సర్వోదయ కవితా వైతాళికుడు


Sun,December 23, 2018 11:02 PM

inaganti
సర్వతంత్ర స్వతంత్రుడే సత్కవీంద్రు
డెన్నడో కల్పమునకొక్కడే లభించు..
అభినవ తిక్కన యుగ కవి యుగకర్త అయిన తుమ్మల సీతారామమూర్తి గారు తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్దమున లభించిన అపూర్వమైన కానుక. ఆధునిక కవుల్లో విలక్షణమైన కవి. వారు ఆకారంలో ఆంధ్రుడు. ధర్మములో భారతీయు డు. భావనలో విశ్వ మానవుడు. ధర్మ సంరక్షణార్థం కవితలల్లిన ఋషితుల్యులు. వారు సంప్రదాయ కవితాభినివేశంతో సాహితీ లోకంలో అడుగు మోపి జాతీ య భావసోయగంతో నవయుగ హృద య స్పందనతో సర్వ స్వతంత్రాంధ్ర సర్వోదయ కవితా సృష్టి చేసిన కారణజన్ములు. హాలిక కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయ వృత్తిలో జీవిం చి సందేశాత్మక కావ్యాలను వెలయించిన నిరంతర కవితాహాలికు డు. సాధుశీల మాభిజాత్యమ్ము చెలువమ్మున నసి మెఱయు వనిత నాదు కవిత అని ఎంతో విశ్వాసంతో చెప్పగలిగిన కళాప్రపూర్ణుడు. కాలంతోపాటు కాలం కంటే ముందు నడిచి జగద్ధితమైన కవితను కళాన్వితంగా వెలయించిన కవితా తపస్వి. కళకొఱకే కవిత్వమని గంతులు వేయక మానవాభ్యుదయానికి కవితా గానమొనర్చిన అభ్యుదయ కవి. తమ కవిత్వానికి ఆంధ్రత్వాన్ని ఊపిరిగా, భారతీయత్వాన్ని జీవాత్మగా, గాంధీతత్తాన్ని వజ్ర కవచంగా చేసుకొన్న జాతీయ కవి. స్వరాజ్య సాధనకు సురాజ్య నిర్మాణానికి కవితను అంకి తం చేసిన దేశభక్తి కవి. స్వరాష్ట్ర సిద్ధికి, అభ్యుదయానికి తమ కవితను ముడుపుగట్టిన రాష్ట్ర కవి. గాంధీ దివ్యగాథ ను ఆధునిక ఇతిహాసంగా తెలుగు సారస్వతపీఠంపై సుప్రతిష్ఠించిన గాంధీ కవి. ప్రజల బాధ తన బాధగా భావిం చి, సామాజిక కల్యాణం కోసం కవితాగానం చేసిన అసలు సిసలైన ప్రజాకవి.

తెలుగు భాషార్చకుడై కవితా కళకు నూతన జవమును జీవమును కలిగించి ప్రకాశింపజేసిన తెలుగు లెంక. భాషా వివర్యయముసైపని సంప్రదాయ కవితా సంరక్షణాభినివిష్ణులు. కవితా పాకమును మార్చి సరళ సుందరమైన కవితను వెలయించిన నవ్యాతి నవ్య కవి. అభ్యుదయ దృష్టి ఉన్న కవికి ఛందస్సు ఇనుప సంకెల కాదని, మల్లెపూల మాలయని నిరూపించిన కవితా కళాశిల్పి. మచ్చ మసకలేని మనుగడను సాగించిన మానవోత్తముడు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన సర్వోదయ విప్లవ కవితను వెలయించిన యుగకర్త. కవితలో యుగ లక్షణాలను గుబాళిం చి, జాతికుపకరించు సందేశమును కళాన్వితముగా వచించిన యుగ కవి.
భావ కవిత్వం ఒక ఊపు ఊపుతున్న కాలమది. ప్రణ య కవులు ఊహాలోకంలో తమ ప్రణయ రూపిణులతో సరససల్లాపములలో తూగిపోతూ ఉన్న కాలమది. అభ్యు దయ కవితోద్యమాలు జాజ్జల్యమాన మగుచున్న కాలమది. దీనికితోడు నూతన కవితా ప్రక్రియలు వికసిస్తున్న కాలమది. అటువం టి కాలంలో..
గిఱిగీచుకొన్న కవి కృతి
చిరకాలము నిల్వ; దెల్ల సిద్ధాంతములన్
దరియించి విప్లవము దెస
కరిగిన కృతి సత్యదర్శియై రాణించున్- అని ప్రకటించి సిద్ధాంతరాద్ధాంతాలకతీతంగా పాతకొత్తల మేలు కలయికతో తమ సర్వోదయ కవితోద్యమాన్ని వారే సృష్టించుకొన్నారు.
రాష్ట్ర సిద్ధి కొఱకు రక్తమ్ము గార్చిన
కవిని నేను గాంధికవిని నేను
బడలి బడలి తల్లిబాసకూడెము సేయు
కవిని నేను దేశి కవిని నేను.. అంటూ తమను తాము విశ్లేషించుకొని చెప్పిన పద్యం. వారు జాతినిత్య వైతాళికు డు. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయాలకూ అవమానాలకూ వారు ఉడికిపోయా రు. పరవళ్లు తొక్కే ఆవేశంతో రాష్ట్రగాన కావ్యాన్ని రచిం చి ఉద్యమానికి దిశానిర్దేశం చేసి, ఆంధ్రులను కార్యోన్ముఖులను చేశారు. తెలుగు జాతి నిరంకుశ వీరజాతిగానేలిన జాతిరా! అంటూ గత వైభవ ప్రాభవాలను గుర్తుచేసి జాతిని చైతన్యపరిచారు.

నూతన రాష్ర్టావతరణానంతరం జాతి అభ్యుదయానికి ఉదయగానము అను కృతిని రాశారు. దీనియందు ఆనా టి సమస్యలను చర్చించి, తగిన సూచనలను చేశారు. మాతృభాషను అధికార భాషగా చేయాలన్నారు. రాష్ట్ర నడిబొడ్డున గల బెజవాడను రాజధానిగా చేయాలన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి ప్రాజెక్టుల ను నిర్మించి వ్యవసాయాభివృద్ధి చేయాలన్నారు. పదవి కోసం పుట్టినది కుల తత్తమని హెచ్చరించారు. జాతి పెంపు నాకు చాలును- జాతీయ గౌరవంబ నాదు గౌరవంబు-జాతి సేవ నాదు జన్మంబునకు-ఫలంబని తలంచువాడె నాయకుండు అని చెప్పారు.
తుమ్మల వారు గొప్ప దేశభక్తులు. జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. శిక్షలు కూడా అనుభించారు. మాతృమహీగౌరవములు మానవునకు ప్రాణమ్ములు-స్వాతంత్య్రము లేని జాతి చచ్చుజాతి మచ్చజాతి అని ప్రబోధించి ప్రజలనుత్తేజరిచారు.
వాల్మీకి శ్రీరాముణ్ణి మానవాదర్శమూర్తిగా, వ్యాసుడు శ్రీకృష్ణుణ్ణి గొప్ప రాజనీతిజ్ఞుడిగా తీర్చిదిద్దినట్లుగా తుమ్మలవారు మహాత్ముని రాజనీతిజ్ఞుడుగా, కర్మయోగిగా, యుగ పురుషునిగా తీర్చిదిద్ది అభినవ తిక్కనగా మహాత్ముని ఆస్థాన కవిగా స్థిరయశస్సు గడించారు. మహాత్మకథ రచించే నాటికి తుమ్మల వారికి మహాత్ముని బాహ్యాంతర తేజస్సులు సంపూర్ణంగా సాక్షాత్కరించాయి. వారు మహాత్ముని జీవితానికి అపూర్వమైన వ్యాఖ్యానం చేశారు.
వారు 30 ఏండ్లకు పైగా సేద్యము చేసిన గట్టి రైతు. కర్షకుల జీవితములోని వెలుగు చీకట్లను కన్నులకుగట్టినట్లు వర్ణించారు. ఒకనాడు సమాజంలో రైతు ఒక్కడే స్వతంత్రుడు. రైతు జీవితమును కమనీయభావముల మనోజ్ఞం గా వర్ణించి కావ్య గౌరవాన్ని కలిగించారు.
సమ ధర్మం సహజ ధర్మమని నమ్మి ఆర్థిక సమానతా సిద్ధియైన గాని-విడువదావేశమీ నాటి విప్లవంబు అని హెచ్చరించిన సర్వోదయ విప్లవ కవి తుమ్మల వారు. సర్వోదయవాదులు దానికి వెన్నుదన్నుగా తాత్తిక చింతనముంటే అదిలోక శ్రేయోదాయకమవుతుందన్నారు. సామ్యవాద సిద్ధాంతంలోని మేలిమిని కూడా స్వీకరించిన ప్రగతిశీలి తుమ్మల వారు. ప్రతి యుగంలో ఉత్తమ కవులు కొందరే ఉంటారు. వారిలో ఉన్నత వ్యక్తిత్వం గలవారు అరుదు. ఆధునిక యుగమునందు ఉన్నతమైన సాహిత్యానికి, సమ్మున్నతమైన వ్యక్తిత్వానికి కీర్తిగాంచిన ఉత్తమకవి తుమ్మలవారు. కవిత్వంలోనూ, జీవితంలోనూ ఉన్నతములైన నైతికములైన విలువల పరిరక్షణకు తమ కవిత్వా న్ని జీవితాన్ని ముడుపుగట్టిన ఋషితుల్యులు తుమ్మల సీతారామమూర్తి గారు.
- ఇనగంటి వేదకుమారి
(రేపు తుమ్మల సీతారామమూర్తిగారి 119వ జయంతి)

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles