అక్షర చిత్రాల రంగరింపు


Mon,December 17, 2018 01:35 AM

రంగినేని గారు చిక్కని, చక్కని భావకవులు. తమ ఎదలో పూసిన భావాలను సీత పుష్పమాలగా కూర్చారు. తాము దర్శించిన జగత్తును జీవనహేలగా తీర్చిదిద్దారు. తమ మనసులో మెదిలిన ముప్పది రెండు చిత్రాలను మనసు గీసిన చిత్రాలుగా మలిచారు.

తెలంగాణ అస్తిత్వం కోసం సుదీర్ఘ పోరాటం ఫలితంగా రాష్ట్రం కల సాకారమైంది. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మన కవులు మన సాహిత్యాన్ని వెలికితీసే పనిలో ముం దుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మరుగున పడిన మన సాహిత్య చరిత్రను, కవులను వెలుగులోకి తేవాలి. తద్వారా తెలంగాణ ఘన చరిత్రను చాటాలి. దీనికోసం అనేకమంది సాహిత్యకారులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆణిముత్యం, పిన్న వయసులోనే అనేక సాహిత్య రచనలు చేసి, మరుగున పడిన మాణిక్యం రంగినేని సుబ్రహ్మణ్యం.
ఒకప్పటి పాలమూరు జిల్లా, నేటి నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతం సురభి రాజుల ఏలుబడిలో సాహిత్యప రంగా ఒక వెలుగు వెలిగింది. సంస్థానాధీశులతో పాటు అనేకమంది కవి పండితులు సంస్కృతం, తెలుగు, తర్కం, మీమాంస , న్యాయ , వ్యాకరణ, జ్యోతిష్యాది శాస్ర్తాల్లో అనేక రచనలు చేశారు. ఈ ప్రాంతం నుంచి చంద్రికా పరిణయం, మల్లి భూపాలీయం, రాఘవయాదవ పాండవీయం, ప్రసన్న భారతం, చూతపురీ విలాసం, రాచకన్యకా పరిణయం మొదలైన అనేక ఉత్తమ గ్రంథాలు వెలువడినాయి.

వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సంస్థానానంతర కాలంలో అనేకమంది వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. వారిలో కీ.శే. రంగినేని సుబ్రహ్మణ్యం గారు ఒకరు. వీరు కొల్లాపూర్ పట్టణానికి చెందినవారు. తల్లిదండ్రులు రాజన్న, లక్ష్మీదేవమ్మ. వీరి జీవిత కాలం 1950-1979. వీరు జీవించింది తక్కువ కాలమే అయినా ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి ప్రోత్సాహంతో వివిధ సామాజికాంశాలతో కూడిన అనేక రచనలను ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. వీరు 1970-80 మధ్య కాలంలో వెలుగులోకి తెచ్చిన రచనలు.. సీత పుష్పమా ల, జీవన హేలి, మనసు గీసిన చిత్రాలు, తూర్పు కన్నులెర్రజేస్తే మొదలైనవి వారి పాండితీ ప్రకర్షకు నిదర్శనాలు. ఇవి అందుబాటులో లేకపోవడంతో వీటన్నింటిని కలిపి సాగర మథనం పేరుతో ఒకే పుస్తకంగా వారి కుటుంబీకులు ఇటీవలనే పునర్ముదించి వెలుగులోకి తేవడం అభినందనీయం.

రంగినేని గారు చిక్కని, చక్కని భావకవులు. తమ ఎదలో పూసిన భావాలను సీత పుష్పమాలగా కూర్చారు. తాము దర్శించిన జగత్తును జీవనహేలగా తీర్చిదిద్దారు. తమ మనసులో మెదిలిన ముప్పది రెండు చిత్రాలను మనసు గీసిన చిత్రాలుగా మలిచారు. అతని మనోదర్పానికి ప్రతిబింబం తూర్పు కన్నులెర్ర జేస్తే.. ఇలా వీరి కవితా సంపుటాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు తనదైన సౌకుమార్య భాషలో నిరాశ-నిస్పృహ-ఆగ్రహం-అనురాగం-ఆదర్శం-ఆశల వంటి ఉద్వేగాలను అక్షరాల్లోకి ఒంపడం ప్రశంసనీయం. రంగినేని గారు చిన్న వయసులోనే సమాజాన్ని నిశితంగా పరిశీలించారు. అందుకే సమాజంలోని అసమానతలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, పాలకవర్గాల పెత్తనం, శ్రమజీవి కష్టాలు, ఆకలి, దారిద్య్రం, ఆవేదన మొదలైన అంశాలు వారి కవిత్వంలో కనిపిస్తాయి. కేవలం సమస్యలనే ఎత్తిచూపకుండా, వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ, యువతకు తమ బాధ్యతను గుర్తు చేస్తూ, మార్గనిర్దేశనం చేస్తాడు.

అజ్ఞాన తిమిరాన
నల్లాడు నంధుడా
పథ విహీన మౌచు
బ్రతుకు నిర్భాగ్యుడా.. అంటూ
మమత మానవతతో
మంచిగా నడుచుకో... అని జ్ఞానబోధ చేస్తాడు.
సత్యాన్ని-ధర్మాన్ని
నిత్యమ్ము నడిపించు.. అంటాడు.
మానవుడు చేయలేనిది
మహినేది లేదోయి... అని భరోసా ఇస్తాడు.
ఓ భారతీయ వీరులారా
ఉప్పెన వలె పొంగిపొరలి
ధర్మ దయా వీరులునై
దానవతను సంహరించి
దగాకోర్ల హతమారిచి
ధరణిన భరత సంస్కృతి
నిలుపగ ముందడుగేయుడు.. అని కర్తవ్య బోధ చేస్తాడు.
ప్రకృతిని కూడా ప్రియనేస్తంగా మార్చుకుని వీరు కవితలల్లారు. వీటిని చదివినప్పుడు ప్రకృతి సౌజన్య సౌహార్ద సౌమనస్యాలనే పిండి వంటలు తయారు చేసే తల్లిలా కన్పిస్తుంది. పయనించడం నేర్పే ఆచార్యునిలా బోధపడుతుంది. ప్రబోధించే ప్రవక్తలా భాసిస్తుంది. కవి లాగా అనిపిస్తుంది. మొత్తం గా తన ప్రాణానికి రాగమై సాక్షాత్కారిస్తుంది. ఇట్లా మనిషికి, ప్రకృతికి అవినాభావ సంబంధాన్ని నిరూపించి, మనిషిని ప్రకృతిలో భాగం చేసి చూపే అద్భుత భావనలు రంగినేనికే సొంతం.
ఉదయిస్తా, ఉద్యమిస్తా, ప్రగతివైపు గతాన్ని తలుస్తా, వర్తమాన్ని నడిపిస్తా భవిష్యత్తులోకి బాటలు వేస్తా.. మొదలైన కవితలు చదువుతుంటే కవిలో అభ్యుదయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి.

వేదనలో నుంచే విప్లవం పుడుతుంది అంటూ గుండెల్లో మండే గాయాల నుంచి కారిన రక్తాన్ని సంజీవనిగా మలిచే అక్షరశిల్పిగా, శాంతికాముకునిగా కొన్ని కవితలు చదివినప్పుడు అనిపిస్తుంది.
భౌతిక వాస్తవికతను విస్మరించానేమోననే ఆత్మవిమర్శ చేసుకోవడం తొలి సంకలనం నుంచి చివరి సంకలనం వరకు కన్పిస్తుంది. ఇలా విశిష్ట లక్షణాలు కలబోసిన కవిత్వం రంగినేనిది. మానవతావాదం అనే విశ్వజనీన భావన వీరి కవిత్వానికి బలనాన్నిచ్చే అంశం. కలానికీ, గళానికీ సంకెళ్లు తగిలించుకున్న కవులున్న నేటి విపరీత కాలాన్ని నాడే నిర్దంద్వంగా తెగనాడిన ఆదర్శవాది రంగినేని.
ఇంతటి మహోన్నతమూర్తులైన కీ.శే. రంగినేని గారి సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు జరుగాలి. వారి రచనలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఇంకా ఇలా మరుగున పడిన మాణిక్యాలను, వారి రచనలను వెలుగులోకి తేవాలి. అప్పుడే తెలం గాణ సాధన సాఫల్యం అయినట్లుగా సాహిత్యాభి మాను లు భావించాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ నిబద్దతతో కృషి చేయాలి.
-వేదార్థం మధుసూదన్ శర్మ, 9063887585

651
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles