడుతాడో తెలుపుతాడు. ఇటువంటి ఉత్తమమైన సాహిత్యాన్ని సృష్టించిన రామారావు కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు. ఏ ఒక్క రాష్ర్టానికో, జిల్లాకో, గ్రామానికో పరిమితమైన వ్యక్తికాదు. ఆయనలో గొప్ప శక్తి ఏమిటంటే ప్రజలందరిని ప్రేమించిన ఉదారమైన స్వభావం. అది అందరికీ ఉండదు. ఆయన భిన్నమైన సందర్భాల్లో విభిన్నమైన అభివ్యక్తుల్ని కలిగించిన స్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రెడ్లు పడే ఇబ్బందులు, పేదలు పడే కష్టాలు ఆయన కథల్లో బాగా కనిపిస్తాయి. స్త్రీలకు.. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వాళ్ళ కష్టాలు మనకు బాగా తెలుసు. సర్బరాహి కథలోని స్త్రీ ఆమె బర్రెదు డ్డె తనకు కాకుండా పోతుంటే ఎంత నేర్పుగా దొర దగ్గర్నుంచి వాటిని తెచ్చుకుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

నర్సింహరెడ్డి అద్భుతమైన వ్యక్తి. గ్రామస్థులందర్నీ విముక్తుల్ని చేయ్యడానికి పూనుకున్న వాణ్ణి ప్రభుత్వం పట్టుకపోయి ఇబ్బందులు పెట్టి నా, కళ్ళలో కారంగొట్టినా, బంధించి తీసుకుపోతున్నా వాళ్ళ కళ్ళలో కారం గొట్టి తప్పించుకున్న విధానం చూస్తే విస్మయానికి లోనవుతాం. రామారావు నాటకీయత పుష్కలంగా ఉండే నాటికలు రాశా డు. ఇవి ప్రదర్శనకు అనుకూలత కలిగి ఉన్నాయి. ఇంత సంక్షిప్తంగా, ఇంత విస్తృతిగా ఉన్న జీవితాన్ని ప్రదర్శించిన నాటికలు చాలా తక్కువగా వస్తాయి. స్త్రీలపట్ల, మాదిగల పట్ల కథల్లో, నాటికల్లో చాలా ప్రేమను చూపించిన పొట్లపల్లి రామారావును తలుచుకుంటుంటే గొప్పగా ఉంటుంది. ఆశ్చర్యమూ కలుగుతుంది. నాటికల్లో తెలంగాణ భాష. కవిత్వంలో ఆంధ్ర దేశానికంతటికీ పరివ్యాప్తమైన తెలుగు వ్యవహారిక భాష. దీన్ని కవిత్వంలో సర్వసామాన్యమైందిగా రాసినా, అక్కడ అది వ్యక్తి నిష్టంగా మాత్రమే ఉంది. పూర్తిగా తెలంగాణ భాషలో ఉన్న ఈ నాటికలు చాలా విలువైన భావాలనందించే గొప్ప నాటికలు. సమకాలీనులైన కవుల గురించి ఆయన చెప్పిన ఒక మాట ఒక్కొక్క కవిలో ఒక్కొక్క విశేషముంటుంది. అది వారి సొం తం స్వభావజన్యం. దాశరథిలో తిరుగుబాటు, నారాయణరెడ్డి లో ప్రణయమాధుర్యం, కాళోజీలో విజ్ఞతతో కూడిన ఎత్తిపొడుపు, జాషువాలో సుమరాశుల భావుకత ఈ నలుగురిని గురించి ఆయన చెప్పాడు. ఈ నలుగురు ఆయనకిష్టమైన కవులు. పైనున్న ముగ్గురు ఆయన చుట్టున్నవారు. నాలుగో ఆయన కవిత్వం ఆయన చుట్టూ ఉంది. ఇట్లా వాళ్లను ఆయన అంచనా వేయ డం చాలా విశేషంగా ఉంది. పొట్లపల్లి అచ్చమైన, స్వచ్ఛమైన అనుభూతి తాదాత్మ్యంతో పరవశించి, మైమరించే మనస్తత్వం.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
(పొట్లపల్లి శతజయంతి సదస్సులోని కీలకోపన్యాసం సంక్షిప్తంగా..)

1447
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles