మనస్సాక్షికి.. సాక్షి!


Sun,December 30, 2018 11:05 PM

వ్యవసాయాభివృద్ధి చెయ్యలేక వ్యవసాయం దండుగ అన్న నేతల నిర్లక్ష్యం, రైతన్నల ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు వృద్ధ తల్లిదండ్రులను వదలి పొట్టచేతబట్టుకుని కుటుంబాలు ఉన్నఊరిని వదలిపోవడం, కళ్ళముందు దృశ్యంలా చూపగలిగారు రచయిత వేణు.

గగనవీధిలో తళుక్కుమని మెరిసే నక్షత్రం సాహితీ జగత్తుకు, అక్షరయానం చేస్తూ వచ్చి, వేణునాదాన్ని హృదయం పులకించేలా మనోవీధిలో నవరసాల నొలికిస్తూ చదువరులను తన వాక్యాల వెంట మనోవేగంతో పరుగులెత్తించిందని చెప్పడంలో లేశమాత్రం సంభ్రమం లేదు. ముఖచిత్రంపై తుహినం ఘనీభవించి వృక్షపు వ్రేళ్ళకు హత్తుకుని మొదలుదాకా పాకుతూ, కొమ్మను ఆవరించుకున్నప్పటికీ, నేను మొలకెత్తుతూనే ఉన్నానంటూ ఓ రెమ్మ కొమ్మగా మారుతాను, వృక్షంగా ఎదుగుతాను.. నా మౌనమే దీనికి సాక్షి! అంటూ, మౌనసాక్షిని తన ముఖంపై చిత్రించింది. చివరి కవరు పేజీపై నక్షత్రం వేణుగోపాల్ గారి చిరుమందహాసపు ముఖారవిందం కనిపిస్తుంటే, మనుషులను మరింత మానవీయంగా మార్చే కథలు ఎలాగుంటాయో కథా రచయిత మనసును ఆవిష్కరించడమే గాదు, ఆ కథా సంపుటిలో సామాజిక-మానవీయతలు ప్రతిబింబిస్తాయని నొక్కి వక్కాణిస్తూ.. దేశాంతరం వెళ్లినా, స్థాని కత పరిమళించే సౌరభాలు వెదజల్లే తత్వమున్న రచయిత వేణుగారి సంస్కారాన్ని అలతి వాక్యాలైనా అనల్పవ్యక్తిత్వం వేణుగారిదని ప్రస్తావిస్తారు నందిని సిధారెడ్డి, బెల్లంకొండ. సంపత్ కుమార్ గార్లు జీవితాన్ని చదివి ఆచరించి, పదిమందికి సాయపడటంలోని తృప్తిని వారసత్వంగా అందించిన కన్నతల్లిదండ్రులకు మౌనసాక్ష్యాలను అంకితమిచ్చిన వేణు ఒక నక్షత్రమే! ప్రపంచీకరణ నేపథ్యంలో జగమే ఒక కుగ్రామంగా మారి, భౌతిక దూరమెంతైనా, మనసుకు అత్యంత సాన్నిహిత్యాన్ని అందించే సాంకేతిక విప్లవ ఫలితంగా జీవితయానానికి ఉన్న చదువులకు తగిన జీవనోపాధుల్లో ఉన్నా, కళాప్రపంచంలో కళలు కళల కోసమేగాదు -ప్రజలకోసం అనుకుంటూ వృత్తి -వ్యాపారం గా కానీ మనస్తత్వంకాని వేణు.. వృత్తికి ప్రాణంపోసి సజీవంగా ఉంచే ప్రవృత్తి , ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు. తన మిత్రులు, హితైషులు, మనసున మనసై ఉండే వారిని ప్రస్తావించారు మననంలో.

విషయసూచిక స్థానంలో మౌనముద్రికలు ఏకాదశ సంఖ్యలో మౌనసాక్షి గా నిలబడిన కథల పేర్లను చూసి, మనసును ఆకట్టుకుంటాయనుకునే కథలను ముందు ఎంచుకుని, వాటి వెంట మనోనేత్రాలు పరుగులు పెట్టగా, వేకప్, సూపర్ హీరో తమవైపే రమ్మన్నాయి తమలోతు కనుక్కోమన్నాయి. ఊరు మారినా, ఉనికి మారు నా? అన్నట్లుంది వేకప్‌కథా సారాంశం! పసిమనసులను అర్థం చేసుకుని , వారికి మార్గదర్శకులుగా ఉంది, వారి ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి ఒత్తిడి లేని వాతావరణం కల్పిస్తూ కష్టపడిగాదు-ఇష్టపడి చదివేలా, పిల్లలను పెంచాల్సిన తల్లిదండ్రులు, నేడు వేళ్ళతో లెక్క పెట్టినంత తక్కువ సంఖ్యలోనే దొరకడం లేదు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఇతరుల పిల్లలతో పోల్చుకుని , తమ పిల్లలూ వారిలాగే కాదు, రెండాకులు ఎక్కువే వాళ్ళకంటే ముందుండాలని పిల్లలను ఒత్తిడి చేస్తూ చదు వు -మార్కులే, వారి సామాజిక అంతస్తులకు కొలబద్దలుగా పసి మొగ్గల హృదయాలను నలిపేస్తుంటారు! ఇది అమెరికాకు వెళ్లినా, మారని మూసలోనే కొందరు మోడరన్ తల్లిదండ్రులుంటారని, శ్వేతా రాజేష్‌ల ఒకే ఒక్క సంతానం వరుణ్‌ను చదువు తప్ప వేరే ప్రపంచం లేదన్నట్లు పెద్దవాళ్లు పిచ్చుకపై బ్రహ్మాస్త్ర ప్రయోగాలు చేయడం బట్టి పాఠకులకు తెలిపారు రచయిత. వ్యవసాయాభివృద్ధి చెయ్యలేక వ్యవసాయం దండుగ అన్న నేతల నిర్లక్ష్యం, రైతన్నల ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు వృద్ధ తల్లిదండ్రులను వదలి పొట్టచేతబట్టుకుని కుటుంబాలు ఉన్నఊరిని వదలిపోవడం, కళ్ళముందు దృశ్యంలా చూపగలిగారు రచయిత వేణు. నిరుద్యోగ పెనుభారం, మేధస్సు ఉన్నా చదువుకోలేనితనం కథలో ఆవిష్కరించబడ్డాయి. గజ్వేల్‌కు పని కోసం వెళ్లి వస్తూ రాజు వినడానికి తటస్థపడిన పాట.. మట్టిని నమ్మి న కర్షకులు మాణిక్యాలను పొందేరు- కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలను చెదుదురు, - అనురాగంతో దంపతులు, పాలు-తేనై కలిశారు.. రాజులోని ప్రశ్నకు మంచి సమాధానాన్నిచ్చింది అని చెప్పి, సాహిత్యం, సం గీత కళలు సందేశాన్నిచ్చి, జీవితంలోని పలు చిక్కులను విడదీసి సమస్యలకు సరైన దారి చూపిస్తాయని చెప్పడం బాగుంది.

అమెరికాలో ఉంటే అందరూ ఎప్పుడూ బిజీ అనే జవాబుతో తల్లిదండ్రులతో మాట్లాడ్డం కూడా వాయి దా వేయడాన్ని ప్రస్తావిస్తారు రచయిత. ఇది వాస్తవదూ రం కాదు. మృగాల మధ్య కథ డిసెంబర్ ఆరు, బాబ్రీ మసీదు కూల్చి, రామమందిరం నిర్మాణానికి ఇటుకలు తీసుకుని కరసేవకుల్లా యువతను అయోధ్య వైపుకు మళ్లించి బలై పోయిన వేలాది అమాయకులను గుర్తుచేస్తారు. కాంత మ్మ భయంకర హత్యకు గురికావడం చూసి కంటతడి పెట్టడంలో మత సామరస్యం వికసిత పుష్పంలా కనబడి మత సామరస్య అవసరమెంతో చెపుతుంది మృగాల మధ్య కథ. వ్యవస్థలో ఉన్న కుళ్ళును కడిగేందుకు పేద-బడుగు రైతుల బాధలను పోగొట్ట లేని విఫల ప్రజాస్వామ్యంలో.. పోలీస్ కాల్పుల్లో రవికిశోర్ మరణం పాలైనాడని తెల్సుకుని, లాయర్‌ను కలిసిప్రెస్ మీట్‌లో ఉన్నదున్నట్లు చెప్పి సాహసం ప్రదర్శించి ఎన్‌కౌంటర్లన్నీ ప్రభు త్వ హత్యలే అని చెబుతుంది. పోలీసుల చేత హతమార్చబడి, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడటం, 72 ఏళ్ళ దుఃఖ తంత్ర భారతంలో ఒక సహజ ప్రక్రియ అనే వాస్తవానికి పాఠకులు వచ్చేలా, నడిచింది పర్యవసానం కథ. కాలాలు మారినా తరాలు మారినా, పరువుప్రతిష్ఠలకే ప్రేమాభిమానాలకన్నా పెద్దపీట వేసేవారికి కౌముది కథ కనువిప్పులాంటిది. శైలి, నేటితరం పాఠకులకు అంత నచ్చనిదైనా ఓపిక పట్టి చదివితేనే సందేశం అర్ధమౌతుంది. ఇక తనపేరుకిందనే ముద్రించుకున్న మౌనసాక్షి కథ ఇతివృత్తం, పాఠకుల హృదయాన్ని కన్నీటి సంద్రంలో ముంచుతుంది. సారా, మద్యం బానిసలు, భూమిని పోగొట్టుకుని, కుటుంబాలను వీధిన పడేసి, కన్నబిడ్డలను బాలకార్మికుల కన్నా హీనమైన బుజ్జి బిచ్చగాళ్లుగా వీధులవెంట, రైలు బోగీల్లోకి పసిబాల్యాన్ని విసిరేసిన దీనావస్థను హృద్యంగా కళ్ల ముందుకు తెస్తుంది. ఇది నేటి సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ ధోరణికి ప్రేక్షక పాత్ర కు సాక్షీభూతం. నక్షత్రం వేణుగోపాల్ గారి మౌనసాక్షి కథాసంకలనం మనసులతో సంభాషణలు జరుపుతుంది. మరిన్ని మనసులకు మేలుకొలుపులు పాడి ప్రేక్షక పాత్ర నుంచి జనం బయటపడి, కార్యోన్ముఖులను చేసే కథలు ఇవి.
- చాకలకొండ శారద

1740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles