తెలంగాణలో మరుగునపడిన కవి


Sun,December 23, 2018 11:03 PM

వరరుచి సంహితలోని వచనాలను కూడా ఉదహరించిన అప్పకవి, ఈ కావ్యంలో జ్యోతిష సంబంధ విషయాలను కూడా విడిచిపెట్టలేదు. తెలంగాణ పలుకుబడి, యాస ఒక విలక్షణమైనది అని నిరూపించ డం కోసం నేటి కాలంలో అప్పకవీయం, పునర్వివేచన ఒక తప్పనిసరైన సామాజిక అవసరం అనాలి.
appakaveeyamu
తెలంగాణ ఏర్పడ్డది. మన తెలంగాణల పేర్వడిన పం డితుల, కవుల, కళాకారుల యాది గురించి, గియ్యాలిటి తరాన్కి ఎర్కజేయాలె. అందులో అం దరం తెల్సుకోవాల్సలిన పేరు అప్పకవి. ఊరు కాకునూరు. సుట్టుమట్ల ఉన్న ఊళ్ళల్ల 1656 కాలం నాట్కి ఉన్న బొదినంపల్లె, నిడుదవెల్లి, లేతమామిడి (లేమామిడి), నవదళపురి (తొమ్మిది రేకుల) అన్ని మాకాంలల్ల శానపేరుండే ఆయనకు. ఆయన తెలంగాణోడౌనో కాదో అనే సందిగ్ధంల వడి, ఇడ్సిపెట్టెటోల్లకు బూర్గుల రామకృష్ణరావు పంతులు రాసిన వ్యాసం గుర్తుకు తేనీకెనీ నాల్గు మాటలు, ముచ్చట్లు.
తెలుగు భాషకు సంబంధించి ఉన్న లక్షణ గ్రంథాల్లో అగ్రగణ్యమైనది అప్పకవీయం. ఇది పెట్టు పేరు. గ్రంథావతారికలో.. యాంధ్ర శబ్ద చింతామణి గ్రంథసౌరపాదపంబునకు.. అని, అలాగే ఆ తర్వాత గద్యలో.. కాకునూర్యప్పకవి విరచితంబైన యాంధ్ర శబ్ద చింతామణి యను వ్యాకరణ శాస్త్రంబునందు.. అని ఉన్నందువల్ల ఈ గ్రంథం పేరు ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది కవి పెట్టిన పేరు. కర్త కాకునూరి అప్పకవి. తన కాలాన్ని, నివాస స్థానాన్ని స్పష్టంగా రాసుకున్నవాడు.

ధాత రెండవ పరార్థమున నాది దినంబు పగటి వరాహ కల్పంబునందు.. శాలివాహన నామ శకమున గజ శైలశర సుధా కిరణుల సంఖ్య.. అంటూ ఇంత స్పష్టంగా, శాలివాహన శకం మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి (క్రీ.శ. 1656 ఆగస్టు 3) నాడు తనకు కలలో భగవంతుడు కనిపించి గ్రంథం రాయమని ఆనతిచ్చెనని చెప్పి, గ్రంథ రచనను దశమీసుర గురువాసర శశితారా వజ్ర యోగ షష్ఠ కరణయుక్త ధనుర్లగ్నమున, దశమి గురువారం నాడు రచనకు శ్రీకారం చుట్టిన ట్లు వివరించాడు. ఇంత స్పష్టంగా తన రచనారంభ కాలాన్ని వివరించినదీ ఇడొక్కడే. ఈ కల కవికి కామేపల్లి గ్రామంలో ఉన్న కాలంలో పడింది. కావ్యాన్ని కామేపల్లిలో ఉన్న చక్రస్వామికి అంకితమిచ్చాడు. ఈ కామేపల్లి అనే ఊరు శ్రీశైలానికి ఈశాన్యంలో శ్రీ గిరీశాన్య దిశను గొండవీటి పడమట దంగెడ విషయమునను, గామె పల్లిని గోపాలధామమునను.. అని కవి వివరించాడు. ఈ కామేపల్లి గుంటూరు జిల్లాలోని పల్నాడు తాలూకాలో ఉన్నదని, అప్పుడు ఈ గ్రామం తంగెడు సీమలో ఉన్నదని అగ్రహారమని కీ.శే.శ్రీ లక్ష్మణరావుగారు విజ్ఞాన సర్వస్వంలో రాసినారని బూర్గుల వారు ఉటంకించారు. అందుచేత అప్పకవి గుంటూరుకు చెందినవాడిగా నాటి కాలపు విమర్శకు లు నిర్ధారించడం వల్ల తెలంగాణకు పెద్ద నష్టం వాటిల్లింది. సాహిత్య చౌర్యం జరిగింది. అప్పకవీయ అవతారికలోనే.. మదీయ స్వప్న విధం బంతయు దేటపడ నెఱింగించిన నాకర్ణించి సకల జనంబులు నానందంబు పొంది రందు గొందరు మాతృ సంబంధులగు మదీయ బంధువులు గూడ గులసింధు సౌగంధిక బంధులును గృత ప్రబంధులును.. ఉండి తనను ప్రోత్సహించారని చెప్పినందు వల్ల మాతృ సంబంధులకు బం ధువులు, బహుశా మేనమామలు లేక కామేపల్లివారు అప్పకవివారికి మాతృగృహ బంధువులు అని కొమఱ్ఱాజుగారి మాట, ఇది సత్యం.

చరికొండ సీమలో సంతరించెనుగాకు
నూరన సర్వగ్రహార మొకటి
నిడుదవెల్లిని బొద్దినే పల్లిని నవదళ
పురిని మాన్య క్షేత్రముల గడించె
..గాకునూరి తిమ్మయ సుతుండు
సోముడభినవ చూత సద్గాృమమునకు..
కాకునూరి తిమ్మన కుమారుడు కాకునూరి సోమన. ఇతడు కవికి తాత,తండ్రి తండ్రి. ఇప్పుడు ఈ కాకునూరు అనే గ్రామం మహబూబునగరం జిల్లాలోని కేశంపేట మండలంలో ఉంది. నిడుదవెల్లి బొదినంపల్లి, లేమామిడి, తొమ్మిది రేకుల, సుందరాపురం అనే చుట్టూరా ఉన్న గ్రామాలు అన్నీ అప్పకవి ఉట్టంకించినవి నేటికీ ఉన్నాయి.
ఇంకా తన తాతగారు వట్టెం గ్రామం, (ఇది కూడా సమీప గ్రామం)లోని పోతనార్యుని కూతురును వివాహం చేసుకున్నాడని, వట్టెము పోతనార్య సుతవర్యుడనందగు పెద్దిభట్టుతోబుట్టిన కృష్ణగైకొని.. (ప.80) వివరించాడు. ఈ వట్టెం నాగర్‌కర్నూల్ తాలూకాలో ఉన్న గ్రామం. వట్టెంలో నిప్పటికినీ విద్వాంసులు కల బ్రాహ్మణులు గలరు అని కూడా బూర్గులవారి మాట. ఈ వ్యాసకర్తకు బాల్యంలో ఉపనయన సంస్కా రం నిర్వహించిన వేద పండితుడు వట్టెం నరసింహ శాస్ర్తులవారు. మొత్తం మీద తెలంగాణ లోని, నాటి తరిగొండ సంస్థానాధీశులు మెచ్చి ఇచ్చిన అగ్రహారం కాకునూరు. మన హైదరాబాద్‌కు సుమారు అరువై కిలోమీటర్ల దూరంలో, షాద్‌నగరానికి ఇరువై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రామంలో హనుమదాలయం, అతిపెద్ద నంది విగ్రహం నేటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. వీరది భారద్వాజస గోత్రం.

కాకునూరి వంశావళిలో వరుసగా సోమన్న, అతని కొడుకు తిమ్మన్న. అతని కొడుకు చిన సోమన్న. చిన సోమన్నకు నలుగురు కొడుకులు. వారిలో రెండవవాడు రంగప్ప. అతని భార్య కన్నమాంబ. వీరికి తిరిగి నలుగురు కొడుకులు. తిరుమలభట్టు, గంగాభట్టు, పెద సోమన్న, చిన సోమన్న. వారిలో పెద సోమ న్న భార్య పేరు కృష్ణమ్మ, కృష్ణమ్మ తండ్రి గారి పేరు పెద్దిభొట్లు. వీరిది వట్టెం గ్రామం. పెద్దిభొట్లు తన కుమార్తె కృష్ణమ్మను పెద్ద సోమన్నకు ఇచ్చి వివాహం చేసి అల్లుని ఆస్తి వ్యవహారాలను తానే చక్కబెట్టేవాడు. పెద సోమన్న, కృష్ణమ్మ దంపతులకు వెం గన, కన్నభట్టు, గంగాభట్టు అనే కుమారులు, తిమ్మమ్మ, రంగ మ్మ, గోసమ్మ అనే కుమార్తెలు కలిగారు. వీరిలో వెంగనకు తిరిగి నలుగురు కొడుకులు. వారు అప్పన్న, సోమన్న, వెంకటపతి, లక్ష్మన్న. ఈ అప్పన్ననే ఆంధ్ర శబ్ద చింతామణి అనే పేరు గల అప్పకవీయం రాసిన కాకునూరి అప్పకవి. వేదశాస్త్ర పురాణాది వాదాలను కాకునూరింట జేసిన కారణమున, కాకునూరింటి వాడని ఘనత పొందిన వాడు.
అప్పకవి తన వంశావళిని వివరిస్తూ నూట తొంభై నాలుగు గ్రామాల్లో పేరు పొందిన వంశం అని ప్రస్తుతించాడు. ఆ పేరు ప్రఖ్యాతులే స్థిర చరాస్తులుగా, తెలంగాణలో ఒకవారన నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్న కుటుంబం ఇది. తెలుగు భాషా జీవితానికి యతిప్రాసలు ప్రాణములు. ఇది నిజమే అనేటట్లుగా అప్పకవి తన గ్రంథంలో 5 ఆశ్వాసాలలో నలభై ఒక్క విధాలైన యతి విధానాలను వివరించాడు. అప్పకవీయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే, నాటి తెలంగాణలోని ప్రాచీన లేఖన సంప్రదాయాలు, భాషా సంప్రదాయాలు ఎన్నో కనిపిస్తాయి.

నేడు తెలంగాణలో విరివిగా వాడే శబ్దజాలం మూలరూపాలను ఇందులో గుర్తించవచ్చు. మచ్చుకు, ఱకార సీసమాలికను ద్వితీయాశ్వాసంలో చూస్తే అఱవ జాలన దునియలు.. అఱవఱలు=తునుకలు (తున్కలు) వ్యవహారంలో ముక్కలు అం టుంటాం. అఱ అంటే గది. అరని కూడా అంటాం. అఱ లేక చనుట, అపోహం లేకుండా ఉండడమని మూలరూపం. అర ట్లు=స్త్రీలు మెడలో కట్టుకునే పూసలు; అఱకము = అన్నం అఱగకపోవడం, నేడు అన్నం తింటే అరగ లేదా/జీర్ణం లేదా! అం టాం కదా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
ఈ గ్రంథానికి పీఠికాకర్త శ్రీమత్కందాడై అప్పన్ కృష్ణమాచార్యుల దృష్టిలో, ఇది అసమగ్ర గ్రంథం. వళిప్రాస విషయం మాత్రమే ఇందులో సమగ్రంగా ఉందని అభిప్రాయపడ్డాడు ఆయన. నన్నయ్య, శబ్దాశాసనుడు సంక్షేపంబుగా గూర్చిన యాంధ్ర వ్యాకరణంబునందలి, సంజ్ఞా, సంధి, తత్సమ, దేశ్య, క్రియా పరిచ్ఛేందంబును, వళిప్రాస పరిచ్ఛేందంబును, పద్య పరిచ్ఛేందును, సంధి పరిచ్ఛేదంబును, తత్సమ పరిచ్ఛేదంబును, దేశ్య పరిచ్ఛేదంబును, క్రియాపరిచ్ఛేదంబును అను నామంబుల నభిరామంబులగు నాశ్వాసంబు లెనిమిదిగా..లో అప్పకవి వాక్కును గమనిస్తే, ముందు ఈ కావ్యం ఎనిమిది ఆశ్వాసాలుగా సంకల్పం చేసి మరి ఏ కారణం చేతనో ఐదింటి కే పూర్తిచేశాడు. మొదటి ఆశ్వాసంలో అవతారికతోపాటు కావ్యభేదాలు, వాక్యలక్షణాలు, పంచవిధ భావాలు, సుకవి ప్రశంసకు కవి నిందలతో పాటు దేశ భాషా విశేషాలు కవి సమయ సిద్ధపదాలు భాషా పరిచ్ఛేదమనే పేరిట అనేక ఇతర అంశాలు వర్ణింపబడ్డాయి.
చివరగా, 18 విధాలైన ఆర్యావృత్తాలు, నలభై ఎనిమిది సూత్రాల వివరణలతో సంధి పరిచ్ఛేదమను పేరిట పంచమాశ్వాసం పూర్తవుతుంది. ఈ గ్రంథాన్ని రాయడానికి అప్పకవి, అధరణ్వాచార్యుని విరాపరట్వం మొదలు 73 కావ్యాలతోపాటు కవిత్రయ విరచిత భారతం 18 పర్వాలు పరిశీలింపబడినాయి. చాటువులుగా ఇరువై ఇద్దరి కవిత్వాలను కూడా కవి తన రచనకు స్వీకరించాడు. మొత్తంమీద నేటి కాలానికి తెలంగాణ ఏర్పడి, తన అస్తిత్వానికి మూలాలను అన్వేషించే ఈ శుభతరుణంలో కాకునూరి అప్పకవిని కాదని లేదా విస్మరించి చరి త్ర నిర్మిస్తే, అది అసమగ్రమవుతుంది. వరరుచి సంహితలోని వచనాలను కూడా ఉదహరించిన అప్పకవి, ఈ కావ్యంలో జ్యోతిష సంబంధ విషయాలను కూడా విడిచిపెట్టలేదు. తెలంగాణ పలుకుబడి, యాస ఒక విలక్షణమైనది అని నిరూపించ డం కోసం నేటి కాలంలో అప్పకవీయం, పునర్వివేచన ఒక తప్పనిసరైన సామాజిక అవసరం అనాలి.
- డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి
98665 42365

1029
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles